కుటుంబ సభ్యులతో కలెక్టర్ ప్రద్యుమ్న (ఫైల్)
చిత్తూరు కలెక్టరేట్: చూడ్డానికి ప్రశాంతంగా కనిపిస్తారు... విధుల్లో అలసత్వం వహిస్తే సహించరు.. ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు..సొంతంగా ఆలోచించడం.. పట్టుదలగా పూర్తి చేయడం నైజం. ఆయనే కలెక్టర్ పాలేగార్ శ్రీనివాస్ ప్రద్యుమ్న. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని గొప్పెనహల్లి చిన్నపల్లె గ్రామంలో డాక్టర్ శ్రీనివాస్, సుజాత దంపతుల పెద్ద కుమారుడు. డాక్టర్ కుటుంబంలో పుట్టిన ఆయన పీజీ తర్వాత సివిల్స్ పూర్తి చేశారు. తండ్రి డాక్టర్ శ్రీనివాస్ కల నెరవేర్చేందుకు ఐఏఎస్ అయ్యారు. 2011లో చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కలెక్టర్‌గా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా (ఓడీఎఫ్) దేశంలోనే మొదటిస్థానంలో నిలిచేలా ఓ భారీ క్రతువు నిర్వహించారు. ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, అది ఓ బాధ్యత అని అంటున్న కలెక్టర్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్య..
సాక్షి :మీ కుటుంబ నేపథ్యం..?
కలెక్టర్ :మాది కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని గొప్పెనహల్లి చిన్నపల్లె గ్రామం. నా తండ్రి డాక్టర్ శ్రీనివాస్, తల్లి సుజాత గృహిణి. మేము ఇద్దరం. నేను ఇంటికి పెద్ద కుమారుడిని. తమ్ముడు అనూ మ. నా తండ్రి మైసూర్, బెంగళూరులలో డీఎంఅండ్‌హెచ్‌ఓ, జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. 2007లో వివాహం చేసుకున్నాను. భార్య శిల్ప, కూతురు అవ్యక్త, కుమారుడు విక్రమాదిత్య.
సాక్షి : ఐఏఎస్ వైపు అడుగులు ఎలా పడ్డాయి....?
కలెక్టర్ : నాన్న నన్ను సివిల్స్ సాధించాలని చిన్నతనం నుంచి చెప్పేవారు. నేను 5వ తరగతి చదివేటప్పుడే ఐఏఎస్‌పై గురిపెట్టించారు. పీజీ అవ్వగానే సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలు రాయాల్సి వచ్చింది. మెయిన్స్‌కు ఢిల్లీలో కేవలం రెండు నెలలు మాత్రమే శిక్షణ తీసుకున్నా. మొదటి ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాను. అంతటితో నా ఆశయాన్ని వదులుకోకుండా మళ్లీ సివిల్స్ రాశాను. ఆ తర్వాత ఐఏఎస్‌కు ఎంపికై నా కలను నెరవేర్చుకున్నాను.
సాక్షి :జిల్లాలో మీ అనుభవాలు, విజయాలు, లక్ష్యాలు...?
కలెక్టర్ :నేను చిత్తూరులో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడే పూర్తిగా అవగాహన ఉంది. జిల్లాలో ఎక్కువగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాను. ఎవ్వరూ చేయలేని విధంగా నేషనల్ హైవేలు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణం, ఓడీఎఫ్, ప్రకృతి వ్యవసాయం లాంటి కార్యక్రమాలు సంతృప్తినిచ్చాయి.
సాక్షి :కరువును అధిగమించడానికి చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యలు..?
కలెక్టర్ : జిల్లాలో కరువు ఉన్న మాట వాస్తవమే. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో కరువు ఏర్పడింది. ఇప్పటికే అన్ని మండలాలను కరువు జాబితాలో ప్రకటించాం. సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులకు ఉలవలు ఉచితంగా పంపిణీ చేశాం. తలసరి ఆదాయం తగ్గకుండా చర్యలు చేపడుతున్నాం.
సాక్షి : ప్రకృతి వ్యవసాయంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.. కారణం..?
కలెక్టర్ :ప్రస్తుతం ఏ అలవాటూ లేని వారు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. కారణం నాణ్య మైన ఆహారం తీసుకోకపోవడమే. అందుకోసం ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాం. ప్రకృతి వ్యవసాయంలో చిత్తూరు 1.30 లక్షల హెక్టార్లలో సాగుచేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.
సాక్షి : కార్పొరేషన్ రుణాలు లబ్ధిదారులకు చేరడం లేదు... అందుకు మీరు తీసుకుంటున్న చర్యలు..?
కలెక్టర్ :కార్పొరేషన్ రుణాలు గతంలో సరిగా మంజూరు చేయకపోవడం వల్ల సమస్యలు ఉండేవి. ప్రస్తుతం అలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారులందరికీ రుణాలు అందేలా తరచూ బ్యాంకర్లతో సమావేశాలు జరుపుతున్నాం. సహకరించని బ్యాంకులపై చర్యలకూ సిద్ధమవుతున్నాం.
సాక్షి :అమృత్ పథకం నిధులు మురిగిపోతున్నాయని తెలిసింది.. ఎందువల్ల....?
కలెక్టర్ :అమృత్ పథకంలో ఎంపికైన మున్సిపాలిటీలకు నిధులు వచ్చాయి. ఆ నిధులను ఎక్కువగా తాగునీటి సమస్య పరిష్కారానికి వాడుతున్నాం. చిత్తూరు కార్పొరేషన్‌కు మంజూరైన రూ.250 కోట్లు తాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నాం. కొన్ని పనులకు టెండర్లు పూర్తయ్యాయి.
సాక్షి : త్వరలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.. మీరు అమలు చేస్తున్న ప్రణాళిక...?
కలెక్టర్ : పేదరికం నుంచి బయటపడాలంటే విద్య వల్లే సాధ్యపడుతుంది. కాపీకొట్టి మార్కులు సాధిస్తే ఫలితం ఉండదు. అందుకోసం ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించబోతున్నాం. ఇప్పటికే తిరుపతి పరిధిలో పదో తరగతి విద్యార్థులకు సూపర్ 60 కార్యక్రమాన్ని ప్రారంభించాం.
సాక్షి : పెద్ద పరిశ్రమల స్థాపన అనుకున్న స్థాయిలో
జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఏమంటారు?
కలెక్టర్ : పెద్ద పరిశ్రమల స్థాపనకు సమయం పడుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎంవోయూలు ఇచ్చాం. త్వరలో స్మాల్‌గ్రూప్ బిజినెస్ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. గృహిణులకు స్మాల్‌గ్రూప్ బిజినెస్ ద్వారా రుణాలు అందజేసి, ఉపాధి కల్పించే విధంగా ముందుకు వెళుతున్నాం.
సాక్షి : ఓడీఎఫ్‌లో జిల్లాను దేశస్థాయిలో నిలిపేందు కు మీరు చేసిన కృషి...?
కలెక్టర్ : మరుగుదొడ్ల నిర్మాణంలో నెలకొల్పిన రికార్డును ఎవరూ అధిగమించలేరు. ఓడీఎఫ్‌లో చిత్తూరును దేశంలో ప్రథమస్థానంలో నిలపడానికి జిల్లా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించారు. ఆత్మగౌరవం ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు.
సాక్షి :అభివృద్ధిని వేగవంతం
చేయడానికి మీరు తీసుకున్న చర్యలు...?
కలెక్టర్ :మొదట్లో జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయాలని నిర్ణయించాం. ఇంజినీర్లు కష్టమని చెప్పినా ప్రస్తుతం 800 కిలోమీటర్లు పూర్తి చేశాం. ఇది రికార్డే. పెద్ద జిల్లా కావడంతో పనులు చేయడానికి అవకాశముంది. వేరే జిల్లాలో ఈ స్థాయిలో పనులు చేయాలనుకుంటే కుదరదు.
సాక్షి :మీ సతీమణి అంగన్‌వాడీ కేంద్రాలను దత్తత తీసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీని వెనుక మీ కృషి ఏమైనా ఉందా...?
కలెక్టర్ : సమాజ సేవంటే మక్కువ కావడంతో ఆమె అంగన్‌వాడీ కేంద్రాలను దత్తత తీసుకుంది. సొంత డబ్బు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారు. బిహార్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంతమంది ఇటీవల నన్ను› కలిశారు. అంగన్‌వాడీల అభివృద్ధి గురించి తెలుసుకున్నారు. 2019 మార్చి నాటికి పౌష్టికాహార లోపం లేని జిల్లాగా తయా రు చేసేలా ఆశయం పెట్టుకున్నాం.
Comments
Please login to add a commentAdd a comment