ఫిబ్రవరి చివరి నాటికి మంజూరైన పనులను ప్రారంభించాలని పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదే శించారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫిబ్రవరి చివరి నాటికి మంజూరైన పనులను ప్రారంభించాలని పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదే శించారు. గురువారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినందున ఈ కొద్ది కాలంలో అన్ని పనులను గ్రౌండింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయినవి, టెండర్ అవసరం లేని పనులను కూడా ఈ నెల 20 కల్లా నివేదిక అందించాల ని ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులు, ఆర్‌డీఎఫ్ పనులు గ్రౌండ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గత మార్చిలో పెద్ద సంఖ్యలో ఉపాధి పనులు మంజూరు చేసినప్పటికీ నిధులు లేవని పనులు ప్రారంభించలేదన్నారు. ప్రస్తుతం నిధులు అందుబాటులో లేనప్పటికీ కూలీలకు పనులు కల్పించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా నిధులు విడుదల చేస్తారని తెలిపారు. గత మార్చిలో మంజూరు పొందినా, పనులు ప్రారంభించనందున సుమారు రూ. 30 నుంచి రూ. 40 కోట్ల పనులు చేయలేకపోయామన్నారు.
‘ఉపాధి’లో ఇప్పటి వరకు రూ.150 కోట్లు ఖర్చు
ఈ ఏడాదిలో ఉపాధి హామీలో ఇప్పటివరకు రూ. 150 కోట్ల ఖర్చుచేసినట్లు చెప్పారు. మరో రూ. 40 కోట్లు మార్చిలోగా ఖర్చుచేయాల్సి ఉందన్నారు. నిధులు అందుబాటులో ఉన్న మేరకు ఎస్సీ, ఎస్టీలకు పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ పనులు పూర్తి చేయాల న్నారు. కామారెడ్డి డివిజన్‌లో 574 పనులు డిసెంబర్‌కల్లా పూర్తి చేయాల్సి ఉండగా, కేవలం 62 శాతంతో 356 పనులు పూర్తి చేశారన్నారు. నిజామాబాద్ డివిజన్‌లో 2292 పనులకుగాను 1372 పనులు చేసి 60 శాతం పూర్తి చేశారన్నారు. బోధన్ డివిజన్‌లో 770 పనులకు గాను 59 శాతంతో 449 పనులను మాత్రమే పూర్తి చేశారన్నారు. జిల్లాలో 500 అంగన్‌వాడీ భవనా ల నిర్మాణానికి మొదటి విడతగా ఒక్కో భవనానికి రూ. 4.50 లక్షల చొప్పున విడుదల చేసిందని తెలిపారు.