సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) ఇపుడు దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల పనితీరుపై నాబార్డు రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడయ్యింది. 2019–20లో ఏపీ స్వయం సహాయక సంఘాలు పొదుపులో దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ వన్ స్థానంలో నిలవగా... 2020–21లో ఏకంగా దేశంలో కెల్లా అగ్రస్థానం సాధించడం గమనార్హం. స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
పొదుపు పెరగడమే కాదు అప్పులూ తగ్గాయి
స్వయం సహాయక సంఘాల పొదుపు పెరగడమే కాదు వారి అప్పులు కూడా తగ్గాయని నాబార్డు నివేదిక పేర్కొంది. 2019–20తో పోల్చితే 2020–21లో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల పొదుపు ఏకంగా రూ.4,153.37 కోట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పొదుపులో మన రాష్ట్ర సంఘాల పొదుపు 29.17 శాతం ఉండటం గమనార్హం. ఇక ఇదే సమయంలో అప్పులు రూ.5,940.97 కోట్ల మేర తగ్గాయి. ఈ రెండేళ్లలో ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని అమలు చేయడంతో పాటు సకాలంలో రుణాల కిస్తీలను చెల్లించిన సంఘాలకు సున్నా వడ్డీ రాయితీలను అక్కచెల్లెమ్మల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దీంతో మహిళా సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పొదుపు పెరగడం, అప్పులు తగ్గడంతో పురోగతి సాధించాయి. 2019 – 20లో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల క్రెడిట్ లింకేజీ 61.9 శాతం ఉండగా.. 2020–21లో 69.12 శాతానికి పెరిగినట్లు నాబార్డు నివేదిక స్పష్టం చేసింది.
పొదుపు సంఘాలు జీవం పోసుకున్నాయిలా..
స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారం చేపట్టిన అనంతరం చంద్రబాబు పైసా మాఫీ చేయకపోగా చివరికి సున్నా వడ్డీకి కూడా ఎగనామం పెట్టారు. ఫలితంగా స్వయం సహాయక సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా ఆ సంఘాల రుణాలు భారీ ఎత్తున నిరర్ధక ఆస్తులుగా మారిపోయాయి. గత సర్కారు తీరుతో స్వయం సహాయక సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని రెండేళ్లలోనే అమలు చేయడంతో స్వయం సహాయక సంఘాలు జీవం పోసుకున్నాయి. గత ఎన్నికల సమయానికి వారికున్న రుణాలను 4విడతల్లో చెల్లిస్తామని చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్ ఇప్పటికే ఒక విడతలో 87.74 లక్షల మంది మహిళలకు రూ.6,792.21 కోట్లు అందచేశారు.
అంతేకాకుండా సకాలంలో రుణాలు చెల్లించిన సంఘాల్లోని 87 లక్షల మందికి పైగా మహిళలకు సున్నా వడ్డీ కింద 2019–20లో రూ.1,400.8 కోట్లను చెల్లించారు. 2020–21లో సున్నా వడ్డీ కింద 1.02 కోట్ల మంది మహిళలకు రూ.1,109 కోట్లను చెల్లించారు. దీంతో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి.ఆసరా, సున్నావడ్డీతోపాటు చేయూత పథకం కూడా మహిళలు నిలదొక్కుకోవడానికి దోహదపడుతోంది. అలాగే రిసోర్స్ పర్సన్స్‌కి జీతాలు పెంచి మోటివేట్ చేయడమే కాక.. స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారాల్లో రాణించి ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది.
పొదుపులో ఏపీ మహిళలే టాప్
Published Fri, Jul 16 2021 2:24 AM | Last Updated on Fri, Jul 16 2021 12:51 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment