
నల్లగొండ: ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌పురాలో నివాసముంటున్న మహ్మద్ ఖలీల్ నల్లగొండ మండలం చర్లగౌరారం జెడ్పీహెచ్‌ఎస్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.
అతడికి 2007లో అక్సర్ జహతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఖలీల్ చేస్తున్న అటెండర్ ఉద్యోగం తనకు లేదా పిల్లలకు ఇవ్వాలని అతడిని భార్య అక్సర్ జహ వేధింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24న ఖలీల్ అనారోగ్యంతో ఇంట్లో పడిపోయాడని చుట్టుపక్కల వారిని అక్సర్ జహ నమ్మించి, ఆటోలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. ఖలీల్‌కు ఎటువంటి వైద్యం చేయించకుండానే ఇంటికి తీసుకొచ్చింది. అదే రోజు రాత్రి ఖలీల్ మృతిచెందాడు.
మరుసటిరోజు ఖలీల్ తల్లి అహ్మది బేగం తన కుమారుడి మృతికి కోడలే కారణమంటూ నల్లగొండ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో మృతుడి తలపై మారణాయుధాలతో కొట్టడంతో పాటు ముక్కు, నోటిని బలవంతంగా మూయడంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి అక్సర్ జహను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించిందని డీఎస్పీ తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment