పేదల బీమా పై పెనుచీకటి
సాక్షి, హైదరాబాద్: ‘అంగట్లో అన్నీ ఉన్నా....అల్లుడి నోట్లో శని’ అన్నట్టుగా తయారైంది కూలీల బీమా పథకం. అందుబాట్లో కోట్లాది రూపాయలున్నా 25 కోట్ల రూపాయలు ప్రీమియంగా చెల్లించే దిక్కులేక నిరుపేద కూలీలు నష్టపరిహారానికి దూరమవుతున్నారు.వారి జీవితాలకు బీమా ధీమా అందని ద్రాక్షే అయింది. నిరుపేదల కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలిగించే అద్భుతమైన ఈ కారు చౌక బీమా పథకంపై కారుచీకట్లు కమ్ముకున్నాయి వారి పిల్లలు ఉపకారవేతనాలు పొందలేకపోతున్నారు.
ప్రమాదంలో మరణించినా, క్షతగాత్రులైనా పట్టించుకునే దిక్కులేని ఆ నిరుపేదలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. పరిపాలనా ఖర్చుల కింద కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న అధికారులు చిన్నమొత్తాన్ని ప్రీమియంగా చెల్లించలేక బీమా పథకాన్ని అటకెక్కించారు. విడ్డూరంగా కనిపించే ఈ అంశానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.రూ.25 కోట్ల వ్యయంతో 20 లక్షల మందికిపైగా కూలీలకు లబ్ధి కలిగే ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో అటకెక్కింది. దీంతో ఉపాధిహామీ పథకంలో పనిచేసే లక్షలాది మంది కూలీలకు తీరని అన్యాయం జరుగుతోంది.ఈ 25 కోట్ల రూపాయలు సైతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్లో నుంచి ఖర్చుచేసే అవకాశం ఉన్నా.. అందుకు అధికార యంత్రాంగం ససేమిరా అంటోంది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 90 శాతం నిధుల నుంచి ఆరు శాతం పరిపాలన వ్యయంగా ఖర్చు చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. మరే రాష్ట్రంలో లేనంతగా దాదాపు తొమ్మిది శాతం నిధులను ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిపాలన వ్యయం కింద ఖర్చు చేస్తోంది. కూలీలకు బీమా మొత్తాన్ని ఈ నిధుల నుంచి కేటాయించడానికి అవకాశం ఉన్నా..మన రాష్ట్ర అధికారయంత్రాంగం, ప్రభుత్వం ససేమిరా అంటున్నాయి.
బీమా ప్రీమియం కింద 25 కోట్లు చెల్లిస్తే..కూలీలకు బీమా పథకం అమలయ్యేది.కూలీలకు బీమా రెన్యూవల్ చేయకపోవడంతో..ప్రమాదాలేమైనా జరిగితే కూలీల కుటుంబాలకు అందాల్సిన నష్టపరిహారం అందకుండా పోయింది. బీమా పథకం అమలులో ఉంటే కూలీలు ప్రమాదవశాత్తు మరణిస్తే.. రూ. 70 వేలు, సాధారణంగా మరణిస్తే రూ.35 వేలు నష్ట పరిహారంగా లభించేవి. అంతేకాక కూలీల పిల్లల్లో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న వారికి ఏటా 1200 రూపాయలు ఉపకార వేతనం కూడా లభించేది.అయితే ఈ అవకాశాన్ని ప్రభుత్వం కాలరాసింది.ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల్లో ప్రతీ సంవత్సరం 25 వేల నుంచి 30 వేల మంది మరణిస్తుంటారని, ఈ బీమా సౌకర్యం కల్పించే పక్షంలో.. మరణిస్తున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం కింద ఏటా రమారమి రూ. 150 కోట్ల నుంచి 180 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది. కాని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల నిర్భాగ్యులైన కూలీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
ఈ ఏడాది కేటాయింపు రూ. 8300 కోట్లు..
ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 8300 కోట్లు కేంద్రం కేటాయించింది. ఎనిమిది వేల కోట్ల రూపాయల్లో ఆరు శాతం వ్యయం అంటే రమారమి రూ. 500 కోట్లు పరిపాలన వ్యయం కోసం వినియోగించుకోవచ్చు. కాని రాష్ట్రంలో ఉపాది హామీ పథకాన్ని అమలు చేస్తున్న గ్రామీణాభివద్ధి శాఖ అధికారులు దాదాపు తొమ్మిదిశాతం మేరకు పరిపాలన వ్యయం చేస్తున్నారు. అదేమంటే ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నామని, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇతర అంశాల కారణంగా పరిమితి కంటే ఎక్కువ నిధులు వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.కాని ఉపాది కూలీలకు ప్రీమియంగా చెల్లించాల్సిన రూ. 25 కోట్లు చెల్లించడానికి మాత్రం ముందుకురాకపోవడం గమనార్హం.
అనవసరం వ్యయం..
ఉపాధి హామీ పథకంలో అనవసర వ్యయం విపరీతంగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్హులు కాని వారికి వాహనాలు సమకూర్చడం, వేతనాల నిర్ణయంలోనూ ఉన్నతాధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పదవీ విరమణ చేసిన అధికారులకు ‘ఉపాధి’ కేంద్రంగా తయారైందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ పథకం అమలులో నిధులు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ కూలీల బీమా కోసం ప్రీమియం చెల్లించడానికి మనసొప్పకపోవడం విడ్డూరం.