Department of Rural Development Agencies
-
నారీ శక్తికి 'చేయూత'
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటివరకు 13 లక్షల మంది మహిళలు ప్రతి నెలా తమ కుటుంబానికి స్థిరమైన ఆదాయాన్ని పొందేలా శాశ్వత జీవనోపాధులు కల్పించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వనుండగా ఇప్పటివరకు మూడు విడతల్లో లబ్ధిదారులకు రూ.14,129.11 కోట్లు అందచేసినట్లు చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖతో పాటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాల అమలు తీరుపై సీఎం జగన్ సమీక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని మహిళలు ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధి కల్పనకు వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు. ‘చేయూత’ కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. లబ్ధిదారులు తొలివిడత డబ్బులు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమాలకు అనుసంధానం చేస్తే మహిళలకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందన్నారు. అవసరమైన వారికి అదనంగా బ్యాంకు రుణాలు ఇప్పించి స్వయం ఉపాధిని పెంపొందించే మార్గాలపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు జగనన్న తోడు పథకం ప్రయోజనాలను కూడా వర్తింప చేయాలని సూచించారు. పొదుపు సంఘాల మహిళలు ఉమ్మడిగా నెలకొల్పిన మహిళా మార్టులు సమర్థంగా పని చేస్తున్నాయని, ఇప్పటివరకు 36 మహిళా మార్టుల ద్వారా రూ.32.44 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మహిళా మార్టులో సగటున రోజుకు రూ. 20.62 లక్షల వ్యాపారం జరిగిందని వివరించారు. 10న ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’.. పొదుపు సంఘాల మహిళలకు వారి బ్యాంకు రుణాలకు సంబంధించి వైఎస్సార్ సున్నా వడ్డీని ఆగస్టు 10న మరో విడత అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. జూలై 26వ తేదీన జరగాల్సిన ఈ కార్యక్రమం ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తంలో రూ.19,178.17 కోట్లను వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నేరుగా వారి ఖాతాలకు గత మూడేళ్లలో ప్రభుత్వం జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు. సకాలంలో రుణాలు చెల్లించే మహిళలకు ఇప్పటి వరకు వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.4,969.05 కోట్లు చెల్లించామన్నారు. బ్యాంకర్ల సమావేశంలో పలుమార్లు ఒత్తిడి తెచ్చి పొదుపు సంఘాల మహిళలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా చర్యలు చేపట్టామన్నారు. స్త్రీ నిధి ద్వారా ఇచ్చే రుణాలపై వడ్డీని 9 శాతానికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. మహిళల తరపున అధికారులే గట్టిగా మాట్లాడి వారికి తగిన ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. పట్టణాల్లోనూ డిజిటల్ లైబ్రరీలు గ్రామీణ ప్రాంతాల తరహాలోనే పట్టణాల్లోనూ వైఎస్సార్ డిజిటల్ లైబరీల నిర్మాణానికి స్థలాలను తొలుత గుర్తించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాల తీరును పరిశీలించిన అనంతరం సీఎం జగన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సచివాలయాల భవనాల నిర్మాణం దాదాపుగా కొలిక్కి వచ్చిందని, సెప్టెంబరు నాటికే అన్నింటినీ పూర్తి చేసేలా కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశిత గడువులోగా అన్ని భవనాల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ – జూలై మధ్య ఉపాధి హమీ ద్వారా 18.90 కోట్ల పనిదినాలు కల్పించిన నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాదిలో కనీసం 24 కోట్ల పనిదినాల తగ్గకుండా ఉపాధి కల్పన లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఉత్తమ పనితీరు కనపరిచిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావించారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు జగనన్న కాలనీలలో కనీస మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నందున మౌలిక సదుపాయాల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. కాలనీల్లో అపరిశుభ్రతకు తావు లేకుండా పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామ కంఠం ఇళ్లకు హక్కు పత్రాలు వ్యవసాయ భూములకు సంబంధించి యజమానులకు పాస్ పుస్తకాల మాదిరిగా గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్ల యజమానులకు కూడా భూ హక్కు పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ కంఠం పరిధిలో రూ.లక్షల విలువ చేసే ఇళ్లు, ఇంటి స్థలాలున్నా అధికారిక పత్రాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా వారికి భూహక్కు పత్రాల జారీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. 10,943 గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్లతో సర్వే పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో భూహక్కు పత్రాలను ఇస్తున్నట్లు చెప్పారు. వందేళ్ల తరువాత తొలిసారిగా మనం చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అత్యంత విశిష్టమైనదని సీఎం జగన్ పేర్కొన్నారు.ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యేకంగా ఒక సర్వేయర్‌ను నియమించడం వల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోందన్నారు. గ్రామ స్థాయిలో సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన ఘనత కేవలం మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఇతర శాఖాధికారులు సీఎం సమీక్షలో పాల్గొన్నారు. -
పర్యావరణ హితులు.. మన డ్వాక్రా మహిళలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి నాగా వెంకటరెడ్డి : రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి, సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ వారి కుటుంబాల ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల మహిళలను పర్యావరణ హితులుగా కూడా మారుస్తున్నారు. జాతీయ రహదారుల వెంబడి మొక్కల పెంపకంలో వీరిని భాగస్వాములను చేస్తున్నారు. టోల్‌ప్లాజాలు, నగర శివార్లలో వ్యాపార అవకాశాలను ఏ మేరకు కల్పించవచ్చనేది కూడా పరిశీలించాలని సీఎం జగన్ సెర్ప్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళలకు ఆర్థికంగా కూడా తోడ్పాటు లభిస్తుంది. స్వయం సంమృద్ధికి బాటలు వేసుకోనున్నారు. మహిళల జీవన ప్రమాణాలు కూడా పెంపొందుతాయి. రూ.1.57 కోట్ల ప్రాజెక్టులో 761 సంఘాల భాగస్వామ్యం నేషనల్ రూరల్ లైవ్లీ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం), నేషనల్ హైవేస్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మధ్య గత ఏడాది కుదిరిన ఎంవోయూ ప్రకారం రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటి వాటిని అయిదేళ్ల పాటు రక్షించి ఎన్హెచ్ఎఐకి అప్పజెప్పాలి. ఈ బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖ పరి«ధిలోని ‘సెర్ప్’ తీసుకుంది. తొలుత ఎన్‌హెచ్– 544డి పరిధిలోని గిద్దలూరు – వినుకొండ సెక్షన్లో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని కేశినేనిపల్లి– ఉమ్మడివరం గ్రామాల మధ్య ఉన్న 17.74 కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా (మొత్తం 35.48 కి.మీ) 5,907 మొక్కలు నాటాలి. గుంతలు తవ్వకం, మొక్కలు కొని నాటడం, కంచె ఏర్పాటు, నీటి సరఫరా, ఎరువులు వేయడం, అయిదేళ్ల పాటు పెంచే బాధ్యతలను త్రిపురాంతకం, పెదారవీడు మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 761 డ్వాక్రా సంఘాల్లోని 7,610 మంది సభ్యులకు ‘సెర్ప్’ అప్పగించింది. ఇందుకోసం ఎన్హెచ్ఏఐ అయిదేళ్లకు రూ.1.57 కోట్లు ఇస్తుంది. త్రిపురాంతకం, పెదారవీడు మండల సమాఖ్యలు, ఆరు గ్రామైక్య సంఘాలు ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించనున్నాయి. ఏడాదిలో 3 నెలలు ఉపాధి.. దినసరి వేతనం రూ.400 ప్రాజెక్టులో భాగస్వాములవుతున్న ఒక్కో డ్వాక్రా సభ్యురాలికి ఏడాదికి సుమారు మూడు నెలలు ఉపాధి లభిస్తుంది. సగటున దినసరి వేతనం రూ.400 వస్తుంది. తద్వారా ఏడాదికి రూ.36 వేలు చొప్పున అయిదేళ్లలో రూ.1.80 లక్షలు సమకూరుతుందని. ఈ స్వయం సహాయక సంఘాలకు గ్రామైక్య సంఘాలు నేతృత్వం వహిస్తాయి. డీఆర్డీఏ, సెర్ప్ ఉన్నతాధికారుల మార్గదర్శనం చేస్తారు. కాంట్రాక్టు వ్యవస్థను దరిజేరనీయకుండా డ్వాక్రా సంఘాలే నీటి సరఫరాకు ట్యాంకర్లు, గుంతలు తవ్వేందుకు యంత్ర పరికరాలు, ఎరువులు సమకూర్చే బాధ్యతలను తీసుకున్నందున వ్యాపార వ్యవహారాలలోనూ వారికి అనుభవం వస్తుంది. ఎన్హెచ్ఏఐ నిర్దేశించిన మేరకు 5,907 బొగోనియా, స్పాథోడియా, మిల్లింగ్ టోనియా, మారేడు, పొగడ మొక్కలను ప్రభుత్వ నర్సరీలలోనే డ్వాక్రా సంఘాలు కొనుగోలు చేస్తున్నాయి. పచ్చదనం పెంపునకు ప్రణాళిక రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో 24.62 శాతం గ్రీనరీ ఉండగా రాష్ట్రంలో 22.86 ఉంది. ఈ వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని కొండలపై కోటి మొక్కలు పెంచాలన్నది గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం. 660 మండలాల్లోని వెయ్యి కొండలనైనా ఎంపిక చేసుకుని ఒక్కో కొండపై కనీసం 10 వేల మొక్కల పెంపకం చేపట్టనుంది. సీడ్ బాల్స్ విధానంలో ఫలాలనిచ్చే ఉసిరి, రేగు, సీతాఫలం, వెలగ, నీడనిచ్చే వేప, కానుగ తదితర మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధి హామీలో మొక్కల పెంపకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొక్కల పెంపకం ఓ ముఖ్యాంశం. పొదుపు సంఘాల మహిళలు ఇందులో క్రియాశీలకంగా ఉన్నారు. రాష్ట్ర , జిల్లా, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల వెంబడి మొక్కలు నాటి పెంచే ప్రక్రియను డ్వాక్రా సభ్యులు చేపట్టిన సంగతి తెలిసిందే. రానున్న కాలంలో జాతీయ రహదారుల వెంబడి చెట్ల పెంపకంలోనూ భాగస్వాములు కానున్నారు. వ్యాపార అవకాశాలపైనా దృష్టి గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని 8.64 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలలో దాదాపు 90 లక్షల మంది సభ్యులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మెప్మాలో లక్ష గ్రూపులు, పది లక్షల మంది వరకు సభ్యులు ఉన్నారు. 2014 నాటికి రాష్ట్రంలో 4,193 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా 2023 నాటికి 8,744 కిలోమీటర్లకు పెరుగుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా తిరుపతిలో ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ చొరవ, వేగం వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. ఈ జాతీయ రహదారులను ఉపయోగించుకొంటూ మహిళలకు పలు వ్యాపార అవకాశాలివ్వాలన్నది సీఎం జగన్ సంకల్పం. ఈమేరకు అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. రహదారుల టోల్‌ప్లాజాలు, ప్రధాన కూడళ్లు, నగర శివార్లలోని ఎన్హెచ్ఏఐ స్థలాల్లో స్థానిక డ్వాక్రా సంఘాలతో ఫుడ్ ప్లాజాలు, అవుట్లెట్ల ఏర్పాటు, గ్రామీణ ఉత్పత్తుల విక్రయాలకు స్టాళ్లు ఏర్పాటు చేయించాలని, ఇందుకోసం ఎన్హెచ్ఎఐతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారని సెర్ప్ సీఈవో ఎండి ఇంతియాజ్ ‘సాక్షి’కి తెలిపారు. -
రోజూ 35 లక్షల మందికి ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: వ్యవసాయపనులు ఉండని ఈ వేసవి రోజుల్లోను గ్రామీణ ప్రాంతాల్లో పేదలు పనుల కోసం పట్టణాలకో, నగరాలకో వలస పోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా సొంత ఊళ్లలోనే పనులు కల్పిస్తోంది. ఇప్పుడు రోజూ 30 లక్షల నుంచి 35 లక్షల మంది ఈ పనులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి జూన్ పదోతేదీ వరకు గత 70 రోజుల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 37.59 లక్షల పేద కుటుంబాలు ఈ పనులు చేసుకుని రూ.2,952.66 కోట్ల మేర లబ్ధిపొందినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అదికారులు వెల్లడించారు. శనివారం (ఈ నెల పదోతేదీ) కూడా 35.70 లక్షల మంది సొంత ఊళ్లలోనే ఈ పనులు చేసుకుని లబ్ది పొందారు. మరోవైపు ఈ పనులకు హాజరయ్యేవారికి ఒక్కొక్కరికి రోజుకు సరాసరిన రూ.245 చొప్పున గిట్టుబాటు అవుతోందని, పనులకు హాజరయ్యేవారిలో 60 శాతం వరకు మహిళలే ఉంటున్నారని అధికారులు తెలిపారు. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉపాధి పనులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య విరామం కల్పించింది. ఎండతీవ్రత తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఈ పనులు చేయిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్ని జిల్లాల డ్వామాల పీడీలతో ప్రతి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఈ వేసవిలో పేదలకు పనుల కల్పన కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నారు. 11.62 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు లబ్ధి ఈ వేసవిలో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 37.59 లక్షల గ్రామీణ ప్రాంత కుటుంబాలు ఉపాధిహామీ పథకం పనులు చేసుకుని లబ్ది పొందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 8,36,826 ఎస్సీ కుటుంబాలు, 3,25,204 ఎస్టీ కుటుంబాలు (మొత్తం 11,62,030 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు) ప్రయోజనం పొందినట్లు చెప్పారు. 12.06 కోట్ల పనిదినాలు గత నాలుగు సంవత్సరాల మాదిరే.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఉండని వేసవి కాలంలోను ఉపాధిహామీ పథకం ద్వారా పేదలకు పనుల కల్పనలో ఈ ఏడాది కూడ మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఈ వేసవిలో ఇప్పటివరకు 73.52 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించారు. అందులో ఆరోవంతు (16 శాతానికి పైగా) మేర 12.06 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించిన మన రాష్ట్రం ఈ పథకం కింద పనుల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రెండోస్థానంలో ఉన్న తమిళనాడు 8.37 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించింది. -
AP: ఉపాధిలో మార్కులు..
సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామీణాభివృద్ధి శాఖ నూతన సంస్కరణకు నాంది పలికింది. ఇప్పటి వరకు కూలీల హాజరు, పనుల కల్పన, మేట్లుగా స్త్రీలను నియమించడం వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చింది. తాజాగా అధికారుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే దిశగా చర్యలకు ఉపక్రమిస్తూ.. ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి అవార్డులతో సత్కరించేందుకు సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇకపై విద్యార్థుల తరహా గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు అందరికీ వీటి పరిధిలోకి తీసుకువచ్చింది మార్కుల ఆధారంగా వారి ప్రతిభను గుర్తించనుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ ఇటీవల మార్గదర్శకాలు వెలువరించారు. 100 మార్కులు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 18 మండలాలు ఉండగా 286 పంచాయతీల పరిధిలో ఉపాధి పనులు చేపడుతున్నారు. 2.96 లక్షల ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉండగా.. 5,27,000 మంది పనులను వినియోగించుకుంటున్నారు. ఈ ఏడాది రూ.26 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రూ.94 కోట్లు వేతనాలు, సామగ్రికి వెచ్చించేందుకు ప్రణాళికలు రూపొందించారు. కూలీలకు పనులు కల్పించడం, పర్యవేక్షణకు జిల్లాలో ప్రాజెక్టు డైరెక్టర్, 10 మంది ఏపీవోలు, 262 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీటిలో కొందరు నిబద్ధతతో పనిచేస్తున్నా.. కొందరు తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. మరి కొందరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో బాధ్యతను పెంపొందించేందుకు మార్కుల విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తారు. ఉద్యోగుల కేడర్ వారీగా పనితీరు, వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి 100 మార్కులు కేటాయించారు. మార్కులను బట్టి ఎక్సలెంటు(ఏ–గ్రేడ్), గుడ్(బీగ్రేడ్) ఫెయిర్ (ఎఫ్‌ఏఐఆర్–సీగ్రేడ్ ), తక్కువ (డీ–గ్రేడ్)లో ఉన్న వారు పనితీరును మెరుగుపరుచుకునేందుకు రెండు నెలల అవకావం ఇస్తారు. మార్పు లేకపోతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తారు. సీ–గ్రేడ్‌లో ఉన్న వారు బీగ్రేడ్‌లో రాణించే విధంగా ప్రోత్సహిస్తారు. 90 ఆపైన మార్కులు సాధించిన ఎక్కలెంటుగా గుర్తింపు పొందిన వారిని రాష్ట్ర స్థాయి అవార్డులకు గ్రామీణాభివృద్ధి శాఖ నామినేట్ చేస్తుంది. ప్రగతిని పరిగణిస్తారిలా..! పనుల్లో ఉత్తమ పురోగతి సాధించిన వారిని ఎంపి చేస్తారు. వాటిలో కొన్ని పనులు ఎంపిక చేశారు. పండ్లతోటల అభివృద్ధి, అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలి. మొక్క ఎండితే దాని స్థానంలో మరొకటి నాటాలి. ప్రతి కూలీకి సగటు వేతనం అందేలా చూడాలి. ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలి జాబ్ కార్డులు అప్డేట్ చేయడం, ఏడు రకాల రికార్డులను నిర్వహించాలి. పని ప్రదేశంలో బోర్డుల ఏర్పాటు, పని వారీగా ఫైల్స్ నిర్వహించాలి. సామాజిక తనిఖీల రికవరీలు, మస్టర్ వెరిఫకేషన్‌లో నిర్లక్ష్యాన్ని సహించరు. వ్యవసాయ, అనుబంధ కార్యక్రమాల్లో 60 శాతం ప్రగతి చూపాలి. పారదర్శకంగా గ్రేడింగ్ ఉపాధి సిబ్బందికి మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వమని గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు వెలువరించింది. అందుకు అనుగుణంగా గ్రేడింగ్ విధానం పారదర్శకంగా చేపడతాం. 30 అంశాల్లో స్పష్టమైన ప్రగతి ఉండాలనేది ప్రధాన లక్ష్యం. తద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి పీడీ వరకు ఉద్యోగ నిర్వహణలో పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనం పెంపొందిస్తాం. పనితీరును బట్టి ప్రతి ఒక్కరికీ గ్రేడ్లు ఇస్తారు. ప్రతి అంశానికి మార్కులు ఉంటాయి. –రామ్‌గోపాల్, డ్వామా పీడీ -
ఆంధ్రప్రదేశ్‌లో పథకాల అమలుపై కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో వందకు వంద శాతం సమర్థంగా అమలవుతున్నాయని కేంద్ర నిపుణుల కమిటీ బృందం ప్రశంసించింది. గత నాలుగు రోజులుగా శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ ముద్ర అట్టడుగు స్థాయిలో సైతం చాలా స్పష్టంగా కనిపించిందని కేంద్ర బృందం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్న పథకాలతో పేదలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని, దేశవ్యాప్తంగా ఈ విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అధ్యయనానికి కమిటీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న దాదాపు పది రకాల పథకాలను రాష్ట్రాల వారీగా పరిశీలించడంతో పాటు మార్పు చేర్పులపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించారు. పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అరుణాశర్మ, తమిళనాడు రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ నేతృత్వంలో వివిధ రంగాల నిపుణులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కామన్ రివ్యూ మిషన్ పేరుతో కమిటీ ఏర్పాటైంది. ఏపీలో పథకాల అమలు తీరు పరిశీలనకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అశోక్ పంకజ్, నీతి అయోగ్ నియమించిన వందనా శర్మ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీ పీఆర్) కమిటీ సభ్యుడు ఏ.సింహాచలం, సివిల్ ఇంజనీరింగ్ నిపుణుడు ఎంకే గుప్తాలతో కూడిన బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించింది. బృందం సభ్యులు ఇద్దరు చొప్పున ఈ నెల 19 నుంచి 22 వరకు జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు డీబీటీ కంటే మెరుగ్గా ఏపీలో పింఛన్ల పంపిణీ.. వలంటీర్ల ద్వారా ప్రతి నెలా మొదటి తేదీనే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించిన కేంద్ర నిపుణుల కమిటీ అభినందనలు తెలియచేసింది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని అయితే డీబీటీ కంటే మరింత మెరుగ్గా ఏపీలో లబ్ధిదారుల ఇంటి వద్దే బయోమెట్రిక్ లేదా ఐరిస్ తీసుకొని నేరుగా డబ్బులు అందజేయడం ప్రశంసనీయమన్నారు. దీనివల్ల పెద్ద వయసు వారు, అనారోగ్య బాధితులు ప్రతి నెలా బ్యాంకు దాకా వెళ్లాల్సిన అవసరం తొలగిపోయిందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న డీబీటీ విధానంలో ఎవరైనా లబ్ధిదారులు మరణించిన తరువాత కూడా సంబంధిత బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడం, ఏటీఎం కార్డులతో ఇతరులు డ్రా చేసుకోవడం లాంటి వాటికి ఆస్కారం ఉందన్నారు. ఇలాంటి వాటికి తావులేకుండా పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల చేతికే డబ్బులు అందించడం వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా టంచన్‌గా మొదటి తారీఖునే పింఛన్ల పంపిణీ చేస్తున్న తీరు గురించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. శాశ్వత భవనాలతో గ్రామాలకు కొత్త రూపు ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులతో గ్రామ సచివాలయాల భవనాలు సహా పలు నిర్మాణాలను చేపట్టడం వల్ల ప్రతి గ్రామానికి శాశ్వతంగా ఆస్తులు కల్పిస్తున్నారని కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రతి పల్లెలో సామాజిక సంపదగా కొత్తగా నిర్మితమవుతున్న భవనాలు గ్రామాల రూపురేఖలు మార్చేస్తున్నాయని, ఇది దేశానికే ఆదర్శనీయమని ప్రశంసించారు. పలు రకాల సేవలను గ్రామాల్లోనే ప్రజల ముంగిటికే అందుబాటులోకి తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్థను దేశమంతా ప్రవేశ పెట్టాలని తమ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేస్తుందని వెల్లడించారు. ఉపాధి హామీ నిధులతో రోడ్లకు ఇరువైపులా నాటే మొక్కలలో అధిక శాతం పచ్చగా కళకళలాడుతున్నాయని కమిటీ సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు– నేడు ద్వారా జరిగిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తాము స్వయంగా పరిశీలించామని చెప్పారు. ఏజన్సీలో 150 రోజులకు ‘ఉపాధి’ గిరిజన ప్రాంతాలతో పాటు కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులకు బదులుగా 150 రోజుల పాటు పేదలకు పనులు కల్పించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ నిఫుణుల కమిటీని కోరారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కూలీలకు వేసవి కాలంలో తక్కువ మొత్తంలో పనిచేసినా కొంత అదనంగా కూలీ డబ్బులు ఇచ్చే విధానం అమలులో ఉండేదని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు ఆ అవకాశం లేదన్నారు. తిరిగి గత విధానం అమలుకు వీలుగా సిఫార్సు చేయాలని కోరారు. కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన అరకు, పాడేరులో ఉపాధి హామీ పథకం ద్వారా తోటల పెంపకానికి అనుమతిచ్చేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన గూడేలకు రోడ్లు పీఎంజీఎస్‌వై పథకం ద్వారా ప్రస్తుతం కనీసం 250 మంది జనాభా ఉండే గ్రామాలకు మాత్రమే కొత్తగా రోడ్ల నిర్మాణానికి అవకాశం ఉందని, గిరిజన ప్రాంతాల్లో 50–100 మంది నివసించే గూడేలకు కూడా పథకం ద్వారా రహదారుల నిర్మాణానికి అనుమతించేలా నిబంధనల సవరణకు సిఫారసు చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ సుబ్బారెడ్డి కోరారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన నేపధ్యంలో గృహ నిర్మాణానికి వీలుగా అదనంగా నిధులు కేటాయించేలా కృషి చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ గుప్తా కోరారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సంచాలకులు పి.చినతాతయ్య, జాయింట్ కమిషనర్ ఏ.కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష; కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ శాఖల పరిధిలో వివిధ కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించిన సీఎం పలు ఆదేశాలు ఇచ్చారు. జాతీయ ఉపాధిహామీ పథకం పనులు, జగనన్న పచ్చతోరణం, వైఎస్సార్ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్ కింద కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, గ్రామీణ మంచినీటి సరఫరా తదితర కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఉపాధిహామీ పనులు ►ప్రాధాన్యతా క్రమంలో ఉపాధిహామీ పనులు చేపట్టాలి అధికారులకు సీఎం ఆదేశం ►గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం ►అమూల్ పాలసేకరణ చేస్తున్న జిల్లాలను, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని బీఎంసీయూలను పూర్తిచేయాలన్న సీఎం ►జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తిచేయడానికి తగిన కార్యాచరణతో ముందుకు సాగాలన్న ముఖ్యమంత్రి జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లాప్ కార్యక్రమాలు ►జగనన్న స్వచ్ఛ సంకల్పం, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ప్రాసెస్‌లపై సీఎం సమీక్ష ►నవంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 22 శాతం ఇళ్లనుంచి చెత్తసేకరణ ప్రారంభమై ప్రస్తుతం 61.5శాతానికి చేరుకున్నామన్న అధికారులు ►అక్టోబరు కల్లా పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటున్నామన్న అధికారులు ►గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపరచాలని సీఎం ఆదేశాలు ►మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న సీఎం ►వివిధ గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను ప్రత్యేక సర్వేద్వారా గుర్తించిన అధికారులు ►దాదాపు 582 ప్రాంతాలను గుర్తించిన అధికారులు ►ఇక్కడ సాయిల్ బయోట్రీట్‌మెంట్, వెట్ ల్యాండ్‌ట్రీట్‌మెంట్, వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ తదితర పద్ధతుల్లో శుద్ధికి ప్రణాళికను వివరించిన అధికారులు ►వెంటనే ఈపనులు చేపట్టాలని సీఎం ఆదేశం ►ఏడాదిలోగా పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►కట్టిన తర్వాత వాటి నిర్వహణపైనా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్వహణపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్లాలన్న సీఎం ►పాదయాత్రలో గ్రామాల్లో పరిస్థితులు చూపినప్పుడు ఆవేదన కలిగిందన్న సీఎం ►అలాంటి పరిస్థితులను మార్చాలన్న సీఎం ►నివాసప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండే పరిస్థితులు ఉండకూడదన్న సీఎం ►ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలన్న సీఎం ►ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ల ఏర్పాటుపైనా ప్రణాళిక వివరించిన అధికారులు ►వీటి నిర్వహణపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం వైఎస్సార్ జలకళ ►వైయస్సార్ జలకళపైనా సీఎం సమీక్ష ►ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గును అప్పగించాలన్న సీఎం ►ఆ రిగ్గు ద్వారా రైతులకుబోర్లు వేయించాలన్న సీఎం ►దీనివల్ల బోర్లు వేసే పని క్రమంగా ముందుకు సాగుతుందన్న సీఎం ►బోరు వేసిన వెంటనే మోటారును బిగించాలన్న సీఎం రోడ్ల నిర్మాణం, నిర్వహణ ►రోడ్ల నిర్మాణం, నిర్వహణపైనా సీఎం సమీక్ష ►గత ప్రభుత్వం హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను పూర్తిగా గాలికొదిలేశారు ►ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండేళ్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి ►క్రమం తప్పకుండా చేయాల్సిన నిర్వహణను వదిలేయడంతో అన్ని రోడ్లనూ ఒకేసారి నిర్మించి, మరమ్మతు చేయాల్సిన అవసరం ఏర్పడింది ►ఈసారి రోడ్ల నిర్మాణం, మర్మతులను పూర్తిచేయాలి ►భవిష్యత్తులో రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ ఉండాలి ►ఏ దశలోకూడా నిర్లక్ష్యానికి గురికాకుండా క్రమం తప్పకుండా మెయింటైనెన్స్ పనులు నిర్వహించాలి ►దీనికోసం నిధుల కొరత లేకుండా ఒక ప్రణాళికను ఆలోచించాలని అధికారులకు సీఎం ఆదేశం జగనన్న కాలనీల్లో రక్షిత తాగునీరు ►జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►ఇళ్ల నిర్మాణం పూర్తయ్కేనాటికి అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా ధ్యాస పెట్టాలన్న సీఎం ►గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం. ►నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెరుగైన విధానం తీసుకురావాలన్న సీఎం ఈ సమీక్షా సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఎండీ పి సంపత్ కుమార్, సెర్ఫ్ సీఈఓ ఎండి ఇంతియాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ కమిషనర్ శాంతి ప్రియా పాండే ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
31లోగా వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తులు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో.. కొత్తగా పింఛన్లకు అర్హత ఉన్న వారు ఆగస్టు 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన వారంతా మీ–సేవ/ఈ–సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ పింఛన్లు పొందే అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వయసు నిర్ధారణకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు, పాఠశాల బదిలీ సర్టిఫికెట్లు, వయ సు నిర్ధారణ చేసే విద్యా సంస్థల సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తులో కులం, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచి పేరు తదితర వివరాలు ఇవ్వాలని పేర్కొంది. మీ–సేవ/ఈ–సేవ కేంద్రాల్లో ఈ దరఖాస్తులకు ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని ఈ–సేవ కేంద్ర కమిషనర్‌కు సూచించింది. కాగా, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు తగ్గించినందున, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 10.56 లక్షల మంది అభ్యర్ధులలో మంగళవారం నాటికి 6.99 లక్షల మంది తమ హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని పరీక్షల నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు పేర్కొన్నారు. మిగిలిన 3.57 లక్షల మంది తమ హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వెయిటేజీ కోసం 20వ తేదీలోగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. ప్రస్తుతం కాంట్రాక్టు లేదంటే ఔట్సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తూ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు వెయిటేజీ మార్కుల కోసం తమ శాఖాధిపతుల నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను çఈ నెల 20వ తేదీలోగా గ్రామ వార్డు సచివాలయ వెబ్ సైట్ అప్లోడ్ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
అరచేతిలో.. ఇక వ్యవసాయ సమాచారం
బెంగళూరు : ఏ కాలంలో ఎలాంటి పంటలు వేయాలి.. ఎలాంటి నేలల్లో ఏరకమైన ఎరువులు వాడాలి.. తదితర వివరాలన్నింటిని రైతన్నల అరచేతుల్లోకి తీసుకొచ్చింది బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంస్థ. బాగల్కోటె, బీజాపుర జిల్లాల్లోని ఎంపిక చేసిన 250 మంది ప్రగతిశీల రైతులకు ‘ఈ-కిసాన్’ పేరిట ఈ సంస్థ ట్యాబ్లెట్లను అందజేసింది. బాగల్కోటెలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వాహకులు ఎస్ఆర్ పాటిల్ ఈ ట్యాబ్లెట్లను రైతులకు అందజేశారు. వ్యవసాయానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని ఈ ట్యాబ్లెట్లలో నిక్షిప్తం చేసినట్లు ఐటీశాఖ మంత్రి ఎస్ఆర్ పాటిల్ వెల్లడించారు. ప్రయోజనాలేంటి.... వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు కావలసిన అన్ని సూచనలను ఈ ట్యాబ్లెట్లలో పొందుపరిచారు. ట్యాబ్లెట్, అందులో పొందుపరిచిన సాఫ్ట్‌వేర్‌తో కలిపి మొత్తం ఒక్కో ట్యాబ్లెట్‌కు రూ.15 వేలను వెచ్చించారు. ఈ ట్యాబ్లెట్లకు బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంస్థ నుంచే ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది. ఆరు నెలల పాటు రైతులకు పూర్తి ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనున్నారు. ఇక కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రైతులు సమాచారాన్ని పొందవచ్చు. ఇందులో సాధారణ పంటల సాగుతో పాటు ఉద్యాన పంటల సాగుకు కావలసిన సూచనలు, ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వచ్చిన నూతన పరికరాలు, రైతులకు ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలు కల్పిస్తోంది, ఏయే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి రైతు శిక్షణా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి తదితర అన్ని వివరాలను రైతులు పొందవచ్చు. ఇందుకు గాను రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంస్థ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక ఈ ట్యాబ్లెట్లకు 3జీ కవరేజీ సౌకర్యాన్ని సైతం బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంస్థ కల్పిస్తోంది.