పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు కాంగ్రెస్ వ్యూహం
15వ తేదీలోగా సమన్వయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కూడా ఏర్పాటు
ముఖ్య నేతలతో సీఎం రేవంత్ జూమ్ కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేలా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీలోగా ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ నెలాఖరులోగా అభ్యరి్థని ఖరారు చేయాలని భావిస్తోంది. ఎన్నికల వ్యూహాల అమలు కోసం ప్రత్యేకంగా వార్ రూమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలతో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు.
పథకాలు, కార్యక్రమాలపై విస్తృత ప్రచారం
ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని రేవంత్ సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి విచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందని, ప్రధానంగా డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, టీచర్లకు ప్రమోషన్లు, టీచర్ల బదిలీ చేపట్టడంతో పాటు ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ అంశాలను పట్టభద్రులైన యువత దృష్టికి ప్రధానంగా తీసుకెళ్లాలని సూచించారు. రుణమాఫీతో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీల ఏర్పాటు లాంటి విప్లవాత్మక కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు.
తక్షణమే ఓటర్ల నమోదు
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను పార్టీ పక్షాన వెంటనే ప్రారంభించాలని, ఈ ప్రక్రియలో యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలను భాగస్వాములను చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ద్వారా రాష్ట్రంలోని యువత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉందనే విషయాన్ని మరోమారు తెలియజేయాలని, ఈ మేరకు ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీలోని అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని కోరారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్‌లు కూడా జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment