శ్రీవారికి కొప్పెర కష్టాలు
► కొప్పెరకు కొత్త వస్త్రాల్లేవ్!
సాక్షి, తిరుమల: భక్తుల కొండంత కోరికలను నెరవేర్చే కోనేటిరాయుడికి కొప్పెర కష్టం వచ్చింది. భక్తులు కానుకలు సమర్పించుకునేందుకు కొప్పెర వస్త్రాలు కుట్టే దర్జీ కరువైపోయాడు. ఉద్యోగ విరమణ చేసిన దర్జీ స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో కొప్పెర వస్త్రాలు కుట్టే పని అర్ధంతరంగా నిలిచిపోయింది.
అపర కుబేరుడికి దర్జీ కరువే
కొప్పెర ద్వారా భక్తుల నుంచి కానుకలు అందుకునే తిరుమలేశుడికే దర్జీ కరువైపోవడం సంబంధిత అధికారుల పనితీరుకు దర్పణం పడుతోంది. తిరుమల ఆలయ కొప్పెర(హుండీ) కోసం వాడే కేస్మెట్ వస్త్రాన్ని కుట్టేందుకు గతంలో ప్రత్యేకంగా అనుభవం గడించిన దర్జీ ఉండేవారు. ఐదారేళ్ల క్రితం ఆయన ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొంతకాలంగా టీటీడీ ఆరోగ్య శాఖలోని ఓ మల్టిపుల్ వర్కర్(అవసరాన్ని బట్టి ఏ విభాగానికైనా వినియోగించుకునే టీటీడీ ఉద్యోగి) చేత ఈ దర్జీ పనిచేయించారు. రోజువారీ విధుల్లో భాగంగా ఆ దర్జీ తిరుమల ఆలయానికి అవసరమైన కొప్పెర వస్త్రాలను కుట్టి ఇచ్చేవారు. ఆయన కూడా రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశారు.
కానీ, ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో కొప్పెరతయారు చేసేందుకు మార్కెటింగ్ విభాగం కొనుగోలు చేసిన వస్త్రాలు సంబంధిత కార్యాలయంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. దర్జీలేని కారణంగా ఆలయంలో కొప్పెరకు కొత్త వస్త్రాల కొరత ఏర్పడింది. ఆలయ నిబంధనల ప్రకారం ఒకసారి గంగాళం లేదా పాత్రకు కట్టిన వస్త్రాన్ని మరోసారి వాడకూడదు. దర్జీ లేకపోవడంతో ఒకసారి ఉపయోగించిన వస్త్రాలనే మళ్లీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఆలయ అధికారులు ధ్రువీకరించడం లేదు. తమ వద్ద స్టాకు ఉందని, అవసరమైతే తెప్పించుకుంటామని చెబుతున్నారు.
కొప్పెర కొలతలేమిటి?
హుండీ ఎత్తు తొమ్మిది అడుగులు, వెడల్పు మూడు అడుగులు. మూడు అడుగుల ఎత్తు కలిగిన రాగి గంగాళాన్ని నేల నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో సిద్ధం చేసిన దళసరి కేస్మెట్ వస్త్రంలో ఉంచి హుండీ రూపొందిస్తారు. భక్తులు చేయి ఎత్తి కానుకలు వేస్తే అవి సరిగ్గా రాగి గంగాళంలో పడే విధంగా నాలుగు వైపులా ఆంగ్ల అక్షరం ‘వి’ ఆకారంలో రంధ్రాలు వేస్తారు. హుండీ మధ్యలో చుట్టిన తాడుపై ఏడు టీటీడీ సీళ్లు, మరో ఆరు జీయంగార్ సీళ్లు వేస్తారు. మూడు అడుగుల ఎత్తు కలిగిన రాగి గంగాళంతోపాటు మరో రెండు అడుగుల వరకు కానుకలు నిండాక, ఆ హుండీ పైకప్పు తాళ్లను విప్పి సీలు వేసి పరకామణికి తరలిస్తారు. తర్వాత అదే స్థానంలో కొత్త హుండీని ఏర్పాటు చేస్తారు.
కరెన్సీ నోట్లు, బంగారం, వెండి, విలువైన రాళ్లు
హుండీ ద్వారా నగదు కానుకల్లో చిల్లర నాణేల నుంచి అన్ని రకాల కరెన్సీ నోట్ల రూపంలో ఏడాదికి సుమారు రూ.వెయ్యి కోట్లు, 1,000 నుంచి 1,500 కిలోల బంగారం, 2,000 కిలోల వెండి, వజ్రాలు, కెంపులు, పచ్చలు, గోమేధికాలు, ఇతర విలువైన రంగురాళ్లు అందుతున్నాయి.
పదవీ విరమణ చేసిన దర్జీతో కుట్టిస్తాం
‘‘హుండీ వస్త్రాలు కుట్టే దర్జీ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఔట్సోర్సింగ్ కింద ఒకరిని తీసుకునేందుకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. హుండీ వస్త్రాలను కుట్టి కొరత లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైతే ఉద్యోగ విరమణ చేసిన దర్జీనే కాంట్రాక్ట్ విధానం కింద కొనసాగిస్తాం’’ అని అధికారులు చెప్పారు.
కొప్పెర (హుండీ) అంటే?
భక్తులు కానుకలు వేసే పాత్ర లేదా రాగి గంగాళాన్ని కొప్పెర(హుండీ) అంటారు. చెన్నైలోని ఆర్కియాలజీ విభాగం నుంచి సేకరించిన ఆధారాల ప్రకారం క్రీ.శ.17 శతాబ్దం ముందు నుంచే తిరుమల ఆలయంలో ఈ కొప్పెర ఉన్నట్లు తేల్చారు. టీటీడీ వద్ద అప్పటి నుంచి హుండీ లెక్కలున్నాయి. అయితే, ఈస్టిండియా కంపెనీ పాలన కాలంలో 1821 జూలై 25న కొప్పెర (హుండీ)ని ఏర్పాటు చేశారని ఆలయ పరిపాలనా విధానాలను నిర్దేశించే చట్టం బ్రూస్కోడ్-12 ఆధారం కూడా ఉంది. అప్పట్లో ఆలయ పోషణకు హుండీ తప్ప మరొక ప్రధాన ఆదాయ మార్గం ఉండేది కాదు. కొప్పెరను తిరుమల ఆలయంలోని తిరుమామణి మండపం (ఘంటా మండపం)కు ఉత్తర పార్శ్వంలో నాలుగు రాతి స్తంభాల నడుమ ఏర్పాటు చేశారు.
ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్యులవారు ‘శ్రీచక్రం’ ప్రతిష్టించారని.. అందువల్లే అంతులేని ధన, కనక, వస్తు, ద్రవ్య కానుకలతో స్వామివారి హుండీ నిండుతోందని భక్తుల విశ్వాసం. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా హుండీ స్థలం ఎత్తు పెంచేందుకు అక్కడి నేలను తవ్వినప్పుడు కొందరు శ్రీచక్రాన్ని ప్రత్యక్షంగా దర్శించారని టీటీడీ రికార్డుల్లో పొందుపరిచారు. దీన్ని ఆలయ జీయంగార్లు, అర్చకులు, అధికారులు, చరిత్రకారులు కూడా విశ్వసిస్తున్నారు. అందువల్లే ఆలయంలో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా హుండీ స్థలాన్ని మాత్రం అంగుళం కూడా మార్చలేదు.