సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రద్యుమ్న
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పలుచోట్ల ఓట్ల తొలగింపు కోసం ఆన్‌లైన్‌లో ఇష్టానుసారం దరఖాస్తులు చేస్తున్నారని, ఆ నేరస్తులను పట్టుకోవడానికి వెంటాడుతామని, వదిలేది లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి 11న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా తరువాత ఫారం–7 ద్వారా ఓట్ల తొలగింపు కోసం ఆన్‌లైన్‌లో అధికంగా దరఖాస్తు చేస్తున్నారని చెప్పారు. ఈ సమస్య మొదట్లో చంద్రగిరి నియోజకవర్గంలో వచ్చిన వెంటనే స్పందించి మొదటి పది మంది దరఖాస్తుల ఐపీ అడ్రస్సులు కావాలని సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. రెండు మూడు రోజులుగా ఫారం–7 దరఖాస్తులు ఎక్కువ అయినట్లు జిల్లాలోని పలు నియోజకవర్గాల ఆర్వోలకు ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా సైబర్ క్రైమ్‌లో కేసు పెట్టాలని ఆర్వోలకు సూచించామని చెప్పారు. విచారణ లేకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించబోమని స్పష్టం చేశారు.
మరణించిన వారి ఓట్లను మరణ ధ్రువీకరణపత్రం ద్వారా తొలగిస్తున్నట్లు చెప్పారు. వలస వెళ్లిన వారి ఓట్లు ఇంటి పక్కన ఉన్న వారి సంతకం తీసుకుని తనిఖీ చేశాకే తొలగిస్తారని తెలిపారు. తొలగించిన ఓట్లను ప్రతి గ్రామంలో పేర్లతో సహా వెల్లడిస్తామని చెప్పారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు ప్రతి పోలింగ్ కేంద్రంలో బీఎల్‌ఏలను నియమించి నివేదికలివ్వాలన కోరారు. రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా ఐదారు అంశాలపై దృష్టి పెడతారని చెప్పారు. మార్చి 1,2 తేదీల్లో తిరుపతిలో ఆర్వో, ఈఆర్వోలకు మాస్టర్ ట్రైనర్లచే ఎన్నికలపై శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇటీవల పోలీస్ శిక్షణ మైదానం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని, వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేశారని, అదే సమయంలో ధర్నా చేసిన టీడీపీ నాయకులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించగా, ఎస్పీకి చెప్పాను... ఈ విషయంపై ఆరా తీస్తామంటూ కలెక్టర్ సమాధానాన్ని దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment