Livelihoods
-
నారీ శక్తికి 'చేయూత'
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటివరకు 13 లక్షల మంది మహిళలు ప్రతి నెలా తమ కుటుంబానికి స్థిరమైన ఆదాయాన్ని పొందేలా శాశ్వత జీవనోపాధులు కల్పించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వనుండగా ఇప్పటివరకు మూడు విడతల్లో లబ్ధిదారులకు రూ.14,129.11 కోట్లు అందచేసినట్లు చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖతో పాటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాల అమలు తీరుపై సీఎం జగన్ సమీక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని మహిళలు ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధి కల్పనకు వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు. ‘చేయూత’ కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. లబ్ధిదారులు తొలివిడత డబ్బులు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమాలకు అనుసంధానం చేస్తే మహిళలకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందన్నారు. అవసరమైన వారికి అదనంగా బ్యాంకు రుణాలు ఇప్పించి స్వయం ఉపాధిని పెంపొందించే మార్గాలపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు జగనన్న తోడు పథకం ప్రయోజనాలను కూడా వర్తింప చేయాలని సూచించారు. పొదుపు సంఘాల మహిళలు ఉమ్మడిగా నెలకొల్పిన మహిళా మార్టులు సమర్థంగా పని చేస్తున్నాయని, ఇప్పటివరకు 36 మహిళా మార్టుల ద్వారా రూ.32.44 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మహిళా మార్టులో సగటున రోజుకు రూ. 20.62 లక్షల వ్యాపారం జరిగిందని వివరించారు. 10న ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’.. పొదుపు సంఘాల మహిళలకు వారి బ్యాంకు రుణాలకు సంబంధించి వైఎస్సార్ సున్నా వడ్డీని ఆగస్టు 10న మరో విడత అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. జూలై 26వ తేదీన జరగాల్సిన ఈ కార్యక్రమం ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తంలో రూ.19,178.17 కోట్లను వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నేరుగా వారి ఖాతాలకు గత మూడేళ్లలో ప్రభుత్వం జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు. సకాలంలో రుణాలు చెల్లించే మహిళలకు ఇప్పటి వరకు వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.4,969.05 కోట్లు చెల్లించామన్నారు. బ్యాంకర్ల సమావేశంలో పలుమార్లు ఒత్తిడి తెచ్చి పొదుపు సంఘాల మహిళలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా చర్యలు చేపట్టామన్నారు. స్త్రీ నిధి ద్వారా ఇచ్చే రుణాలపై వడ్డీని 9 శాతానికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. మహిళల తరపున అధికారులే గట్టిగా మాట్లాడి వారికి తగిన ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. పట్టణాల్లోనూ డిజిటల్ లైబ్రరీలు గ్రామీణ ప్రాంతాల తరహాలోనే పట్టణాల్లోనూ వైఎస్సార్ డిజిటల్ లైబరీల నిర్మాణానికి స్థలాలను తొలుత గుర్తించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాల తీరును పరిశీలించిన అనంతరం సీఎం జగన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సచివాలయాల భవనాల నిర్మాణం దాదాపుగా కొలిక్కి వచ్చిందని, సెప్టెంబరు నాటికే అన్నింటినీ పూర్తి చేసేలా కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశిత గడువులోగా అన్ని భవనాల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ – జూలై మధ్య ఉపాధి హమీ ద్వారా 18.90 కోట్ల పనిదినాలు కల్పించిన నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాదిలో కనీసం 24 కోట్ల పనిదినాల తగ్గకుండా ఉపాధి కల్పన లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఉత్తమ పనితీరు కనపరిచిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావించారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు జగనన్న కాలనీలలో కనీస మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నందున మౌలిక సదుపాయాల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. కాలనీల్లో అపరిశుభ్రతకు తావు లేకుండా పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామ కంఠం ఇళ్లకు హక్కు పత్రాలు వ్యవసాయ భూములకు సంబంధించి యజమానులకు పాస్ పుస్తకాల మాదిరిగా గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్ల యజమానులకు కూడా భూ హక్కు పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ కంఠం పరిధిలో రూ.లక్షల విలువ చేసే ఇళ్లు, ఇంటి స్థలాలున్నా అధికారిక పత్రాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా వారికి భూహక్కు పత్రాల జారీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. 10,943 గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్లతో సర్వే పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో భూహక్కు పత్రాలను ఇస్తున్నట్లు చెప్పారు. వందేళ్ల తరువాత తొలిసారిగా మనం చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అత్యంత విశిష్టమైనదని సీఎం జగన్ పేర్కొన్నారు.ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యేకంగా ఒక సర్వేయర్‌ను నియమించడం వల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోందన్నారు. గ్రామ స్థాయిలో సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన ఘనత కేవలం మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఇతర శాఖాధికారులు సీఎం సమీక్షలో పాల్గొన్నారు. -
హాయిగా ఊళ్లోనే ఉపాధి... ఇక ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా...
కూలీలకు ఉన్న ఊళ్లోనే ఉపాధి పనులను ప్రభుత్వం కల్పిస్తోంది. తద్వారా పొట్ట చేతపట్టుకుని నగరాలకు వలస వెళ్లే బాధ తప్పింది. మండు వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళల్లో మాత్రమే పని చేసేలా వెసులుబాటు కల్పించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూలీల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఉపాధి కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అధికార యంత్రాంగం నిర్విరామ కృషి ఫలితంగా ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. పారదర్శకంగా పనులు చేపడుతూ కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్థానం దక్కడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరిగిన పనులు, లబ్ధిదారులకు అందుతున్న నగదుపై నిర్వహించిన సోషల్ ఆడిట్లో ఏపీ పనితీరును కేంద్రం ప్రశంసించింది. కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పథకాన్ని క్షేత్రస్థాయిలో ఈ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లోని 31 మండలాల్లో ఉపాధి హామీ పనులు పక్కాగా సాగుతున్నాయి. మూడేళ్లలో 5.5 లక్షల పనిదినాలు జిల్లా వ్యాప్తంగా 1,50,682 కుటుంబాల నుంచి 74,059 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. 2019 ప్రారంభం నుంచి ఈ ఏడాది జూన్ 10 వరకు 5,43,81,511 పనిదినాలను కల్పించారు. ఇందుకు గాను రూ.1971.31 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 2021–22లో 20,393 కుటుంబాలు 100 రోజులపాటు పనులకు హాజరయ్యారు. ఇక 2022–23 ఏడాది ఏప్రిల్ వరకు 13.19 శాతం వరకు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కూలీలకు రోజువారి వేతనం సగటున రూ.251 అందుతోంది. ఉపాధి పనుల్లో జాబ్‌కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఆశయం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్నా వారికి కనీసం వంద పనిదినాలు కల్పిస్తారు. పల్లెల్లో పచ్చదనం ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచే పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు నాటేందుకు గోతులు తీయటం నుంచి మొక్కలు నాటి వాటి సంరక్షణ వరకు అన్నీ కూలీలే పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల చాలా గ్రామాల్లో పచ్చదనం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక పనిచేసిన వెంటనే కూలీలకు సకాలంలో వేతనాలను చెల్లిస్తున్నారు. మెరుగైన వసతులు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మెరుగైన వసతులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో నీడ, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. కలెక్టర్ హరి నారాయణన్ క్షేత్రస్థాయిలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ పనుల్లో పారదర్శకతను అమలు చేస్తున్నారు. పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పిస్తున్నారు. వారి జీవనోపాధికి తోడ్పాటునందిస్తున్నారు. ఆదుకున్న ఉపాధి ఎండలు మండిపోతున్నాయి. పనులు చేయలేకపోతున్నాము. ఇదే సమయంలో ఉపాధి పనులు కల్పించడంతో పట్టణాలకు వలస వెళ్లాల్సిన బాధ తప్పిపోయింది. ప్రభుత్వం ఉదయం 10 గంటల్లోపే పనులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అనంతరం పశుపోషణతో మెరుగైన జీవనం సాగిస్తున్నాం. –కుప్పయ్య, గొల్లపల్లె యాదమరి మండలం రోజుకు రూ.250 పనులు లేని కాలంలోనే రోజుకు రూ.250 సంపాదించుకునే ఉపాధిని ప్రభుత్వం కల్పించింది. నిత్యం పట్టణానికి వెళ్లే అవస్థ తప్పింది. ఇంటి దగ్గర పశువులను చూసుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నాను. ఉపాధి పనుల వల్ల కూలీ వస్తోంది. మిగిలిన సమయంలో సొంతపనులూ చేసుకుంటున్నాం. – నాగమ్మ, విజయపురం పని కల్పించటమే ధ్యేయం జిల్లా వ్యాప్తంగా అడిగిన వారందరికీ పని కల్పించేలా చర్యలు చేపట్టాము. ఉపాధి పనుల్లో జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం. అడిగిన వారికి జాబ్‌కార్డులను ఇస్తున్నాము. వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలకు వసతులు కల్పిస్తున్నాము. – హరి నారాయణన్, కలెక్టర్, చిత్తూరు జిల్లా (చదవండి: పవన్ కల్యాణ్ జనసేన జనం కోసమా.. చంద్రబాబు కోసమా..?) -
దర్జా కోల్పోతున్న దర్జీలు
జైనూర్ : ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుడుతున్న దర్జీలు చాలీచాలని కూలితో కష్టాలు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూర్ ఊటీడీఏ పరిధిలోని జైనూర్, సిర్పూర్(యు), కెరమెరి మండలాల్లో 15 ఆశ్రమ పాటశాలలకు జైనూర్లోని స్త్రీ శక్తి భవనంలో సుమారు 50 మంది దర్జీలు ఏకరూప దుస్తులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కో డ్రెస్‌కు రూ.40 మాత్రమే.. ఏకరూప దుస్తులకు ప్రభుత్వం ఒక డ్రెస్‌కు రూ.40 మాత్రమే చెల్లిస్తోంది. ఇవి ఎటూ చాలడం లేదని దర్జీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బిల్లులు కూడా వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. ఒక్కోసారి సంవత్సరం గడిచినా బిల్లులు రాని సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే పని రాకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు. మొత్తం 20 వేల దుస్తులు.. ప్రతీ సంవత్సరం సుమారు 5000 మంది పిల్లలకు ఒక్కొక్కరికీ 4 చొప్పున మొత్తం 20 వేల దుస్తులు తయారు చేస్తామని వారు తెలుపుతున్నారు. ఆ పని కూడా కేవలం ఐదు నెలలు మాత్రమే దొరుకుతుందని చెబుతున్నారు. మిగతా సమయంలో కాలీగా ఉంటున్నామని కనీసం ప్రభుత్వం ఒక్కో డ్రెస్సుకు రూ.200 చెల్లిస్తే కుటుంబ పోషన భారం కాకుండా ఉంటుందని వారు కోరుతున్నారు. బట్ట సరఫరాలో జాప్యం ప్రతీ ఏడాది జూన్ రెండో వారంలో పాఠశాలలు ప్రారంభమవుతాయి. పాఠశాలలు ప్రారంభం నుంచే పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేద్దామనే ఆలోచన ఏ అధికారికి రావడం లేదు. జూన్‌లో దుస్తులు పంపిణీ చేయాల్సి ఉన్నా నవంబర్, డిసెంబర్ నెలల్లో దుస్తులు కుట్టడానికి బట్టను సరఫరా చేస్తున్నారు. వీటిని కుట్టడానికి మళ్లీ మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. దుస్తులు అందేలోపు పాఠశాలలకు సెలవులు వస్తాయి. దీంతో పిల్లలు పాఠశాలల నిర్వహన ఉన్న అన్ని రోజులు సొంత దుస్తులే ధరిస్తున్నారు. అధికారులు స్పందించి వేసవిలోనే దర్జీలకు బట్టలు కుట్టడానికి బట్ట సరఫరా చేస్తే పిల్లలకు జూన్‌లోనే దుస్తులు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పిల్లలు కూడా ఏకరూప దుస్తులో కనిపిస్తారు. వేసవిలో పని తక్కువ మాకు వేసవి కాలంలో పని చాలా తక్కువగా ఉంటుంది. ఎండా కాలంలో అయితే ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. – యమునాబాయి మా కష్టాన్ని చూడాలి మేము చేసే పనిని చుసి ప్రభుత్వం కనీసం ఒక్కో డ్రెస్సులకు రూ.200 చెల్లించాలి. అప్పుడే మా కుటుంబ పోషన సజావుగా సాగుతుంది. – భీమన్న బట్ట సరఫరా చేయాలి పిల్లలకు జూన్‌లోనే ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలి. అలా చేయాలంటే ప్రభుత్వం మార్చి గాని ఏప్రిల్‌లో గాని బట్ట సరఫరా చేయాలి. – శంకర్ -
జీవనభృతి కోసం రోడ్డెక్కిన బీడీ కార్మికులు
- అందరికీ ‘భృతి చెల్లించాలంటూ చేగుంట-మెదక్ రహదారిపై రాస్తారోకో ఎంపీపీ కార్యాలయం ముట్టడిచిన్నశంకరంపేట: బీడీ కార్మికులందరికీ జీవనభృతిని చెల్లించాలంటూ వివిధ గ్రామాలకు చెందిన బీడీ కార్మికులు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సోమవారం రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఉదయం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీడీకార్మికులు చిన్నశంకరంపేట బస్‌స్టాండ్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. వందలాది మంది బీడీ కార్మికులు రోడ్డుపై బైఠాయించడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు బీడీ కార్మికులు మాట్లాడుతూ ఎన్నికల ముందు బీడీ కార్మికులందరికి జీవనభృతిని అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కొందరికే భృతి మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందించాలని డిమాండ్ చేశారు. గంటకు పైగా రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు వారిని సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం కార్మికులు ర్యాలీగా బయలుదేరి ఎంపీపీ కార్యాలయం ముట్టడించారు. అందరికీ జీవనభృతి అందించాలని కోరుతూ ఈఓపీఆర్డీ కోటిలింగానికి వినతి పత్రం అం దజేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్ కార్యాలయానికి వచ్చి తహశీల్దార్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పోతరాజ్ రమణ, డీసీసీ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీమన్‌రెడ్డి, జాలసాయిబాబా,కృష్ణాగౌడ్,కిష్టయ్య,మండల నాయకులు సత్యనారాయణగౌడ్,శివకుమార్, యాదగిరి, భరత్, గొండస్వామి,రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.