సాక్షి, హైదరాబాద్: ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో వ్యక్తిగత లబ్ధి కలిగించే ఉచిత హామీలు ఉండరాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాతే ఏ అంశంలోనైనా చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి లభిస్తుంది. అయితే ఒక్క మేనిఫెస్టో విషయంలో మాత్రం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రాకముందు కూడా చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఉండాలి. పార్టీలు తమ ముసాయిదా మేనిఫెస్టోలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి ఏవైనా ఉల్లంఘనలు ఉంటే మేనిఫెస్టోలను సవరించాలని కోరుతుంది’’అని వెల్లడించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం
రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని, ఈ మేరకు ఏర్పాట్లను వేగవంతం చేశామని రజత్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు చట్టబద్ధంగా పూర్తి చేయాల్సిన ఓటరు జాబితా రూపకల్పన, ఈవీఎం యంత్రాల సమీకరణ, ఎన్నికల సిబ్బంది నియామకం, శాంతి భద్రతల ఏర్పాట్లు తదితర అంశాలపై సంతృప్తి చెందిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
ఈ క్రమంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపించిందని, ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత మళ్లీ అధికారుల బృందాన్ని పంపించి అధ్యయనం జరపనుందని తెలిపారు. ఏర్పాట్లపై సంతృప్తి చెందితేనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుందన్నారు. లేని పక్షంలో లోపాలను సరిదిద్దాలని కోరుతుందని, అనంతరం మరోసారి అధికారుల బృందాన్ని పంపిస్తుందని చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నిరంతర సమీక్ష నిర్వహిస్తోందని, కొన్ని అంశాల్లో ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్ష సమీక్ష జరుపుతోందని వెల్లడించారు. రాజకీయ పార్టీలకు అనుమతుల జారీ ప్రక్రియపై ఫిర్యాదులొస్తున్న నేపథ్యంలో ఇకపై ఆన్‌లైన్ చేశామని, ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి ముందు అనుమతులిస్తామని తెలిపారు.
ఓటర్ల నమోదుకు భారీ ప్రచారం
రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. ‘‘రాష్ట్రంలో 32,574 పోలింగ్ స్టేషన్లున్నాయి. ప్రతి బూత్‌లో సంబంధిత బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ) రోజూ విధులకు హాజరై ప్రజలకు సహకరించాలని ఆదేశించాం. ఒకవేళ ఎవరైనా గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటాం. అన్ని రాజకీయ పార్టీలకు ముసాయిదా ఓటర్ల జాబితాలను పంపిణీ చేశాం. వారి నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులొస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు రాజకీయ పార్టీలు సైతం బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలి’’అని ఆయన కోరారు.
ఓటర్ల నమోదు కోసం ఈనెల 15, 16 తేదీల్లో భారీ ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో స్థానిక పోలింగ్ బూత్‌లలో ఓటర్ల జాబితాలను చదివి వినిపిస్తారని తెలిపారు. ఫిర్యాదులు, ఓటరు నమోదు దరఖాస్తులను బీఎల్‌ఓలు తొలుత పరిశీలిస్తారని, అనంతరం సహాయ రిటర్నింగ్ అధికారులు సంతృప్తి చెందితేనే అంగీకారం తెలుపుతారన్నారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ ఓటరు జాబితా సవరణ కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్ల నుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఒక్కో బూత్ స్థాయిలో 14 వందల ఓటర్లు ఉన్నారని, ఈ సారి పెరిగే అవకాశం ఉందన్నారు.
కొత్త ఈవీఎంలతో ఎన్నికలు
రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నామని రజత్ కుమార్ వెల్లడించారు. ‘‘ఒక ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ పాట్ యూనిట్ అనే మూడు పరికరాలుంటాయి. 52,100 బ్యాలెట్ యూనిట్లు, 40,000 కంట్రోల్ యూనిట్లు, 44,000 వీవీ పాట్ యూనిట్లు రాష్ట్రానికి వస్తున్నాయి. ఒక బ్యాలెట్ యూనిట్‌లో నోటాతో కలిపి 16 మంది అభ్యర్థుల పేర్లకు చోటు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో తొలిసారిగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ పాట్) యంత్రాలను వినియోగిస్తున్నాం. యంత్రాలు వచ్చిన వెంటనే రాజకీయ పార్టీల సమక్షంలో ప్రాథమిక స్థాయి తనిఖీలు నిర్వహించి పనితీరు పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతనే ఎన్నికల్లో వినియోగిస్తాం. ఓటు వేసిన వెంటనే వీవీ పాట్ యూనిట్ డిస్‌ప్లే స్క్రీన్‌పై ఏడు క్షణాలపాటు ఎవరికి ఓటు వేశామో కనిపించి మాయం అవుతుంది. ఒకవేళ ఓటు వేరే అభ్యర్థికి పడినట్లు స్క్రీన్ మీద కనిపిస్తే వెంటనే ఓటర్లు పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి. పోలింగ్ అధికారి ఈవీఎంను పరీక్షించి చూస్తారు’’అని వివరించారు.
1982 నుంచి దేశంలో ఈవీఎంలను వినియోగిస్తున్నారని, అనుమానాలు వద్దని అన్నారు. ఈవీఎంలపై ఇప్పటి వరకు కోర్టుల్లో 37 కేసులు నడిచాయని, అన్ని కేసుల్లో ఈవీఎంలకు అనుకూలంగా తీర్పులొచ్చాయని తెలిపారు. ఏ ఈవీఎం ఎక్కడికి వెళ్తుందో చివరి వరకు ఎవరికీ తెలిసే అవకాశం లేదని చెప్పారు. ఈనెల 20లోగా అన్ని జిల్లాలకు ఈవీఎంలు చేరుతాయని, ఆ తర్వాత ప్రతి పోలింగ్ బూత్‌లో మాక్ పోలింగ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.
మన పోలీసులు సరిపోతారు...
ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలీసు బలగాలు రాష్ట్రంలో ఉన్నాయని, కేంద్ర బలగాల అవసరం రాకపోవచ్చని రజత్ కుమార్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి పెద్ద ఘటనలు జరగలేదని, సాధారణ నేరాలు సైతం తక్కువగానే ఉన్నాయన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌కు భద్రత మ్యాప్, ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. బలహీన వర్గాలుండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఏడు జిల్లాల్లో తీవ్రవాద ప్రాబల్యముందని కేంద్ర హోంశాఖ ప్రకటించిందని, అవసరమైతే కేంద్ర బలగాలను వినియోగించుకుంటామన్నారు. రౌడీలను బైండోవర్ చేసి వారిపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో డబ్బుల పంపిణీని అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గత ఎన్నికల సందర్భంగా రూ.76 కోట్లను జప్తు చేశారని చెప్పారు. మొబైల్ టీంలతో అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెడతామన్నారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెడితే సైబర్ క్రైం పోలీసుల సహకారంతో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో ఫిర్యాదుల స్వీకరణకు అన్ని జిల్లాల్లో 1950 నంబర్‌తో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో విలీనమైన ఏడు మండలాల విషయంలో నియోజకవర్గాల పునర్విభజన జరపాలన్న అంశంపై ఎన్నికల సంఘం కేంద్ర హోంశాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించిందని తెలిపారు.
కోడ్ వస్తే రైతుబంధుపై పరిశీలన
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రధాన కార్యదర్శుల స్థాయి అధికారుల కమిటీ పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్యక్రమాలను నిలుపుదల చేయాలని కోరుతుందని రజత్ కుమార్ తెలిపారు. వచ్చే రబీ సీజన్ కోసం రైతులకు ప్రభుత్వం అక్టోబర్ నుంచి రైతుబంధు కార్యక్రమం కింద డబ్బు పంపిణీ చేయనుందని విలేకరులు ప్రశ్నించగా, ఆయన పైవిధంగా స్పందించారు. కమిటీ పరిశీలించిన తర్వాతే చర్యలుంటాయన్నారు. గత ఎన్నికల్లో నమోదైన పెండింగ్ కేసుల విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు తేలితే ఎన్నికల్లో పాల్గొనకుండా అభ్యర్థులపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment