Central Expert Committee
-
Andhra Pradesh: ‘సంఘ’టితంగా.. కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొదుపు సంఘాలు ఆర్థిక ప్రగతితో కాంతులీనుతున్నాయని, మహిళల ఆధ్వర్యంలో పలు వ్యాపారాల నిర్వహణ అద్భుతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో పొదుపు సంఘాల మహిళలు నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వివిధ వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదిగారని కమిటీ నివేదికలో ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది ప్రాధాన్యత రంగాలను గుర్తించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధంగా అమలు చేస్తోందని అభినందించింది. ఆరోగ్యం (ఆరోగ్యశ్రీ), విద్య (అమ్మ ఒడి), విద్య (ఫీజు రీయింబర్స్మెంట్), గృహ నిర్మాణం (పేదలందరికీ ఇళ్లు), జీవనోపాధి (వైఎస్సార్ చేయూత – వైఎస్సార్ ఆసరా), సంక్షేమం (పెన్షన్ల పెంపు), వ్యవసాయం (వైఎస్సార్ రైతు భరోసా), సాగునీరు (జలయజ్ఞం), మద్య నియంత్రణను ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి అమలు చేస్తూ కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటోందని తెలిపింది. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున టెక్నాలజీని వినియోగిస్తోందని కమిటీ పేర్కొంది. కాగా గత సర్కారు హయాంలో డ్వాక్రా రుణమాఫీ అందక డిఫాల్టర్లుగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోయిన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆదుకున్న విషయం తెలిసిందే. ఎన్పీఏలుగా మారిన డ్వాక్రా సంఘాలు దీంతో పునరుజ్జీవమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న 14 పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర రిటైర్డ్ కార్యదర్శితో పాటు తమిళనాడు రిటైర్డ్ సీఎస్ల నేతృత్వంలో వివిధ రంగాలకు చెందిన 32 మంది నిపుణులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 6వ కామన్ మిషన్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో కమిటీ పర్యటించింది. ఫిబ్రవరి 17 – 27 తేదీల మధ్య నలుగురు ప్రతినిధులతో కూడిన బృందం శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలోని 23 గ్రామ పంచాయతీలను సందర్శించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో స్వయంగా పరిశీలించిన అంశాలను విశ్లేషిస్తూ కమిటీ నివేదికను రూపొందించింది. అందులో ముఖ్యాంశాలు ఇవీ. శ్రీకాకుళం జిల్లాలో కంప్యూటర్ శిక్షణ ల్యాబ్‌ను పరిశీలిస్తున్న కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు ఆత్మవిశ్వాసం.. టెక్నాలజీ వినియోగం రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల నిర్మాణం దాదాపు సంతృప్త స్థాయిలో ఉంది. అపార సామాజిక మూలధన రూపంలో సభ్యులు ఆత్మ విశ్వాసంతో, శక్తివంతంగా ఉన్నారు. రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించడంతో పాటు సంక్షోభంలో పరస్పరం సాయం చేసుకుంటున్నారు. సంఘాల కార్యకలాపాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. హాజరు నమోదుతో పాటు రుణ వివరాల లాంటి రికార్డుల కోసం మొబైల్ అప్లికేషన్ సేవలను వినియోగించుకుంటున్నారు. ► రాష్ట్రంలో పొదుపు సంఘాలు కిరాణా, బ్యూటీ పార్లర్, కలంకారీ, చెక్క క్రాఫ్టింగ్, చీపుర్ల తయారీ, వివాహ వస్తువుల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పూల పెంపకం, వ్యవసాయం, పశువులు, మిల్లెట్స్ ఉత్పత్తి, చిన్న వ్యాపారాలు, ఉద్యానవనాలు లాంటి వివిధ రకాల జీవనోపాధి కార్యకలాపాలలో నిమగ్నమయ్యాయి. సేంద్రీయ వ్యవసాయంలోనూ.. పొదుపు సంఘాలు సభ్యులు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు రుణాలు తీసుకుని వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. టైలరింగ్, కొవ్వొత్తుల తయారీ, స్వీట్ షాప్ లాంటి వ్యాపారాలను చేస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల రికవరీ రేటు నూటికి నూరు శాతంగా ఉంది. సాధికారత, ఆర్థిక నిర్వహణలో బాగా ప్రావీణ్యం ఉంది. పొదుపు సంఘాలు సేంద్రీయ వ్యవసాయంతో పాటు న్యూట్రి గార్డెన్స్‌లో కూడా పాల్గొంటున్నాయి. మెరుగైన ఆదాయం.. పొదుపు సంఘాల సభ్యులు మెరుగైన ఆదాయ స్థాయి కలిగి ఉన్నారు. ఉదాహరణకు పొదుపు సంఘంలోని ఓ సభ్యురాలు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ పొంది రుణం తీసుకుని టైలరింగ్ దుకాణాన్ని ప్రారంభించింది. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పొదుపు సంఘాల ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సెర్ప్ ద్వారా సంఘాలకు తగిన మద్దతు ఇస్తుండటంతో గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలు శక్తివంతంగా ఉన్నాయి. సంఘాల సభ్యులకు గ్రామీణాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల పట్ల పూర్తి అవగాహన ఉంది. ► పొదుపు సంఘాలు సామాజిక చైతన్య కార్యక్రమాల్లో విస్తృతంగా పాలు పంచుకుంటున్నాయి. పల్స్ పోలియో, కోవిడ్ వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఉపాధి, మౌలికం.. భేష్ రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన బాగుందని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొంది. వైవిధ్యమైన సామాజిక సంపదను సృష్టించినట్లు క్షేత్రస్థాయి సందర్శనలో గుర్తించామని తెలిపింది. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని ప్రశంసించింది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ భవనాలు, గ్రామ సచివాలయాల భవనాలు, ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు లాంటి వాటిపై దృష్టి పెట్టి సామాజిక సంపద సృష్టించటాన్ని ప్రస్తావించింది. ‘నేషనల్ రూర్బన్ మిషన్’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభావవంతంగా నిర్వహిస్తోందని తెలిపింది. 70 శాతం డిపార్ట్మెంట్ నిధులతో పాటు 30 శాతం క్రిటికల్ గ్యాప్ నిధులను ఏకీకృతం చేసి వాటర్ ట్యాంక్‌లు, అంగన్వాడీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, కాలేజీ భవనాల నిర్మాణం తదితరాలను నిర్దేశిత ప్రణాళికతో అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ► సాధారణంగా ఉపాధి హామీ కింద జాబ్ కార్డులను డిమాండ్ ఆధారంగా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను నియమించిన తరువాత గ్రామ పంచాయతీ స్థాయిలోనే జాబ్ కార్డులను ఇస్తున్నారు. గతంలో బ్లాక్ స్థాయిలో ఇచ్చేవారు. ఇప్పుడు జాబ్ కార్డుల మంజూరు గణనీయంగా మెరుగుపడింది. ► కోవిడ్, లాక్డౌన్ సమయంలో ముందుగానే జాబ్ కార్డులను జారీ చేశారు. ముఖ్యంగా వలస కూలీలు తిరిగి రాగానే జాబ్ కార్డులిచ్చారు. లబ్ధిదారుల ఫొటోలతో సహా జాబ్ కార్డులను జారీ చేశారు. ► రాష్ట్రంలో ఉపాధి హామీకి సంబంధించి ప్రతి పని వివరాలు ఫైల్ రూపంలో ఉన్నాయి. మెజర్మెంట్ బుక్‌తో సహా రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారు. ► కూలీలకు వేతనాలు నూటికి నూరు శాతం డీబీటీ చెల్లింపులు చేస్తున్నారు. పనులను నూరు శాతం జియో ట్యాగింగ్ చేస్తున్నారు. కూలీలకు వేతనాలను సమయానికి ఇస్తున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ బాగుంది యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు రాష్ట్రంలో బాగా అమలవుతున్నాయని నిపుణుల కమిటీ తెలిపింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గ్రామీణ యువతకు మంచి మౌలిక సదుపాయాలున్న సంస్ధ ద్వారా రెసిడెన్షియల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తోంది. శిక్షణ భవనాలు, తరగతి గదులు, ప్రాక్టికల్ ల్యాబ్‌లు, ఐటీ శిక్షణ ల్యాబ్స్ చాలా బాగున్నాయని, 40 గంటల కాలం పాటు శిక్షణ అందుతోందని కమిటీ పేర్కొంది. అర్హత కలిగిన శిక్షకులు, రిసోర్స్పర్సన్లు అందుబాటులో ఉంటున్నారు. ప్లేస్‌మెంట్స్ 70 – 80 శాతం వరకు ఉన్నాయని తెలిపింది. కొందరు లబ్ధిదారులు రెండు మూడేళ్ల పని అనుభవం తరువాత నెలకు రూ.లక్ష వేతనం ఆర్జిస్తున్నారని, కోవిడ్ సమయంలోనూ శిక్షణ కేంద్రాలను కొనసాగించారని పేర్కొంది. రూ.వేల కోట్లతో పేదలకు ఇళ్లు పేదలందరికీ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా దశాబ్దాలుగా సొంత గూడు లేని నిరుపేద కుటుంబాలకు గృహాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కమిటీ తెలిపింది. పేదల ఇళ్ల కోసం అందుబాటులో ఉన్న చోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను ఉచితంగా కేటాయించింది. ఇది కాకుండా ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రిజిస్టర్డ్ భూములను సేకరించేందుకు ఏకంగా రూ.23 వేల కోట్లను వ్యయం చేసి పేదలకు ఇళ్ల పట్టాలిస్తోందని కమిటీ పేర్కొంది. వ్యర్థాల ప్రాసెసింగ్‌లో ఉత్తమ విధానాలు ► ఘన వ్యర్థాల ప్రాసెసింగ్‌లో ఏపీ ఉత్తమ పద్ధతులను అనుసరిస్తోంది. ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించి వివిధ వస్తువులను వేరు చేసి వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. కిలో రూ.10 చొప్పున విక్రయించే ఈ ఎరువులను తోటల సాగుదారులతోపాటు స్థానిక రైతులు కొనుగోలు చేస్తున్నారు. -
గడువు దాటొద్దు!
సాక్షి, అమరావతి: కేంద్ర జల్ శక్తి శాఖ నిర్దేశించిన గడువులోగా పోలవరాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖకు కేంద్ర నిపుణుల కమిటీ సూచించింది. సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) సభ్యులు కుశ్వీందర్ వోహ్రా నేతృత్వంలో 11 మంది సభ్యులతో కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ రెండో రోజు ఆదివారం పోలవరం హెడ్ వర్క్స్(జలాశయం) పనులను మరోసారి పరిశీలించింది. కుడి కాలువను జలాశయంతో అనుసంధానించే టన్నెల్, హెడ్ రెగ్యులేటర్‌ను తనిఖీ చేసింది. అనంతరం కుడి కాలువను పరిశీలించింది. నిర్వాసితుల కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేసింది. క్షేత్ర స్థాయిలో రెండు రోజుల పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో గత నెల 18న ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన గడువు మేరకు పోలవరం పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించింది. పరీక్షలు వేగవంతం.. ఈసీఆర్ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరద ఉద్ధృతికి ఏర్పడిన గోతులను పూడ్చేందుకు 11 రకాల పరీక్షలను వేగంగా పూర్తి చేయాలని నిపుణుల కమిటీ ఆదేశించింది. జూలై 15లోగా పరీక్షల నివేదికను సీడబ్ల్యూసీకి అందజేయాలని సూచించింది. సెప్టెంబర్‌లోగా గోతులను పూడ్చే విధానాన్ని సీడబ్ల్యూసీ ఖరారు చేస్తుందని, వాటి ఆధారంగా అక్టోబర్ 1 నుంచి పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. దిగువ కాఫర్ డ్యామ్‌ను జూలై నాటికి రక్షిత స్థాయికి పూర్తి చేయాలని పేర్కొంది. డయాఫ్రమ్ వాల్ పటిష్టతపై ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్) నిపుణులతో అధ్యయన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించింది. ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఆధారంగా పాత దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న భాగంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానం చేయాలా? అన్నది నిర్ణయిస్తామని పేర్కొంది. స్పష్టత రాగానే డయాఫ్రమ్ వాల్ పనులకు సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ చేపట్టి గడువులోగా పూర్తి చేయవచ్చని పేర్కొంది. పునరావాసంపై ప్రత్యేక దృష్టి.. పోలవరం నిర్వాసితులకు దశలవారీగా తొలుత 41.15 మీటర్లు, ఆ తర్వాత 45.72 మీటర్ల వరకూ పునరావాసం కల్పించాలని కేంద్ర నిపుణుల కమిటీ సూచించింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 20,946 కుటుంబాలకుగానూ ఇప్పటికే 8,277 కుటుంబాలకు పునరావాసం కల్పించామని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ వివరించారు. మిగతావారికి ఆగస్టులోగా పునరావాసం కల్పిస్తామని చెప్పారు. రీయింబర్స్ ప్రక్రియలో జాప్యం జరగడం పనుల పురోగతిపై ప్రభావం చూపుతోందని పేర్కొనగా దీనిపై కేంద్రానికి నివేదిస్తామని కమిటీ పేర్కొంది. కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం ఉదయం రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లనుంది. వారంలో జల్ శక్తి శాఖకు నివేదిక రెండు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలో పరిశీలించిన అంశాలు, అధికారులతో సమీక్షలో వెల్లడైన అశాలను బేరీజు వేసి పోలవరాన్ని గడువులోగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు కేంద్ర నిపుణుల కమిటీ వారంలోగా నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై పీపీఏ, జలవనరుల శాఖకు దిశానిర్దేశం చేయనుంది. -
ఆంధ్రప్రదేశ్‌లో పథకాల అమలుపై కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో వందకు వంద శాతం సమర్థంగా అమలవుతున్నాయని కేంద్ర నిపుణుల కమిటీ బృందం ప్రశంసించింది. గత నాలుగు రోజులుగా శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ ముద్ర అట్టడుగు స్థాయిలో సైతం చాలా స్పష్టంగా కనిపించిందని కేంద్ర బృందం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్న పథకాలతో పేదలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని, దేశవ్యాప్తంగా ఈ విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అధ్యయనానికి కమిటీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న దాదాపు పది రకాల పథకాలను రాష్ట్రాల వారీగా పరిశీలించడంతో పాటు మార్పు చేర్పులపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించారు. పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అరుణాశర్మ, తమిళనాడు రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ నేతృత్వంలో వివిధ రంగాల నిపుణులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కామన్ రివ్యూ మిషన్ పేరుతో కమిటీ ఏర్పాటైంది. ఏపీలో పథకాల అమలు తీరు పరిశీలనకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అశోక్ పంకజ్, నీతి అయోగ్ నియమించిన వందనా శర్మ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీ పీఆర్) కమిటీ సభ్యుడు ఏ.సింహాచలం, సివిల్ ఇంజనీరింగ్ నిపుణుడు ఎంకే గుప్తాలతో కూడిన బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించింది. బృందం సభ్యులు ఇద్దరు చొప్పున ఈ నెల 19 నుంచి 22 వరకు జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు డీబీటీ కంటే మెరుగ్గా ఏపీలో పింఛన్ల పంపిణీ.. వలంటీర్ల ద్వారా ప్రతి నెలా మొదటి తేదీనే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించిన కేంద్ర నిపుణుల కమిటీ అభినందనలు తెలియచేసింది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని అయితే డీబీటీ కంటే మరింత మెరుగ్గా ఏపీలో లబ్ధిదారుల ఇంటి వద్దే బయోమెట్రిక్ లేదా ఐరిస్ తీసుకొని నేరుగా డబ్బులు అందజేయడం ప్రశంసనీయమన్నారు. దీనివల్ల పెద్ద వయసు వారు, అనారోగ్య బాధితులు ప్రతి నెలా బ్యాంకు దాకా వెళ్లాల్సిన అవసరం తొలగిపోయిందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న డీబీటీ విధానంలో ఎవరైనా లబ్ధిదారులు మరణించిన తరువాత కూడా సంబంధిత బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడం, ఏటీఎం కార్డులతో ఇతరులు డ్రా చేసుకోవడం లాంటి వాటికి ఆస్కారం ఉందన్నారు. ఇలాంటి వాటికి తావులేకుండా పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల చేతికే డబ్బులు అందించడం వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా టంచన్‌గా మొదటి తారీఖునే పింఛన్ల పంపిణీ చేస్తున్న తీరు గురించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. శాశ్వత భవనాలతో గ్రామాలకు కొత్త రూపు ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులతో గ్రామ సచివాలయాల భవనాలు సహా పలు నిర్మాణాలను చేపట్టడం వల్ల ప్రతి గ్రామానికి శాశ్వతంగా ఆస్తులు కల్పిస్తున్నారని కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రతి పల్లెలో సామాజిక సంపదగా కొత్తగా నిర్మితమవుతున్న భవనాలు గ్రామాల రూపురేఖలు మార్చేస్తున్నాయని, ఇది దేశానికే ఆదర్శనీయమని ప్రశంసించారు. పలు రకాల సేవలను గ్రామాల్లోనే ప్రజల ముంగిటికే అందుబాటులోకి తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్థను దేశమంతా ప్రవేశ పెట్టాలని తమ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేస్తుందని వెల్లడించారు. ఉపాధి హామీ నిధులతో రోడ్లకు ఇరువైపులా నాటే మొక్కలలో అధిక శాతం పచ్చగా కళకళలాడుతున్నాయని కమిటీ సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు– నేడు ద్వారా జరిగిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తాము స్వయంగా పరిశీలించామని చెప్పారు. ఏజన్సీలో 150 రోజులకు ‘ఉపాధి’ గిరిజన ప్రాంతాలతో పాటు కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులకు బదులుగా 150 రోజుల పాటు పేదలకు పనులు కల్పించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ నిఫుణుల కమిటీని కోరారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కూలీలకు వేసవి కాలంలో తక్కువ మొత్తంలో పనిచేసినా కొంత అదనంగా కూలీ డబ్బులు ఇచ్చే విధానం అమలులో ఉండేదని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు ఆ అవకాశం లేదన్నారు. తిరిగి గత విధానం అమలుకు వీలుగా సిఫార్సు చేయాలని కోరారు. కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన అరకు, పాడేరులో ఉపాధి హామీ పథకం ద్వారా తోటల పెంపకానికి అనుమతిచ్చేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన గూడేలకు రోడ్లు పీఎంజీఎస్‌వై పథకం ద్వారా ప్రస్తుతం కనీసం 250 మంది జనాభా ఉండే గ్రామాలకు మాత్రమే కొత్తగా రోడ్ల నిర్మాణానికి అవకాశం ఉందని, గిరిజన ప్రాంతాల్లో 50–100 మంది నివసించే గూడేలకు కూడా పథకం ద్వారా రహదారుల నిర్మాణానికి అనుమతించేలా నిబంధనల సవరణకు సిఫారసు చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ సుబ్బారెడ్డి కోరారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన నేపధ్యంలో గృహ నిర్మాణానికి వీలుగా అదనంగా నిధులు కేటాయించేలా కృషి చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ గుప్తా కోరారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సంచాలకులు పి.చినతాతయ్య, జాయింట్ కమిషనర్ ఏ.కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
2021 నాటికి ‘పోలవరం’ పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికను(యాక్షన్ ప్లాన్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసించింది. గోదావరికి వరదలు వచ్చేలోగా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, నిర్వాసితుల పునరావాసం పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడింది. ఆర్థిక వనరులు సమకూర్చితే ఆ యాక్షన్ ప్లాన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తుందని స్పష్టం చేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు శనివారం నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హెచ్‌కే హల్దార్ నేతృత్వంలో నిపుణుల కమిటీ నివేదికలో ఏం పేర్కొన్నారంటే.. పకడ్బందీ ప్రణాళికతో పనులు - పోలవరం స్పిల్ వేలో 18.48 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకుగానూ, 15.81 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన 2.67 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను జూలై 2020 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. నెలకు సగటున 33,375 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం ద్వారా వాటిని పూర్తి చేయనున్నారు. - స్పిల్ ఛానల్లో 18.75 లక్షల క్యూబిక్ మీటర్లకుగానూ, 13.31 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 5.44 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను నెలకు 48,545.55 క్యూబిక్ మీటర్ల చొప్పున పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. - వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించి.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు చేయడానికి వీలుగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను జూన్ నాటికి పూర్తి చేయడానికి కసరత్తు సాగిస్తున్నారు. - 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే పనులు చేపట్టారు. వాటిని మే నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. - కుడి కాలువ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఎడమ కాలువలో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని.. కొత్త కాంట్రాక్టర్లకు రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు అప్పగించి.. 2021 నాటికి డిస్ట్రిబ్యూటరీలతో సహా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు. - వచ్చే సీజన్లో ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్.. కాలువలకు నీటిని సరఫరా కుడి, ఎడమ అనుసంధాలు, స్పిల్ వేకు గేట్లు బిగించే ప్రక్రియతోసహా 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించే దిశగా కసరత్తు చేస్తున్నారు. నిధులు సమకూర్చితే.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి సెప్టెంబరు 2019 వరకూ రూ.11,377.243 కోట్లు వెచ్చించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6,764.16 కోట్లు(ఇందులో పీపీఏ కార్యాలయ నిర్వహణ వ్యయం రూ.15 కోట్లు) రీయింబర్స్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి 2018–19లో రూ.393.51 కోట్లు .. నవంబర్ 8, 2019న రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఆ నిధులను విడుదల చేయలేదు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు. ఇందులో జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయంపోగా మిగతా.. అంటే రూ.50,987.96 కోట్లు నీటిపారుదల విభాగం వ్యయం. ఆ మేరకు నిధులను సమకూర్చితే సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందించవచ్చునని నిపుణుల కమిటీ పేర్కొంది. -
సజావుగా పోలవరం
పోలవరం పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. నిధుల కొరత లేకుండా చూస్తే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం సవాలే. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలంటే ఇంకా రూ.30 వేల కోట్లు అవసరం. ఇదే అంశాన్ని కేంద్రానికి నివేదిస్తాం. ఇప్పటికే మంజూరు చేసిన రూ.1,850 కోట్లు తక్షణమే విడుదలవుతాయి. మిగతా బకాయిలు విడుదల చేసేలా కేంద్రానికి నివేదిక ఇస్తాం. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లపై ఇప్పటికే సీడబ్ల్యూసీ టీఏసీ(సాంకేతిక సలహా కమిటీ) ఆమోదముద్ర వేసింది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ కూడా ఆమోదముద్ర వేయగానే ఆ మేరకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. – కేంద్ర నిపుణుల కమిటీ చైర్మన్ హల్దార్ సాక్షి, అమరావతి: ‘‘పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక వాస్తవికంగా, ఆచరణాత్మకంగా ఉంది. ప్రస్తుతం పనులన్నీ ప్రణాళిక మేరకు సజావుగా సాగుతున్నాయి. నిధుల కొరత లేకుండా చూస్తే ఆ గడువులోగా పోలవరం ఫలాలను రైతులకు అందించవచ్చు’’ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హల్దార్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. ఈ సీజన్లో కాఫర్ డ్యామ్‌లు, స్పిల్ వే, పునరావాస పనులను సమన్వయంతో చేపట్టాలని కమిటీ జలవనరుల శాఖకు సూచించింది. పెండింగ్‌లో ఉన్న 9 డిజైన్లపై చర్చించేందుకు వారంలోగా ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి సమగ్ర వివరాలతో హాజరైతే ఆమోదించేలా చూస్తామని తెలిపింది. పోలవరం ఎడమ కాలువ, హెడ్ వర్క్స్‌ను రెండు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం ఉదయం కుడి కాలువను సందర్శించింది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు విజయవాడలోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. పనుల పూర్తికి ప్రణాళిక.. పోలవరాన్ని 2021లోగా పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారని ఆదిత్యనాథ్ దాస్ కేంద్ర నిపుణుల కమిటీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన వ్యయంలో రూ.5,103 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని, సవరించిన అంచనాల మేరకు నిధులిస్తే 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. దీనిపై కేంద్ర నిపుణుల కమిటీ చైర్మన్ స్పందిస్తూ కార్యాచరణ ప్రణాళిక వాస్తవికంగా, ఆచరణాత్మకంగా ఉందని ప్రశంసించారు. కాఫర్ డ్యామ్‌లలో వరదను దిగువకు వదలడానికి ఉంచిన ఖాళీ ప్రదేశాలను అలాగే ఉంచి.. మిగిలిన పనులు (ఎగువ కాఫర్ డ్యామ్ 42 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ 30 మీటర్లు) పూర్తి చేయాలని సూచించారు. స్పిల్‌వేలో 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉందని, 48 గేట్లను బిగించాల్సి ఉందన్నారు. ఈ పనులను మే నాటికి పూర్తి చేసి 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించగలిగితే అప్పుడు కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయాలని దిశా నిర్దేశం చేశారు. అప్పుడు వరదను స్పిల్‌వే మీదుగా మళ్లించి ఈసీఆర్ఎఫ్ పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయవచ్చన్నారు. హెడ్‌వర్క్స్‌ను పూర్తి చేసి జలాశయంలో నీటిని నిల్వ చేసినా కాలువలకు నీటిని విడుదల చేసే అనుసంధానాలు(కనెక్టివిటీస్) పూర్తి చేయకపోతే ఫలితం ఉండదన్నారు. ఎడమ కాలువ అనుసంధానం పనుల్లో 18 మీటర్ల వ్యాసంతో సొరంగం తవ్వకం పనులు మూడు దశల్లో చేస్తుండటం వల్ల కొంత జాప్యం చోటుచేసుకుంటోందని సీఈ సుధాకర్ బాబు వివరించారు. పునరావాసమే పెద్ద సవాల్.. పోలవరంలో 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలో 1.05 లక్షల కుటుంబాలు నిర్వాసితులుగా మారతాయని నిపుణుల కమిటీకి అధికారులు వివరించారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో 18,620 నిర్వాసిత కుటుంబాలకుగానూ 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించామని, మే నాటికి మిగతా 14,698 కుటుంబాలకు పునరావాసం కల్పించే విధంగా వేగంగా చర్యలు చేపట్టామని, నిధుల కొరత లేకుండా చూస్తే పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికతో కేంద్ర నిపుణుల కమిటీ ఛైర్మన్ హల్దార్ ఏకీభవిస్తూ నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. నిధుల కొరత లేకుండా చూస్తే 2021 నాటికి పోలవరం పనులు పూర్తి చేయవచ్చని, ఇదే అంశాన్ని కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు నివేదిస్తామని తెలిపారు. సమావేశంలో కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు ఆర్కే పచౌరి, ఎస్ఎల్ గుప్తా, రంగారెడ్డి, బీపీ పాండే, డీపీ భార్గవ, భూపేందర్‌సింగ్, నాగేంద్రకుమార్, దేవేంద్రకుమార్, వ్యాప్కోస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు ‘పోలవరం’పై సమీక్ష
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం విజయవాడలో నీటిపారుదల శాఖ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టు పనుల తీరును రెండ్రోజులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిటీ ఈ సీజన్లో పూర్తి చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేయనుంది. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాక, 3 నెలలకు ఒకసారి పనులను పరిశీలించి, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని ఇటీవల కేంద్రం పునర్ వ్యవస్థీకరించింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హెచ్‌కే హల్దార్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ పీపీవో సీఈ ఆర్కే పచౌరీ కనీ్వనర్‌గా ఉన్న ఈ కమిటీలో సీఎస్‌ఆర్‌ఎంఎస్ డైరెక్టర్ ఎస్ఎల్ గుప్తా, కృష్ణా గోదావరి బేసిన్ విభాగం సీఈ డి.రంగారెడ్డి, పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సభ్య కార్యదర్శి బీపీ పాండే, ఎన్‌హెచ్‌పీసీ మాజీ డైరెక్టర్ డీపీ భార్గవ, జాతీయ ప్రాజెక్టుల విభాగం డైరెక్టర్ భూపేందర్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్ నాగేంద్రకుమార్, సీడబ్ల్యూసీ(హైదరాబాద్) డైరెక్టర్ దేవేంద్రకుమార్‌ను సభ్యులుగా నియమించింది. శనివారం విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎడమ కాలువ పనులను పరిశీలించింది. ఆదివారం పోలవరం హెడ్ వర్క్స్‌లో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, ఎడమ గట్టు, కుడి గట్టు, అనుసంధానాలు (కనెక్టివిటీస్), ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్)లను తనిఖీ చేశారు. పనులపై పోలవరం సీఈ సుధాకర్‌బాబును ఆరా తీశారు. ఈ సీజన్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను కొలిక్కి తెస్తామని పోలవరం అధికారులు తెలిపారు. తద్వారా వచ్చే సీజన్లో వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి ప్రధాన ఆనకట్ట ఈసీఆర్ఎఫ్ పనులను నిర్విఘ్నంగా చేయడం ద్వారా 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని వారు వివరించారు. పునరావాస పనులు వేగవంతం 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల్లోని 18,620 కుటుంబాలకుగానూ ఇప్పటిదాకా 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించామని పోలవరం అధికారులు కమిటీకి తెలిపారు. మిగతా 14,698 కుటుంబాలకు మేలోగా పునరావాసం కలి్పంచే పనులను వేగవంతం చేశామని వివరించారు. కార్యాచరణ ప్రణాళిక మేరకు పనులు పూర్తి చేయాలంటే నిధులు అవసరమని, సవరించిన అంచన వ్యయ ప్రతిపాదనల (రూ.55,548.87 కోట్లు)కు ఆమోదముద్ర వేసి నిధులు విడదలయ్యేలా చూడాలని కేంద్ర కమిటీని కోరారు. ఇప్పటివరకూ చేసిన పనులకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.5,103 కోట్లను విడుదల చేసేలా చూడాలని కోరారు. అనంతరం కేంద్ర నిపుణుల కమిటీ చైర్మన్ హెచ్‌కే హల్దార్ విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులతో పోల్చితే నిర్వాసితుల సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయమే అధికమని, నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే ప్రధానమని చెప్పారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు ఫలాలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు. -
నేడు పోలవరానికి కేంద్ర నిపుణుల కమిటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను హెచ్‌కే హల్దార్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ శనివారం నుంచి మూడు రోజులపాటు పరిశీలించనుంది. ఢిల్లీ నుంచి శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకోనున్న కమిటీ శనివారం ఎడమ కాలువ పనులను పరిశీలించి, రాజమహేంద్రవరానికి చేరుకుంటుంది. ఆదివారం పోలవరం హెడ్‌వర్క్స్‌ను(జలాశయం పనులు) పరిశీలించనుంది. సోమవారం(ఈ నెల 30న) కుడి కాలువ పనులను పరిశీలించి.. మధ్యాహ్నం విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలు, సమీక్షా సమావేశంలో వెల్లడైన విషయాల ఆధారంగా.. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు జనవరి 2న నివేదిక ఇవ్వనుంది. నిపుణుల కమిటీని పునర్వ్యవస్థీకరించిన కేంద్రం ప్రస్తుత సీజన్లో కాఫర్ డ్యామ్‌తోపాటు స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులను పూర్తి చేయడం, 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కేంద్ర నిపుణుల కమిటీకి వివరించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కారుకు అప్పగించాక.. మూడు నెలలకోసారి పనులను పరిశీలించి, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చేందుకు అప్పటి సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ అధ్యక్షతన నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మసూద్ హుస్సేన్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నిపుణుల కమిటీ చైర్మన్‌గా వైకే శర్మను నియమించింది. ఇటీవల ఆయన పదవీ విరమణ చేయడంతో నిపుణుల కమిటీని కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. సీడబ్ల్యూసీ సభ్యులు హెచ్‌కే హల్దార్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ పీపీవో సీఈ ఆర్కే పచౌరీ కన్వీనర్‌గా నిపుణుల కమిటీలో సీఎస్‌ఆర్‌ఎంఎస్ డైరెక్టర్ ఎస్ఎల్ గుప్తా, కృష్ణా గోదావరి బేసిన్ విభాగం సీఈ డి.రంగారెడ్డి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యకార్యదర్శి బీపీ పాండే, ఎన్‌హెచ్‌పీసీ మాజీ డైరెక్టర్ డీపీ భార్గవ, జాతీయ ప్రాజెక్టుల విభాగం డైరెక్టర్ భూపేందర్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్ నాగేంద్రకుమార్, సీడబ్ల్యూసీ(హైదరాబాద్) డైరెక్టర్ దేవేంద్రకుమార్‌ను సభ్యులుగా నియమించింది. -
నాణ్యత డొల్ల
సాక్షి, పోలవరం/పోలవరం రూరల్/అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) స్పిల్‌వే పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడాన్ని కేంద్ర నిపుణుల కమిటీ తప్పుబట్టింది. స్పిల్‌వే పనుల్లో ఉపయోగిస్తున్న సిమెంట్, స్టీల్ నాసిరకంగా ఉన్నాయని తేల్చింది. సెంట్రింగ్(ఇనుప కడ్డీలను వంచడం) పనులను సక్రమంగా చేయకపోవడం వల్ల కాంక్రీట్ పనుల్లో పటిష్టత ఉండదని పేర్కొంది. పోలవరం జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేసేందుకు చేపట్టిన స్పిల్‌వే పనుల్లో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేసింది. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాక.. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నివేదిక ఇవ్వడానికి కేంద్ర సర్కారు ‘నిపుణుల కమిటీ’ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడుసార్లు పోలవరం పనులను పరిశీలించిన ఈ కమిటీ, ఆయా సందర్భాల్లో కేంద్రానికి ఇచ్చిన నివేదికలు తీవ్ర ప్రకంపనలు రేపాయి. స్పిల్‌వేకు చీలికలు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సభ్యులు వైకే శర్మ నేతృత్వంలో సీడబ్ల్యూసీ సీఈ ఆర్కే పచౌరి, సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.కె.సింగ్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈ ఏకే ప్రధాన్, శాస్త్రవేత్త ఆర్.చిత్ర, పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా తదితరులు సభ్యులుగా ఉన్న కేంద్ర నిపుణుల కమిటీ గురువారం పోలవరం స్పిల్‌వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కాంక్రీట్ మిశ్రమంలో ఉపయోగిస్తున్న సిమెంట్, ఇసుక, కంకర నాణ్యతను పరీక్షించింది. సిమెంట్ నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేసింది. అనంతరం స్పిల్ వే పనులు జరుగుతున్న ప్రదేశానికి చేరుకుంది. స్పిల్‌వే(సిమెంటు గోడ)కు అక్కడక్కడ గ్యాప్‌లు(చీలికలు) ఏర్పడటాన్ని గుర్తించింది. నాసిరకమైన స్టీల్, సెంట్రింగ్ ఇష్టారాజ్యంగా చేయడం, నాణ్యత లేని సిమెంట్‌తో కూడిన మిశ్రమాన్ని వినియోగించి పనులు చేయడం వల్లే స్పిల్ వేలో చీలికలు ఏర్పడ్డాయని తేల్చింది. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడంపై అధికారులను నిలదీసింది. నాణ్యతపై ఇకనైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించింది. ఇలాగైతే కష్టమే.. క్షేత్రస్థాయి పరిశీలనకు ముందు పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు హెడ్ వర్క్స్ వద్ద జలవనరుల శాఖ కార్యాలయంలో కేంద్ర కమిటీ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్పిల్‌వే పనులను నవంబర్ నాటికి పూర్తి చేస్తామని.. వరద తగ్గాక కాఫర్ డ్యామ్‌ల పనులు చేపడతామని చెప్పారు. 2019 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. సగటున రోజుకు ఆరు వేల క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీట్ పనులు చేస్తున్నామని అధికారులు వివరించారు. అలాగైతే స్పిల్‌వే పనులు నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశమే లేదని కమిటీ సభ్యులు తేల్చిచెప్పారు. పనులను వేగవంతం చేస్తూనే నాణ్యత పాటించాలన్నారు. ఇప్పటికే చేసిన పనులకు రూ.2200 కోట్లకుపైగా కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని, సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల(డీపీఆర్–2)ను ఆమోదించేలోగా పనులను వేగవంతం చేయడానికి రూ.10 వేల కోట్లను అడ్వాన్సుగా ఇచ్చేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని అధికారులు కోరారు. దీనిపై కమిటీ సభ్యులు స్పందిస్తూ.. డీపీఆర్–2 ఆమోదం మేరకు కేంద్రం నిధులు విడుదల చేస్తుందన్నారు. డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్‌పై సందేహాలు ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పునాది(డయాఫ్రమ్ వాల్) గోదావరి వరద ప్రవాహంలో మునిగిపోవడంతో వాటి నాణ్యతను కేంద్ర కమిటీ పరిశీలించలేకపోయింది. కాఫర్ డ్యామ్ పునాది(జెట్ గ్రౌటింగ్) పనులను కూడా పరిశీలించలేదు. వాటి నాణ్యతపైనా కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది. వరద ప్రవాహం పూర్తిగా తగ్గాక నాణ్యతను పరిశీలించాలని నిర్ణయించింది. పరిశీలన పూర్తయ్యాక కమిటీ ఛైర్మన్ వైకే శర్మ మీడియాతో మాట్లాడారు. స్పిల్‌వే కాంక్రీట్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని చెప్పారు. సిమెంట్, స్టీల్ నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత కీలకమైన హెడ్ వర్క్స్(జలాశయం) పనులపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉందన్నారు. నేడు సమీక్షా సమావేశం కేంద్ర నిపుణుల కమిటీ శుక్రవారం పోలవరం కుడి, ఎడమ కాలువలను పరిశీలించనుంది. అనంతరం పనుల ప్రగతి, నాణ్యతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పనులు వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాజమహేంద్రవరంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనుంది. అధికారులకు దిశానిర్దేశం చేయనుంది. అనంతరం శుక్రవారం రాత్రికి కమిటీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది. క్షేత్రస్థాయి పర్యటన, అధికారులతో నిర్వహించిన సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రాజెక్టు వాస్తవ స్థితిగతులపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. రేలా పిటిషన్‌పైఏపీకి నోటీసులు పోలవరంపై ‘సుప్రీం’ విచారణ వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టువల్ల ముంపు ముప్పు ఉందని, స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను పునరుద్ధరించాలని రేలా స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్ సూట్‌పై గురువారం జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ముందుగా ఒడిశా ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. మరోవైపు.. ‘రేలా’ తరఫున న్యాయవాదులు జయంత్ భూషణ్, కె. శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇంజినీర్ల సిఫారసుల మేరకు 2011లో కేంద్రం స్టాప్ వర్క్ ఆర్డర్ జారీ చేసిందని నివేదించారు. దీంతో ‘రేలా’ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసు లు జారీ చేస్తూ విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. ఒడిశా పిటిషన్‌తో పాటు ‘రేలా’ పిటిషన్‌ను కలిపి విచారిస్తామంది. -
సీడబ్ల్యూసీ క్లియరెన్స్ తీసుకోండి
- తర్వాతే పర్యావరణ అనుమతులిస్తాం - ఆలమట్టి ఎత్తు పెంపుపై కర్ణాటకకు తేల్చి చెప్పిన నిపుణుల కమిటీ న్యూఢిల్లీ: ఆలమట్టి ఆనకట్ట ఎత్తు పెంచే ప్రాజెక్టుకు ముందుగా కేంద్ర జల మండలి (సీడబ్ల్యూసీ) అనుమతి తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఆ తర్వాతే తాము పర్యావరణ అనుమతులను ఇస్తామంది. అంతర్ రాష్ట్ర వివాదాలు, హైడ్రాలజీకి సంబంధించి సీడబ్ల్యూసీ నుంచి అనుమతి తెచ్చుకోవాలంది. ఉత్తర కర్ణాటకలో కృష్ణానదిపై ఉన్న ఆలమట్టి డ్యాం ప్రస్తుత ఎత్తు 519.6 మీటర్లు కాగా, దానిని 524.256 మీటర్లకు పెంచుకుంటామని కర్ణాటక కోరుతోంది. ఆ ప్రతిపాదనను నిపుణుల కమిటీ గత నెల్లో పరిశీలించింది. అంతర్ రాష్ట్ర వివాదాలు, హైడ్రాలజీకి సంబంధించిన అంశాలను తప్పనిసరిగా సీడబ్ల్యూసీ పరిశీలించాల్సిందేననీ, ఆ తర్వాతే తాము ఎత్తు పెంపుపై మరోసారి ఆలోచిస్తామని కమిటీ చెప్పింది. సాధారణంగా కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రాజెక్టులకు జల వనరుల మంత్రిత్వ శాఖ అనుమతులిస్తుంది. ఎగువ కృష్ణానది ప్రాజెక్టులో భాగంగా ఆనకట్ట ఎత్తును పెంచి మరిన్ని నీళ్లను నిల్వ చేసి కొత్తగా 4 ఎత్తిపోతల పథకాలను నిర్మించేందుకు కర్ణాటక ప్రణాళికలు రచిస్తోంది. వీటి ద్వారా ఉత్తర కర్ణాటకలోని 7 జిల్లాల్లో 5.3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎత్తు పెంచితే 907 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేసుకునే సామర్థ్యం కర్ణాటకకు లభిస్తుంది. అయితే కర్ణాటక ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలు కేంద్రం, ట్రిబ్యునల్, సీడబ్ల్యూసీ వద్ద గతంలో పలుమార్లు అభ్యంతరాలు లేవనెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీ తాజా నిర్ణయం కర్ణాటకకు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. -
‘పోలవరం’ పనులు ఇలాగేనా?!
కేంద్ర నిపుణుల కమిటీ అసహనం సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) చీఫ్ ఇంజినీర్ మస్సూద్ అహ్మద్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివ్వెరపోయింది. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు కనీసం కార్యాచరణ ప్రణాళిక(వర్కింగ్ షెడ్యూల్) కూడా రూపొందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. హెడ్ వర్క్స్ ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ పనితీరుపై నోరెళ్లబెట్టిన కమిటీ.. పనులన్నీ ఏకపక్షంగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సబ్ కాంట్రాక్టర్ల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. 2014–15 నుంచి 2016–17 వరకూ కేంద్రం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఆరా తీసింది. పోలవరం కుడి, ఎడమ కాలువల పనులనూ నిశితంగా పరిశీలించిన కమిటీ.. నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.