ఈ నగరానికి ఏమైంది?  | Heavily reduced polling with Comparing 2014 | Sakshi
Sakshi News home page

ఈ నగరానికి ఏమైంది? 

Published Sat, Dec 8 2018 2:34 AM | Last Updated on Sat, Dec 8 2018 12:15 PM

Heavily reduced polling with Comparing 2014 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహానగరంలో పోలింగ్‌ శాతం మళ్లీ నిరుత్సాహ పరిచింది. శుక్రవారంతోపాటు వారంతం కావడంతో చాలా మంది సెలవులు తీసుకుని కుటుంబాలతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. నగరంలో ఉన్న వారు సైతం ఓటు వేసేందుకు నిరాసక్తత కనబరిచారు. హైదరాబాద్‌లో జిల్లాలో 50.86%, మేడ్చల్‌ జిల్లాలో 54.99% పోలింగ్‌ నమోదైంది. ఓటింగ్‌లో పాల్గొనాలని అధికారులు, పార్టీలు అనేక విజ్ఞప్తులు చేసినా.. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఆశించిన స్థాయిలో పోలింగ్‌ జరగలేదు. పోలింగ్‌ బూత్‌లు, ఓటరు స్లిప్‌లకు ఆధునిక సాంకేతిక సహాయం అందుబాటులోకి వచ్చినా, అనేక చోట్ల ఓట్ల గల్లంతు, నివాసాల నుండి సుదూర ప్రాంతాల్లో పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటుతో చాలా మంది ఓటేసేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది.

మరోవైపు నగరంలో ఓటరు గుర్తింపు కార్డులున్నా ఓటరు జాబితాలో పేరు లేకపోవటం, పలు చోట్ల ఈవీఎంలు మొరాయించిన అంశం కూడా పోలింగ్‌పై ప్రభావాన్ని చూపింది. ఓటు గల్లంతైన వారిలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, దర్శకుడు రాజమౌళి సతీమణి రమ తదితర ప్రముఖులుండటం గమనార్హం. నియోజకవర్గాల వారీగా చూస్తే.. మల్కాజిగిరిలో 51.68%, కుత్బుల్లాపూర్‌లో 55.77%, కూకట్‌పల్లిలో 57.72%, ఉప్పల్‌లో 51.04% నమోదు కాగా, ఎల్బీనగర్‌లో 49%, మహేశ్వరంలో 55.09%, రాజేంద్రనగర్‌లో 57.29% ,శేరిలింగంపల్లిలో 48% పోలింగ్‌ నమోదైంది. ముషీరాబాద్‌లో 51.34%, అంబర్‌పేటో 55.20%, ఖైరతాబాద్‌లో 54%, జూబ్లీహిల్స్‌ 54.60%, సనత్‌నగర్‌లో 52.63%, నాంపల్లిలో 44.02%, సికింద్రాబాద్‌లో 57%, మలక్‌పేటలో 55.54%, కార్వాన్‌లో 50.89%, గోషామహల్‌లో 50.28%, చార్మినార్‌లో 46.03%, చంద్రాయణగుట్టలో 48%, యాకుత్‌పురాలో 45%, బహుదూర్‌పురాలో 49.50%, కంటోన్మెంట్‌లో 48.90% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 

భారీగా తగ్గిన పోలింగ్‌ 
2014తో పోలిస్తే శుక్రవారం జరిగిన ఎన్నికల్లో నగరంలో పోలింగ్‌ తగ్గింది. 2014లో హైదరాబాద్‌లో 53% పోలవగా, ఈ ఎన్నికల్లో 50.86% నమోదైంది. 2014తో పోలిస్తే ముషీరాబాద్, సనత్‌నగర్,నాంపల్లి,కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహుదూర్‌పురా నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం తగ్గిపోగా, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, మలక్‌పేట తదితర నియోజకవర్గాల్లో పెరిగింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement