ఆంధ్రప్రదేశ్‌లో పథకాల అమలుపై కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసలు | Central Committee of Experts commends implementation of schemes | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: పథకాల అమలుపై కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసలు

Published Thu, Feb 24 2022 3:41 AM | Last Updated on Thu, Feb 24 2022 3:23 PM

Central Committee of Experts commends implementation of schemes - Sakshi

రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో వందకు వంద శాతం సమర్థంగా అమలవుతున్నాయని కేంద్ర నిపుణుల కమిటీ బృందం ప్రశంసించింది. గత నాలుగు రోజులుగా శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమైంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ ముద్ర అట్టడుగు స్థాయిలో సైతం చాలా స్పష్టంగా కనిపించిందని కేంద్ర బృందం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్న పథకాలతో పేదలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని, దేశవ్యాప్తంగా ఈ విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ప్రకటించింది. 

దేశ వ్యాప్తంగా అధ్యయనానికి కమిటీ
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  దేశవ్యాప్తంగా అమలవుతున్న దాదాపు పది రకాల పథకాలను రాష్ట్రాల వారీగా పరిశీలించడంతో పాటు మార్పు చేర్పులపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించారు. పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అరుణాశర్మ, తమిళనాడు రిటైర్డ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రంజన్‌ నేతృత్వంలో వివిధ రంగాల నిపుణులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కామన్‌ రివ్యూ మిషన్‌ పేరుతో కమిటీ ఏర్పాటైంది. ఏపీలో పథకాల అమలు తీరు పరిశీలనకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ అశోక్‌ పంకజ్, నీతి అయోగ్‌ నియమించిన వందనా శర్మ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీ పీఆర్‌) కమిటీ సభ్యుడు ఏ.సింహాచలం, సివిల్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు ఎంకే గుప్తాలతో కూడిన బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించింది. బృందం సభ్యులు ఇద్దరు చొప్పున ఈ నెల 19 నుంచి 22 వరకు జిల్లాలో పర్యటించారు. 
రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు   

డీబీటీ కంటే మెరుగ్గా ఏపీలో పింఛన్ల పంపిణీ..
వలంటీర్ల ద్వారా ప్రతి నెలా మొదటి తేదీనే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించిన కేంద్ర నిపుణుల కమిటీ అభినందనలు తెలియచేసింది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని అయితే డీబీటీ కంటే మరింత మెరుగ్గా ఏపీలో లబ్ధిదారుల ఇంటి వద్దే బయోమెట్రిక్‌ లేదా ఐరిస్‌ తీసుకొని నేరుగా డబ్బులు అందజేయడం ప్రశంసనీయమన్నారు. దీనివల్ల పెద్ద వయసు వారు, అనారోగ్య బాధితులు ప్రతి నెలా బ్యాంకు దాకా వెళ్లాల్సిన అవసరం తొలగిపోయిందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న డీబీటీ విధానంలో ఎవరైనా లబ్ధిదారులు మరణించిన తరువాత కూడా సంబంధిత బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడం, ఏటీఎం కార్డులతో ఇతరులు డ్రా చేసుకోవడం లాంటి వాటికి ఆస్కారం ఉందన్నారు. ఇలాంటి వాటికి తావులేకుండా పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల చేతికే డబ్బులు అందించడం వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా టంచన్‌గా మొదటి తారీఖునే పింఛన్ల పంపిణీ చేస్తున్న తీరు గురించి పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ అహ్మద్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. 

శాశ్వత భవనాలతో గ్రామాలకు కొత్త రూపు
ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధులతో గ్రామ సచివాలయాల భవనాలు సహా పలు నిర్మాణాలను చేపట్టడం వల్ల ప్రతి గ్రామానికి శాశ్వతంగా ఆస్తులు కల్పిస్తున్నారని కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రతి పల్లెలో సామాజిక సంపదగా కొత్తగా నిర్మితమవుతున్న భవనాలు గ్రామాల రూపురేఖలు మార్చేస్తున్నాయని, ఇది దేశానికే ఆదర్శనీయమని ప్రశంసించారు. పలు రకాల సేవలను గ్రామాల్లోనే ప్రజల ముంగిటికే అందుబాటులోకి తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్థను దేశమంతా ప్రవేశ పెట్టాలని తమ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేస్తుందని వెల్లడించారు. ఉపాధి హామీ నిధులతో రోడ్లకు ఇరువైపులా నాటే మొక్కలలో అధిక శాతం పచ్చగా కళకళలాడుతున్నాయని కమిటీ సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు– నేడు ద్వారా జరిగిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తాము  స్వయంగా పరిశీలించామని చెప్పారు. 

ఏజన్సీలో 150 రోజులకు ‘ఉపాధి’
గిరిజన ప్రాంతాలతో పాటు కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులకు బదులుగా 150 రోజుల పాటు పేదలకు పనులు కల్పించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ నిఫుణుల కమిటీని కోరారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కూలీలకు వేసవి కాలంలో తక్కువ మొత్తంలో పనిచేసినా కొంత అదనంగా కూలీ డబ్బులు ఇచ్చే విధానం అమలులో ఉండేదని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఇప్పుడు ఆ అవకాశం లేదన్నారు. తిరిగి గత విధానం అమలుకు వీలుగా సిఫార్సు చేయాలని కోరారు. కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన అరకు, పాడేరులో ఉపాధి హామీ పథకం ద్వారా తోటల పెంపకానికి అనుమతిచ్చేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

గిరిజన గూడేలకు రోడ్లు
పీఎంజీఎస్‌వై పథకం ద్వారా ప్రస్తుతం కనీసం 250 మంది జనాభా ఉండే గ్రామాలకు మాత్రమే కొత్తగా రోడ్ల నిర్మాణానికి అవకాశం ఉందని, గిరిజన ప్రాంతాల్లో 50–100 మంది నివసించే గూడేలకు కూడా పథకం ద్వారా రహదారుల నిర్మాణానికి అనుమతించేలా నిబంధనల సవరణకు సిఫారసు చేయాలని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఈఎన్‌సీ సుబ్బారెడ్డి కోరారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన నేపధ్యంలో గృహ నిర్మాణానికి వీలుగా అదనంగా నిధులు కేటాయించేలా కృషి చేయాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భరత్‌ గుప్తా కోరారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సంచాలకులు పి.చినతాతయ్య, జాయింట్‌ కమిషనర్‌ ఏ.కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement