జైనూర్ : ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుడుతున్న దర్జీలు చాలీచాలని కూలితో కష్టాలు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూర్ ఊటీడీఏ పరిధిలోని జైనూర్, సిర్పూర్(యు), కెరమెరి మండలాల్లో 15 ఆశ్రమ పాటశాలలకు జైనూర్‌లోని స్త్రీ శక్తి భవనంలో సుమారు 50 మంది దర్జీలు ఏకరూప దుస్తులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు.
ఒక్కో డ్రెస్‌కు రూ.40 మాత్రమే..
ఏకరూప దుస్తులకు ప్రభుత్వం ఒక డ్రెస్‌కు రూ.40 మాత్రమే చెల్లిస్తోంది. ఇవి ఎటూ చాలడం లేదని దర్జీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బిల్లులు కూడా వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. ఒక్కోసారి సంవత్సరం గడిచినా బిల్లులు రాని సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే పని రాకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు.
మొత్తం 20 వేల దుస్తులు..
ప్రతీ సంవత్సరం సుమారు 5000 మంది పిల్లలకు ఒక్కొక్కరికీ 4 చొప్పున మొత్తం 20 వేల దుస్తులు తయారు చేస్తామని వారు తెలుపుతున్నారు. ఆ పని కూడా కేవలం ఐదు నెలలు మాత్రమే దొరుకుతుందని చెబుతున్నారు. మిగతా సమయంలో కాలీగా ఉంటున్నామని కనీసం ప్రభుత్వం ఒక్కో డ్రెస్సుకు రూ.200 చెల్లిస్తే కుటుంబ పోషన భారం కాకుండా ఉంటుందని వారు కోరుతున్నారు.
బట్ట సరఫరాలో జాప్యం
ప్రతీ ఏడాది జూన్ రెండో వారంలో పాఠశాలలు ప్రారంభమవుతాయి. పాఠశాలలు ప్రారంభం నుంచే పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేద్దామనే ఆలోచన ఏ అధికారికి రావడం లేదు. జూన్‌లో దుస్తులు పంపిణీ చేయాల్సి ఉన్నా నవంబర్, డిసెంబర్ నెలల్లో దుస్తులు కుట్టడానికి బట్టను సరఫరా చేస్తున్నారు. వీటిని కుట్టడానికి మళ్లీ మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. దుస్తులు అందేలోపు పాఠశాలలకు సెలవులు వస్తాయి. దీంతో పిల్లలు పాఠశాలల నిర్వహన ఉన్న అన్ని రోజులు సొంత దుస్తులే ధరిస్తున్నారు. అధికారులు స్పందించి వేసవిలోనే దర్జీలకు బట్టలు కుట్టడానికి బట్ట సరఫరా చేస్తే పిల్లలకు జూన్‌లోనే దుస్తులు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పిల్లలు కూడా ఏకరూప దుస్తులో కనిపిస్తారు.
వేసవిలో పని తక్కువ
మాకు వేసవి కాలంలో పని చాలా తక్కువగా ఉంటుంది. ఎండా కాలంలో అయితే ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది.
– యమునాబాయి
మా కష్టాన్ని చూడాలి
మేము చేసే పనిని చుసి ప్రభుత్వం కనీసం ఒక్కో డ్రెస్సులకు రూ.200 చెల్లించాలి. అప్పుడే మా కుటుంబ పోషన సజావుగా సాగుతుంది.
– భీమన్న
బట్ట సరఫరా చేయాలి
పిల్లలకు జూన్‌లోనే ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలి. అలా చేయాలంటే ప్రభుత్వం మార్చి గాని ఏప్రిల్‌లో గాని బట్ట సరఫరా చేయాలి.
– శంకర్
Comments
Please login to add a commentAdd a comment