
70 రోజులుగా వేతనాలందక ఇక్కట్లు
రూ.664 కోట్ల మేర బకాయి
రాష్ట్రంలో 74 లక్షల మందికి ఈ పథకమే జీవనోపాధి
సాక్షి, అమరావతి: గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు 70 రోజులుగా వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ ఏడాది జనవరి 9 తర్వాత పనులు చేసిన కూలీలకు ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. 65 రోజులపాటు చేసిన పనులకు సంబంధించి దాదాపు రూ.664 కోట్లను కూలీలకు చెల్లించాల్సి ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని రోజుల్లో పేదలు ఉపాధి హామీ పనులపైనే ఆధారపడుతుంటారు. వ్యవసాయ పనులు పూర్తిగా తగ్గిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది పేదలు ప్రస్తుతం ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు.
74 లక్షల మందికి ఈ పనులే ఆధారం
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 57.87 లక్షల కుటుంబాలకు చెందిన 97.35 లక్షల మంది ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా 46 నుంచి 47 లక్షల కుటుంబాలు వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి హామీ పథకం పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 46.51 లక్షల కుటుంబాలకు చెందిన 74 లక్షల మంది ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. వీరిలో 60 శాతానికి పైగా మహిళలే. దీనిని బట్టి గ్రామీణ ప్రాంతాల్లో సగం కుటుంబాలు ఉపాధి హామీ పథకంపైనే ఆధారపడుతున్నాయి. ఎందరికో జీవనోపాధి కలి్పస్తున్న ఈ పథకం అమలులో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో అర్థమవుతోందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
ఉద్యోగులకూ వేతనాలు కరువే..?
15వ తేదీ ముగిసినా 5వేల మందికి అందని జీతాలు
సాక్షి, అమరావతి: నెలలో సగం రోజులు గడిచిపోయినా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. ఉపాధి హామీ పథకం నిర్వహణ కోసం మండల స్థాయిలో కంప్యూటర్ సెంటర్లు(ఎంసీసీ) నుంచి మొదలై జిల్లా స్థాయిలో డ్వామా కార్యాలయాలు, రాష్ట్ర స్థాయిలోని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ఫిక్సిడ్ టెన్యూర్ ఎంప్లాయీస్(ఎఫ్‌టీఈ) కేటగిరీలో కలిపి ఐదు వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తుంటారు.
ఎంసీసీల్లో పని చేసే ఎఫ్‌టీఈ కేటగిరీ ఉద్యోగుల్లో టెక్నికల్ అసిస్టెంట్ల(టీఏ) నుంచి రాష్ట్ర స్థాయి కార్యాలయంలో పనిచేసే వివిధ స్థాయి ఎఫ్‌టీఈ ఉద్యోగుల వరకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలను మార్చి 15వ తేదీ సాయంత్రం వరకు చెల్లించలేదు. ఆయా ఉద్యోగులకు చాలా తక్కువ మొత్తంలో వేతనాలు ఉన్నాయని, వాటిని సక్రమంగా చెల్లించకపోతే ఎలా జీవించాలని ఉద్యోగ
సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు.
పెండింగ్ వేతనాలు ఇవ్వాలి..
నాలుగు వారాలు పని చేశాం. రోజూ ఆటోలో బాడిగ రూ.20 ఇచ్చి వెళ్లాం. మేం చేసిన పనికి రావాల్సిన కూలి కోసం రోజూ మేట్‌లను అడుగుతున్నాం. పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. – పసుపులేటి బ్రహ్మయ్య, ఉపాధి కూలీ, చాగంటివారిపాలెం, పల్నాడు జిల్లా
రూపాయి కూడా ఇవ్వడం లేదు
రోజూ ఉపాధి పనికి వస్తున్నాం. ఐదారు వారాల నుంచి ఒక్క రూపాయి కూడా అందడం లేదు. పనిచేస్తున్న దగ్గర కనీసం నీడ సదుపాయం కూడా లేదు. సకాలంలో వేతనాలు అందజేసి, పని దగ్గర మౌలిక వసతులు కల్పించాలి.
– జి.విజయలక్ష్మి, ఉపాధి కూలీ, శ్యామసుందరపురం, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
పైసా ఇవ్వలేదు
ఉపాధి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గతంలో వారానికి ఓసారి డబ్బు పడేది. ఇప్పుడు రెండు నెలలుగా కూలీ డబ్బులు ఇవ్వలేదు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. పిల్లల్ని ఎలా పోషించాలో తెలియడం లేదు. – కుమార్, ఉపాధి కూలీ, చిట్టమూరు, తిరుపతి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment