మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల
భద్రాచలం అర్బన్: డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందించి సంఘాలు బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క భరోసా ఇచ్చారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఎంతోకాలంగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలోనే విడుదల చేస్తామని ఆయన హామీనిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో పలు సమస్యలతో సహజీవనం సాగిస్తున్న గిరిజనులకు అన్ని విధాలా లబ్ధి చేకూర్చేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. 19 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం జరిగిన భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడారు.
రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ హయాంలో ఐటీడీఏ పూర్తిగా నిర్వీర్యం అయిందని, దీనికి పూర్వ వైభవం తెచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 2004 – 2014 సంవత్సరాల మధ్య ఐటీడీఏకు కేటాయించిన బడ్జెట్, చేసిన ఖర్చు వివరాల నివేదికను వచ్చే సమావేశం నాటికి అందజేయాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని పలువురు విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని, ఇందుకు గల కారణాలను విశ్లేషించి, వారు పాఠశాలలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. యువతకు స్వయం ఉపాధి ద్వారా సాయం అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు 2005లోనే నాటి వైఎస్సార్ ప్రభుత్వం మూడున్నర లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు.
పక్క రాష్ట్రంలో గత సర్కారు ఇదే శాఖలో స్కామ్ చేసింది
విద్యార్థులకు అందిస్తున్న సహకారంపై స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులతో మాట్లాడిన భట్టి.. పక్క రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇదే శాఖలో స్కామ్ చేసిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 32 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఐటీడీఏను విభజిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భద్రాద్రి ఏజెన్సీ బాధ్యత తనదేనన్నారు. భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment