సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటివరకు 13 లక్షల మంది మహిళలు ప్రతి నెలా తమ కుటుంబానికి స్థిరమైన ఆదాయాన్ని పొందేలా శాశ్వత జీవనోపాధులు కల్పించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వనుండగా ఇప్పటివరకు మూడు విడతల్లో లబ్ధిదారులకు రూ.14,129.11 కోట్లు అందచేసినట్లు చెప్పారు.
సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖతో పాటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాల అమలు తీరుపై సీఎం జగన్ సమీక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని మహిళలు ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధి కల్పనకు వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు. ‘చేయూత’ కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు.
లబ్ధిదారులు తొలివిడత డబ్బులు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమాలకు అనుసంధానం చేస్తే మహిళలకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందన్నారు. అవసరమైన వారికి అదనంగా బ్యాంకు రుణాలు ఇప్పించి స్వయం ఉపాధిని పెంపొందించే మార్గాలపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు జగనన్న తోడు పథకం ప్రయోజనాలను కూడా వర్తింప చేయాలని సూచించారు. పొదుపు సంఘాల మహిళలు ఉమ్మడిగా నెలకొల్పిన మహిళా మార్టులు సమర్థంగా పని చేస్తున్నాయని, ఇప్పటివరకు 36 మహిళా మార్టుల ద్వారా రూ.32.44 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మహిళా మార్టులో సగటున రోజుకు రూ. 20.62 లక్షల వ్యాపారం జరిగిందని వివరించారు.
- 10న ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’..
పొదుపు సంఘాల మహిళలకు వారి బ్యాంకు రుణాలకు సంబంధించి వైఎస్సార్ సున్నా వడ్డీని ఆగస్టు 10న మరో విడత అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. జూలై 26వ తేదీన జరగాల్సిన ఈ కార్యక్రమం ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తంలో రూ.19,178.17 కోట్లను వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నేరుగా వారి ఖాతాలకు గత మూడేళ్లలో ప్రభుత్వం జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు.
సకాలంలో రుణాలు చెల్లించే మహిళలకు ఇప్పటి వరకు వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.4,969.05 కోట్లు చెల్లించామన్నారు. బ్యాంకర్ల సమావేశంలో పలుమార్లు ఒత్తిడి తెచ్చి పొదుపు సంఘాల మహిళలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా చర్యలు చేపట్టామన్నారు. స్త్రీ నిధి ద్వారా ఇచ్చే రుణాలపై వడ్డీని 9 శాతానికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. మహిళల తరపున అధికారులే గట్టిగా మాట్లాడి వారికి తగిన ప్రయోజనం చేకూర్చాలని సూచించారు.
- పట్టణాల్లోనూ డిజిటల్ లైబ్రరీలు
గ్రామీణ ప్రాంతాల తరహాలోనే పట్టణాల్లోనూ వైఎస్సార్ డిజిటల్ లైబరీల నిర్మాణానికి స్థలాలను తొలుత గుర్తించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాల తీరును పరిశీలించిన అనంతరం సీఎం జగన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సచివాలయాల భవనాల నిర్మాణం దాదాపుగా కొలిక్కి వచ్చిందని, సెప్టెంబరు నాటికే అన్నింటినీ పూర్తి చేసేలా కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశిత గడువులోగా అన్ని భవనాల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ – జూలై మధ్య ఉపాధి హమీ ద్వారా 18.90 కోట్ల పనిదినాలు కల్పించిన నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాదిలో కనీసం 24 కోట్ల పనిదినాల తగ్గకుండా ఉపాధి కల్పన లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఉత్తమ పనితీరు కనపరిచిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావించారు.
- జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు
జగనన్న కాలనీలలో కనీస మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నందున మౌలిక సదుపాయాల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. కాలనీల్లో అపరిశుభ్రతకు తావు లేకుండా పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
- గ్రామ కంఠం ఇళ్లకు హక్కు పత్రాలు
వ్యవసాయ భూములకు సంబంధించి యజమానులకు పాస్ పుస్తకాల మాదిరిగా గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్ల యజమానులకు కూడా భూ హక్కు పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ కంఠం పరిధిలో రూ.లక్షల విలువ చేసే ఇళ్లు, ఇంటి స్థలాలున్నా అధికారిక పత్రాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా వారికి భూహక్కు పత్రాల జారీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. 10,943 గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్లతో సర్వే పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో భూహక్కు పత్రాలను ఇస్తున్నట్లు చెప్పారు.
వందేళ్ల తరువాత తొలిసారిగా మనం చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అత్యంత విశిష్టమైనదని సీఎం జగన్ పేర్కొన్నారు.ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యేకంగా ఒక సర్వేయర్‌ను నియమించడం వల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోందన్నారు. గ్రామ స్థాయిలో సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన ఘనత కేవలం మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఇతర శాఖాధికారులు సీఎం సమీక్షలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment