Pradyumna
-
Andhra Pradesh: భారీగా ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఏపీ మెడికల్ సర్వీసెస్ వీసీ–ఎండీ డి.మురళీధర్‌రెడ్డిలను తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్‌గా కాటమనేని భాస్కర్ నియమితులయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను బదిలీ చేసి గనులు, భూగర్భ వనరుల శాఖ కమిషనర్, డైరెక్టర్‌గా నియమించారు. తిరుపతి జాయింట్ కలెక్టర్‌కు ఆ జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌కుమార్ సింఘాల్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్‌గా బి.రాజశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. -
తెలంగాణ నేపథ్యంలో...
నేత్ర, శ్రేయస్ బట్టోజు, సుధీర్ శర్మ, సాయి రాఘవేంద్ర, ప్రద్యుమ్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొక్కిలి’. మహేష్ గంగిమళ్ల దర్శకత్వంలో వీఆర్‌జీఆర్ మూవీస్‌పై గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్‌తో పాటు పోస్టర్ని డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. ‘‘తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో, వాస్తవ ఘటనలతో రూ΄÷ందుతోన్న చిత్రం ‘΄÷క్కిలి’. క్లైమాక్స్, రెండు ΄ాటలు మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: జయ΄ాల్ నిమ్మల. -
అక్రమాలు జరిగితే ఏజెన్సీని మార్చేస్తాం
సాక్షి, అమరావతి: పంటల కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగితే సేకరణ ఏజెన్సీని మార్చేస్తామని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న తేల్చిచెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన మంగళవారం మార్కెటింగ్ శాఖ అధికారులు, సేకరణ ఏజెన్సీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పత్తి, కందుల కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, పత్తి కొనుగోలు కేంద్రాలన్నింటిపై ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో కందుల సేకరణ ఏజెన్సీ అయిన జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీని ఆ బాధ్యత నుంచి తప్పించామని చెప్పారు. అవకతవకలకు పాల్పడ్డ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్దతు ధరలు ప్రకటించిన 22 రకాల పంటలను 216 మార్కెట్ యార్డులు, 150 సబ్ యార్డుల్లో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. పంటల సేకరణ ఏజెన్సీలు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. మార్గదర్శకాలు - రైతుల వారీగా యార్డుల్లోని ఇన్‌గేట్, ఔట్‌గేట్‌ల వద్ద పంటలను నమోదు చేయాలి. రైతుల నుంచే పంటలను సేకరించాలి. - సేకరణ కేంద్రానికి రైతులు తప్పనిసరిగా రావాలి. అలా రాకపోతే పంటను తీసుకోరు. - రైతు పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు పాస్‌పుస్తకం, కౌలుదారీ పత్రం, ఈ–క్రాప్ నమోదు వివరాలు తీసుకురావాలి. - ప్రభుత్వం సూచించిన పరిమాణానికి మించి పంటను రైతుల నుంచి ఏజెన్సీలు తీసుకోకూడదు. - పంటల నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలి. - మార్గదర్శకాలను ఉల్లంఘించిన కేంద్రాల్లో పంటల సేకరణను నిలిపివేసే అధికారం మార్కెటింగ్ శాఖ కార్యదర్శికి ఉంటుంది. -
అలసత్వం వహిస్తే.. వేటే
చిత్తూరు కలెక్టరేట్: ఓట్ల లెక్కింపు రోజున నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న హెచ్చరించారు. శుక్రవారం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో ఆర్వో, ఏఆర్వో, నోడల్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌లో పాటించాల్సిన జాగ్రత్తలను డిప్యూటీ ఎన్నికల అధికారి గిరీషాతో కలసి ప్రాక్టికల్‌గా తెలియజేశారు. ప్రద్యుమ్న మాట్లా డుతూ గతంతో పోల్చితే ఈ ఎన్నికలు ఎంతో భిన్నమైనవని పేర్కొన్నారు. కౌంటింగ్, పోలింగ్‌కు సంబంధించిఈసీకి ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయన్నారు. పోలింగ్ జరిగిన రోజున కొందరు తహసీల్దార్లు తమకేమి సంబంధం లేనట్లు ప్రవర్తించారని, ఇలాగే కౌంటింగ్ రోజున కూడా వ్యవహరిస్తే.. మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఆయా మండల పోలింగ్ కేంద్రాలకు ఆయా తహసీల్దారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్‌కు జారీ చేసిన చెక్‌లిస్టు ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేసి ఆర్వో సంతకం చేసి 11వ తేదీ సాయంత్రంలోగా అందజేయాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను సీల్ చేసి కలెక్టరేట్లోని గోడౌన్‌కు తరలించాల్సిన బాధ్యత సీలింగ్ నోడల్ ఆఫీసర్లదేనన్నారు. ఈ శిక్షణలో సబ్ కలెక్టర్లు మహేష కుమార, కీర్తి, డీఆర్వో గంగాధరగౌడ్, ఆర్వోలు కమలకుమారి, కనకనరసారెడ్డి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. వీటిపై అవగాహన తప్పనిసరి.. ఈ సారి కౌంటింగ్‌లో కొత్తగా వీవీప్యాట్ స్లిప్పులు, ఈబీపీబీఎస్ ఓట్ల లెక్కింపును అమలు చేస్తున్నారని వీటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ నెల 15న మొదటి దశ ర్యాండమైజేషన్, 16న ఆర్వోలు కంప్లీట్ సర్టిఫికేట్ అందజేయడం, 17న కౌంటింగ్ కేంద్రాల వద్ద బయట బారికేడింగ్‌ను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అదేరోజున ఆర్వోలకు విజయవాడలో శిక్షణ ఉంటుందన్నారు. 18న కౌంటింగ్ ఏజెంట్లకు అనుమతి కార్డుల పంపిణీ, 20న రెండవ దశ ర్యాండమైజేషన్, 23న మూడో దశ ర్యాండమైజేషన్ చేసి ఉద్యోగులు ఏ టేబుల్ లో విధులు నిర్వహించాలనే విషయాన్ని ప్రకటిస్తామన్నారు. 23వ తేదీ కౌంటింగ్ మొదలయ్యే ముందు వరకు వచ్చే పోస్టల్ బ్యాలెట్లన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. గైర్హాజరైన నలుగురు తహసీల్దార్లకు నోటీసులు ఓట్ల లెక్కింపు శిక్షణకు గైర్హాజరైన నలుగురు తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు. వీరిని సస్పెండ్ చేస్తేనే జాగ్రత్తగా ఉంటారని, ముందస్తు అనుమతి లేకుండా శిక్షణకు రాకపోవడం దారుణమన్నారు. -
‘చిత్తూరులో 52 వేల మందికి పోస్టల్ ఓట్లు’
చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా 52 వేల మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు, అలాగే ఆర్మీ సర్వీసులో ఉన్నవారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. చిత్తూరులో ప్రద్యుమ్న విలేకరులతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 2వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చామని తెలిపారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడం కుదరదని స్పష్టంగా పేర్కొన్నారు. వివిధ శాఖల ద్వారా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొన్న వారికి ఆయా శాఖాధిపతుల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే సౌకర్యం చేపట్టామని అన్నారు. ఓటరు లిస్టులో పొరపాట్లు, అడ్రస్ ట్యాలీ కాకపోవడం వల్ల కొందరికి పోస్టల్ బ్యాలెట్లు మంజూరు కాకపోయి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్లు చాలా మందికి మంజూరు కాలేదంటూ చిత్తూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. -
ప్రద్యుమ్ను..డు
చిత్తూరు కలెక్టరేట్: చూడ్డానికి ప్రశాంతంగా కనిపిస్తారు... విధుల్లో అలసత్వం వహిస్తే సహించరు.. ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు..సొంతంగా ఆలోచించడం.. పట్టుదలగా పూర్తి చేయడం నైజం. ఆయనే కలెక్టర్ పాలేగార్ శ్రీనివాస్ ప్రద్యుమ్న. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని గొప్పెనహల్లి చిన్నపల్లె గ్రామంలో డాక్టర్ శ్రీనివాస్, సుజాత దంపతుల పెద్ద కుమారుడు. డాక్టర్ కుటుంబంలో పుట్టిన ఆయన పీజీ తర్వాత సివిల్స్ పూర్తి చేశారు. తండ్రి డాక్టర్ శ్రీనివాస్ కల నెరవేర్చేందుకు ఐఏఎస్ అయ్యారు. 2011లో చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కలెక్టర్‌గా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా (ఓడీఎఫ్) దేశంలోనే మొదటిస్థానంలో నిలిచేలా ఓ భారీ క్రతువు నిర్వహించారు. ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, అది ఓ బాధ్యత అని అంటున్న కలెక్టర్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్య.. సాక్షి :మీ కుటుంబ నేపథ్యం..? కలెక్టర్ :మాది కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని గొప్పెనహల్లి చిన్నపల్లె గ్రామం. నా తండ్రి డాక్టర్ శ్రీనివాస్, తల్లి సుజాత గృహిణి. మేము ఇద్దరం. నేను ఇంటికి పెద్ద కుమారుడిని. తమ్ముడు అనూ మ. నా తండ్రి మైసూర్, బెంగళూరులలో డీఎంఅండ్‌హెచ్‌ఓ, జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. 2007లో వివాహం చేసుకున్నాను. భార్య శిల్ప, కూతురు అవ్యక్త, కుమారుడు విక్రమాదిత్య. సాక్షి : ఐఏఎస్ వైపు అడుగులు ఎలా పడ్డాయి....? కలెక్టర్ : నాన్న నన్ను సివిల్స్ సాధించాలని చిన్నతనం నుంచి చెప్పేవారు. నేను 5వ తరగతి చదివేటప్పుడే ఐఏఎస్‌పై గురిపెట్టించారు. పీజీ అవ్వగానే సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలు రాయాల్సి వచ్చింది. మెయిన్స్‌కు ఢిల్లీలో కేవలం రెండు నెలలు మాత్రమే శిక్షణ తీసుకున్నా. మొదటి ప్రయత్నంలో ఐఆర్ఎస్కు ఎంపికయ్యాను. అంతటితో నా ఆశయాన్ని వదులుకోకుండా మళ్లీ సివిల్స్ రాశాను. ఆ తర్వాత ఐఏఎస్‌కు ఎంపికై నా కలను నెరవేర్చుకున్నాను. సాక్షి :జిల్లాలో మీ అనుభవాలు, విజయాలు, లక్ష్యాలు...? కలెక్టర్ :నేను చిత్తూరులో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడే పూర్తిగా అవగాహన ఉంది. జిల్లాలో ఎక్కువగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాను. ఎవ్వరూ చేయలేని విధంగా నేషనల్ హైవేలు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణం, ఓడీఎఫ్, ప్రకృతి వ్యవసాయం లాంటి కార్యక్రమాలు సంతృప్తినిచ్చాయి. సాక్షి :కరువును అధిగమించడానికి చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యలు..? కలెక్టర్ : జిల్లాలో కరువు ఉన్న మాట వాస్తవమే. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో కరువు ఏర్పడింది. ఇప్పటికే అన్ని మండలాలను కరువు జాబితాలో ప్రకటించాం. సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులకు ఉలవలు ఉచితంగా పంపిణీ చేశాం. తలసరి ఆదాయం తగ్గకుండా చర్యలు చేపడుతున్నాం. సాక్షి : ప్రకృతి వ్యవసాయంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.. కారణం..? కలెక్టర్ :ప్రస్తుతం ఏ అలవాటూ లేని వారు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. కారణం నాణ్య మైన ఆహారం తీసుకోకపోవడమే. అందుకోసం ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాం. ప్రకృతి వ్యవసాయంలో చిత్తూరు 1.30 లక్షల హెక్టార్లలో సాగుచేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. సాక్షి : కార్పొరేషన్ రుణాలు లబ్ధిదారులకు చేరడం లేదు... అందుకు మీరు తీసుకుంటున్న చర్యలు..? కలెక్టర్ :కార్పొరేషన్ రుణాలు గతంలో సరిగా మంజూరు చేయకపోవడం వల్ల సమస్యలు ఉండేవి. ప్రస్తుతం అలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారులందరికీ రుణాలు అందేలా తరచూ బ్యాంకర్లతో సమావేశాలు జరుపుతున్నాం. సహకరించని బ్యాంకులపై చర్యలకూ సిద్ధమవుతున్నాం. సాక్షి :అమృత్ పథకం నిధులు మురిగిపోతున్నాయని తెలిసింది.. ఎందువల్ల....? కలెక్టర్ :అమృత్ పథకంలో ఎంపికైన మున్సిపాలిటీలకు నిధులు వచ్చాయి. ఆ నిధులను ఎక్కువగా తాగునీటి సమస్య పరిష్కారానికి వాడుతున్నాం. చిత్తూరు కార్పొరేషన్‌కు మంజూరైన రూ.250 కోట్లు తాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నాం. కొన్ని పనులకు టెండర్లు పూర్తయ్యాయి. సాక్షి : త్వరలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.. మీరు అమలు చేస్తున్న ప్రణాళిక...? కలెక్టర్ : పేదరికం నుంచి బయటపడాలంటే విద్య వల్లే సాధ్యపడుతుంది. కాపీకొట్టి మార్కులు సాధిస్తే ఫలితం ఉండదు. అందుకోసం ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించబోతున్నాం. ఇప్పటికే తిరుపతి పరిధిలో పదో తరగతి విద్యార్థులకు సూపర్ 60 కార్యక్రమాన్ని ప్రారంభించాం. సాక్షి : పెద్ద పరిశ్రమల స్థాపన అనుకున్న స్థాయిలో జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఏమంటారు? కలెక్టర్ : పెద్ద పరిశ్రమల స్థాపనకు సమయం పడుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎంవోయూలు ఇచ్చాం. త్వరలో స్మాల్గ్రూప్ బిజినెస్ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. గృహిణులకు స్మాల్గ్రూప్ బిజినెస్ ద్వారా రుణాలు అందజేసి, ఉపాధి కల్పించే విధంగా ముందుకు వెళుతున్నాం. సాక్షి : ఓడీఎఫ్‌లో జిల్లాను దేశస్థాయిలో నిలిపేందు కు మీరు చేసిన కృషి...? కలెక్టర్ : మరుగుదొడ్ల నిర్మాణంలో నెలకొల్పిన రికార్డును ఎవరూ అధిగమించలేరు. ఓడీఎఫ్‌లో చిత్తూరును దేశంలో ప్రథమస్థానంలో నిలపడానికి జిల్లా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించారు. ఆత్మగౌరవం ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు. సాక్షి :అభివృద్ధిని వేగవంతం చేయడానికి మీరు తీసుకున్న చర్యలు...? కలెక్టర్ :మొదట్లో జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయాలని నిర్ణయించాం. ఇంజినీర్లు కష్టమని చెప్పినా ప్రస్తుతం 800 కిలోమీటర్లు పూర్తి చేశాం. ఇది రికార్డే. పెద్ద జిల్లా కావడంతో పనులు చేయడానికి అవకాశముంది. వేరే జిల్లాలో ఈ స్థాయిలో పనులు చేయాలనుకుంటే కుదరదు. సాక్షి :మీ సతీమణి అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీని వెనుక మీ కృషి ఏమైనా ఉందా...? కలెక్టర్ : సమాజ సేవంటే మక్కువ కావడంతో ఆమె అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకుంది. సొంత డబ్బు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారు. బిహార్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంతమంది ఇటీవల నన్ను› కలిశారు. అంగన్వాడీల అభివృద్ధి గురించి తెలుసుకున్నారు. 2019 మార్చి నాటికి పౌష్టికాహార లోపం లేని జిల్లాగా తయా రు చేసేలా ఆశయం పెట్టుకున్నాం. -
ఒట్టేసి చెబుతున్నా.. నిర్లక్ష్యం చేస్తే ఇంటికే..
వరదయ్యపాళెం/పిచ్చాటూరు/కేవీబీపురం: ‘ఒట్టేసి చెబుతున్నా..మహిళల ఆత్మగౌరవం పేరుతో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి లక్ష్యం పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి అధికారులైన ఇళ్లకు పంపడంలో వెనుకడుగు వేసేది లేదు’ అని జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. వరదయ్యపాళెంలోని ఒన్నెస్ కోచింగ్ సెంటర్లో సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలకు చెందిన అధికారులతో ఓడీఎఫ్, నరేగా పథకాల గురించి జిల్లా కలెక్టర్ సమీక్షిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ రుగుదొడ్డి నిర్మాణాల నిధులకు కొరత లేదని ప్రస్తుతం జిల్లాకు రూ.625 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 2లక్షల మరుగుదొడ్లు నిర్మించామని, మరో 80వేల మరుగుదొడ్లు నిర్మిస్తే ఓడీఎఫ్ ఖాతా లోకి చేరుకుంటామన్నారు. శ్రమకు తగి న ఫలితం రావాలంటే ఈనెల 30 లోపు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సత్యవేడు మండలంలోని కన్నవరం, మల్లవారిపాళెం, పెద్దఈటిపాకం, సత్యవేడు, వానెల్లూరు పంచాయతీలలో 1012 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ లక్ష్యం పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం కేవీబీపురం మండలంలోని ఐకేపీ(వెలుగు)కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 29 పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందితో మరుగుదొడ్డి నిర్మాణాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పిచ్చాటూరు మండలం ఎంపీడీఓ కార్యాలయలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్లు టార్గెట్లను తప్పక పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. కీళపూడి, ముడియూరు పంచాయితీలలో నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. -
స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయండి
తిరుపతి మంగళం : తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న ఆదేశించా రు. తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్, అధికారులతో ఆయన సమీక్షించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని వీధులలో పనులను పూర్తి అధికారులకు సూచిం చారు. ఒకినోవా బ్యాటరీ ఆపరేటెడ్ చెత్త సేకరణ వాహనాలు 30 రోజుల్లో నగరానికి చేరుకోవాలని, ఏఇకమ్–డెలాయిట్ ప్రాజె క్ట్ అధికారులకు సూచించారు. వినాయకసాగర్, పార్కుల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్ల పనులకు వెంటనే పూనుకోవాలన్నారు. అమృత్ పథకం కింద తిరుపతిలో రూ.252 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. తాగునీటి సరఫరా, పార్కింగ్, ట్రాన్స్పోర్ట్ హబ్ వంటి అత్యవసరాన్ని గుర్తించి పనులను ప్రారంభించాలన్నారు. జేసీ గిరీషా, తిరుపతి సబ్ కలెక్టర్ నిషాంత్‌కుమార్, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. అందరికీ న్యాయం చేస్తాం శెట్టిపల్లి భూములలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తామని జేసీ గిరీ షా హామీ ఇచ్చారు. తన కార్యాలయంలో బుధవారం శెట్టిపల్లి భూముల కొనుగోలు దారులతో ఆయన సమావేశమయ్యారు. శెట్టిపల్లి లెక్క దాఖలాల్లో పేదలు కొనుగోలు చేసిన 140 ఎకరాలలో 12 నుంచి 18వ తేదీ వరకు సర్వే చేస్తామన్నారు. -
చిత్తూరు కలెక్టర్‌కు చేదు అనుభవం!
తిరుపతి: చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. మద్యం దుకాణాలు తొలగించాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలు శనివారం ఉదయం కలెక్టర్ ప్రద్యుమ్నను అడ్డుకున్నారు. తిరుపతి నగర శివార్లలోని మంగళం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న కలెక్టర్ ప్రద్యుమ్న వద్దకు మహిళలు భారీ సంఖ్యలో చేరుకొన్నారు. నివాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని వినతిపత్రాలు సమర్పించారు. విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కలెక్టర్ ప్రద్యుమ్న ప్రకటనపై సంతృప్తి చెందని మహిళలు ముందుకు వెళ్లకుండా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ఎక్సైజ్ అధికారులతో చర్చించి తీవ్ర ఇబ్బందికరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని మరోసారి హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
జిల్లా కలెక్టర్ బదిలీ
నూతన కలెక్టర్‌గా ప్రద్యుమ్న ప్రకాశం కలెక్టర్‌గా వినయ్‌చంద్ తిరుపతి: జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆయనను రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌గా నియమించింది. కాగా నూతన కలెక్టర్‌గా ప్రస్తుతం సీఎం పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నప్రద్యుమ్న బాధ్యతలు చేపట్టనున్నారు. రాత్రి 11 గంటల వరకూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయలేదు. సేకరించిన సమాచారం ప్రకారం జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ సెక్రటరియేట్‌కు బదిలీ కాగా, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌గా కొనసాగుతున్న వినయ్‌చంద్‌ను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. 2010 మార్చి నుంచి 2011 మార్చి వరకూ చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ప్రద్యుమ్న కొనసాగారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వానికి అనుకూలంగా సహకారం అందించాలని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రద్యుమ్నపై ఒత్తిడి తెచ్చింది. అయినప్పటికీ ఆయన నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయనను బదిలీ చేశారు. తిరిగి మళ్లీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ వినయ్‌చంద్ తాజా బదిలీల్లో ప్రకాశం కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. తిరుపతి కమిషనర్‌గా ఎవరికి పోస్టింగ్ ఇచ్చారో తెలియలేదు. -
చదువు ‘కొనాల్సిందే’..!
‘నెలకైతే ఇంత.. ఏడాది మొత్తం ఒకేసారి కడితే కొంత తగ్గిస్తాం..’ అంటూ చదువును అమ్ముతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ విద్యను అంగట్లో వస్తువుగా మార్చేశారు. ప్రైవేటు పాఠశాలల వాళ్లు నిర్ణయించిన ఫీజులను చెల్లించి.. చదువు‘కొనే’ దుస్థితి ఏర్పడింది. విద్యాశాఖాధికారుల సమన్వయంతో విద్యావ్యాపారం జోరుగా సాగుతోంది. ఇంతింత పెట్టి చదివిస్తున్నాం మరి.. విద్యాబోధన ఎలా ఉంటుదంటే.. అదీ ఇష్టారాజ్యంగానే కొనసాగుతోంది. ప్రైవేటు పాఠశాలల ‘ఫీజు’లుంతో పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల చదువులంటేనే భయపడుతున్నారు. నిజామాబాద్‌అర్బన్/బాన్సువాడ : జిల్లాలో 854 ప్రైవేట్‌పాఠశాలలు ఉండగా, అందులో 680 ఉన్నత పాఠశాల లు ఉన్నాయి. ఏడాదికేడాది 20నుంచి 30వరకు కొత్త పాఠశాలలు పుట్టుకువస్తున్నాయి. ఇప్పటికే ఉన్నవాటిలో ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలూ ఉన్నాయి. స్థానిక విద్యాశాఖాధికారిని మచ్చిక చేసుకొని తమ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క పాఠశాల ఒక్కో విధంగా స్థాని క అధికారికి ముడుపులు అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. టెక్నో, గ్లోబల్, టాలెంట్ పేర్లు తొలగించకుండా రూ.10వేల నుంచి రూ.20వేల వరకు అధికారులకు అందిస్తున్నట్లు తెలిసింది. ఇక పుస్తకాలు, దుస్తుల పేరిట ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న దందాపై కనీసం స్పందించే నాథుడే లేరు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉండాల్సిన నిబంధనలు లేకున్నా.. పాఠశాలల్లో నిపుణులైన టీచర్లు లేకు న్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాలను చూసుకోవాల్సిన స్థానిక విద్యాశాఖాధికారులు సంబంధిత స్కూల్ యాజమాన్యాలతో కుమ్మక్కై ఏమాత్రం స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 35మంది ఇన్‌చార్జిలే జిల్లాలో 36 మంది ఎంఈవోలకు గానూ 35మంది ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. వీరు పకడ్బందీగా చర్యలు తీసుకోకపోవడం లేదు. ప్రైవేట్ పాఠశాలల తనిఖీలకూ సాహసించడం లేదు. తమకు ఎంతో కొంత అందుతుంది లే.. అన్న విధానంలోనే వారూ సంతృప్తి చెందుతున్నారు. ఒక్క ఆర్మూర్‌లో 21 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 12వరకు కనీస సౌకర్యాలు లేనివే. సదరు పాఠశాలలు నిబంధనలు పాటించకుండా ఫీజులు మాత్రం వేలల్లో వసూలు చేస్తున్నాయి. ఈ సంగతి తెలిసినా సంబంధిత విద్యాధికారులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం. ఫీజుల దడ ఏడాదికేడాది ప్రైవేటు పాఠశాలలో ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని స్కూళ్లు నర్సరీ, ఎల్కేజీ పిల్లలకే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. డొనేషన్, స్కూల్ డెవలప్మెంట్ ఫీజులతో పాటు బస్సు చార్జీలు, దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, టై, బెల్ట్‌లు అంటూ వేలు వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.40 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇద్దరు , ముగ్గురు పిల్లలున్న తల్లిదండ్రులకు చదువు మరింత భారంగా మారుతోంది. నియంత్రణ చర్యలేవి? ప్రైవేటు పాఠశాలలు ఇష్టారీతిన వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించేందుకు గత కలెక్టర్ ప్రద్యుమ్న జిల్లావ్యాప్తంగా ఫీజుల వివరాలను సేకరించారు. అనంతరం ఆయన బదిలీ అయ్యారు. సంబంధిత విద్యాశాఖాధికారులైనా స్పందించి.. అధికంగా ఫీజులు వసూలు చే స్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. నిబంధనలు గాలికి.. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకున్నా ఫీజుల దోపిడీ కొనసాగుతోంది. విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని ఉన్నా.. పట్టించుకోవడం లేదు. స్కూల్ పేరు తర్వాత ఎలాంటి తోకపేర్లు ఉండకూడదన్న నిబంధననూ తుంగలో తొక్కేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పేదవిద్యార్థులకు అందించాల్సిన ఉచిత విద్యను ఎక్కడా అమలు చేయడం లేదు. వీటిపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడం సదరు స్కూళ్లకు వరంలా మారుతోంది. ఒకవేళ తనిఖీకి వచ్చినా అధికారులను మచ్చిక చేసుకుంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ కళ్లు తెరవాలని ప్రైవేట్ పాఠశాలల దూకుడుకు కళ్లెం వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రాష్ట్రాభివృద్ధికి విద్యార్థులే పునాదులు
నందిపేట రూరల్ : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి విద్యార్థులే పునాదులు కావాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆకాంక్షించారు. వ్యక్తిగతంగానే కాకుండా దేశ, భాషాభివృద్ధికి శిక్షణ వ్యవస్థ కీలకమని అన్నారు. సోమవారం మండలంలోని డొంకేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలో ‘ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా శిక్షణ వ్యవస్థ నుంచే ప్రారంభం కావాలని అన్నారు. 5 నుంచి 14 సంవత్సరాలలోపు బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఎన్ని వసతులు కల్పించినా ఎక్కడో ఒకచోట విమర్శలు ఎదురవుతునే ఉన్నాయన్నారు. పాఠశాలల్లో అదనపు గదులు కట్టించినంత మాత్రాన సమస్యలు తీరిపోవని, పాఠశాలకు పూర్తిస్థాయిలో విద్యార్దులు వచ్చినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందన్నారు. మనం చేసే ప్రయత్నం మంచిదై సదుద్దేశంతో చేస్తేనే విజయం సాధిస్తామని, ప్రయోజనంలేని పనిచేయడం వ్యర్థమన్నారు. జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో డొంకేశ్వర్ పాఠశాల విద్యార్థులు చదువులో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. అందుకు తమ సహాయం పూర్తి స్థాయిలో అందిస్తామన్నారు. పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని తాను చెప్పడం లేదని, అందులో రెండు శాతం తక్కువయినా జ్ఞానాన్ని మాత్రం విద్యార్థులు సముపార్జించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మన పక్కనే ఉన్న సరస్వతి మాతా ఆశీస్సులతో జిల్లాలోని ప్రతి విద్యార్థి మంచిఫలితాలు సాధించాలని, అందుకు డొంకేశ్వర్ పాఠశాల విద్యార్థులే ఆదర్శం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాదికారి శ్రీనివాసాచారి, స్థానిక సర్పంచ్ హరి దాస్, ఆర్వీఎం పీఓ కిషన్‌రావు, సీఎంఓ స్వర్ణలత, మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం అశోక్, ఎంపీడీఓ నాగవర్ధన్, విద్యాకమిటీ చైర్మన్ రాములు తదితరులు పాల్గొన్నారు. దీపికకు కలెక్టర్ అభినందన నందిపేట రూరల్ : ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 10/10 గ్రేడు సాధించిన మండలంలోని తల్వేద ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని పి. దీపికను కలెక్టర్ ప్రద్యుమ్న అభినందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని దీపిక, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పోటీపడి ఈ ఘనత సాధించడం హర్షించదగిన విషయమన్నారు. చదువుకు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల అనే తేడా ఏమీ ఉండదని, ముందుగా చదువుకోవడానికి ప్రయత్నం, సాధించాలనే పట్టుదల ఉంటే ఫలితం మనముందే సాక్షాత్కరిస్తుందన్నారు. అందుకు దీపికే నిదర్శనమన్నారు. విద్యార్థులకు చదువుచెప్పడంతోనే ఉపాధ్యాయుల బాధ్యత తీరదని, నిజాయితీగా పనిచేసి చదువుకు సార్థకత చేకూరేలా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దినపుడే తగు న్యాయం చేసినవారవుతారన్నారు. దీపికను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. -
నిర్మాణాలను పూర్తి చేయించండి
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : నిర్మాణాలు పూర్తయిన కళాశాలలు, పాఠశాలలు, వసతి గృహాలు తదితర భవనాలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రగతిభవన్‌లో జిల్లా విద్యామౌలిక సదుపాయాల సంస్థ ఇంజనీర్లు, రాజీవ్ విద్యామిషన్ అధికారులతో సమీక్షించారు. వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా పాఠశాలలో అదనపు తరగతి గదులు (ఏసీఆర్) తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మరో 164 ప్రాథమికోన్నత పాఠశాలలకు అదనపు తరగతుల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు మంజూరు కోసం సమర్పించాలని సూచించారు. జిల్లాకు రెండో విడత 20 మోడల్ స్కూల్స్ మంజూరు కోసం, అలాగే 5 కోట్లు విడుదల చేయడానికి విద్యాశాఖ కమిషనర్‌కు అధికారికంగా లేఖ రాసి పంపించాలని కార్యనిర్వాహక ఇంజనీర్ క్రిష్ణారెడ్డికి కలెక్టర్ సూచించారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా త్వరితంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో విద్యా, మౌలిక సదుపాయాల సంస్థ ఈఈ క్రిష్ణారెడ్డి, ఆర్వీఎం ఈఈ వినయ్‌కుమార్, డిప్యూటీ ఈఈ అధికారులు పాల్గొన్నారు. ఆధార్ సీడింగ్ పూర్తి చేయండి జూలై ఒకటో తేదీ నాటికి ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని డ్వామా అధికారులను జిల్లా కలెక్టర్ పి.ఎస్. ప్రద్యుమ్న ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నీటి యాజమాన్య సంస్థ సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జూలై ఒకటి నాటికి ఆధార్ సీడింగ్ ఉన్న మండలాల్లో కూలి చెల్లింపులు జరపాలన్నారు. నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) 2014-15 సంవత్సరానికి గాను *267 కోట్ల పనులు మంజూరయ్యాయని, వాటిలో * 72 కోట్లు పంచాయతీరాజ్ ద్వారా అభివృద్ధి పనులు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల మంది కూలీలు ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు నమోదు కాని, నమోదైన కూలీలకు ఆధార్ సీడింగ్ ద్వారా చెల్లింపులు నిర్వహించాలని సూచించారు. ప్రతి మండలానికి మంజూరైన నిధులు, పనులపై ఏపీఓలకు అవగాహన కల్పించాలన్నారు. నీటి యాజమాన్య సంస్థ ద్వారా భూ అభివృద్ధి, మోడల్ స్కూల్స్, రోడ్ల నిర్మాణం, కచ్చా రోడ్ల పునరుద్ధరణ వంటి పనులు నిర్వహించాలన్నారు. అన్ని మండలాల్లో ఎస్సీ, ఎస్టీ అధికంగా ఉన్న గ్రామ పంచాయతీలను గుర్తించి భూ అభివృద్ధి, ఉద్యానవనం ఏర్పాటు వంటి పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ శివలింగయ్య , ఏపీఓలు పాల్గొన్నారు. -
ఇందూరు ఆదర్శం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఇందూరు జిల్లా ‘తెలంగాణ’లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక ప్రణాళి కతో ముందుకెళ్తామన్నారు. మన పూర్వీకు లు సాధించిన ఘన కార్యాలెన్నో ఉన్నాయ ని, వాటిని భావితరాలకు అందిస్తే వారు నవోత్తేజంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఉదయం నిజామాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన వారికి కలెక్టర్ జోహారులు అర్పించారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 2013-14 సంవత్సరంలో వ్యవసా య రంగంలో అత్యధికంగా రూ. 1,834 కోట్ల రుణాలను అందించామన్నారు. రబీ సీజన్లో 274 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని, 32 వేల మంది రైతులకు ఆన్లైన్ ద్వారా మూడు రోజుల్లోపే డబ్బులు చెల్లించామన్నారు. గతేడాది మహిళా సంఘాలకు రూ. 426 కోట్ల రుణాలివ్వాలన్నది లక్ష్యం కాగా రూ. 475 కోట్ల రుణాలిచ్చామన్నారు. ఆ ఏడాది మహిళా సంఘాలు రూ. 54 కోట్ల వడ్డీ రాయితీ పొందాయన్నారు. ఎక్కువ వడ్డీ రాయితీని పొందిన జిల్లాలో ఇందూరుది ప్రథమ స్థానమని పేర్కొన్నారు. స్త్రీనిధి పథకం కింద రూ. 132 కోట్ల రుణాలివ్వాలన్నది లక్ష్యంకాగా రూ. 142 కోట్ల రుణాలిచ్చామన్నారు. ఈ విషయంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వంనుంచి పురస్కారాన్ని అందుకున్నామన్నారు. సూక్ష్మ నీటిపారుదల పథకం కింద 2013-14 సంవత్సరంలో 5,010 హెక్టార్ల లక్ష్యానికి గాను 4,431 హెక్టార్లలో నీటి పారుదల సదుపాయం కల్పించామన్నారు. బంగారుతల్లి పథకం కింద 10,129 మందికి లబ్ధి చేకూర్చామన్నారు. ఉపాధి హామీ పథకం కింద 2013-14 సంవత్సరంలో రూ.200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా ప్రథమ స్థానం లో ఉందని, గతేడాది 19,621 ఇళ్ల నిర్మాణాల లక్ష్యానికిగాను 16,517 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. జిల్లాలో రెండు స్టేడియాల నిర్మాణానికి రూ.10.20 కోట్లు మంజూరయ్యాయన్నారు. నిజామాబాద్ నగరంలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా రూ. 56 కోట్లతో పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో 25 వేల కుళాయి కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ఆర్మూర్‌కు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రూ. 70 కోట్ల విలువ గల పథకం మంజూరు అయ్యిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా రూ. 34 కోట్లతో చేపట్టిన పనులు ముగింపు దశలో ఉన్నాయని, దీని ద్వారా పట్టణంలో 10 వేల అదనపు తాగునీటి కనెక్షన్లు ఇవ్వవచ్చని వివరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ రేంజ్ డీఐజీ సూర్యనారాయణ, జిల్లా జడ్జీ షమీమ్ అక్తర్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్రావు, ఎస్పీ తరుణ్‌జోషి, డీఆర్వో రాజశేఖర్, డీపీవో సురేశ్‌బాబు, డ్వామా పీడీ శివలింగయ్య, డీఆర్డీఏ పీడీ వెంకటేశం, గృహనిర్మాణ సంస్థ పీడీ చైతన్యకుమార్, జడ్పీ సీఈవో రాజారాం, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు విమలాదేవి, శ్రీనివాసాచారి, కొండల్రావు, దివాకర్, భీమానాయక్, మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. -
అంబరమంటేలా.. సంబురాలు
ప్రజల చిరకాల వాంఛ నెరవేరే క్షణం కొద్ది గంటల్లో రాబోతోంది. దశాబ్దాల పోరాటం రాష్ట్రంగా రూపుదిద్దుకోబోతోంది. త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించబోతోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచే సంబురాలు అంబరమంటేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్రావులు రెండు రోజులుగా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జూన్ రెండో తేదీ.. తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. దీనికి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వేదిక కానుంది. సోమవారం ఉదయం 8.45 గంటల కు కలెక్టర్ ప్రద్యుమ్న జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించి సంబురాలను ప్రారంభిస్తారు. తెలంగా ణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా వారం పాటు కలెక్టరేట్ మైదానంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులు, రచయితలు, ప్ర ముఖులను సన్మానించనున్నారు. గ్రామాల్లోనూ సంబురాలు నిర్వహించనున్నారు. సంబురాలకు పార్టీలు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సర్వసన్నద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేడుకలకు ఏర్పాట్లు చేసింది. పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యకర్తలను సమాయత్తం చేశారు. జిల్లాను పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో గులాబీమయం చేస్తున్నారు. ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లా నేతలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు సైతం జిల్లాలో ఆవిర్భావ వేడుకలను భారీగా జరపాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. జిల్లా వ్యా ప్తంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు బీజేపీ, టీడీపీలు కూడా స మాయత్తమయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాలతో పాటు తెలంగాణవాదులు ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందకు సిద్ధమయ్యారు. -
పుస్తకాల పంపిణీ ఈసారి ముందుగానే
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : విద్యాసంవత్సరం ప్రారంభమైనా పాఠ్యపుస్తకాలు అందక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అవస్థలు పడడాన్ని ఇన్నాళ్లు చూశాం. ఈసారి పరిస్థితి మారింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. విద్యాశాఖ డెరైక్టర్ పూనం మాలకొండయ్య పుస్తకాల పంపిణీని పకడ్బందీగా చేపట్టారు. దీంతో ఈ ఏడాది పాఠ్యపుస్తకాలు ముందే జిల్లాకు చేరాయి. జిల్లాలో 465 ఉన్నత పాఠశాలలు, 975 ప్రాథమికోన్నత పాఠశాలు, 1,525 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో రెండున్నర లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికిగాను ఈ ఏడాది విద్యా సంవత్సరానికి 16.45 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా 97,450 పుస్తకాలు గత సంవత్సరంవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా 15.60 లక్షల పుస్తకాలు కొత్తగా అవసరమయ్యాయి. ఇప్పటికే 15.51 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాయి. వీటిని ఆయా పాఠశాలలకు పంపించారు. పాఠశాలల పునఃప్రారంభం రోజునే.. పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠ్యపుస్తకాల పంపిణీపై మంగళవారం తన చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 12న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. అన్ని తరగతుల విద్యార్థులకు అన్ని టైటిల్స్‌ను అందించాలని సూచించారు. -
యువతకు పెద్దపీట
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : ప్రస్తుతం అధికారం చేపట్టనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో గ్రామీణ యువతకు స్వయంఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న చెప్పారు. బుధవారం డిచ్పల్లి టీటీడీసీ ఆవరణలో ఎస్బీహెచ్ ఆధ్వర్యంలో *కోట్ల వ్యయంతో నిర్మించిన ‘గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్ఎస్ఈటీఐ)’ భవనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారి నైపుణ్యాలను వెలికి తీసే విధంగా కృషి చేయాలని సూచించారు. ఏ శిక్షణ కేం ద్రంలోనైనా జీవితాంతం సరిపోయే శిక్షణ ఇవ్వలేరని, మారుతున్న పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా ఎప్పటి కప్పుడు కొత్త విధానాలను మనకు మనమే నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. జ్ఞానం అనేది ఎంతో విలువైనదని, మనం ఎంచుకున్న రంగంలో జ్ఞానం సంపాదిస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలెదురైనా పరిష్కరించుకోవచ్చన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యువత ముందుగా కోరుకోనేది ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడం. అయితే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే సాధ్యం కాదని, అందుకే యువత స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి చూపించే మార్గం ఎంచుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎంత తీవ్రంగా ఉందంటే.. చౌకధరల దుకాణం డీలర్ పోస్టుకు ఇంటర్వ్యూ పిలిచినా, పీజీ చేసిన వారు సైతం హాజరువుతున్నారని ఉదాహరణగా తెలిపారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు త్వరలో అధికారం చేపట్టనున్న ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాలను పరిశీలిస్తే, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోందన్నారు. ఎస్బీహెచ్ ఆర్ఎస్ఈటీఐ ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది, స్వయం ఉపాధి పొందుతున్న యువత వివరాలను సంస్థ ప్రతినిధులు నమోదు చేసుకోవాలని సూచిం చారు. ఏడాది, రెండేళ్ల తర్వాత వారు స్వయం ఉపాధి పొందుతున్నారా లేదా వాటిని వదిలేసి ఇంటికి చేరుకున్నారా అనే విషయాన్ని గమనించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక డాటా విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల ని కలెక్టర్ సూచించారు. అనంతరం ఎస్బీహెచ్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. 2002లో ఎస్బీహెచ్ ఆ ధ్వర్యంలో ఆర్ఎస్ఈటీఐ ను మొట్టమొదట వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఏడు కేంద్రాలు, కర్ణాటకలో రెండు, మ హారాష్ట్రలో మూడు శిక్షణ కేంద్రాలు కొనసాగుతున్నా రు. గ్రామీణాభివృద్ధిశాఖ వారు చేసిన సర్వేల్లో ఈ శిక్షణ కేంద్రం ‘ఏఏ’ గ్రేడ్ సాధించిందన్నారు. కార్య క్రమంలో ఆర్బీ ఐ రీజనల్ డెరైక్టర్ కేఆర్‌దాస్, ఎస్బీహెచ్ సీజీఎంలు సురేశ్‌బాబు, ఎస్.వెంకటరామన్, జీఎం ఆర్ఎన్.డా ష్, ఆర్ఎస్ఈటీఐ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పీసీ దాస్, సం స్థ డెరైక్టర్ విష్ణుకుమార్, సర్పంచ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : ఈ నెల 16న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. జిల్లాలోని 9 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోకవర్గాలకు సంబంధిం చిన ఈవీఎంలను డిచ్పల్లి సీఎంసీ కళాశాల భవనంలో భద్రపరిచిన విషయం తెలిసిందే. ఇక్కడే కౌంటింగ్ నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి కలెక్టర్ సీఎంసీ కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ.. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. గంట ముందుగానే పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సంబంధిత నియోజకవర్గ కౌంటింగ్ హాల్లోకి చేరుకోవాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలోనే సీల్ వేసిన స్ట్రాంగ్ గదులను తెరచి ఈవీఎంలను కౌంటింగ్ హాల్లోకి తీసుకువస్తారన్నారు. ఏజెంట్లుతమ వెంట తెల్లపేపర్, పెన్సిల్ తప్ప ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని సూచించారు. ఏజెంట్లకు పాస్‌లు తప్పని సరని, పాస్ లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించేది లేదన్నారు. కౌంటింగ్ సమయంలో బయటకు వెళ్లే ఏజెంట్లను తిరిగి లోనికి అనుమతించ బోమన్నారు. కౌంటింగ్ హాల్లోకి ముందు అధికారులు, తర్వాతే పోలింగ్ ఏజెంట్లను అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్లకు తాగునీటి వసతి మాత్రమే కల్పిస్తామని, భోజన వసతి కల్పించడం లేదన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు, ఏజెంట్లు గమనించి అధికారులకు సహకరించాలని సూచించారు. కౌంటింగ్ జరిగే కేంద్రం వద్ద 100 గజాల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉం టుందన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నియమ,నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం కౌంటింగ్ జరుగుతుందని, 16నుంచి 18 వరకు రౌండ్లు ఉంటాయన్నారు. 18 గదుల్లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి అసెంబ్లీ, ఎంపీ కౌం టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్‌లో వేయి మందికి పైగా సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. కౌంటింగ్‌కు హాజ రయ్యే ఏజెంట్లు సీఎంసీ కళాశాల భవనం వెనుక వైపు ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా లో నికి వెళ్లాలనిసూచించారు. అభ్యర్థులు, ఏజెం ట్లు, ఎన్నికల సిబ్బంది, మీడియా వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించామని, బోర్డులు ఏర్పాటు చేసినట్లుతెలిపారు. ఎవరికి కేటాయించిన స్థలంలో వారే వాహనాలు నిలుపాలన్నారు. -
13న రీ పోలింగ్
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎం లోపాల కారణంగా జిల్లాలోని ఎనిమిది పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 13న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం తగు ఆదేశాలు జారీ చేసిందన్నారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికల నిర్వహణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ తరుణ్‌జోషి అన్నారు. ప్రదాన రహదారులతో పాటు చెక్‌పోస్టు ల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహి స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద వాహనాల తనిఖీని కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. చెక్‌పోస్టుల్లో వా హనాలను తనిఖీ చేస్తున్న పోలీస్, రెవెన్యూ అధికారుల పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అ చ్చంపేట అథితి గృహం వద్ద స్థానిక అధికారులతో వారు మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా నగదు, మ ద్యం రవాణా కాకుండా పకడ్బందీగా సోదాలు చేయాలన్నారు. వాహనాల తనిఖీల పై కొందరు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆర్టీసీ తో పాటు ప్రై వేటు వాహనాలను అణువణువు తనిఖీ చేయాలన్నారు. అభ్యర్థులు ప్రచారం కోసం వాడుకుం టున్న వాహనాల అనుమతులను పరిశీలించాలన్నా రు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న పార్టీ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ముందస్తు అనుమతి లేకుండా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేయా లన్నారు. వందశాతం పోలింగ్ నమోదుకావాలి ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియో గించుకొని వందశాతం పోలింగ్ నమోదు చేయాలని కలెక్టర్ ప్రద్యుమ్న గిరిజన ఓటర్లకు సూచించారు. పిప్పిరేగడి తండాలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మీ అవసరాల కోసం తండాలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఓటర్లంద రూ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. -
జిల్లా ఆస్పత్రిలో వైద్యుల మధ్య విభేదాలు
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : అసలే వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జిల్లా ఆస్పత్రిలో... ఉన్న వైద్యులు వారం రోజులుగా ఒకరికొకరు వాగ్వాద పడుతున్నా రు. దీంతో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదు. విధుల్లో కావాలనే వేధిస్తున్నారని గైనిక్ వైద్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గత బుధవారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను కలిసి లిఖిత పూర్వకంగా వారు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి వైద్యాధికారులు తమకు ఎక్కువగా బాధ్యతలు అప్పగిస్తూ కావాలని వేధిస్తున్నారని, కళాశాల ప్రొఫెసర్లుగా ఉన్న తమకు వైద్యసేవలు అందించడానికి వీలులేదని కోరుతూ లేఖలో ఆస్పత్రిలోని స్త్రీ వైద్యనిపుణులు రాజేశ్వరి, మంజుల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ప్రతిరోజు 40 ప్రసవాలు చేయాల్సి వస్తుందని, ఉన్న ముగ్గురు వైద్యులు సక్రమంగా విధులకు రాకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆస్పత్రి అధికారులు పేర్కొంటున్నారు. ఇరువురి మధ్య డ్యూటీల కేటాయింపులో తరుచుగా వాగ్వాదం చోటుచేసుకుంటున్నాయి. తమకు డ్యూటీలు వేయవద్దని వైద్యురాళ్లు, డ్యూటీలు చేయాల్సిందేనని వైద్యాధికారులు పట్టుబడుతుండడంతో వీరిమధ్య వారం రోజులుగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. అయితే ఫిర్యాదు అందగానే కలెక్టర్ శుక్రవారం మెడికల్ కళాశాల అధికారులను , వైద్యులను తను చాంబర్‌కు పిలిపించుకొని సమావేశం నిర్వహించారు. వైద్యులు విభేదాలు మాని రోగులకు సేవలు అందించాలని, ఒకరికొకరు ఫిర్యాదు చేసుకోవడం తగదని హెచ్చరించినట్లు తెలిసింది. ఆస్పత్రిలో గైనిక్ సేవలు అందించడానికి వైద్యురాళ్లు పనిభారం అనుకోకుండా, వీలైనంత ఎక్కువగా సేవలు అందించాలని సూచించారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు అదనం గా సేవలు అందించాలని కోరినట్లు తెలి సింది. లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించి నట్లు సమాచారం. కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ వైద్యుల పనితీరు నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఇందులో 40 మంది ప్రొఫెసర్లు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారని తెలపడంతో కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. తక్షణమే వారిని రప్పించి వైద్యసేవలు అందిచాలని ఆదేశించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ జిజియాబాయి, ఆసుపత్రి సూపరింటెండెంట్ భీంసింగ్, పరిపాలన అధికారి నరేందర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
మద్యం ప్రవాహానికి బ్రేక్
మోర్తాడ్, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ మద్యం భారీగా విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్న మద్యం వ్యాపారుల ఆటలు సాగడం లేదు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు తోడు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న చేపట్టిన చర్యలు మద్యం వ్యాపారులకు ప్రతి బంధకంగా మారాయి. జిల్లాలోని మద్యం దుకాణాలకు మాక్లూర్‌లోని ఐఎంఎల్ డిపో నుంచి మద్యం సరఫరా చేస్తారు. అయితే మద్యం విక్రయాల్లో పురోగతి ఉన్నా ఎన్నికల కమిషన్ ఆదేశంతో గత సంవత్సరం వ్యాపారులు తీసుకున్న మద్యంలో 10 శాతాన్ని తగ్గించి ఇప్పుడు కొత్త కోటాను అధికారులు నిర్ణయించారు. గత రికార్డులను పరిశీలించి మద్యం దుకాణాలలో నిలువ ఎంత ఉన్నా తక్కువ పరిమాణంలోనే విక్రయించాలని కలెక్టర్ నిబంధన విధించారు. గతంలోని అమ్మకాల రికార్డులను పరిశీలించి అంత మేరకే మద్యం విక్రయించాలని ఆదేశించారు. ఎవరైనా మద్యం దుకాణం యజమాని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల కంటే ఒక్క సీసా ఎక్కువ అమ్మినా ఆ దుకాణాన్ని సీజ్ చేయాలని తనిఖీ బృందాలకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 10 ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 123 మద్యం దుకాణా లు ఉన్నాయి. ఐఎంఎల్ డిపో నుంచి మద్యం వ్యాపారులు ఎంత మద్యంను కొనుగోలు చేసినా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే వ్యాపారులు మద్యంను విక్రయించాల్సి ఉంది. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలలోని మద్యం దుకాణాలలో సాధారణంగా రోజుకు 15 నుంచి 20 కాటన్ల విస్కీ, 45 నుంచి 60 కాటన్ల బీరు అమ్ముడవుతుంది. పట్టణాలలో అయితే రెండింతల మద్యం ఎక్కువగా అమ్ముడవుతుంది. కాగా, 12 కాటన్ల విస్కీ, 40 కాటన్ల బీరు మాత్రమే విక్రయించాలని జిల్లా అధికార యం త్రాంగం నిబంధన విధించింది. మందుబాబుల పరేషాన్ వేసవితాపం పెరగడంతో బీరుకు డిమాండ్ ఉంది. ఎన్నికల సీజన్ కావడంతో విస్కీ అమ్మకాలు ఊపందుకున్నాయి. మందుబాబులు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. అయితే తక్కువ పరిమాణంలోనే మద్యంను విక్రయించాలని కలెక్టర్ ఆదేశించడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే వ్యాపారులు షాపులను తెరిచి ఉంచుతున్నారు. రోజువారీ కోటా మద్యం విక్రయించిన తరువాత వినియోగదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో దుకాణాలకు తాళాలు వేస్తున్నారు. మద్యం అమ్మ కాలపై ఎస్ఎస్టీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఫ్ల యింగ్ స్క్వాడ్, వీడియో సర్విలెన్స్ తదితర బృందాలు రోజూ నిఘా ఉంచుతున్నాయి. మద్యం దుకాణాలలోని అమ్మకాలు, నిలువ ఉన్న మద్యం వివరాలను పరిశీలిస్తున్నాయి. మద్యం దుకాణాలను సీజ్ చేసే అవకాశం ఉండటంతో వ్యాపారులు రోజువారీ కోటా అమ్మకాలు పూర్తి కాగానే దుకాణాలు మూసేస్తున్నారు. ఎన్నికలలో మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ తీసుకుం టున్న చర్యలపై ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రణాళికాబద్ధంగా ఎన్నికల విధులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికలలో ప్రిసైడింగ్ అధికారి డైరీ అత్యంత ప్రధానమైనదని, ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న అధికారులను సూచించారు.ఆదివారం ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్రిటర్నింగ్ అధికారి చెక్ మెమో సరిచూసుకోవాలని, ప్రిసైడింగ్ అధికారి హ్యాండ్‌బుక్‌లోని ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. ఎన్నికలు జరిగే సమయంలో బూత్‌లోకి ఎన్నికల సిబ్బంది, ఓటర్లు తప్ప ఇతరులెవరూ లోనికి రాకుండా చూడాలన్నారు.ప్రిసైడింగ్ అధికారి మినహా ఎవరికి ఫోన్ ఉండకూడదన్నారు. వృద్ధులు, అంధులు ఓటు వేయడానికి సహాయంగా ఒకరిని తెచ్చుకోవడానికి అనుమతించాలన్నారు. ఓటర్ల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి అనుమతించాలన్నారు. టెండర్ ఓటు, చాలెంజ్ ఓటు, నిరాకరించిన ఓటు వయసు అర్హత లేని ఓటు తదితర నిబంధనలను నిశితంగా పరిశీలించాలన్నారు. ఎన్నిక సరైన పద్ధతిలో నిర్వహించారో ప్రిసైడింగ్ అధికారి డైరీ సూచిస్తుందన్నారు. దానితో పాటు బ్యాలెట్ పేపరు ఎకౌంట్ కూడా అత్యంత ప్రధానమైనవని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధల ప్రకారం సజావుగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ సురేష్‌బాబు ,డ్వామా పీడీ శివలింగయ్య, జేడీఏ నర్సింహ, అధికారులు పాల్గొన్నారు. -
ప్రచారానికి అనుమతి లేకుంటే కేసులే..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా, అభ్యర్థిపై ఐపీసీ-17సీ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. సార్వత్రిక, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి శుక్రవారం పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తిస్థాయిలో అమలు జరిగేలా అధికారులంతా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించా రు. అభ్యర్థులు, పార్టీలు నిర్వహించే సభలు ,సమావేశాలు, ర్యాలీలు ప్ర చారం నిర్వహించే ప్రతి అంశాన్ని వీడియో ద్వారా చిత్రీకరించాలన్నారు. వాహనాల్లో అక్రమంగా మద్యం, డబ్బు రవాణా కాకుండా ప్రత్యేక చర్య లు తీసుకోవాలన్నారు. కుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ప్రత్యేక గుర్తింపుకార్డులు జా రీ చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులంతా స్థానికంగా ఉండాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ స్టేషన్లు, ప్రత్యేకంగా ఉంటాయన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లు సందర్శించి వాటి పరిస్థితిని వెంటనే నివేదిక ద్వారా తెలియచేయాలని సూచించారు. ఇంకా తొలగించకుండా ఉన్న పార్టీల బ్యానర్లు, హోర్డింగ్‌లు, నాయకులు ఫొటోలు, వాల్ పెయింటింగ్స్ ఉంటే తక్షణమే తొలగించాలన్నారు. వాల్ పెయింటిం గ్ను తొలగించడానికి అయిన ఖర్చును బాధ్యుల నుంచి వసూలు చేయాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు రూట్‌మ్యాప్ రూపొందించి పోలీసు అ ధికారులకు అందించాలన్నారు. ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు, కోడ్ అమలుకు అన్ని చర్యలు తీ సుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి తెలిపారు. రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గాల వారీగా రూట్‌మ్యాప్‌లను డీఎస్పీలకు అందచేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీఆర్వో రాజశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
వీడియో నిఘాలో ఎన్నికలు
నిజామాబాద్‌అర్బన్,న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కల్టెకర్ ప్రద్నుమ్న పేర్కొన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. కలెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం...సాధారణ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ ఏప్రిల్ 2న విడుదల కాగా, అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.ప్రతి మండలానికి ఐదు వీడియో బృందాలు పనిచేస్తాయన్నారు. ఎన్నికల్లో చోటు చేసుకునే ప్రతి అంశంపై,అభ్యర్థులు నిర్వహించే సభలు సమావేశాలు,ర్యాలీలు, ప్రచారం కార్యక్రమాలపై అధికారుల ప్రత్యేక నిఘా ద్వార వీడియో చిత్రీకరణ చేస్తారు. ఈవీఎంలను రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పరిశీలిస్తారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా బ్యాలెట్ ఓటును పరిశీలించేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సెక్టోరల్ అఫీసర్లను నియమించామని కలెక్టర్ తెలిపారు. రిటర్నింగ్ అధికారుల అనుమతి లేకుండా అభ్యర్థులు ఎలాంటి సభలు, సమావేశాలు,ర్యాలీలు చేపట్టకూడదన్నారు. ప్రచారంలో ఉపయోగించే వాహనాలకు అనుమతి లేకపోతే సీజ్ చేస్తామన్నారు. ఓటర్లను ప్రభావం చేసే అంశాలపైనా, అభ్యర్థులు ఓటర్లపై ఒత్తిడి తీసుకువచ్చినా, భయభ్రాంతులకు గురిచేసిన అంశాలపై అధికారుల బృందాలు అధ్యయనం చేస్తాయన్నారు. కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో కళాజాతా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమస్య తలెత్తినా, ఓటర్లకు సందేహం కలిగినా నివృత్తి చేసేందుకు వీలుగా జిల్లా కేంద్రంలో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఈ టోల్‌ఫ్రీ నంబర్ 18004256644 సంప్రదించవచ్చన్నారు. లేదా తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. పత్రికలలో లేదా టెలివిజన్ ఛానల్స్‌లో ప్రచురించే పేయిడ్ న్యూస్ గుర్తించి వాటి ఖర్చును అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తామన్నారు. అభ్యర్థులు ఎన్నికల సామగ్రి కోసం చేసే ఖర్చు రూ. 10 వేలు మించకూడదన్నారు. ఐదు కేసులు నమోదు : ఎస్పీ జిల్లా ఎస్పీ తరుణ్‌జోషీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలు లేకుండా వాహనాల్లో తరలిస్తున్న రూ. 14.81 లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో సమస్యాత్మక,అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆయా గ్రామాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలోని 9 నియోజకవర్గాలలోని పోలింగ్ స్టేషన్లలో, పోలీసు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు వినియోగించే ప్రతి వాహనానికి అనుమతి పత్రాలు ఉండాలన్నారు. బెల్టు షాపులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. లెసైన్స్ ఆయుధాలు కలిగిన ప్రతి ఒక్కరు సంబంధిత పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయాలని సూచించారు. అభ్యర్థులు చేసే ప్రచారం ఎవరికీ ఇబ్బంది కలుగకుండా ఉండాలని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే ప్రచారం కోసం మైకులు వాడాలన్నారు. మందిరాలు, మజీదులు, చర్చిలు,ప్రార్థనల స్థలాలలను ప్రచారం కోసం వాడకూడదన్నారు. -
పౌష్టికాహారలోపం మీ నిర్వాహకమే
ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల నిర్వహించిన సర్వేల్లో 2,500 మంది పిల్లలు పోషణ లోపానికి గురైయ్యారని తేలిందని, మహిళా,శిశు సంక్షేమ శాఖ ద్వారా మాతా,శిశువులకు సరైన పౌష్టికాహారం అందక పోవడమే దీనికి కారణమని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ఐసీడీఎస్ ఉద్యోగులు, సిబ్బంది ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని కలెక్టర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న పౌష్టికాహార అభివృద్ధి పథకం(ఐఎస్‌ఎస్‌ఎన్‌ఐపీ) పై జిల్లాలోని ఐసీడీఎస్ సీడీపీఓల, సూపర్వైజర్లకు జిల్లా పరిషత్‌లో బుధవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రాలల్లో గర్భిణులకు నెలకు ఒకసారి బరువు,ఇతర పరీక్షలు నిర్వహించి... ప్రతిరోజు పౌష్టికాహారం అందించకపోవడం వల్లే అనారోగ్యంతో, తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారని తెలిపారు. ఇదే పోషణ లోపానికి ప్రధాన కారణమన్నారు. పుట్టిన పిల్లలకు సక్రమంగా పౌష్టికాహారం ఇవ్వకపోవడం కూడా కారణమన్నారు. జనవరి నెలలో పుట్టిన 60 మంది పిల్లలు పౌష్టికాహార లోపం, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. మాతా,శిశు మరణాలు పూర్తిస్థాయిలో తగ్గడం లేదని, సమస్య ఎక్కడుందో గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.మాతాశిశు సంరక్షణ అన్ని చర్యలు తీసుకోవాలని, పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతీ అంగన్వాడీ కేంద్రాన్ని మాడల్ అంగన్వాడీ కేంద్రంగా మార్చాలని, తాగునీటి, టాయిలెట్లు, సొంత భవనాలు కచ్చింతగా ఉండాలన్నారు. ఇందుకు 500 కొత్త భవనాలు, టాయిలెట్లు మంజురయ్యాయని, వాటిని వారంలోగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ ఉద్యోగులపై బాధ్యతలు.. అన్ని శాఖల కంటే ఐసీడీఎస్ శాఖపై చాలా బాధ్యత ఉందని ఐసీడీఎస్ రాష్ట్ర జాయింట్ డెరైక్టర్ సరళ రాజ్యలక్ష్మి అన్నారు. పిల్లలకు, గర్భిణులకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలన్నారు. జిల్లాలో 2,500 మంది పిల్లలు పోషణ లోపానికి గురయ్యారంటే, దానికి కారణం పౌష్టికాహారం అందించకపోవడమేనని అన్నారు. వచ్చే తరం పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలన్నారు. కాగా ఫ్రీ స్కూల్ పిల్లలు అంగన్వాడీలకు వచ్చే విధంగా, వారి హాజరు శాతాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐఎస్‌ఎస్‌ఎన్‌ఐపీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ రాములు, జెడ్పీ సీఈఓ రాజారాం, డీపీవో సురేశ్‌బాబు, డీఈఓ శ్రీనివాసచారి పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరగాలి
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు నూరు శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సూచించారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రుల్లోనే పురుడుపోసుకునేందుకు సంబంధిత కుటుంబ సభ్యుల ద్వారా పేషెంట్ పరిస్థితిని తెలుసుకొని, కాన్పు కోసం వారిని 108 వాహనాల్లో తరలించాలన్నారు. రెండో కాన్పునకు పేరు నమెదు చేసుకున్న మహిళల్లో మొదటి సారి సాధారణ కాన్పు జరిగిన వారి వివరాలను సేకరించాలన్నారు. తద్వారా రెండో కాన్పును కూడా సాధారణ కాన్పుగా జరగడానికి అవకాశం ఉన్నందున ఆ విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వారికి అవసరమైన పౌష్టికాహారం, రోగ నిరోధక శక్తికి అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సాధారణ కాన్పుకు దోహదపడుతుందన్నారు. ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువును సరిచూసి బలహీనంగా ఉన్న పిల్లలకు పౌష్టికాహారం సరైన పద్ధతిలో అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కవలపిల్లలు ఉన్నట్లుగా పరీక్షల్లో తెలిసిన పక్షంలో ఆ పిల్లలు ఆరోగ్యంగా జన్మించడానికి తీసుకోవలసిన చర్యలపై, పౌష్టికాహారంపై తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. న్యూమోనియా లాంటి వ్యాధుల ద్వారా పిల్లలు చనిపోకుండా వారిని గుర్తించి వెంటనే ఆస్పత్రుల్లో చికిత్సలు అందించాలని ఆయన ఆదేశించారు. న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, తద్వారా మరణాల రేటును తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు, కార్యకర్తలు తప్పనిసరిగా సాయంత్రం 4.30 గంటల వరకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొత్తగా మంజూరైన 500 అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి టెండర్లు పిలవాలని, అంగన్వాడీ కేంద్రాలలో విద్యుత్తు సరఫరాతో పాటు ఫ్యాన్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 210 అంగన్వాడీ కార్యకర్తలు ఇతర గ్రామాల నుంచి ప్రతిరోజు వచ్చి వెళ్తుతున్నారని, వారందరు ఈనెల 25వ తేదీ వరకు స్థానికంగా ఉండాలన్నారు. లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకోవడానికి వివరాలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో పీడీ రాములు, సీడీపీఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గణతంత్ర వేడుక
నిజామాబాద్‌కల్చరల్ న్యూస్‌లైన్ : గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రద్యుమ్న జెండా ఎగురవేశారు. అనంతరం స్వా తంత్య్ర స్ఫూర్తి, దేశభక్తి, సామాజిక అంశాల మేళవింపుతో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అందరినీ కట్టిపడేశాయి. ఉపాధ్యాయురాలు కళాలలిత వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాలు కొనసాగాయి. జేసీ హర్షవర్ధన్, ఏజేసీ శేషాద్రి, డీఐజీ అనిల్‌కుమార్, ఎస్పీ తరుణ్‌జోషి, వివిధ శాఖాధికారులు, పార్టీల నాయకులు, ప్రముఖులు తదితరులు వీక్షించారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్య గీతాలు ఆకట్టుకున్నాయి. జిల్లాకేంద్రంలోని రామకృష్ణ విద్యాలయం, వాసవి, ఆర్చిడ్, ఆర్.బి.విఆర్.ఆర్, బ్లూమింగ్‌బర్డ్స్ పాఠశాలల విద్యార్థులతో పాటు ధర్మారం సాంఘిక సంక్షేమ పాఠశాల, సుద్దపల్లి సాం ఘిక పాఠశాల, ముబారక్‌నగర్ విజయహైస్కూల్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలతో అలరించారు. కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపికలను అందుకున్నారు. శకటాల ప్రదర్శన జిల్లా చరిత్రలో మొదటిసారిగా 17శాఖల శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ, ఉద్యాన, జిల్లానీటి యాజమాన్య సంస్థ, జిల్లాగ్రామీణాభివృద్ధి-క్రాంతి పథకం, జిల్లా గృహనిర్మాణ సంస్థ, 207 వజ్ర, అగ్నిమాపక, 108, జిల్లా వైద్యఆరోగ్య, పశుసంవర్ధక, గ్రామీణనీటి సరఫరా, జిల్లాపౌర సరఫరాల, నగరపాలక, మీసేవా, పర్యాటక, రాజీవ్ విద్యామిషన్ తదితర శాఖలు తమ పోటాపోటీగా తమ శకటాలను ప్రదర్శించాయి. గృహనిర్మాణ సంస్థ రూపొందించిన శకటాన్ని, నగరపాలక సంస్థ శకటాలను కలెక్టర్, ఎస్పీ, ఆయా శాఖాధికారులను అభినందించారు. -
వ్యవసాయం
న్యూస్‌లైన్, నిజామాబాద్ అర్బన్: జిల్లాలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రబీ సీజన్లో 2.52 లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగునీటి సమస్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. ఈ ఏడాది నూతనంగా ఐదు తాగునీటి పథకాలకు రూ. 56 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇందిర జీవిత బీమా, వైఎస్ఆర్ అభయ హస్తం, జనశ్రీ బీమా యోజన అమలులో రాష్ర్టంలో జిల్లా అగ్రస్థానంలో ఉందని, బంగారుతల్లి పథకంలో మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ లక్ష్యాన్ని మార్చిలోగా చేరుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పదో తరగతిలో జిల్లా స్థానాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జలాశయాలు కళకళ ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనందున జలాశయాలు కళకళలాడుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో రబీలో పూర్తిస్థాయిలో నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సాగునీటికి సంబంధించి రబీ సీజన్లో 2 లక్షల 52 వేల ఎకరాలకు నీరందించడం కోసం చర్యలు జిల్లాలోని 42 ఎత్తిపోతల పథకాల ద్వారా 56 వేల ఎకరాలకు నీటి వసతి రెంజల్ మండలంలో రూ. 14 కోట్ల 40 లక్షలతో చేపట్టే కందకుర్తి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. దీని ద్వారా 3,366 ఎకరాలకు నీరు.. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల ఆధునికీకరణకోసం ఇప్పటివరకు రూ. 300 కోట్ల 19 లక్షలు ఖర్చు కౌలాస్ నాలా ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల సౌకర్యార్థం రూ. 3 కోట్ల 20 లక్షలతో చేపట్టే డోన్గావ్ -శక్తినగర్ మధ్య వంతెన నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి వ్యవసాయ రంగానికి రబీ సీజన్లో వెయ్యి కోట్ల రూపాయల పంట రు ణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్ప టికి రూ. 565 కోట్ల పంట రుణాలను అందించాం. యంత్రలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీపై రూ. 4 కోట్ల 32 లక్షల విలువైన ఆధునిక యంత్ర పరికరాలను సరఫరా చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు 2.8 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల విత్తనాలు పంపిణీ చేశాం. ఇందులో రాయితీపై 73 వేల క్వింటాళ్ల విత్తనాలు ఇచ్చాం. {V>Ò$× విత్తనోత్పత్తి పథకం కింద రూ. 46.66 లక్షల విలువ చేసే 2,340 క్వింటాళ్ల మూల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందించాం. 159 మంది పసుపు రైతులకు రూ. 2.38 కోట్ల విలువ చేసే స్టీమ్ బాయిలింగ్ యం త్రాలను పంపిణీ చేశాం. బీఆర్జీఎఫ్ నిధులు రూ. 10 కోట్లతో జిల్లా లో 58 గోదాములు నిర్మిస్తున్నాం. ఇందులో ఏడు నిర్మాణాలు పూర్తయ్యాయి. తాగునీటికి 202 గ్రామాలలో తాగునీటి సమస్య తీర్చడం కోసం రూ. 12 కోట్ల 51 లక్షలతో చేపట్టిన ఏక గ్రామ తాగునీటి పథకాలు పూర్తయ్యాయి. 470 గ్రామాల్లో రూ. 34 కోట్ల 29 లక్షలతో పనులు జరుగుతున్నాయి. ఒకటి కంటే ఎక్కువ గ్రామాల తాగునీటి పథకం కింద రూ. 146.75 కోట్లతో 36 పను లు చేపట్టగా, ఇప్పటికి రూ. 8 కోట్లకు సం బంధించి ఆరు పనులు పూర్తయ్యాయి. మిగ తా పనులను మార్చినాటికి పూర్తి చేస్తాం. ఈ ఏడాది జిల్లాకు ఐదు తాగునీటి పనులకు సంబంధించి రూ. 56 కోట్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా 80 గ్రామాలకు తాగునీరు అందిస్తాం. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.232 కోట్లతో పనులు సాగుతున్నాయి. వివిధ పథకాలు బంగారుతల్లి పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో ఉంది. జిల్లాలో 9,479 మం ది ఈ పథకం కోసం నమోదు చేసుకోగా 7,647 మంది చిన్నారులకు సంబంధిం చిన బ్యాంకు ఖాతాలలో 1.91 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇందిర జీవిత బీమా, వైఎస్ఆర్ అభయ హస్తం, జనశ్రీ బీమా యోజనలో జిల్లా అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన మూ డో విడత రచ్చబండలో 57,812 మందికి రేషన్ కార్డులు, 38,674 మందికి పెన్షన్లు, 11,553 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 1 లక్షా 46 వేల 270 వ్యక్తిగత మరుగుదొడ్డి యూనిట్లు మంజూరు చేశాం. ఇందులో 18 వేల యూనిట్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 18 వేలు యూనిట్లు పురోగతిలో ఉన్నాయి. వీటిపై రూ. 16.6 కోట్లు ఖర్చు చేశాం. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం కోసం రూ. 32.50 కోట్లు మం జూరయ్యాయి. అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కోసం రూ. 93 లక్షలతో 579 పనులు చేపట్టగా రూ. 88 లక్షలకు సంబంధించిన 556 పనులు పూర్తయ్యాయి. ఆధార్‌తో అనుసంధానం జిల్లాలో నగదు బదిలీ పథకం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 23,49,337 తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులలో 13,37,473 మంది ఆధార్ వివరాలు సమర్పించారు. 3,79,337 ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా 2,79,306 మంది ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. 5,48,668 మంది ఉపాధి హామీ కూలీల కుగాను 4,60,880 కూ లీలు ఆధార్ వివరాలు నమోదు చేసుకున్నారు. పోస్టు మెట్రిక్ స్కాల ర్షిప్లకు 77,244 మంది అర్హులుండగా 76,667 మంది ఆధార్ వివరాలు సమర్పించారు. 2,84,165 మంది పింఛన్దారులకుగాను 2,13,286 మంది వివరాలను ఆధార్‌తో అనుసంధానించాం. సంక్షేమం జిల్లాలోని 127 హాస్టళ్లలో 42 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వసతి కల్పించాం. 2013-14 సంవత్సరానికిగాను 1.20 లక్షల మంది విద్యార్థులకు రూ. 85 కోట్ల స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజులు చెల్లించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు 6,447 యూనిట్లు మంజూరు చేసి, రూ. 32.16 కోట్ల రుణాలు అందించాలన్నది లక్ష్యం. ఇప్పటికి 759 యూనిట్లకు సంబంధించి రూ. 2.23 కోట్ల రుణాలు ఇచ్చాం. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద అద్దె భవనాలలో కొనసాగుతున్న హాస్టళ్లకు నూతన భవనాల నిర్మాణం నిమిత్తం రూ. 105 కోట్లు, భవనాల మరమ్మతుల కోసం రూ. 2.70 కోట్లు మంజూరు చేశాం. ఎస్సీల ఇళ్లకు సంబంధించి విద్యుత్ బిల్లులు రూ. 13.76 కోట్లు మాఫీ చేశాం. ఏడో విడత భూపంపిణీలో భాగంగా 163 మంది లబ్ధిదారులకు 182 ఎకరాల భూమిని పంపిణీ చేయడం కోసం చర్యలు తీసుకున్నాం. ఇందిరమ్మ ఇళ్లు జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో 56,667 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మార్చినాటికి 19,621 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇప్పటికి 8,663 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందిరమ్మ లేఅవుట్ కాలనీల్లో రూ. 32 కోట్ల 62 లక్షలతో మౌలిక సదుపాయలు కల్పిస్తున్నాం. విద్యారంగం ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితా లు సాధించడం కోసం కృషి చేస్తున్నాం. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి 1,647 వంట శాలల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, ఇప్పటికి 926 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఉర్డూ మీడియం పాఠశాలలలో 274 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాం. జిల్లాలో 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలుండగా రూ. 23.75 కోట్లతో 19 విద్యాలయాలకు భవనాలు నిర్మిస్తున్నాం. పది భవనాల నిర్మాణం పూర్తయ్యింది. -
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత పవిత్రమైందని కలెక్టర్ ప్రద్యు మ్న పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని కాపాడేందుకు ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ మై దానంలో శకటాన్ని ప్రారంభించారు. నగరంలో ర్యాలీ తీశారు. కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్ వరకు సాగింది. అక్క డ ఆర్డీఓ యాదిరెడ్డి విద్యార్థులు, యువతతో ప్రతిజ్ఞ చేయించారు. అక్కడినుంచి రాజీవ్‌గాంధీ స్టేడియం వరకు ర్యాలీ వచ్చింది. ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నివాసం మారితే అందుకు అనుగుణంగా ఓటరు జాబితాలోనూ మార్పులు చేయించుకోవాలన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. జిల్లాలో 25 లక్షల జనాభా ఉండగా సుమారు 18 లక్షల ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్లలో ప్రత్యేకంగా ఓటు హక్కు నమోదు కార్యక్రమం నిర్వహించామన్నారు. ఓటు హక్కు నమోదు, మార్పులు చేర్పులకోసం 1.05 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సుమారు 60 వేల మంది యువతీయువకులు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందించారు. 50 ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న నగరానికి చెందిన ఆశమ్మ, భోజప్పలను కలెక్టర్ శాలువాతో సన్మానించారు. కొత్తగా ఓటరు గుర్తింపు కార్డు పొందిన వారికి ఎపిక్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో జేసీ హర్షవర్ధన్, ఏజేసీ శేషాద్రి, స్టెప్ సీఈఓ భిక్షానాయక్, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, ఎన్సీఎల్పీ పీడీ సుధాకర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పనితీరు మెరుగుపర్చుకోవాలి
బోధన్ రూరల్, న్యూస్‌లైన్ : అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల పనితీరు మెరుగుపర్చకపోతే చర్యలు తప్పవని చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. మంగళవారం మండలంలోని హంగర్గ, ఖండ్గావ్, సిద్దాపూర్, కల్దుర్కి గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హంగర్గలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. హాజరు పట్టికను, స్టాక్ రిజిష్టర్‌ను పరిశీలించారు. అంగన్వాడీ కా ర్యకర్త బదురునీసా స్థానికంగా ఉండకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఆమెను విధుల నుంచి తొలగించాలని సీడీపీవో వెంకటరమణమ్మను ఆదేశించారు. ఆమె స్థానంలో అర్హత కలిగిన గ్రామానికి చెందిన మరొకరిని నియమించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని తెలుగు, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికను, గదులను పరిశీలించారు. తెలుగు మీడియం పాఠశాలలో 24మంది విద్యార్థులకు గాను 12మంది విద్యార్థులే హాజరు కావడంతో ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే ఉర్దూ మీడియం పాఠశాలలో కూడా విద్యార్థులు తక్కువగా వచ్చారు. దీంతో తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలల ఉపాధ్యాయులు రేణుక, సంధ్య, రహిమతుల్లా, నజీరాబేగంలకు చార్జి మెమోలు జారీ చేయాలని ఎంఈఓ పద్మజాను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ గ్రామ ప్రజలతో మాట్లాడారు. గ్రామంలోని పత్తిపంటలను పరిశీలించారు. పత్తిపంట దిగుబడి, గిట్టుబాటు ధర తదితర వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖండ్గావ్, సిద్దాపూర్, కల్దుర్కి గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను తనిఖీ చేశారు. పిల్లల హాజరు పట్టికను, స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలలో బాలింతలకు, గర్భణులకు పౌష్టికాహారం ఎలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలకు గుడ్డు, ఆకుకూరలు, పాలు ఎలా అందుతున్నాయని సీడీపీవో వెంకటరమణమ్మను అడిగి తెలుసుకున్నారు. పిల్లల బరువు తూకం వేసి చూడాలని అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించి, పిల్లల బరువును పరిశీలించారు. ప్రతిరోజు పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాలలోని మరుగుదొడ్లకు నీటి సౌకర్యం గురించి తెలుసుకున్నారు. ప్రతిపాఠశాలలో నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కల్దుర్కిలో * 98లక్షలతో నిర్మిస్తున్న తాగునీటి ట్యాంకు పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని సంబంధిత అర్డబ్ల్యుఎస్ శాఖ అధికారులను హెచ్చరించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ హరినారాయణన్, తహశీల్దార్ రాజేశ్వర్, ఎంపీడీఓ మల్లారెడ్డి, ఎంఈవో పద్మజా, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ లక్ష్మీనారాయణ ఉన్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష బోధన్ పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, స్థానిక అధికారులతో కలెక్టర్ ప్రద్యుమ్న సమీక్షా సమావేశం నిర్వహించారు. -
జర ‘పది’లం సారూ!
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వారు ఈ మేరకు రంగంలోకి దిగారు. ఇటీవల జరిగిన అర్ధవార్షిక పరీక్షల జవాబు పత్రాలలో ప్రతి సబ్జెక్టు నుంచి పది పేపర్ల చొప్పున ఎంపిక చేసుకున్నారు. వాటిని ప్రత్యేకంగా వాల్యుయేషన్ చేస్తున్నారు. ఇందుకు ఆయా సబ్జెక్టులలో నిపుణులైన 50 మంది టీచర్లను వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌లో గల ఎంఎస్ఆర్ పాఠశాలలో వారం రోజుల నుంచి ఈ వాల్యుయేషన్ ప్ర క్రియ కొనసాగుతోంది. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా విద్యార్థుల మెరిట్‌ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పాఠశాలలలో సంబంధిత టీచర్లే జవాబు పత్రాలను దిద్ది అనుకూలంగా మార్కులు వేయడంలాంటి చర్యలను గుర్తిస్తున్నారు. ఇటువంటి వాటికి చెక్‌పెట్టి విద్యార్థుల ప్రతిభను స్వయంగా గుర్తించాలని కలెక్టర్ నిర్ణయించుకున్నారు. ఇతర టీచర్లచే వాల్యుయేషన్ చేయిస్తే సరైన ఫలి తా లు రాబట్టవచ్చునని అభిప్రాయపడుతున్నారు. మరో వారం రోజుల్లో ఈ వాల్యుయేషన్ పూర్తి చేసి మిగిలిన 55 రోజులలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిం చేందుకు వారిని ఎలా సన్నద్ధం చేయాలో ప్రణాళిక రూపొందించనున్నారు. దీం తో మెరుగైన ఫలితాలు రాబట్టే ఆవకాశం ఉంది. వీటి ఆధారంగా వెనకబడిన పా ఠశాల లోపాలు తెలుసుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గత వైభవం కోసం గతంలో పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జిల్లా 18, 21 స్థానాలకు పడిపోయింది. గతంలో వరుసగా జిల్లా నంబర్ వన్ రావడంతో పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా మంత్రి కూడా స్పందించారు.ప్రతిభతో కూడి న మెరుగైన ఫలితాలు మాత్రమే రావాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిం చా రు. జిల్లా కలెక్టర్ సైతం ఫలితాలపై దృష్టి పెట్టడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా మంచి ఫలితాలు రాబట్టాలని ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు నిత్యం సూచనలు జారీ చేస్తున్నారు. వాల్యుయేషన్ జరుగుతోంది. - శ్రీనివాసాచారి, జిల్లా విద్యాశాఖ అధికారి అర్ధవార్షిక పరీక్షల జవాబు పత్రాలను ప్రత్యేకంగా వాల్యుయేషన్ చేస్తున్నాం. జిల్లాలో 40 పాఠశాలల నుంచి జవాబు పత్రాలు తెప్పించాం. జిల్లా కలెక్టర్ ఆదేశాను సారంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఫలితాల ఆధారంగా మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తాం. -
క్రిమినల్ కేసు నమోదు చేయండి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: బాలుడి కాలు ఆపరేషన్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత వైద్యుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. ఇకపై అధికారులు సెలవులు పెట్టరాదని, ఏదైనా అతిముఖ్యమైన పని ఉంటే తన దృష్టికి తీసుకువస్తే, మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని, వినతులు స్వీకరించారు. తన కుమారుడి కాలు ఆపరేషన్ అని చెప్పి మొత్తం పూర్తిగా కాలు చెడిపోవడానికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని దుర్కి గ్రామానికి చెందిన వడ్ల భాస్కర్ అనే వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో డీఎంహెచ్ఓ ద్వారా పూర్తివివరాలు తెలుసుకున్న కలెక్టర్ బాలుడి కాలు పూర్తిగా చెడిపోవడానికి కారణమైన వైద్యుడిపై క్రిమినల్ కేసు నమోదుచేయాలని ఆదేశించారు. అనంతం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతున్నందున ప్రభుత్వ పథకాల లక్ష్యాలు నెరవేరేలా చూడాలన్నారు. అప్పటి వరకు అధికారులెవరు సెలవు పెట్టరాదన్నారు. జాతీయ పండుగలకు జిల్లా యంత్రాంగం ద్వారా నిర్వహించే పతాకావిష్కరణ కార్యక్రమాలకు అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి స్థానికంగా విధులు నిర్వహించే అధికారులు,ఉద్యోగులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ఈ విషయంలో హాజరు పరీక్షించే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. కార్యక్రమంలో జేసీ హర్షవర్ధన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణికి మొత్తం 274 ఫిర్యాదులు వచ్చాయి. న్యాయం చేయండి.. అన్యాయంగా తమ భూమిని కబ్జా చేసుకున్న అనురాధపై చర్యలు తీసుకోవాలని వర్ని మండలం చందూర్ గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.తమ భూమిని (సర్వేనెంబర్ 408/38 లో ఎకరం 10 గుంటలు) అనురాధ అన్యాయంగా కబ్జా చేసుకున్నారని, దీనికి స్థానిక తహశీల్దార్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకుని విచారణ జరిపి తమ భూమి తమకు ఇప్పించగలరని వారు కోరారు. బకాయిలు చెల్లించండి మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బకాయిలు చెల్లించాలని పీడీఎస్‌యూ నాయకులు కలెక్టర్‌ను కోరారు. అంతకుముందు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి బి.విశ్వనాథ్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,347 భోజన ఏజెన్సీలు ఉన్నాయన్నారు. వాటికి 2010లో బకాయిలు చెల్లించక పోవడంతో నిర్వాహకులు మధ్యాహ్న భోజనం అందించేలేకపోతున్నారన్నారు.దీంతో వారు నిరవధిక సమ్మె చేపట్టారన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. -
ఫిబ్రవరికల్లా పనులు ప్రారంభించండి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫిబ్రవరి చివరి నాటికి మంజూరైన పనులను ప్రారంభించాలని పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదే శించారు. గురువారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినందున ఈ కొద్ది కాలంలో అన్ని పనులను గ్రౌండింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయినవి, టెండర్ అవసరం లేని పనులను కూడా ఈ నెల 20 కల్లా నివేదిక అందించాల ని ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులు, ఆర్డీఎఫ్ పనులు గ్రౌండ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గత మార్చిలో పెద్ద సంఖ్యలో ఉపాధి పనులు మంజూరు చేసినప్పటికీ నిధులు లేవని పనులు ప్రారంభించలేదన్నారు. ప్రస్తుతం నిధులు అందుబాటులో లేనప్పటికీ కూలీలకు పనులు కల్పించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా నిధులు విడుదల చేస్తారని తెలిపారు. గత మార్చిలో మంజూరు పొందినా, పనులు ప్రారంభించనందున సుమారు రూ. 30 నుంచి రూ. 40 కోట్ల పనులు చేయలేకపోయామన్నారు. ‘ఉపాధి’లో ఇప్పటి వరకు రూ.150 కోట్లు ఖర్చు ఈ ఏడాదిలో ఉపాధి హామీలో ఇప్పటివరకు రూ. 150 కోట్ల ఖర్చుచేసినట్లు చెప్పారు. మరో రూ. 40 కోట్లు మార్చిలోగా ఖర్చుచేయాల్సి ఉందన్నారు. నిధులు అందుబాటులో ఉన్న మేరకు ఎస్సీ, ఎస్టీలకు పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ పనులు పూర్తి చేయాల న్నారు. కామారెడ్డి డివిజన్లో 574 పనులు డిసెంబర్‌కల్లా పూర్తి చేయాల్సి ఉండగా, కేవలం 62 శాతంతో 356 పనులు పూర్తి చేశారన్నారు. నిజామాబాద్ డివిజన్లో 2292 పనులకుగాను 1372 పనులు చేసి 60 శాతం పూర్తి చేశారన్నారు. బోధన్ డివిజన్లో 770 పనులకు గాను 59 శాతంతో 449 పనులను మాత్రమే పూర్తి చేశారన్నారు. జిల్లాలో 500 అంగన్వాడీ భవనా ల నిర్మాణానికి మొదటి విడతగా ఒక్కో భవనానికి రూ. 4.50 లక్షల చొప్పున విడుదల చేసిందని తెలిపారు. -
రూ. 267 కోట్ల ఉపాధి
సాక్షి, నిజామాబాద్: గ్రామాలలో కూలీలకు ఉపాధి కల్పించేందు కు జిల్లా అధికారులు 2013-14లో భారీ లక్ష్యాన్నే నిర్దేశించుకున్నారు. రూ 323.17 కోట్ల మేరకు ఖర్చు చేసి వారికి లబ్ది చేకూర్చాలని భావించారు. కానీ, ఆశించిన మేరకు ఉపాధిహామీ పనులు జరగకపోవడంతో ఇందులో సగం కూడా ఖర్చు చేయలేకపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి వాస్తవ పరిస్థితుల మేరకే రూ 267.84 కోట్లతో ఉపాధిహామీ వార్షిక ప్రణాళికను ఖరారు చేస్తున్నారు. అంటే గత ఏడాది కంటే రూ 56 కోట్ల మేరకు లక్ష్యాన్ని తగ్గించా రు. ఈ మేరకే జిల్లాలోని వివిధ గ్రామాలలో రాను న్న ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులను గు ర్తించి గ్రామపంచాయతీలు తీర్మానాలు చేశాయి. వీటికి మండల పరిషత్‌ల నుంచి అనుమతి తీసుకుని జిల్లా పరిషత్ ఆమోదం కోసం పంపారు. ఇందులో రూ 110 కోట్ల (లేబర్ బడ్జెట్) విలువ చేసే 38,636 ప నులకు ఇప్పటికే కలెక్టర్ ప్రద్యుమ్న పరిపాలనా అ నుమతి మంజూరు చేశారు. మిగిలిన పనులకు కూడా త్వరలోనే కలెక్టర్ నుంచి పరిపాలన అనుమ తి తీసుకుంటామని డ్వామా (జిల్లా నీటి యాజమా న్య సంస్థ) ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇవీ ప్రాధాన్యతలు ‘ఉపాధిహామీ’ ద్వారా రానున్న సంవత్సరంలో పొలాల వద్ద నీటి నిల్వ ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల సౌకర్యం ఉన్న రైతుల భూములలో వీటిని నిర్మించుకునేందుకు అనుమతించింది. భూగర్భ జలాల అభివృద్ధి పనులకే ప్రాధాన్యం కల్పిస్తున్నారు. కందకాల తవ్వకం, ఊట కుంటల నిర్మాణం, చిన్న కుంటల తవ్వకం, కందకాలలో మట్టితీత పనులు చేపట్టాలని నిర్ణయించారు. ‘ఇందిరమ్మ పచ్చతోరణం’లో భాగంగా 28 లక్షల టేకు, ఎర్రచందనం మొక్కల పెంపకం, గ్రామానికి ఇద్దరు చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మూడు వేల ఎకరాలలో మామిడి, జామ, సపోట, బత్తాయి వంటి ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ నిర్మాణ్ అభియాన్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహా యాన్ని అందజేస్తారు. ప్రతి నెల ఒక్కో గ్రామంలో 20 చొప్పున పూర్తి చేయాలని నిర్దేశించారు. -
కొత్త ఏడాదిలో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతి శాఖలో చేయాల్సిన పనులకు ప్రణాళికను రూపొందించామని, కొత్త సంవత్సరంలో ఆ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న చె ప్పారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై దృష్టి సారిస్తామన్నారు. 500 అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించనున్నామన్నారు. పది అంగన్వాడీ ప్రాజెక్టులకు గాను ఆరు ప్రా జెక్టుల్లో అమృతహస్తం పథకాన్ని కొనసాగిస్తున్నామని, మరో రెండింటిని ఈ పథకంలోకి తీసుకు రానున్నట్లు పేర్కొన్నారు.ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రసవాల కోసం వెళ్లే గర్భిణులకు 108 వాహన సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 75 శాతం ప్రసవాలు జరిగే విధంగా చర్య లు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్‌ను విస్తరింపచేస్తామన్నారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతాం.. పదవ తరగతి పరీక్షల్లో జిల్లా ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృష్టి చేస్తామన్నారు. పదవ తరగ తి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను నివారిస్తామన్నారు. పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. రెండు వందల పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఐదు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ. 2.2 కోట్లతో బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తద్వారా 9 లక్షల మంది బీసీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నా రు.ఉపాధి హామీ పథకం కింద రూ. 155 కోట్లు ఖర్చు చేశామని కలెక్టర్ తెలిపారు. కొత్త సంవత్సరంలో రూ. 190 కోట్లు ఉపాధి హామీ పను ల కోసం ఖర్చు చేసేందుకు ప్రణాళి కను రూ పొందిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించనున్న కలెక్టరేట్ భవన సముదాయానికి రూ. 23 కోట్లతో ప్రతిపాదనలు పంపామని తెలి పారు. వ్యక్తిగత మరుగుదొడ్లు 1.50 లక్షలు నిర్మిం చేందుకు కృషి చేస్తున్నామని, వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. రబీ సీజన్లో రైతులకు రూ. 768 కోట్ల పంట రుణాలకు గాను రూ. 1000 కోట్లు పెంచి ఇవ్వాలని నిర్ణయిం చగా ఇప్పటి వరకు రూ. 350 కోట్లు రైతులకు పంపిణీ చేసినట్లు తెలి పారు. బ్యాంక్ లింకేజీ కింద మహిళా గ్రూపులకు రూ. 426 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ. 160 కోట్లు అందజేసినట్లు తెలిపారు. శ్రీనిధి కింద ఇప్పటి వరకు రూ. 82 కోట్లు ఇచ్చామని, మార్చి నాటికి రూ. 120 కోట్ల వరకు అందజేయగలమన్నారు. ఈ ఏడాదిలో ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం 19,500 కాగా ఇప్పటి వరకు 7వేల ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డును ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లను మార్చి కల్లా పూర్తి చేస్తామన్నా రు. ఆర్మూర్, కామారెడ్డి, గాంధారి ప్రాంతాల్లో మంచినీటి పథకాలను వెంటనే పూర్తిచేయగలమన్నారు. సోయాపై బెంగవద్దు.... వచ్చే ఖరీఫ్ సీజన్లో 1.21 లక్షల హెక్టార్లలో సోయాబీన్ సాగవుతుందని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 90 వేల క్వింటాళ్ల సాయా విత్తనాలు అవసరం ఉండగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జుక్కల్, ఆర్మూర్ ప్రాం తాల్లో రెండు సోయాబీన్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏడవ విడత భూపంపిణీలో భాగంగా 120 ఎకరాలను జనవరి 10 కల్లా పంపిణీ చేస్తామన్నారు. పభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల జవాబుదారీ తనం పెంచడం ద్వారా పారదర్శక పాలనను అందించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. హాస్టళ్లలో వార్డెన్ల పనితీరును, స్థానికతను గుర్తించేందుకు కాల్సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాల్‌సెంటర్ ద్వారా వార్డెన్లకు అకస్మికంగా ఫోన్ చేయడంతో పాటు హాస్టల్లో ఉండే విద్యార్థులతో మాట్లాడుతామన్నారు. ఉద్యోగులు పనిచేసే చోటే నివాసం ఉండాలనే విధానాన్ని క్రమబద్దంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. -
గడువులోగా పనులు పూర్తిచేయాలి
ఇందూరు,న్యూస్‌లైన్ : గ్రామాల్లో జనవరి పదో తేదీలోగా బీఆర్జీఎఫ్ పనులు పూర్తి చేయని సర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తామని, ఈ విషయాన్ని జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల సర్పంచులకు సమావేశం ఏర్పాటుచేసి తెలియజేయాలని ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న దేశించారు. ఇందులో ఉపేక్షించేది లేదని తేల్చి చె ప్పారు. బుధవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో కొనసాగుతున్న 2012- 13, 2013-14 బీఆర్జీఎఫ్ పనుల పురోగతిపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 2013-14 సంవత్సరానికి సంబంధించిన బీఆర్జీఎఫ్ పనులు ప్రారంభించని వాటిని వెంటనే ప్రాంభించాలని, ముఖ్యంగా గ్రామాల్లో పనులు పెండింగ్‌లో ఉన్నందున సర్పంచులు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణయించిన గడువు తేదీలోగా పనులు పూర్తిచేయని సర్పంచుల చెక్ పవర్‌ను తక్షణమే రద్దు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని, ఎంపీడీఓలను ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేస్తే పనులను ప్రాంభించడం వీలు పడదన్నారు. దీంతో నిధులు వృథా అవుతాయన్నారు. లక్షలోపు ఉన్న పనులను జనవరి పదో తేదీలోగా పూర్తి చేయాలని, రూ.లక్ష నుంచి రెండు రూ.లక్షల పనులను ఫిబ్రవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. రెండు లక్షల కన్న ఎక్కువగా ఉన్న పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని, నిర్ణయించిన గడువు విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. నిర్లక్ష్యం చేసిన సర్పంచులపైనే కాకుండా మండలాధికారులపై కూడా చర్యలు తప్పవన్నారు. ఇసుక క్వారీలు వేరే వ్యక్తులకు వద్దు జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారని కలెక్టర్ అన్నారు. ఇందుకు సంబంధిత మండలంలో లేదా పక్క మండలంలో ఎంపీడీఓల పేరుతో వాగుల్లో ఇసుకను తీయడానికి క్వారీని అనుమతిస్తున్నానని, కానీ ఆ క్వారీలు వేరే వ్యక్తుల పేరిటగాని, ఇతర పనులకు ఇసుకను వాడటంగాని జరిగితే ఎంపీడీఓలపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. వివిధ కారణాలతో మరుగుదొడ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయని కారణాలు చెప్పి తప్పించుకోవడం కుదరదన్నారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్న నేపథ్యంలో రింగుల తయారీదారులు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఓ ఎంపీడీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పం దించిన కలెక్టర్ రింగులను ఎక్కువ ధరకు అమ్మే వారిని తమ కంట్రోల్లో పెట్టుకోవాలని, సరైన ధరకే అమ్మే విధంగా చూడాలన్నారు. అలాకాదని ఎక్కువ ధరకు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రింగుల తయారీ కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి త్వరగా సబ్సిడీ రుణాలు ఇప్పించాలని, బ్యాంకు అనుమతి ఇవ్వని వారికి బ్యాంకరుతో మాట్లాడి రుణం వచ్చేలా చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ నెలాఖరులోగా మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి కనిపించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాజారాం, డ్వామా పీడీ శివలింగయ్య, ఐకేపీ పీడీ వెంకటేశం ఇతర అధికారులు పాల్గొన్నారు. పనిచేసే దమ్ముండాలి.. మెతక వైఖరి పనికిరాదు.. 2012-13 బీఆర్జీఎఫ్ పనులను కూడా ఇంతవరకు పూర్తి చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించిన ప్రహరీ నిర్మాణానికి ఓ వ్యక్తి అడ్డు తగిలి కోర్టులో కేసు వేశాడని బాన్సువాడ ఎంపీడీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ‘ మీ కార్యాలయానికే ప్రహరీ నిర్మించుకోలేని విధంగా ఉన్నావు.. ఇక ప్రజలకు ఉపయోగపడే పనులు ఎలా చేస్తావు.. నీకు సిగ్గుగా అనిపించడంలేదా..’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారి పనిచేసే దమ్ముండాలని, మెతక వైఖరి పనికిరాదని కలెక్టర్ హితవు పలికారు. నేటి నుంచి కొత్త పెన్షన్‌దారులు డబ్బులు తీసుకోవచ్చు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త పెన్షన్లకు సంబంధింత పెన్షన్‌దారులు పోస్టాఫీసుల్లో డబ్బులు తీసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ విషయం గ్రామాల్లో దండోర వేయించాలని సూచించారు. రచ్చబండలో మంజూరైన రేషన్ కార్డులు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు కొందరికి రెండుసార్లు, మరికొందరు బోగస్ ఉండటం, లబ్ధిదారులు చనిపోయిన వారికి మంజూరైనట్లు చెప్పారు. మంజూరైన వాటిని వివరాలతో సహా తనకు అప్పగించాలని మండలాధికారులను ఆదేశించారు. వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని కలెక్టర్ తెలిపారు. -
నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
కలెక్టరేట్,న్యూసలైన్ : అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాల్సిన సేవల్లో నిర్లక్ష్యం చేసిన వారిపై క ఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ప్రగ తి భవన్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, శిశువులకు అందించాల్సిన పౌష్టికాహారం ఇతర సదుపాయాలు సక్రమంగా అందడంలేనట్లు సమీక్ష ద్వారా తెలుస్తోందన్నారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించి, ఆరోగ్యకరమైన సమాజం నిర్మించడానికి , మాతా శిశుమరణాలు తగ్గించడానికి కృషిచేయాలని సూచించారు. బాధ్యతలు విస్మరించి లక్ష్యాలకు తగ్గట్టుగా పని చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జేసీ హర్షవర్ధన్, ఐసీడీఎస్ పీడీ రాములు తదితరులు పాల్గొన్నారు. ‘బంగారు తల్లుల’ను గుర్తించ ండి బంగారుతల్లి పథకానికి అర్హత పొందే ప్రతిపాపను పుట్టిన క్షణంలోనే ఏఎన్ఎంలు ఏంపీఎలకు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఆడపిల్లల నమోదులో ఐసీడీఎస్-ఆరోగ్యశాఖాధికారుల మధ్య తేడాలున్నాయన్నారు. ప్రసవమైన ప్రతికేసును నమోదుచేయాలని, పాప పుట్టిన క్షణంలోనే ఏఎన్ఎంలకు మెసేజ్ పంపాలన్నారు. ఈ నివేదికలు నెలకోసారి కాకుండా ఏరోజుకు ఆరోజు పంపించాలని ఆదేశించారు. ఏఎన్ఎంలు సంబంధిత ప్రాథమిక కేంద్రాల పరిధిలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. బంగారుతల్లి పథకం ప్రారంభమైన మే ఒకటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 9వేల మంది పిల్లలు జన్మించారని తెలిపారు. ఆరోగ్య శాఖద్వారా 8,876 మంది పి ల్లలు నమోదైనట్లు చెప్పారు. ఇందులో 8,097 మంది బంగారుతల్లి పథకానికి అర్హత కలిగి ఉన్నారన్నారు. వీటిలో 6,457 మందిని రిజిస్టర్ చేశామన్నారు. మిగతావారి పేర్లను రిజిస్టర్ చేయాల్సి ఉందన్నారు. పీడీలు రాములు, వెంకటేశం, డీఎంహెచ్ ఓ గోవింద్వాగ్మారే, ఏఎన్ఎంలు, ఏపీఓలు,ఏపీఎంలు పాల్గొన్నారు. -
ఐడియా అదిరింది!
ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ‘సంక్షేమాన్ని’ చక్కదిద్దేందుకు మొన్నటి వరకు ఆయా శాఖల జిల్లా అధికారులను వసతి గృహాల బాట పట్టించిన జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. నెలకు రెండు సార్లు వసతి గృహాల్లో రాత్రుల్లో బస చేసి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలేంటో ప్రోఫార్మాలో నమోదు చేయించారు. ఇప్పుడు వారం రోజులుగా ఫోన్ ద్వారా పర్యవేక్షణ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ వసతి గృహాలు మొత్తం ఎన్ని ఉన్నాయి..వార్డెన్లు ఎందరు, వారి సెల్‌ఫోన్ నెంబర్లతో పాటు ఒక్కో వసతి గృహంలో ఎందరు విద్యార్థులు ఉంటున్నారు.. వారి పేర్లతో సహా పూర్తి వివరాలను కలెక్టర్ సంక్షేమాధికారుల దగ్గరి నుంచి సేకరించారు. ఈ వివరాన్ని కాల్ సెంటర్ ఉద్యోగులకు అందజేశారు. ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కాల్ సెంటర్ ఉద్యోగులు ఐదు ఎస్సీ, రెండు బీసీ,ఒక ఎస్టీ వసతి గృహాల వార్డెన్లకు ఫోన్ చేసి వారు ఎక్కడున్నారో అడిగి తెలుసుకుంటారు. పని చేయాల్సిన సమయంలో వసతి గృహంలో లేకపోతే కారణాలేంటో రికార్డు చేస్తారు. కాగా వార్డెన్‌కు ఫోన్ చేసిన సమయంలో కాల్ సెంటర్ ఉద్యోగులు ఒక విద్యార్థి పేరు చెప్పి మాట్లాడించాలని సూచించిన వెంటనే సదరు విద్యార్థితో మాట్లాడించాలి. ఈ రోజు ఏం భోజనం పెట్టారు..? మీకు రోజు మెనూ ప్రకారం భోజనం,గుడ్లు,పాలు ఇతర ఆహారం అందిస్తున్నారా..? లేదా..? అనే వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు. ఒక వేళ సమాచారం లేకుండా వార్డెన్ బయటకు వెళ్లినా... పేరు చెప్పిన విద్యార్థి లేకపోయినా ఇక ఆ వార్డెన్ సంగతి అంతే. అలాగే కాల్ సెంటర్ ఉద్యోగులు వార్డెకు ఫోన్ చేసిన సమయంలో ఫోన్ ఎత్తకపోయినా.. ఫోన్ స్విచ్ఛాప్ చేసినా... ఆ వార్డెన్ పేరు,సెల్ నెంబరు వివరాలతో కలెక్టర్‌కు నివేదిక అందిస్తారు. వారిపై కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. మరోసారి పునరావృతం అయితే నోటీసులు కూడా జారీ చేయనున్నారు. ఈపాటికే ముగ్గురు వార్డెలపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు... వసతి గృహాల పర్యవేక్షణకు కలెక్టర్ శ్రీకారం చుట్టిన కాల్ సెంటర్ కార్యక్రమంతో ‘సంక్షేమం’ గాడిన పడుతోంది. స్థానికంగా ఉండని వార్డెన్లు సైతం రాత్రి వరకు స్థానికంగా ఉంటూ.. విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టడమే కాకుండా, సాయంత్రం నుంచి రాత్రి వరకు వారికి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. అయితే కాల్ సెంటర్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందోనని వార్డెన్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తమ సెల్‌ఫోన్‌కు కాల్ వస్తేచాలు కాల్ సెంటర్ వారేనా అని ఆందోళన చెందుతున్నారు. ఇటు విద్యార్థులతో మాట్లాడిస్తే వారు ఏం చెబుతారోనని, వారికి ముందుగానే చెప్పి జాగ్రత్త పడుతున్నారు. -
రచ్చబండకు సర్వం సిద్ధం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మూడోవిడత రచ్చబండ కార్యక్రమా న్ని జిల్లాలో విజయవంతం చేయడానికి అన్నిఏర్పాట్లు చేస్తున్నట్లు, ఈ సభల్లో పేదలకు సం క్షేమ ఫలాలు అందించనున్నట్లు కలెక్టర్ ప్రద్యు మ్న పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈనెల 11నుంచి 26వరకు మండలకేంద్రాల్లోనూ, మున్సిపాలిటీ వార్డులు, మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నా రు. రచ్చబండ సభలను విజయవంతం చేయడానికి మండల స్థాయిలో ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ క మిటీలో సర్పంచ్, మండల మహిళా సమాఖ్యలోని ఉత్సాహంగా ఉన్న సభ్యురాలు, ఒక అధికారి ఉంటారని చెప్పారు. మొత్తం 36 మండలాల్లో ప్రతిపాదించిన కమిటీల జాబితాను జి ల్లా ఇన్చార్జి మంత్రి ముఖేశ్‌గౌడ్‌కు నివేదించామన్నారు. మంత్రి ఆమోదం లభించగానే అధికారికంగా ప్రకటిస్తామన్నారు. ఈ నెల 11న బోధన్‌లో మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి తొలి రచ్చబండను ప్రారంభిస్తారని తెలిపారు. పేదలకు లబ్ధి.. మూడో విడత రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో సుమారుగా రెండు వేల నుంచి మూడు వేలమంది పేదలకు లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పెం డింగ్‌లో ఉన్న 73,454 రేషన్‌కార్డుల దరఖాస్తులకు కూపన్లు, 41,369 మంది లబ్ధిదారులకు పెన్షన్లు, 11,179 మందికి ఇందిరమ్మ ఇళ్లకు సం బంధించిన మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. కొత్తగా పెన్షన్లు, రేషన్కూపన్లు మం జూరు చేసిన వారికి డిసెంబర్ నుంచి లబ్ధి చేకూరనున్నట్లు చెప్పారు. ఎస్సీలకు రూ.13.76 కోట్లు, ఎస్టీలకు రూ.3.65 కోట్లు మాఫీ చేసిన విద్యుత్తు బిల్లుల రశీదులను అందిస్తామన్నారు. ఇందిర మ్మ కలలు కార్యక్రమం ద్వారా వసతి గృహాలు, కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపనలు చేస్తామని కలెక్టర్ వివరించారు. ప్రతిరోజు నిర్వహించే రచ్చబండ కార్యక్రమాల వివరాలను ముఖ్య ప్రణాళిక అధికారికి అదే రోజు చేరుతుందని, ఆ వివరాలు జ్ట్టిఞ:ఙఙ్చఞ.జౌఠి.జీ:8080/్కక వెబ్సైట్లో నమో దు చేస్తారన్నారు. ఈ సమావేశంలో సీపీఓ నబీ, ఐకేపీ పీడీ వెంకటేశం, డీఎం, సీఎస్ దివాకర్, డీఎస్ఓ కొండల్రావు, హౌసింగ్ పీడీచైతన్యకుమార్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టులు రద్దు చేయండి
ఇందూరు,న్యూస్‌లైన్ : 2011-12, 2012-13 సంవత్సరానికి సంబంధించిన బీఆర్‌ఈఎఫ్ పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న వారి కాంట్రాక్టులను వెంటనే రద్దు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ప్రద్యు మ్న ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బీఆర్జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం పనులు , నిధుల ఖర్చుపై మున్సిపల్ కమిషనర్లతో, ఎంపీడీఓలతో ఆయన సమీక్షించారు. ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్టర్లు తీసుకున్న పనులను పూర్తి చేయకపోవడంతో ప్రజలకు సౌకర్యాలు తొందరగా అందడంలేదన్నారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని, వారి కాంట్రాక్టులను రద్దు చేయాలని ఆదేశించారు. పని చేయని వారికి టెండర్లు అప్పజెప్పి కాంట్రాక్టర్లను ఊరికే పోషిస్తున్నారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే భవన,ఇతర నిర్మాణ పనులకు కొందరు వ్యక్తులు అడ్డు పడుతున్నారని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ప్రస్తుతం బీఆర్జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ నిధులు ప్రభుత్వం విడుదల చేసినందున గ్రామ సర్పంచులతో కలిసి పనులను గుర్తించాలన్నారు. ఇలా గ్రామాల వారీగా పనులను గుర్తించి పూర్తిగా మండలానికి సం బంధించిన యాక్షన్ ప్లాన్‌ను 15 రోజుల్లో రూపొం దించి, తనకు అందజేయాలని సూచించారు. ఎవరికి వారు పనులకు సంబంధించిన నిధులను ఖర్చు చేయాడానికి వీలు లేదని, జిల్లా వ్యాప్తంగా ఒకే విధంగా నిధులు ఖర్చు చేయాలన్నారు.రాజీవ్‌గాంధీ స్వశక్తి యోజన పథకం కింద పంచాయతీ భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం నిధులు ఇస్తుందని, శిథిలావస్థలో ఉన్న పంచాయతీ భవనాలను గుర్తించి కొత్త భవనాలు నిర్మింపజేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ వాడల్లో తాగునీటి అవసరాలు ఉన్నాయో లేదో హాబిటేషన్ల వారీగా చూసుకుని, లేని చోట ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అలాగే 2011-12,13 సంవత్సరాలకు చెందిన జెడ్పీ జనరల్ ఫండ్స్, బీఆర్జీఎఫ్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు వివరాలు మరోసారి తెలుసుకునేందుకు ఈ నెల 23న మళ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలువురిపై ఆగ్రహం... పనులను పూర్తి చేస్తామని గత సమావేశంలో చెప్పిన అధికారులు పనులు పూర్తి చేయనందుకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ ఎంపీడీఓ రాములు కమ్యూనిటీ భవన నిర్మాణం ఆలస్యం చేయడంపై ఆయనపై మండిపడ్డారు. అలాగే ఈ నెలాఖరులోగా పనులన్ని పూర్తి కాకుంటే చర్యలు తప్పవని నిజామాబాద్, కామారెడ్డి మున్సిపల్ ఇంజినీర్లను హెచ్చరించారు. ఈ సారి కూడా సమావేశానికి ముందే సరైన వివరాలు సిద్ధం చేసుకోకుండా రావడంపై కలెక్టర్ అసహన వ్యక్తం చేశారు. -
తండ్రిలాంటి వాడిని.. ఉద్యోగ సంఘాల నేతలతో కలెక్టర్
కలెక్టరేట్,న్యూస్‌లైన్: ‘నేను మీకు తండ్రిలాంటి వాడిని.. పిల్లలు తప్పు చేస్తే తండ్రి ఇంట్లో మందలించినట్లే ఉద్యోగులు తప్పు చేస్తే నేను అదే చేస్తున్నాను. అయినా నేను ఇంతవరకు ఓ ఇంజనీరు శాఖపై మాత్రమే దృష్టి సారించాను. మిగితా శాఖలపై అసలు దృష్టే పెట్టలేదు. తప్పుచేస్తున్న ఉద్యోగులను, నిర్ణయించిన లక్ష్యం చేరని ఉద్యోగులను మాత్రమే మందలిస్తున్నాను’ అని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పేర్కొన్నారు. బుధవారం ఉద్యోగ సం ఘాల ప్రతినిధులు కలెక్టర్‌తో సమావేశమయ్యా రు. కలెక్టర్ ప్రవర్తిస్తున్న తీరుతో ఉద్యోగులు మ నోవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. కారణాలు లేకుండానే ఉద్యోగులను వేధిస్తున్నారని కలెక్టర్‌ను ఉద్దేశించి అన్నారు. దీంతో స్పందించి న కలెక్టర్ మాట్లాడుతూ నేను ఇప్పటివరకు ఎవరి మన సు నొప్పించలేదని, నావల్ల ఎవరికీ బీపీ, షుగర్ వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఓ కుటుంబ పెద్దలా ఉద్యోగుల పనితీరును మెరు గుపరచడానికి కొంతమందిని మందలించ వల సి వస్తోందని పేర్కొన్నారు. అంతే కాని తనకు ఉద్యోగులపై ఎలాంటి కోపం లేదన్నారు. ఇదం తా చూస్తుంటే ఉద్యోగ సంఘాల వెనుక ఎవరి దో ప్రోద్బలం ఉన్నట్లు అనుమానం వస్తోందన్నారు. అవసరమైతే ఉద్యోగుల సమస్యలపై కలెక్టరేట్లో ‘ఉద్యోగవాణి’ఏర్పాటు చేస్తానన్నా రు. సమస్యలేవైనా ఉంటే అందులో చెప్పుకోవాలని ఉద్యోగలకు సూచించారు. అనంతరం తనకు గ్రూప్ అఫ్ మినిస్టర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ఉందని, తరువాత కలుద్దామని చెప్పి వెళ్లిపోయారు. ఈ సమావేశంలో టీఎన్జీఓస్ అధ్యక్ష,కార్యదర్శులు గంగారాం, కిషన్, సుధాకర్, అమృత్‌రావు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు సూర్యప్రకాష్, వెం కటయ్య, జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం నాయకులు రాములు, గంగాకిషన్, టీజీఓ అధ్యక్షులు బాబురావు, ఎంపీడీఓల సంఘం అధ్యక్షులు గోవింద్, కార్యదర్శి సాయన్న, వ్యవసాయధికారుల సంఘం నేతలు హరికృష్ణ, శ్రీక ర్, డా. బస్వరెడ్డి, డా.ప్రభాకర్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు శంకర్, రాంజీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఫలితమివ్వని ‘బస’
ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు 116 ఉన్నాయి. వీటిలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం రెండు నెలల క్రితం కలెక్టర్ ప్రద్యుమ్న రాత్రి బస కార్యక్రమం చేపట్టారు. జిల్లాస్థాయి అధికారులందరూ నెలలో ఒకరోజు హాస్టళ్లలో బస చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, కావాల్సిన మౌలిక వసతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా, వసతిగృహాల్లో తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యాలున్నాయా అన్న వివరాలను ప్రొఫార్మాలో పొందుపర్చాలి. రెండు సార్లు హాస్టళ్లలో బస చేసిన అధికారులు 209 సమస్యలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందించారు. అయితే ఇప్పటివరకు సౌకర్యాల కల్పనకు ఏ వసతి గృహంలోనూ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. నిధులు లేకపోవడంతో వసతులు కల్పించలేకపోయామని సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా మౌలిక సదుపాయాల కల్పనను పక్కన పెట్టి ప్రస్తుతానికి వసతి గృహల పరిసరాల్లోని అపరిశుభ్ర వాతావరణాన్ని తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ పనులను త్వరలో చేపట్టనున్నారు. అయితే కలెక్టర్ స్పందించి హాస్టళ్లలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. త్వరలో పరిష్కారం జిల్లాలోని వసతి గృహాల్లో అధికారులు రెండు సార్లు బస చేశారు. పలు సమస్యలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. కొన్ని వసతి గృహాల్లో సదుపాయాల కల్పనకు నిధులు వచ్చాయి. మరికొన్నింటికి త్వరలో నిధులు మంజూరవుతాయి. హాస్టళ్లలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. -విమలాదేవి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి -
‘బంగారుతల్లి’పై నిర్లక్ష్యం వద్దు
తాడ్వాయి, న్యూస్‌లైన్ : బంగారుతల్లి పథకంపై నిర్లక్ష్యం వహిస్తే సం బంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. శనివారం ఆయన తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజివాడి గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రం పనితీరును పరిశీలించారు. గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందజేయాలని సూచించారు. గర్భిణులు ప్రసవ సమయంలో 108 అంబులెన్స్‌ను ఉపయోగించుకునేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి రికార్డులన్నింటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పప్పుదినుసులు, బియ్యం, నూనె, తదితర వస్తువులు అందుతున్నాయా లేదా గర్భిణులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వికలాంగులకు పింఛన్ రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సదరన్ శిబిరానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.ఇటీవల కురిసిన భారీవర్షాలకు సోయా, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని నష్టపరిహారం అందించాలని కలెక్టర్‌ను రైతులు కోరారు. మండలంలోని నందివాడ, గ్రామపరిధిలో గల తండాలకు రోడ్డు వేయించాలని తండావాసులు కోరారు. ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరగాలి లింగంపేట: గ్రామాల్లో పేద మహిళల ప్రసవాలను ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే జరిగేలా చూడాలని కలెక్టర్ ప్రద్యుమ్న వైద్య సిబ్బంది ని ఆదేశించారు. శనివారం లింగంపేట ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు.వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహిం చారు. మందులు సక్రమంగా ఇస్తున్నారాలేదా అని అడిగి తెల్సుకున్నారు. సమీక్షలో జిల్లా శిశుసంక్షేమాధికారి రాములు,జిల్లావైద్య ఆరోగ్య అధికారి గోవింద్ వాగ్మారే,ఏడీఎంహెచ్ఓ సురేష్ బాబు పాల్గొన్నారు. -
మహనీయులను మరిచిపోతున్నాం
ఇందూరు, న్యూస్‌లైన్ : ‘అఖండ భారతదేశంలో మహార్షి వాల్మీకీ లాంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు.. వారిని స్మరించుకోకుండా, వారు చూపిన అడుగుజాడల్లో నడవకుండా.. వారినే మరిచిపోతున్నాం.. ఇది అత్యంత బాధాక ర విషయం’ అని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఏర్పడడానికి ముఖ్యకారణం పాశ్చాత్య సంస్కృతికు అలవాటు పడడమే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నూతన అంబేద్కర్ భవన్లో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో వాల్మీకీ జయంతి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. వాల్మీకీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మొ దటిసారిగా వాల్మీకీ జయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా గొప్పవిషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించడం అనందించదగ్గ విషయమన్నారు. ఎంతోమంది గొప్ప మేధావులు, మహాపురుషులు పుట్టిన ఈ దేశంలో, మన దేశ సంసృ్కతిని తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నామన్నారు. కనీసం మనకు పుట్టిన పిల్లలకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. వారికి వాల్మీకీ అంటే ఎవరో తెలియదన్నారు. దేశ సంసృ్కతి, గొప్ప వ్యక్తులు, మహా పురుషుల గురించి చె ప్పాల్సిన అవసరం మనపై ఉందన్నారు. ఇలాంటి పరి స్థితి ఎదురుకాకుండా ఉండడానికి ప్రభుత్వం గొప్ప వ్యక్తుల జయంతి వేడుకలను నిర్వహిస్తోందన్నారు. వాల్మీకీ ఒక కూలానికి చెందిన వ్యక్తి కాదని సా మాన్య మానవుడేనన్నారు. రామాయణం రాసిన మొ ట్టమొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచి, గత చరిత్రను మనకు తెలియజేశారన్నారు. 24వేల శ్లోకాలు రాసి, ఆదికవిగా పేరు పొందారన్నారు. ఒక సంఘటన ద్వారా తన జీవితంలో మార్పు చోటు చేసుకుని ఇంతటి స్థా యికి ఎదిగారని, ఆయన జీవిత చరిత్ర అందరికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం బీసీ సంఘాల సొసైటీల అభివృద్ధికి జిల్లాకు వంద యూనిట్ల రుణాలను మంజూరు చేసిం దని, కాని ఒక్క దరఖాస్తు కూడా రాలేదన్నారు. ఉత్సాహవంతులు ముం దుకు వచ్చి రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఏటా నిర్వహించాలి... -వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ వాల్మీకీ జయంతి ఉత్సవాలను మొదటిసారిగా ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. ప్రతి సారి నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తుల జయంతిలను నిర్వహించాలని, ఇందుకు ప్ర త్యేక నిధులు ఇవ్వాలని కోరారు. బీసీ సంఘాల అభివృద్ధి కోసం మరో వంద యూనిట్లను మంజూరు చే యాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి విమలదేవి, బీసీ కార్పొరేషన్ ఇన్చార్జి అధికారి సత్యనారాయణ, జిల్లా వాల్మీకీ సంఘం అధ్యక్షుడు నర్సింలు, బీసీ సంఘం నాయకులు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పవర్ ప్రద్యుమ్న
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పాలనను గాడిలో పెట్టడానికి కలెక్టర్ ప్రద్యుమ్న కృషి చేస్తున్నారు. ఆర్భాటాలకు తావివ్వకుండా తన పని తాను చేసుకుపోతున్నా రు. జిల్లాకు రావడంతోనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. స్థానిక అధికారుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలుంటే నేరుగా తన ఫోన్ నంబర్ (9491036933)కు సమాచారం ఇవ్వాలని సూచించారు. తర్వాత కలెక్టరేట్లో 1800 425 6644 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ప్రజావాణిపైనా దృష్టి సా రించారు. ఫిర్యాదు చేసిన 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశిం చారు. వాటికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో ఉంచాలని సూచించారు. ప్రజావాణితో పాటు, తన ఫోన్‌కు, టోల్‌ఫ్రీ నెంబర్లకు వ చ్చిన ఫిర్యాదులను బ్లాక్‌లవారీగా విభజిస్తున్నారు. ప్రజావాణి ఫిర్యాదులను ‘ఎ’ బ్లాకు లో, కలెక్టర్ సెల్ నంబర్ ఫిర్యాదులను ‘బి’ బ్లాకుగాను, టోల్‌ఫ్రీ నెంబర్‌కు వచ్చే ఫిర్యా దులను ‘సి’ బ్లాకుగా విభజించి నమోదు చేస్తున్నారు. తర్వాత సమస్యను సంబంధిత శాఖకు పంపిస్తున్నారు. వారు పక్షంలోగా పరిష్కరిం చాల్సి ఉంటుంది. ఒకవేళ పరిష్కరించకపోతే కారణాలను వివరించాలి. సమీక్షలతో హడలెత్తిస్తూ.. కలెక్టర్ ఆయా శాఖల ప్రగతిపై సమీక్షలు నిర్వహిస్తూ హడలెత్తిస్తున్నారు. మంగళవారం నుం చి శుక్రవారం వరకు సమీక్షలు సాగుతున్నా యి. ఒక్కోసారి ఉదయం ప్రారంభమయ్యే సమావేశం రాత్రి పొద్దుపోయే వరకూ సాగుతోంది. శాఖ పనితీరు, వారికి ఇచ్చిన లక్ష్యం, ప్రస్తుత పరిస్థితి, పథకాల ప్రగతి తదితర అం శాలపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. సరిగా స్పందించని వారికి క్లాస్‌లు తీసుకుంటున్నారు. దీనిని భరించలేని కొందరు సెలవులో వెళ్లారు. ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, సం క్షేమ శాఖలు, ఇరిగేషన్, డ్వామా, డీఆర్డీఏ, విద్యాశాఖ, ఆర్వీఎం లాంటి ప్రధాన శాఖలపై కలెక్టర్ సమీక్షలు నిర్వహించారు. ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్.. పాలనలో పారదర్శకత కోసం కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. తాను జిల్లాలోని ఏ శాఖ అధికారికి ఫైల్ పంపించినా.. 24గంటల్లో పూర్తి వివరాలతో దానిని తిరిగి తన వద్దకు పంపాలని సర్క్యూలర్ జారీ చేశారు. దీనికి సంబంధించి ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు, దరఖాస్తుల పరిశీలన, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాల ప్రగతి దీని ద్వారా ఇట్టే తెలి సిపోతుంది. ‘వీకెండ్’కు స్వస్తి.. జిల్లా కలెక్టర్‌గా వరప్రసాద్ ఉన్నప్పుడు వా రాంతపు సమీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాస్థాయి అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు సమావేశంలో పాల్గొనేవారు. వారంలో ఆయా శాఖలు సాధించిన ప్ర గతిపై సమీక్షించేవారు. సమీక్ష పేరుతో శని వారం ఆయా అధికారులు తమ స్థానాల్లో అం దుబాటులో ఉండేవారు కాదు. దీంతో అప్ప ట్లో ఈ సమావేశంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కలెక్టర్‌గా వచ్చిన క్రిస్టీనా కూడా వారాంతపు సమీక్షలు కొనసాగించారు. అయి తే మండల స్థాయి అధికారులు మధ్యాహ్నం వరకు కచ్చితంగా తమ కేంద్రాల్లో విధులు ని ర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు. కొత్త కలెక్టర్ ప్రద్యుమ్న వారాంతపు సమీక్షలకు ఫుల్స్టాప్ పెట్టారు. వారంలో ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నందున ప్రత్యేకంగా వారాంతపు సమీక్ష నిర్వహించడం దం డుగని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడుతూ శాఖల పని తీరు ను తెలుసుకుంటున్నారు. ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు హాస్టళ్లలో బస చేసి, సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతిని ధులు, సంఘాల నాయకులు, పైరవీకారులకు దూరంగా ఉంటూ కలెక్టర్ తన పని తాను చే సుకుపోతున్నారు. ఇలా జిల్లా పాలనపై ప్రత్యే క ముద్ర వేయడానికి ఆయన చర్యలు తీసు కుంటున్నారు. -
కమ్మర్‌పల్లిలో కలెక్టర్ హల్చల్
కమ్మర్పల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రంతో పాటు చౌట్పల్లి గ్రామాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హల్చల్ చేశారు. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ నీటి బిందు సేద్యం యంత్రాల పరిశీలన, ప్రయోజనాలు, స్థితిగతులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కమ్మర్పల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి వరినాటు యంత్రాన్ని పరిశీలించి, పొందుతున్న ప్రయోజనాలను సంబంధిత రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎన్ని వరినాటు యంత్రాలు అందించారని జేడీఏ మధుసూదన్‌ను అడుగగా, 14 వరికోత యంత్రాలు అందించామన్నారు. అనంతరం గ్రామంలో పసుపు ఉడకబెట్టే యంత్రాన్ని పరిశీలించి, సంబంధిత రైతులతో మాట్లాడారు. పసుపు పంట పరిశీలించి, పండిస్తున్న రకాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. చౌట్పల్లిలో వ్యవసాయ క్షేత్రాల్లో సూక్ష్మ బిందునీటి సేద్యం (డ్రిప్ ఇరిగేషన్)ను పరిశీలించారు. సబ్సిడీ, ప్రయోజనాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. సమయం, నీటి వినియోగం విద్యుత్ ఆదాలపై రైతులతో చర్చించారు. అనంతరం ఎస్సీ కాలనీలో ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో నిర్మించిన మురికి కాలువను పరిశీలించారు. దానికి సంబంధించిన వ్యయం, అంచనా విలువలను పీఆర్ఏఈ ఇసాక్ అలీని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం తనిఖీ... చౌట్పల్లి భాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్నం భోజనం పథకాన్ని తనిఖీ చేశారు. మెనూను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి భోజన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెనూలో సూ చించిన విధంగా ఆకు కూరలు, కూరగాయలను వండక పోవడంపై ప్రధానోపాధ్యాయుడు అంజాత్ సుల్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటకాలను పరిశీలించి, అన్నం తిని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఇన్చార్జి ఆర్డీఓ శివలింగయ్య, తహశీల్దార్ పుష్ప, ఎం పీడీఓ రాజేశ్వర్, ఏపీఓ సురేష్‌కుమార్, ఐకేపీ ఏపీఎం గంగాధర్ ఉన్నారు.