చిత్తూరు ఓటు | Collector Pradyumna Interview on Elections | Sakshi
Sakshi News home page

చిత్తూరు ఓటు

Published Thu, Feb 14 2019 12:51 PM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM

Collector Pradyumna Interview on Elections - Sakshi

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రద్యుమ్న

రాబోయే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచడానికి ‘చిత్తూరు ఓటు’అనే నినాదాన్ని  కలెక్టర్‌ ప్రద్యుమ్న వినూత్నంగా ప్రారంభించారు. ఆ నినాదానికి సంబంధించి ప్రత్యేక లోగోను తయారుచేశారు. జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేలా చర్యలు చేపడుతామన్నారు. ఈసారి ఎన్నికల్లో వీవీప్యాట్‌లను నూతనంగా అమలుచేయబోతున్నట్లు చెప్పారు. వాటి ద్వారా ఓటర్లు ఎవరికి ఓటు వేశామని తెలుసుకోవచ్చన్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : నిజాయితీగా, నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ ప్రద్యుమ్న తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఎన్నికలకు సంబంధించి ఆయన మొదటి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల విజయవాడకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ పలు సూచనలు, సలహాలు ఇచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియపై సమీక్ష నిర్వహించిందన్నారు.

ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించి దేశంలో చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్నికలు మొదటి స్థా నంలో నిలిచేలా చర్యలు చేపడుతామన్నారు. తుది ఎన్నికల జాబితా ప్రకారం జిల్లాలో 30,25,222 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అందులో పురుషులు 15,03,477 మంది, మహిళలు 15,21,401 మంది ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో 3,800 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వీవీప్యాట్‌లను నూతనంగా అమలుచేయబోతున్నట్లు చెప్పారు. వాటి ద్వారా ఓటర్లు ఎవరికి ఓటు వేశామని తెలుసుకోవచ్చన్నారు. జిల్లాకు 12,160 ఈవీఎంలు, 10,260 వీవీప్యాట్‌లు, కంట్రోల్‌ యూనిట్‌లు 9,120 వచ్చాయని చెప్పారు. వాటన్నింటిని మొదటి విడత తనిఖీ చేసి భద్రపరిచామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఓటర్లకు ఈవీఎం, వీవీప్యాట్‌పై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా విభిన్న ప్రతిభావంతులు ఓట్లు వేసేవిధంగా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులను కూడా విభిన్న ప్రతిభావంతులనే నియమించబోతున్నట్లు తెలిపారు. మోడల్‌ కోడ్‌ అమలులోకి రాగానే సీ–విజిల్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరు సీ–విజిల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయవచ్చని చెప్పారు. రాబోయే ఎన్నికలకు కేంద్ర బలగాలు ఎక్కువగా కావాలని ఈసీకి నివేదికలు పంపినట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడానికి తనిఖీలను శరవేగంగా చేస్తున్నామన్నారు.

వినూత్నంగా చిత్తూరు ఓటు నినాదం
రాబోయే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి కలెక్టర్‌ ప్రద్యుమ్న చిత్తూరు ఓటు అనే నినాదాన్ని వినూత్నంగా ప్రారంభించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ నినాదంతోనే ముందుకెళతామని స్పష్టంచేశారు. ఆ నినాదానికి సంబంధించి ప్రత్యేక లోగోను తయారుచేశారు. జిల్లా కేంద్రంలో ఒక కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై జిల్లాలోని అన్ని కూడళ్లల్లో, కళాశాలలు, బస్టాండ్ల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో 2014లో జరిగిన ఎన్నికల్లో 78.94 శాతం ఓటింగ్‌ శాతం నమోదైందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో 90 శాతానికి పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement