Andhra Pradesh: ‘సంఘ’టితంగా.. కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసలు | Central Govt Experts Committee Compliments Andhra Pradesh Govt | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ‘సంఘ’టితంగా.. కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసలు

Published Mon, Nov 28 2022 2:19 AM | Last Updated on Mon, Nov 28 2022 3:38 PM

Central Govt Experts Committee Compliments Andhra Pradesh Govt - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొదుపు సంఘాలు ఆర్థిక ప్రగతితో కాంతులీనుతున్నాయని, మహిళల ఆధ్వర్యంలో పలు వ్యాపారాల నిర్వహణ అద్భుతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో పొదుపు సంఘాల మహిళలు నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వివిధ వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదిగారని కమిటీ నివేదికలో ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది ప్రాధాన్యత రంగాలను గుర్తించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధంగా అమలు చేస్తోందని అభినందించింది.

ఆరోగ్యం (ఆరోగ్యశ్రీ), విద్య (అమ్మ ఒడి), విద్య (ఫీజు రీయింబర్స్‌మెంట్‌), గృహ నిర్మాణం (పేదలందరికీ ఇళ్లు), జీవనోపాధి (వైఎస్సార్‌ చేయూత – వైఎస్సార్‌ ఆసరా), సంక్షేమం (పెన్షన్ల పెంపు), వ్యవసాయం (వైఎస్సార్‌ రైతు భరోసా), సాగునీరు (జలయజ్ఞం), మద్య నియంత్రణను ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి అమలు చేస్తూ కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటోందని తెలిపింది. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున టెక్నాలజీని వినియోగిస్తోందని కమిటీ పేర్కొంది.

కాగా గత సర్కారు హయాంలో డ్వాక్రా రుణమాఫీ అందక డిఫాల్టర్లుగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోయిన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా ఆదుకున్న విషయం తెలిసిందే. ఎన్‌పీఏలుగా మారిన డ్వాక్రా సంఘాలు దీంతో పునరుజ్జీవమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న 14 పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర రిటైర్డ్‌ కార్యదర్శితో పాటు తమిళనాడు రిటైర్డ్‌ సీఎస్‌ల నేతృత్వంలో వివిధ రంగాలకు చెందిన 32 మంది నిపుణులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 6వ కామన్‌ మిషన్‌ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, అరుణాచల్‌ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో కమిటీ  పర్యటించింది. ఫిబ్రవరి 17 – 27 తేదీల మధ్య నలుగురు ప్రతినిధులతో కూడిన బృందం శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలోని 23 గ్రామ పంచాయతీలను సందర్శించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో స్వయంగా పరిశీలించిన అంశాలను విశ్లేషిస్తూ కమిటీ నివేదికను రూపొందించింది. అందులో ముఖ్యాంశాలు ఇవీ.
శ్రీకాకుళం జిల్లాలో కంప్యూటర్‌ శిక్షణ ల్యాబ్‌ను పరిశీలిస్తున్న కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు   

ఆత్మవిశ్వాసం.. టెక్నాలజీ వినియోగం
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల నిర్మాణం దాదాపు సంతృప్త స్థాయిలో ఉంది. అపార సామాజిక మూలధన రూపంలో సభ్యులు ఆత్మ విశ్వాసంతో, శక్తివంతంగా ఉన్నారు. రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించడంతో పాటు సంక్షోభంలో పరస్పరం సాయం చేసుకుంటున్నారు. సంఘాల కార్యకలాపాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. హాజరు నమోదుతో పాటు రుణ వివరాల లాంటి రికార్డుల కోసం మొబైల్‌ అప్లికేషన్‌ సేవలను వినియోగించుకుంటున్నారు.

► రాష్ట్రంలో పొదుపు సంఘాలు కిరాణా, బ్యూటీ పార్లర్, కలంకారీ, చెక్క క్రాఫ్టింగ్, చీపుర్ల తయారీ, వివాహ వస్తువుల తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, పూల పెంపకం, వ్యవసాయం, పశువులు, మిల్లెట్స్‌ ఉత్పత్తి, చిన్న వ్యాపారాలు, ఉద్యానవనాలు లాంటి వివిధ రకాల జీవనోపాధి కార్యకలాపాలలో నిమగ్నమయ్యాయి.

సేంద్రీయ వ్యవసాయంలోనూ..
పొదుపు సంఘాలు సభ్యులు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు రుణాలు తీసుకుని వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. టైలరింగ్, కొవ్వొత్తుల తయారీ, స్వీట్‌ షాప్‌ లాంటి వ్యాపారాలను చేస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల రికవరీ రేటు నూటికి నూరు శాతంగా ఉంది. సాధికారత, ఆర్థిక నిర్వహణలో బాగా ప్రావీణ్యం ఉంది. పొదుపు సంఘాలు సేంద్రీయ వ్యవసాయంతో పాటు న్యూట్రి గార్డెన్స్‌లో కూడా పాల్గొంటున్నాయి.

మెరుగైన ఆదాయం..
పొదుపు సంఘాల సభ్యులు మెరుగైన ఆదాయ స్థాయి కలిగి ఉన్నారు. ఉదాహరణకు పొదుపు సంఘంలోని ఓ సభ్యురాలు రూరల్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా శిక్షణ పొంది రుణం తీసుకుని టైలరింగ్‌ దుకాణాన్ని ప్రారంభించింది. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. 

అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌
పొదుపు సంఘాల ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సెర్ప్‌ ద్వారా సంఘాలకు తగిన మద్దతు ఇస్తుండటంతో గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలు శక్తివంతంగా ఉన్నాయి. సంఘాల సభ్యులకు గ్రామీణాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల పట్ల పూర్తి అవగాహన ఉంది.
► పొదుపు సంఘాలు సామాజిక చైతన్య కార్యక్రమాల్లో విస్తృతంగా పాలు పంచుకుంటున్నాయి. పల్స్‌ పోలియో, కోవిడ్‌ వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ చురుగ్గా వ్యవహరిస్తున్నాయి.

ఉపాధి, మౌలికం.. భేష్‌
రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన బాగుందని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొంది. వైవిధ్యమైన సామాజిక సంపదను సృష్టించినట్లు క్షేత్రస్థాయి సందర్శనలో గుర్తించామని తెలిపింది. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని ప్రశంసించింది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ భవనాలు, గ్రామ సచివాలయాల భవనాలు, ఘన వ్యర్థాల ప్రాసెసింగ్‌ యూనిట్లు లాంటి వాటిపై దృష్టి పెట్టి సామాజిక సంపద సృష్టించటాన్ని ప్రస్తావించింది.

‘నేషనల్‌ రూర్బన్‌ మిషన్‌’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభావవంతంగా నిర్వహిస్తోందని తెలిపింది. 70 శాతం డిపార్ట్‌మెంట్‌ నిధులతో పాటు 30 శాతం క్రిటికల్‌ గ్యాప్‌ నిధులను ఏకీకృతం చేసి వాటర్‌ ట్యాంక్‌లు, అంగన్‌వాడీ భవనాలు, హెల్త్‌ సబ్‌ సెంటర్లు, బ్లడ్‌ బ్యాంకులు, కాలేజీ భవనాల నిర్మాణం తదితరాలను నిర్దేశిత ప్రణాళికతో అమలు చేస్తున్నట్లు పేర్కొంది. 

► సాధారణంగా ఉపాధి హామీ కింద జాబ్‌ కార్డులను డిమాండ్‌ ఆధారంగా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్లను నియమించిన తరువాత గ్రామ పంచాయతీ స్థాయిలోనే జాబ్‌ కార్డులను ఇస్తున్నారు. గతంలో బ్లాక్‌ స్థాయిలో ఇచ్చేవారు. ఇప్పుడు జాబ్‌ కార్డుల మంజూరు గణనీయంగా మెరుగుపడింది.
► కోవిడ్, లాక్‌డౌన్‌ సమయంలో ముందుగానే జాబ్‌ కార్డులను జారీ చేశారు. ముఖ్యంగా వలస కూలీలు తిరిగి రాగానే జాబ్‌ కార్డులిచ్చారు. లబ్ధిదారుల ఫొటోలతో సహా జాబ్‌ కార్డులను జారీ చేశారు. 
► రాష్ట్రంలో ఉపాధి హామీకి సంబంధించి ప్రతి పని వివరాలు ఫైల్‌ రూపంలో ఉన్నాయి. మెజర్‌మెంట్‌ బుక్‌తో సహా రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారు.
► కూలీలకు వేతనాలు నూటికి నూరు శాతం డీబీటీ చెల్లింపులు చేస్తున్నారు. పనులను  నూరు శాతం జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. కూలీలకు వేతనాలను సమయానికి  ఇస్తున్నారు.  

యువతకు నైపుణ్య శిక్షణ బాగుంది
యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు రాష్ట్రంలో బాగా అమలవుతున్నాయని నిపుణుల కమిటీ తెలిపింది. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గ్రామీణ యువతకు మంచి మౌలిక సదుపాయాలున్న సంస్ధ ద్వారా రెసిడెన్షియల్‌ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తోంది. శిక్షణ భవనాలు, తరగతి గదులు, ప్రాక్టికల్‌ ల్యాబ్‌లు, ఐటీ శిక్షణ ల్యాబ్స్‌ చాలా బాగున్నాయని, 40 గంటల కాలం పాటు శిక్షణ అందుతోందని కమిటీ పేర్కొంది.

అర్హత కలిగిన శిక్షకులు, రిసోర్స్‌పర్సన్‌లు అందుబాటులో ఉంటున్నారు. ప్లేస్‌మెంట్స్‌ 70 – 80 శాతం వరకు ఉన్నాయని తెలిపింది. కొందరు లబ్ధిదారులు రెండు మూడేళ్ల పని అనుభవం తరువాత నెలకు రూ.లక్ష వేతనం ఆర్జిస్తున్నారని, కోవిడ్‌ సమయంలోనూ శిక్షణ కేంద్రాలను కొనసాగించారని పేర్కొంది. 

రూ.వేల కోట్లతో పేదలకు ఇళ్లు
పేదలందరికీ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా దశాబ్దాలుగా సొంత గూడు లేని నిరుపేద కుటుంబాలకు గృహాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కమిటీ తెలిపింది. పేదల ఇళ్ల కోసం అందుబాటులో ఉన్న చోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను ఉచితంగా కేటాయించింది. ఇది కాకుండా ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి రిజిస్టర్డ్‌ భూములను సేకరించేందుకు ఏకంగా రూ.23 వేల కోట్లను వ్యయం చేసి పేదలకు ఇళ్ల పట్టాలిస్తోందని కమిటీ పేర్కొంది.

వ్యర్థాల ప్రాసెసింగ్‌లో ఉత్తమ విధానాలు
► ఘన వ్యర్థాల ప్రాసెసింగ్‌లో ఏపీ ఉత్తమ పద్ధతులను అనుసరిస్తోంది. ప్రాసెసింగ్‌ కేంద్రాలకు తరలించి వివిధ వస్తువులను వేరు చేసి వర్మీ కంపోస్ట్‌ ఎరువు తయారు చేస్తున్నారు. కిలో రూ.10 చొప్పున విక్రయించే ఈ ఎరువులను తోటల సాగుదారులతోపాటు స్థానిక రైతులు కొనుగోలు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement