AP: ఉపాధిలో మార్కులు..  | Upadi Hami Scheme: Performance Is Recognized As Standard | Sakshi
Sakshi News home page

AP: ఉపాధిలో మార్కులు.. 

Published Sat, Sep 24 2022 8:25 AM | Last Updated on Sat, Sep 24 2022 8:45 AM

Upadi Hami Scheme: Performance Is Recognized As Standard - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామీణాభివృద్ధి శాఖ నూతన సంస్కరణకు నాంది పలికింది. ఇప్పటి వరకు కూలీల హాజరు, పనుల కల్పన, మేట్లుగా స్త్రీలను నియమించడం వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చింది. తాజాగా అధికారుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే దిశగా చర్యలకు ఉపక్రమిస్తూ.. ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి అవార్డులతో సత్కరించేందుకు సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇకపై విద్యార్థుల తరహా గ్రేడింగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ప్రాజెక్టు డైరెక్టర్‌ నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వరకు అందరికీ వీటి పరిధిలోకి తీసుకువచ్చింది మార్కుల ఆధారంగా వారి ప్రతిభను గుర్తించనుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ ఇటీవల మార్గదర్శకాలు వెలువరించారు.

100 మార్కులు
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 18 మండలాలు ఉండగా 286 పంచాయతీల పరిధిలో ఉపాధి పనులు చేపడుతున్నారు. 2.96 లక్షల ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉండగా.. 5,27,000 మంది పనులను వినియోగించుకుంటున్నారు. ఈ ఏడాది రూ.26 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రూ.94 కోట్లు వేతనాలు, సామగ్రికి వెచ్చించేందుకు ప్రణాళికలు రూపొందించారు. కూలీలకు పనులు కల్పించడం, పర్యవేక్షణకు జిల్లాలో ప్రాజెక్టు డైరెక్టర్, 10 మంది ఏపీవోలు, 262 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీటిలో కొందరు నిబద్ధతతో పనిచేస్తున్నా.. కొందరు తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. మరి కొందరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

వీరిలో బాధ్యతను పెంపొందించేందుకు మార్కుల విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు కేటాయిస్తారు. ఉద్యోగుల కేడర్‌ వారీగా పనితీరు, వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి 100 మార్కులు కేటాయించారు. మార్కులను బట్టి ఎక్సలెంటు(ఏ–గ్రేడ్‌), గుడ్‌(బీగ్రేడ్‌) ఫెయిర్‌ (ఎఫ్‌ఏఐఆర్‌–సీగ్రేడ్‌ ), తక్కువ (డీ–గ్రేడ్‌)లో ఉన్న వారు పనితీరును మెరుగుపరుచుకునేందుకు రెండు నెలల అవకావం ఇస్తారు. మార్పు లేకపోతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తారు. సీ–గ్రేడ్‌లో ఉన్న వారు బీగ్రేడ్‌లో రాణించే విధంగా ప్రోత్సహిస్తారు. 90 ఆపైన మార్కులు సాధించిన ఎక్కలెంటుగా గుర్తింపు పొందిన వారిని రాష్ట్ర స్థాయి అవార్డులకు గ్రామీణాభివృద్ధి శాఖ నామినేట్‌ చేస్తుంది.  

ప్రగతిని పరిగణిస్తారిలా..!  
పనుల్లో ఉత్తమ పురోగతి సాధించిన వారిని ఎంపి చేస్తారు. వాటిలో కొన్ని పనులు ఎంపిక చేశారు. 
పండ్లతోటల అభివృద్ధి, అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలి.  
మొక్క ఎండితే దాని స్థానంలో మరొకటి నాటాలి.  
ప్రతి కూలీకి సగటు వేతనం అందేలా చూడాలి.  
ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలి
జాబ్‌ కార్డులు అప్‌డేట్‌ చేయడం, ఏడు రకాల రికార్డులను నిర్వహించాలి.  
పని ప్రదేశంలో బోర్డుల ఏర్పాటు, పని వారీగా ఫైల్స్‌ నిర్వహించాలి.  
సామాజిక తనిఖీల రికవరీలు, మస్టర్‌ వెరిఫకేషన్‌లో నిర్లక్ష్యాన్ని సహించరు.  
వ్యవసాయ, అనుబంధ కార్యక్రమాల్లో 60 శాతం ప్రగతి చూపాలి.   

పారదర్శకంగా గ్రేడింగ్‌
ఉపాధి సిబ్బందికి మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వమని గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు వెలువరించింది. అందుకు అనుగుణంగా గ్రేడింగ్‌ విధానం పారదర్శకంగా చేపడతాం. 30 అంశాల్లో స్పష్టమైన ప్రగతి ఉండాలనేది ప్రధాన లక్ష్యం. తద్వారా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నుంచి పీడీ వరకు ఉద్యోగ నిర్వహణలో పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనం పెంపొందిస్తాం. పనితీరును బట్టి ప్రతి ఒక్కరికీ గ్రేడ్‌లు ఇస్తారు. ప్రతి అంశానికి మార్కులు ఉంటాయి.  
–రామ్‌గోపాల్, డ్వామా పీడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement