సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఓటరు జాబితా స్పెషల్ రివిజన్ కోసం కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు, చిరునామా మార్పులు తదితరాల కోసం సెప్టెంబర్ 25తో గడువు ముగిసింది. ఆ తేదీ నాటికి హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, గడువు ముగిశాక కూడా ఈ దరఖాస్తుల సంఖ్యపెరుగుతూనే ఉంది. ఈ వారంరోజుల్లో కొత్తగా 56,368 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొత్తగా ఓటరు నమోదుతో పాటు చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉన్నప్పటికీ, 75 శాతం కొత్త ఓటరు కోసం వచ్చినవే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలనను అధికారులు ఇంకా ప్రారంభించలేదు. 25వ తేదీ గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలించి, అర్హులైన వారివి జాబితాలో చేర్చారు. ఈనెల 8వ తేదీన తుది జాబితా వెలువరించాకే, గడువు తర్వాత అందిన వాటిని పరిశీలించనున్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారిలో 1.46 లక్షల మంది కొత్త ఓటర్లు కాగా, 16,889 మంది పొరపాట్ల సవరణకు దరఖాస్తు చేసుకున్నారు. మరణించిన వారు, స్థానికంగా లేనివారివి మరో 6755 దరఖాస్తులు ఉన్నాయి.
ఇల్లు మారిన వారెందరో..
నగరంలో ఎక్కువ మంది అద్దె ఇళ్లల్లో ఉండడం తెలిసిందే. అలాంటి వారు తాము ఇల్లు మారిన ప్రతిసారి ఓటరు జాబితాలోనూ చిరునామా మార్చుకోవాలి. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారిన వారి సంగతటుంచి, ఒక నియోజకవర్గంలోనే ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారిన వారు 22,386 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే, స్థానికంగా ఒక చోట ఉండేందుకు అలవాటు పడిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లలేక, పిల్లల చదువులు తదితరమైన వాటి దృష్ట్యా అదే ప్రాంతంలో ఇతర ఇళ్లకు మారుతున్నారు. కోర్ సిటీలోనే ఇంతమంది ఉండగా, గ్రేటర్ మొత్తంలో ఇలాంటి వారు 50వేల మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది.
దరఖాస్తుల పరిశీలన పూర్తి
ఓటర్ల జాబితాపై అభ్యంతరాల పరిశీలన పూర్తయిందని, ఈమేరకు జాబితాను రూపొందించి, కొత్తగా ఓటర్లయిన వారి వివరాల జాబితా ప్రచురణ 7వ తేదీకి పూర్తవుతుందని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) జయరాజ్ కెన్నెడి తెలిపారు. 8వ తేదీన తుది జాబితాలను వెల్లడించనున్నట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment