Self help groups
-
డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయం
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేలా కేంద్రం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకంలో నమోదు చేసుకున్న ఒక్కో సంఘానికి రూ.8 లక్షలు మేర సాయం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2024-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకంలో భాగంగా సుమారు 14,500 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.వ్యవసాయం ఎంతో శ్రమతో కూడుకున్నది. టెక్నాలజీ సహాయంతో వ్యవసాయాన్ని సులువుగా చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలను భాగం చేస్తోంది. వారికి డ్రోన్లు అందించి సరైన శిక్షణ ఇవ్వడంతో ఉపాధి కల్పిస్తోంది. అదే సమయంలో రైతులపై పనిభారం తగ్గినట్లవుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకోసం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని గతంలోనే ప్రారంభించింది.ఇదీ చదవండి: 171.6 టన్నుల బంగారు ఆభరణాలు!ఈ పథకానికి సంబంధించి కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులోని అంశాలను అమలు చేసేందుకు రూ.1,261 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. డ్రోన్ కొనుగోలులో 80 శాతం వరకు కేంద్రమే భరించనున్నట్లు చెప్పింది. లేదంటే రూ.8 లక్షలు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ ధరతో డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే స్వయం సహాయక సంఘాలకు అదనంగా అవసరమయ్యే డబ్బును నేషనల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద 3 శాతం వడ్డీరాయితీతో అందించనున్నట్లు పేర్కొంది. -
Lok sabha elections 2024: ఇస్తినమ్మా తాంబూలం.. వస్తినమ్మా ఓటింగ్‌కు!
లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమాలెన్నో జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బలరామ్‌పూర్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలు చేసిన ‘సంప్రదాయ’ కృషి వీటన్నింట్లో ఎంతో ఆసక్తికరం. మూడో దశలో భాగంగా ఈ నెల 7న రాష్ట్రంలో ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. బలరామ్‌పూర్ జిల్లాలోని సర్గూజా లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు చింతాకులు, అక్షితలు అందించారు. తప్పకుండా ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక సంప్రదాయాలను ఇలా వినూత్నంగా వాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. ‘చింతాకులు, అక్షితలు అందించడం మా సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లకు, మా సంఘం కార్యక్రమానికి ఇలాగే ఆహా్వనిస్తాం. అదే పద్ధతిలో విధిగా ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాం. దీనికి స్పందన కూడా చాలా బాగా వచి్చంది’’ అని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యురాలు విమలా సింగ్ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించినట్టు జిల్లా నోడల్ అధికారి రైనా జమీల్ పేర్కొన్నారు. ఓటర్లను ఇలా వినూత్నంగా పోలింగ్ బూత్‌లకు తరలాల్సిందిగా కోరిన తీరు పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిశాలను కూడా ఆకట్టుకుంది. ఆ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం మే 13న నాలుగు విడతలో మొదలై జూన్ 1న ఏడో విడత దాకా కొనసాగనుంది. అక్కడ కూడా ఇలా ఓటర్లను సంప్రదాయ పద్ధతిలో ఓటేసేందుకు ఆహా్వనించాలని పలు జిల్లాల ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట!– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘పొదుపు’ డబ్బులపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ!
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు మరింత ప్రయోజనం చేకూర్చే మరో చర్యకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇప్పటివరకు ఆ మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న రుణ మొత్తంలో దాదాపు మూడో వంతుకు సమానమైన డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో పొదుపు రూపంలో పోగుపడినప్పటికీ.. ఆ మొత్తానికి నామమాత్రపు వడ్డీని మాత్రమే పొందుతున్నారు. కానీ, బ్యాంకుల నుంచి మాత్రం అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. మహిళలు తమ పొదుపు సంఘాల ఖాతాల్లో దాచుకున్న డబ్బులను వాడుకోవడానికి బ్యాంకులు ఆంక్షలు పెడుతున్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8.75 లక్షల పొదుపు సంఘాలు ఉండగా, వాటిల్లో మహిళలు ప్రతినెలా దాచుకున్న డబ్బులే ఇప్పుడు రూ.11,196 కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలో మహిళా సాధికారిత కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా మహిళలు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకొక్కరు గరిష్టంగా నెలకు రూ. 200 వరకూ దాచుకుంటుండడంతో పొదుపు డబ్బులు భారీగా పెరిగాయి. మరోపక్క.. గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం రూ.30 వేల కోట్ల వరకూ ఉంటాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. అంటే మొత్తం పొదుపు సంఘాల రుణాల్లో మూడో వంతుకుపైగా పొదుపు సంఘాల మహిళలు దాచుకున్న డబ్బులు ఉన్నా, వాటిని వాళ్లు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. సహజంగా పొదుపు ఖాతాలో ఉండే డబ్బులకు బ్యాంకులు నామమాత్రపు వడ్డీ ఇచ్చే పరిస్థితి ఉండగా, రుణాలపై వడ్డీ మాత్రం రెండు మూడింతల దాకా ఉంటోంది. ఈ రుణాలకు సంబంధించి ఆర్బీఐ నిబంధన 7.3.6 మేరకు సంఘాల పొదుపు డబ్బులపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొనప్పటికీ చాలా బ్యాంకులు ఆ నిబంధన పాటించడంలేదని సెర్ప్ కార్యాలయ దృష్టికి వచ్చింది. సీసీ విధానంలోనూ అదనపు భారంలేకుండా.. మహిళలు పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు సంబంధించి గత ఏడెనిమిది ఏళ్ల నుంచి సీసీ (క్యాష్ అండ్ క్రెడిట్ ) ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తున్నాయి. ఈ విధానంలో రుణాలను గరిష్ట లోను మొత్తం మేరకు సీసీ ఖాతాలో అప్పుగా ఇచ్చినట్లు చూపి, ఆ మొత్తాన్ని సంఘం పొదుపు ఖాతాలో జమచేస్తున్నాయి. సీసీ విధానమంటే.. ఆ రుణ ఖాతాలోనే గరిష్ట లోను వరకు అవసరమైనప్పుడే డబ్బులు వినియోగించుకోవడం, ఆ వినియోగించుకున్న డబ్బులకు మాత్రమే వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, బ్యాంకర్లు కొన్నిచోట్ల మహిళలు లోను మొత్తం అవసరంలేని సమయంలో కూడా రుణ ఖాతాలో మొత్తం లోను డబ్బులను తీసుకున్నట్లుగా చూపి, వాటిని ఆ సంఘ పొదుపు ఖాతాలో ఉంచేస్తున్నారు. దీనివల్ల అవసరంలేని డబ్బులకూ వడ్డీ భారం పడుతోంది. వడ్డీ తగ్గించాలన్న సీఎం జగన్.. ఇక పొదుపు సంఘాల మహిళలు తీసుకునే రుణాల అంశంలో రుణాలిచ్చే సమయంలో మహిళలపై వివిధ రకాల అదనపు భారాలేవీ లేకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూణ్ణెళ్ల క్రితం బ్యాంకర్ల సమావేశంలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా తీసుకుంటున్న చర్యలు కారణంగా మహిళల రుణాల చెల్లింపు ఇప్పుడు 99.5 శాతానికి పైగా పెరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ తరుణంలో బ్యాంకర్లు వీలైనంత మేర పొదుపు సంఘాలకిచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని సూచించారు. రుణాలు తీసుకునే ముందు సంఘాలలో ఉండే తమ పొదుపు డబ్బులను మహిళలు వినియోగించుకునే అవకాశం ఇవ్వకపోవడంతో పాటు.. చాలాచోట్ల సీసీ విధానంవల్ల జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి ఆ సమావేశంలో ప్రస్తావించి, పేద మహిళలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు. ఈ విషయాన్ని కేంద్రానికి సైతం లేఖలు రాయడంతో కేంద్రం సైతం కదిలింది. క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర అధికారులు.. ఈ నేపథ్యంలో.. పొదుపు సంఘాల మహిళలు నష్టపోతున్న వైనంపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పొదుపు సంఘాల రుణ విభాగంలో పనిచేసే కీలక అధికారి రామ్బియాస్ గుప్తా రాష్ట్రానికి వచ్చారు. సెర్ప్ అధికారులతో కలిసి ఆయన గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పొదుపు సంఘాల మహిళలను కలిసి వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఈనెల 12న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడిత రాజశేఖర్, రాష్ట్ర బ్యాంకర్ల సంఘం ఏజీఎం రాజాబాబుతో కలిసి ఆయన విజయవాడలో బ్యాంకర్ల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ మొత్తం వివరాలను ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ విభాగానికి సెర్ప్ కార్యాలయం తెలిపింది. 0.5 శాతం మహిళలు కూడా నష్టపోకూడదనే.. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ‘పొదుపు’ మహిళలు తీసుకునే రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. సకాలంలో రుణ కిస్తీలు చెల్లించకుండా ఉంటున్న 0.5 శాతం మహిళలు సైతం నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. త్వరలో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశముందని వారు భావిస్తున్నారు. -
గొంగ్లూర్ టు జపాన్! గానుగ వంటనూనెల ఎగుమతికి సన్నాహాలు..
సాక్షి, సంగారెడ్డి: సంఘటితమై పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూర్ గ్రామ మహిళలు (స్వయం సహాయక బృందం) తయారు చేస్తున్న గానుగ (కోల్డ్ ప్రెస్డ్) వంటనూనెలను జపాన్‌కు ఎగుమతి చేసే దిశగా కీలక ముందడుగు పడింది. గొంగ్లూర్ గ్రామానికి చెందిన 126 మంది మహిళలు నడుపుతున్న సర్వోదయ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాటేజ్ ఇండస్ట్రీస్ తయారు చేస్తున్న గానుగ వంటనూనెల నమూనాలను ఇటీవల నాణ్యతా పరీక్షలకు తీసుకెళ్లిన జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) వాటి ఫలితాలపట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆయా నూనెల ఎగుమతికి వీలుగా సర్వోదయ సంస్థ త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. నూనెలు.. చేతితో చేసిన సబ్బులు.. శుద్ధిచేసిన పప్పు దినుసులు ఐఆర్ఎస్ అధికారి సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు వైద్యుల సహకారంతో గ్రామంలో పలు రకాల కుటీర పరి శ్రమలను స్థాపించారు. అందులో ఒకటైన సర్వోదయ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాటేజ్ ఇండస్ట్రీస్... ‘సర్వోదయాస్ మంజీరా’ బ్రాండ్ పేరుతో చేతితో చేసిన సబ్బులు, పప్పు దినుసుల ప్రాసెసింగ్‌తోపాటు సహజ పద్ధతుల్లో వంట నూనెలను తయారు చేస్తోంది. పల్లి, పొద్దుతిరుగుడు, నువ్వుల నూనెలు, కుసుమ, కొబ్బరినూనెలను ఉత్పత్తి చేస్తోంది. ఐఐటీ హైదరాబాద్ సహకారం.. ఆయా ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించడంతోపాటు వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ తయారీ, నాణ్యతా పరీక్షలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని గొంగ్లూర్ మహిళలు గతంలో ఐఐటీ–హైదరాబాద్‌ను కోరారు. అందుకు అంగీకరించిన ఐఐటీ–హెచ్... భారత్–జపాన్ ద్వైపాక్షిక సహకారంలో భాగంగా తమ క్యాంపస్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ (ఎస్ఐసీ) దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఎస్ఐసీ ద్వారా ‘జెట్రో’ను సంప్రదించింది. ఐఐటీ–హెచ్, ఎస్ఐసీలు ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాయి. మరోవైపు పర్యావరణ అనుకూల పద్ధతుల్లో తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్ తయారీకి తోడ్పాటు అందించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) హైదరాబాద్‌కు గొంగ్లూర్ మహిళలు విజ్ఞప్తి చేయగా ఆ సంస్థ సైతం అందుకు అంగీకారం తెలిపింది. కీలక ముందడుగు పడింది.. సర్వోదయ మంజీరా వంట నూనెల ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి కీలక ముందడుగు పడింది. మేము పంపిన శాంపిల్‌ను పరిశీలించి దిగుమతి చేసుకోవాలని జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సానుకూల నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎంవోయూ కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ప్రతినెలా 5 వేల లీటర్ల నూనెలను ఉత్పత్తి చేస్తున్నాం. ఎగుమతి ఆర్డర్ వస్తే ఉత్పత్తిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – సుధాకర్‌నాయక్, మంజీరా సర్వోదయ ఫౌండర్ తొలుత బెంగళూరుకు.. వంట నూనెల ఎగుమతులకు సంబంధించి జపాన్ సంస్థలు సానుకూలత వ్యక్తం చేయడంతో త్వరలో ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు గొంగ్లూర్ మహిళలు ప్రయత్నాలు చేస్తున్నారు. ధర, ప్యాకింగ్, రవాణా వంటి అంశాలను ఆయా సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఇక్కడ తయారు చేసిన వంటనూనెలను తొలుత బెంగళూరులోని ‘జెట్రో’ గోదాములకు తరలించి అక్కడి నుంచి ఎగుమతి చేసే యోచనలో ఉన్నారు. జాతీయ సంస్థల నుంచి లైసెన్స్‌లు.. సర్వోదయ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సంస్థ ఇప్పటికే పలు జాతీయ సంస్థల నుంచి లైసెన్స్‌లు పొందింది. బహుళజాతి సంస్థలు తీసుకున్నట్లే ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), జీఎంపీ (గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్), హ్యాండ్‌మేడ్ సబ్బులు వంటి కాస్మెటిక్స్ ఉత్పత్తులకు ఆయూష్ విభాగం నుంచి కూడా లైసెన్స్ పొందింది. చదవండి: బిజీ లైఫ్ నుంచి రిలీఫ్ కావాలా? చలో పోచారం.. ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరండి.. -
వాడిన పూలూ 'గుబాళిస్తున్నాయ్'
మహాకవి శ్రీశ్రీ రాసిన ‘వాడిన పూలే వికసించెనే..’ అన్న పాటను నిజం చేస్తున్నారు తుని మండలం టి.తిమ్మాపురం మహిళలు. ‘బంతి.. చామంతి.. మా చేతిన పడితే అగరువత్తి’ అంటూ వారంతా కొత్త పాటను ఆలపిస్తున్నారు. వాడిన పూలను పౌడర్‌గా మార్చి పర్యావరణ హితమైన అగరువత్తులను తయారు చేస్తూ పూల పరిమళాలను వెదజల్లుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: వాడిన పూలు పనికి రావనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అవి కూడా విపణి వీధిలో వికసిస్తూ పరిమళాలు విరజిమ్ముతున్నాయి. దేవుడికి అలంకరించిన పుష్పాలు ఆ తరువాత మహిళల చేతుల్లో అగరువత్తులుగా మారిపోతున్నాయి. ఏడాది క్రితం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియ లాభదాయకమై విజయవంతంగా నడుస్తోంది. ప్రపంచ మార్కెట్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. కాకినాడ జిల్లా తుని మండలంలోని టి.తిమ్మాపురం ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊళ్లో 15 కుటుంబాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు అగరువత్తులు, సాంబ్రాణి కడ్డీలు వంటివి తయారు చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభించిన వీటి టర్నోవర్ రూ.కోటిన్నర దాటేసింది. శ్రీసత్యదేవ స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళలు అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం నుంచి సేకరిస్తున్న పుష్పాలను నిత్యం తిమ్మాపురం తీసుకెళ్లి ఎండబెట్టి పౌడర్‌గా మారుస్తున్నారు. ఆ పౌడర్‌తో అగరువత్తులు తయారు చేసి 60 గ్రాములు, 120 గ్రాముల ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు. పూల పౌడర్‌తోనే సాంబ్రాణి కడ్డీలను సైతం తయారు చేస్తున్నారు. 15 లక్షల అగరవత్తుల ప్యాకెట్ల తయారీ అన్నవరం సత్యనారాయణస్వామి అలంకరణకు ఉపయోగించిన పుష్పాలను రోజుకు 60 నుంచి 80 కిలోల వరకు సేకరించి టి.తిమ్మాపురం తరలిస్తున్నారు. వీడిని ఎండబెట్టి పౌడర్ చేసిన అనంతరం తులసి, పారిజాతం, స్వర్ణ, సంపంగి, చందనం పరిమళాలతో అగరవత్తులు, రెండు రకాల సాంబ్రాణి కప్పులు (కడ్డీలు) తయారు చేస్తున్నారు. ప్రస్తుతం నిత్యం 15 కుటుంబాలకు చెందిన స్వయంశక్తి సంఘాల మహిళలు రోజుకు ఐదువేల అగరవత్తి ప్యాకెట్లు, డిమాండ్‌ను బట్టి సాంబ్రాణి కడ్డీలను తయారు చేస్తున్నారు. ఇలా ఏడాదికి 15 లక్షల ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. 60 గ్రాముల ప్యాకెట్ రూ.50, 120 గ్రాముల ప్యాకెట్ రూ.100, 130 గ్రాములు సాంబ్రాణి కడ్డీల (30) ప్యాకెట్ రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ఏడాది తిరగకుండానే రూ.1.50 కోట్ల లావాదేవీలు నిర్వహించి పెద్దపెద్ద వ్యాపారులను ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన అగరవత్తులను అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం, లోవ కొత్తూరు తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, వీటికి డిమాండ్ పెరుగుతుండటంతో మార్కెట్‌ను విస్తరించేందుకు అమెజాన్ ఇండియా సంస్థతో ఒప్పందం కుదిరింది. వీటికి డిమాండ్ పెరిగింది మేం సేకరించిన పుష్పాలతో అగరవత్తులు తయారు చేసి దైవసన్నిధిలో భక్తులకు విక్రయించడం సంతృప్తినిస్తోంది. పుష్పాలను పౌడర్ చేయడం, పౌడర్‌ను ముద్దగా కలపడం, కలిపిన ముద్దను అగరవత్తులుగా తయారు చేయడానికి ప్రత్యేకంగా యంత్రాలు అవసరం. యంత్రాల కొనుగోలుకు రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు పెట్టుబడి అవసరం. ప్రభుత్వం సహకరిస్తే మరికొందరు మహిళలకు ఉపాధి లభిస్తుంది. – పోల్నాటి సూరన్న, శ్రీపవన్ సూర్య ట్రేడర్స్, టి.తిమ్మాపురం విస్తరణకు తోడ్పాటు అందిస్తాం కుటుంబ సభ్యులు సంయుక్తంగా నిర్వహిస్తున్న అగరవత్తుల తయారీ యూనిట్‌కు రుణం మంజూరుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే స్త్రీ నిధిలో రూ.లక్ష రుణం ఇచ్చాం. పీఎంఎఫ్ఎంఈ పథకంలో రూ.10 లక్షల రుణం మంజూరుకు బ్యాంకులతో చర్చిస్తున్నాం. – వై.సత్తిబాబు, ఏపీఎం, వైఎస్సార్ క్రాంతిపథం, తుని మండలం -
3.80 లక్షల మహిళా గ్రూపులకు రూ.12,070 కోట్లు
సాక్షి, హైదరాబాద్: 2021–22 ఏడాదికి గ్రామీణ దారిద్య్ర నిర్మూలన మిషన్ (సెర్ప్) ద్వారా 3,80,162 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.12,070 కోట్ల బ్యాంక్ లింకేజీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సీఎం కేసీఆర్ రూ.200 కోట్లు మొదటి విడతగా మంజూరు చేశారని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మహిళా సంఘాలు తీసుకునే వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని, అందులో భాగంగానే ఈ మొత్తాన్ని సీఎం విడుదల చేసినట్లు చెప్పారు. గతంలో మహిళలు ప్రతి చిన్న ఖర్చుకు భర్తపై ఆధారపడే పరిస్థితినుంచి డ్వాక్రా సంఘాలు ఏర్పడిన తర్వాత వారు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. -
పొదుపు సంఘాల మహిళల రికార్డు
-
పొదుపులో ఏపీ మహిళలే టాప్
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) ఇపుడు దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల పనితీరుపై నాబార్డు రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడయ్యింది. 2019–20లో ఏపీ స్వయం సహాయక సంఘాలు పొదుపులో దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ వన్ స్థానంలో నిలవగా... 2020–21లో ఏకంగా దేశంలో కెల్లా అగ్రస్థానం సాధించడం గమనార్హం. స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పొదుపు పెరగడమే కాదు అప్పులూ తగ్గాయి స్వయం సహాయక సంఘాల పొదుపు పెరగడమే కాదు వారి అప్పులు కూడా తగ్గాయని నాబార్డు నివేదిక పేర్కొంది. 2019–20తో పోల్చితే 2020–21లో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల పొదుపు ఏకంగా రూ.4,153.37 కోట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పొదుపులో మన రాష్ట్ర సంఘాల పొదుపు 29.17 శాతం ఉండటం గమనార్హం. ఇక ఇదే సమయంలో అప్పులు రూ.5,940.97 కోట్ల మేర తగ్గాయి. ఈ రెండేళ్లలో ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని అమలు చేయడంతో పాటు సకాలంలో రుణాల కిస్తీలను చెల్లించిన సంఘాలకు సున్నా వడ్డీ రాయితీలను అక్కచెల్లెమ్మల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దీంతో మహిళా సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పొదుపు పెరగడం, అప్పులు తగ్గడంతో పురోగతి సాధించాయి. 2019 – 20లో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల క్రెడిట్ లింకేజీ 61.9 శాతం ఉండగా.. 2020–21లో 69.12 శాతానికి పెరిగినట్లు నాబార్డు నివేదిక స్పష్టం చేసింది. పొదుపు సంఘాలు జీవం పోసుకున్నాయిలా.. స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారం చేపట్టిన అనంతరం చంద్రబాబు పైసా మాఫీ చేయకపోగా చివరికి సున్నా వడ్డీకి కూడా ఎగనామం పెట్టారు. ఫలితంగా స్వయం సహాయక సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా ఆ సంఘాల రుణాలు భారీ ఎత్తున నిరర్ధక ఆస్తులుగా మారిపోయాయి. గత సర్కారు తీరుతో స్వయం సహాయక సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని రెండేళ్లలోనే అమలు చేయడంతో స్వయం సహాయక సంఘాలు జీవం పోసుకున్నాయి. గత ఎన్నికల సమయానికి వారికున్న రుణాలను 4విడతల్లో చెల్లిస్తామని చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్ ఇప్పటికే ఒక విడతలో 87.74 లక్షల మంది మహిళలకు రూ.6,792.21 కోట్లు అందచేశారు. అంతేకాకుండా సకాలంలో రుణాలు చెల్లించిన సంఘాల్లోని 87 లక్షల మందికి పైగా మహిళలకు సున్నా వడ్డీ కింద 2019–20లో రూ.1,400.8 కోట్లను చెల్లించారు. 2020–21లో సున్నా వడ్డీ కింద 1.02 కోట్ల మంది మహిళలకు రూ.1,109 కోట్లను చెల్లించారు. దీంతో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి.ఆసరా, సున్నావడ్డీతోపాటు చేయూత పథకం కూడా మహిళలు నిలదొక్కుకోవడానికి దోహదపడుతోంది. అలాగే రిసోర్స్ పర్సన్స్‌కి జీతాలు పెంచి మోటివేట్ చేయడమే కాక.. స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారాల్లో రాణించి ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. -
వడ్డీ మాఫీ వట్టిదేనా!
ఆదిలాబాద్‌రూరల్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఏటా బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తోంది. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం వడ్డీని తిరిగి ఇస్తోంది. 2019 నవంబర్‌లో బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీని ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ చేసింది. మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో వడ్డీలేని రుణ పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాని నెలల తరబడి ప్రభుత్వం వడ్డీని విడుదల చేయకపోవడంతో రుణం పొందిన మహిళా సంఘా ల సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని నెలలుగా పెండింగ్ జిల్లాలో కొన్ని నెలలుగా వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో మహిళా సంఘాల సభ్యులు నిరాశతో ఉన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి క్రమం తప్పకుండా వడ్డీతో సహా వాయిదాలు చెల్లిస్తున్నారు. వాయిదాల చెల్లింపులో క్రమం తప్పితే వడ్డీ మినహాయింపు అవకాశం కోల్పోతారు. దీంతో బ్యాంకు లింకేజీ కింద పొందిన రుణాలకు మహిళా సంఘాల సభ్యులు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ ప్రభుత్వం విడుదల చేయనున్న వడ్డీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత నవంబర్‌లో రూ.618 కోట్లు పెండింగ్‌లో ఉన్న రుణాలకు వడ్డీని విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాని ఈ నిధులు ఇంత వరకు రాలేదు. జమ కాని వడ్డీ జిల్లాలో వడ్డీలేని రుణ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు పొంది క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్న సంఘాలకు సంబంధించి వడ్డీని తిరిగి ప్రభుత్వం చెల్లిస్తోంది. వీటిని ఆయా సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో రూ.107 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా రూ.102 కోట్లు రుణాలు ఇచ్చారు. ఈ రుణాలు పొంది క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ వడ్డీలేని రుణ పథకానికి అర్హత సాధించిన అన్ని సంఘాల సభ్యులకు వడ్డీ జమ చేయాల్సి ఉంది. రెండేళ్ల నుంచి ఎదురుచూపులు రెండేళ్ల నుంచి వడ్డీ జమకాకపోవడంతో మ హిళా సంఘాలు ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో ప్రభుత్వం చేసిన ప్రకటనతో సంఘాల సభ్యులు ఎంతో సంబరపడ్డారు. వడ్డీ డబ్బుతో ప్రస్తుతం చేస్తున్న స్వయం ఉపాధి పనులను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కలుతుందని ఆశించారు. కాని ప్రభుత్వం ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వాటి ఊసేత్తకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్ లింకేజీ రుణాల వడ్డీ ఇవ్వాలి మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అభినందనీయం. కాని వడ్డీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖాతాల్లో జమ చేస్తే బాగుంటుంది. దీంతో మహిళలు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. – రాధ, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు, ఆదిలాబాద్‌రూరల్ రాగానే అందజేస్తాం గత ఆర్థిక సంవత్సరంలో రూ.107 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా రూ.102కోట్లు అందజేశాం. వడ్డీ లేని రుణాలకు నిధులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం వాస్తవమే. కాని ఇప్పటి వరకు ఈ నిధులు రాలేదు. రాగానే వారి ఖాతాల్లో జమ చేస్తాం.– రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీవో -
ఇదీ మన ప్రభుత్వ ఘనత
-
‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు
సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలిపారు. పాదయాత్రలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, మేమంతా మీ వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలో తమకు అండగా ఉన్న మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని, ఈ రాష్ట్రానికి మీ మార్గనిర్దేశం కావాలని పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన అనంతరం వివిధ జిల్లాల నుంచి పొదుపు సంఘాల మహిళలు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల అక్కచెల్లెమ్మలు ఇలా అభిప్రాయపడ్డారు. తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు.. ► దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వడ్డీ భారం తగ్గించడానికి పావలా వడ్డీ ప్రారంభించారు. దురదృష్టం కొద్దీ ఆయన్ని కోల్పోయాం. గత ప్రభుత్వంలో జీరో వడ్డీ లేదు, రుణమాఫీ లేదు. ► పాదయాత్రలో మీరు మా కష్ట సుఖాలను తెలుసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా మా అభ్యున్నతి కోసం సున్నా వడ్డీ పథకం తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. – ఖాజా మున్నీసా, నురానీ పొదుపు సంఘం సభ్యురాలు, ఓర్వకల్లు, కర్నూలు జిల్లా కష్ట సమయంలో ఆదుకున్నారు.. ► గత ప్రభుత్వ సమయంలో మమ్మల్ని మీటింగుల కోసం తిప్పుకున్నారు. ఇవాళ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ► కరోనా సమయంలో ఆదుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రానికి మీ మార్గనిర్దేశం కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరు ఆయు రారోగ్యాలతో చల్లగా ఉండాలి. – రమణమ్మ, నెల్లూరు మండల సమాఖ్య ఉపాధ్యక్షురాలు అనంతపురం జిల్లా గుత్తిలో సోప్ సొల్యూషన్స్‌ను విక్రయిస్తున్న డ్వాక్రా మహిళలు మాట నిలుపుకున్నారు.. ► అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంది. వలంటీర్లు చాలా సేవ చేస్తున్నారు. వెయ్యి రూపాయలు, మూడుసార్లు రేషన్ ఇవ్వడం చాలా మంచి నిర్ణయాలు. ► మాస్క్‌ల తయారీ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడం పట్ల సంతోషిస్తున్నాం. అరటి లాంటి ఉత్పత్తులను మహిళా సంఘాల ద్వారా అమ్మకాలు చేయిస్తున్నారు. తద్వారా కూడా ఉపాధి పొందుతున్నాం. ► గత ప్రభుత్వం మీటింగుల కోసం మమ్మల్ని వాడుకుందే తప్ప.. ఏమీ చేయలేదు. – ఆర్.లక్ష్మి, ప్రగతి సంఘం అధ్యక్షురాలు, కరవది, ప్రకాశం జిల్లా ఇన్ని ఇబ్బందుల్లో వడ్డీ ఊహించలేదు.. మాది లక్ష్మీ తిరుపతమ్మ స్వయం సహాయక సంఘం. ఎన్నికల తేదీ నాటికి రూ.8 లక్షల అప్పు ఉంది. అంతకు ముందు సున్నా వడ్డీ రాయితీ లేకపోవడం వల్ల రూ.75 వేలకు పైగా వడ్డీ చెల్లించాం. ప్రస్తుతం జగన్ ప్రారంభించిన సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపు రూ.80 వేలు వడ్డీ మా ఖాతాల్లో జమ అయింది. ఇన్ని ఇబ్బందుల్లో వడ్డీ సొమ్ము ఇస్తారని మేము అసలు ఊహించ లేదు. ముఖ్యమంత్రికి రుణ పడి ఉంటాం. –ఎస్.వెంకట శివకుమారి, కృష్ణా జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
సర్కారుదే వడ్డీ భారం..మహిళాభివృద్ధికి ఊతం
దేశ వ్యాప్తంగా మహిళలు చాలా మంది ఇప్పటికీ ఏ చిన్న అవసరం వచ్చినా డబ్బుల కోసం అధిక వడ్డీలకు ఏదో ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థ వద్ద చేతులు చాచే పరిస్థితి. తీసుకున్న అప్పునకు వడ్డీ తడిసి మోపెడయ్యేది. చిన్న చిన్న వ్యాపారాలు చేసి వారు సంపాదించిందంతా వడ్డీ కట్టడానికే సరిపోయేది. ఒక వేళ బ్యాంకుల్లో రుణం తెచ్చుకున్నా ఇదే పరిస్థితి. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో ఇకపై రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కష్టాలకు చెక్ పడినట్లే. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించిన ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం’తో మహిళలు పూర్తి ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగనున్నారు. ఇంటిలో చిన్నచిన్న అవసరాలకే కాదు భర్త సంపాదనకు తోడు మహిళలెవరైనా ఓ మోస్తరు వ్యాపారం ప్రారంభించడానికి కూడా రాష్ట్రంలో ఇప్పుడు సున్నా వడ్డీకే రుణం దక్కే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన మహిళలు దాదాపు కోటి మందికిపైగా పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. వీరిలో 90 లక్షల మందికి పైగా మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వారు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ఈ ఏడాదికి గాను వడ్డీ భారాన్ని ప్రభుత్వమే చెల్లించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కొత్తగా సంఘాలు ఏర్పడి, ఇప్పటికీ బ్యాంకుల నుంచి రుణం తీసుకోని లాంటి వారు దాదాపు పది లక్షల మంది.. రాను రాను ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 18వ తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం వివరాల ప్రకారం రాష్ట్రంలో 8,91,210 పొదుపు సంఘాలకు రూ.27,950 కోట్లు రుణంగా ఇచ్చారు. తీసుకున్న రుణాన్ని వారు సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తే.. దానిపై వడ్డీ భారం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. మధ్యలో.. మాట చెప్పి మోసం చేసిన చంద్రబాబు ► మన రాష్ట్ర పొదుపు సంఘాల కార్యకలాపాల్లో ఒక క్రమశిక్షణ ఉంది. మహిళలు ప్రతి నెలా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పొదుపు చేసుకోవడం.. సంఘాల వారీగా సమావేశమై తమ సాధక బాధకాలను ఆ సమావేశాల్లో చర్చించుకోవడం అలవాటుగా మారింది. ► అవసరమైన వారికి పొదుపు డబ్బును నామమాత్రపు వడ్డీతో అప్పు ఇవ్వడం, ఇతరత్రా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహిళలు క్రమశిక్షణతో వ్యవహరించేవారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించే వారు. మహిళల క్రమశిక్షణ చూసి.. బ్యాంకులు ఆ సంఘాలకు విరివిగా రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ► 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా (పొదుపు) సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని బేషరతుగా మాట ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆ మాట నిలుపుకోకుండా మోసం చేయడంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల క్రమశిక్షణ ఒక్కసారిగా గాడి తప్పింది. రుణ మాఫీ హామీపై చంద్రబాబు చేసిన మోసంతో మహిళలు తమ అప్పుల వడ్డీలపై చక్ర వడ్డీలు చెల్లించక తప్పలేదు. ► రాష్ట్రంలోని పొదుపు సంఘాల ద్వారా ప్రతి నెలా కోటి రూపాయల వరకు ఉండాల్సిన మహిళల పొదుపు.. చంద్రబాబు ప్రభుత్వ మోసం కారణంగా అప్పట్లో ఒకానొక సమయంలో కేవలం రూ.7 లక్షలకు పడిపోయింది. ఐదు లక్షల సంఘాలు ఒక్కసారిగా క్రమశిక్షణ తప్పి ‘ఏ’ గ్రేడ్‌లో ఉండాల్సినవి బీ, సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి. ► పావలా వడ్డీ పథకం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను సకాలంలో చెల్లించే వారికి ప్రభుత్వం వడ్డీ రాయితీ అమలులో ఉండేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వడ్డీ రాయితీ డబ్బులను పొదుపు సంఘాలకు చెల్లించడం మానేసింది. దీంతో మహిళలపై మరింత వడ్డీ భారం పడింది. అవాంతరాలలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి.. ► వైఎస్ జగన్ తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కష్టాలు కళ్లారా చూశారు. వారు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు సంబంధించిన వడ్డీని తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ► రాష్ట్రంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా, ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నా.. తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపునే అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలన్న పట్టుదలతో శుక్రవారం (ఏప్రిల్ 24న) వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ పావలా వడ్డీ పథకమే పెద్ద విప్లవం.. ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004కు ముందు చిన్న చిన్న అప్పులపై మైక్రో ఫైనాన్స్ సంస్థలు వసూలు చేసే అధిక వడ్డీల కారణంగా మహిళల ఇబ్బందులను చూసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలించిపోయారు. ► పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై కేవలం పావలా వడ్డీని మాత్రమే మహిళల నుంచి వసూలు చేసి, మిగిలిన వడ్డీ భారాన్ని ప్రభుత్వం చెల్లించడమే పావలా వడ్డీ పథకం. ► రాష్ట్రంలోని ప్రతి మహిళను లక్షాధికారిగా చూడాలన్నదే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పం. ఈ నేపథ్యంలో ఈ పథకం పొదుపు సంఘాల చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది. ► దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ ఆలోచనల నుంచి వచ్చిన ఈ పథకం వల్ల అప్పట్లో మన రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు పొదుపు సంఘాల బాట పట్టారు. ► ప్రస్తుత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు 8.78 లక్షల పొదుపు సంఘాలు ఉండగా, అందులో 2,90,928 పొదుపు సంఘాలు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న 2004–08 «మధ్య కాలంలో నాలుగేళ్లలో ఏర్పడినవే కావడం గమనార్హం. ► పావలావడ్డీ పథకం వల్ల మన రాష్ట్రంలో మహిళలు పొదుపు సంఘాల్లో చేరడానికి చూపిన ఆసక్తి చూసి, కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా 250 జిల్లాలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు కారెంశెట్టి సునీత. గుంటూరు నగరంలోని అంకమ్మనగర్‌లో సంతోష్ డ్వాక్రా సంఘం సభ్యురాలు. గ్రూపు తరఫున రూ.10 లక్షలు రుణం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన సున్నా వడ్డీ పథకం కింద శుక్రవారం రూ.32,548 వారి ఖాతాల్లో జమ అయింది. చంద్రబాబు పాలనలో లక్ష రూపాయలకు పైగా వడ్డీ చెల్లించామని వాపోయింది. వైఎస్ జగన్ మాట ఇచ్చినా, కరోనా కష్టాల మధ్య వడ్డీ సొమ్ము జమ చేస్తారని ఊహించలేదని సంభ్రమాశ్చర్యాల మధ్య చెప్పింది. ఈ రోజు తన లాగే లక్షలాది మంది మహిళలు ఆనంద పడుతున్నారంటే అందుకు కారణం ముమ్మాటికీ సీఎం జగనే అని, ఆయన ఇచ్చిన ఊతంతో ఇకపై ఆర్థికంగా మరింతగా నిలదొక్కుకుంటామనే నమ్మకం కలిగిందని వివరించింది. -
..మీ కష్టం నాది
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన రాష్ట్రంలోని 27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇళ్ల స్థలాలను మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాం. అంతే కాకుండా ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తాం. కరోనా లేకపోయుంటే.. ఇప్పటికే అక్షరాలా 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యేవి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. నాన్నగారి పుట్టిన రోజు జూలై 8న ఈ కార్యక్రమం చేయాలని భావిస్తున్నాం. కరోనా వల్ల ఆదాయం రాని పరిస్థితులు ఉన్నా.. అక్కచెల్లెమ్మలకు ఈ పథకం తీసుకురావడం వల్ల కాస్తో కూస్తో మేలు జరుగుతుందని అనుకుంటున్నాం. ఈ పథకం ద్వారా 8 లక్షల 78 వేల గ్రూపుల్లోని 91 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. ప్రతి గ్రూపునకు కనీసం రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు లబ్ధి కలుగుతుంది. ప్రతి ఏటా ఈ పథకం ద్వారా ఆ మేరకు లబ్ధి పొందుతారు. రూపాయి పైచిలుకు వడ్డీ ఉన్న రుణాలను మొదట పావలా వడ్డీకే మహానేత, దివంగత సీఎం వైఎస్సార్ తీసుకు వస్తే.. ఆ పథకం తర్వాత సున్నా వడ్డీగా మారింది. 2016లో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు అందరికీ ఈ పథకం కింద రూ.1400 కోట్లు ఇవ్వగలగుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రం, దేశం, ఇతర దేశాలు కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కష్టపడుతున్నాయి. అయితే మీ కష్టం ఇంతకంటే పెద్దది. అందుకే ఈ కష్టకాలంలో కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అండగా ఉండాలని నిర్ణయించాం. మీరు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారాన్నంతటినీ ఇకపై ప్రభుత్వమే భరించేలా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి మహిళల ఖాతాల్లోకి సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లను పంపించారు. అనంతరం జిల్లాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 7 నుంచి 13 శాతం వడ్డీ భరిస్తున్నాం ► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రూ.3 లక్షల పరిమితి వరకు ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. మిగిలిన 7 జిల్లాల్లో డ్వాక్రా సంఘాలకు 11 నుంచి సుమారు 13 శాతం వరకూ వడ్డీ భారం వేస్తున్నారు. ఈ లెక్కన సున్నా వడ్డీ అమలు చేయాలంటే 7 శాతం నుంచి 13 శాతం వరకు ఉన్న వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి. ► ప్రతి పథకంలో అక్కచెల్లెమ్మలకే పెద్దపీట వేశాం. మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు మహిళా మంత్రులు (ఒకరు డిప్యూటీ సీఎం), సీఎస్ స్థానంలో ఉన్న మహిళా అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ► తల్లులు, అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే పూర్తిగా సద్వినియోగం అవుతుందని నా భావన. ఫలితాలు బాగుండాలి. ప్రతి పైసా సద్వినియోగం అవుతుందని భావిస్తున్నాం. ఇదీ మన ప్రభుత్వ ఘనత ► 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద జనవరి 9వ తేదీన 15,000 రూపాయల చొప్పున జమ చేశాం. ► పిల్లల చదువులు బాగుండాలనే ఉద్దేశంతో నాడు–నేడు కింద స్కూళ్లలో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నాం. ► నామినేటెడ్ పనులు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని గొప్ప చట్టం తీసుకు వచ్చాం. ► వక్ర బుద్ధితో అక్కచెల్లెమ్మల వైపు చూస్తే.. కఠినంగా శిక్షలు వేసేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ దిశ చట్టాన్ని తీసుకొచ్చాం. త్వరలో రాష్ట్రపతి దీనికి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాం. 13 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేక కోర్టులు తీసుకొస్తున్నాం. ప్రత్యేక యాప్ కూడా కూడా తీసుకొచ్చాం. ► ప్రతి గ్రామ సచివాలయంలో ఒక మహిళా పోలీసును పెట్టాం. 11 వేలకుపైగా మహిళా పోలీసులను రిక్రూట్ చేసి ఉద్యోగాలు ఇవ్వగలిగాం. గ్రామ సచివాలయాల్లో 7 నుంచి 8 మంది మహిళా మిత్రలను ఏర్పాటు చేశాం. బెల్టుషాపులు ఉన్నా, గృహ హింస జరిగినా.. వెంటనే తగిన చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో హర్షం వ్యక్తం చేస్తున్న పొదుపు సంఘాల మహిళలు పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యం ► ‘వసతి దీవెన’ అని ఇటీవల 12 లక్షల మందికి మేలు జరిగేలా ఓ పథకాన్ని తీసుకొచ్చాం. ఇందులో భాగంగా డిగ్రీ, ఇంజినీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదివే వారికి రెండు దఫాల్లో రూ.20 వేలు తల్లుల అక్కౌంట్లో వేస్తున్నాం. ► ఇదివరకెన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ రూ.1,880 కోట్లు పూర్తిగా చెల్లించడమే కాకుండా ఈ ఏడాదికి సంబంధించి దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా భారం భరిస్తూ గత నెల 31 వరకు ఉన్న ఫీజు బకాయిలు అన్నీ కలిపి దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా వచ్చే మంగళవారం పూర్తిగా చెల్లిస్తాం. అనంతరం మూడు నెలలకు సంబంధించిన ఫీజు.. జూన్ నుంచి ఆగస్టు వరకు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం. ► తద్వారా తమ పిల్లలు ఎలా చదువుతున్నారు? కాలేజీల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? అని తల్లులు చూసుకుని ఆ ఫీజులు చెల్లిస్తారు. జవాబుదారీ తనం కోసమే ఇలా చేస్తున్నాం. ► రాబోయే కాలంలో ఇంకా మంచి పనులు చేయడానికి దేవుడి దీవెనలు ఉండాలని కోరుతున్నాను. ► ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఇతర అధికారులు పాల్గొన్నారు. 27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు జూలై 8న వైఎస్సార్ జయంతి రోజు పంపిణీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన రాష్ట్రంలోని 27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇళ్ల స్థలాలను మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాం. అంతే కాకుండా ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తాం. కరోనా లేకపోయుంటే.. ఇప్పటికే అక్షరాలా 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యేవి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. నాన్నగారి పుట్టిన రోజు జూలై 8న ఈ కార్యక్రమం చేయాలని భావిస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ ఇక ఆర్థికంగా నిలదొక్కుకుంటాం కరోనా సమయంలో కూడా బియ్యం, కందులు, శనగలు ఇచ్చారు. మా ఊళ్లో ఇంటి స్థలం విలువ రూ.20 లక్షలు. అలాంటి చోట కూడా ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. సొంత అన్నలా.. తమ్ముడిలా ఇస్తున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి.. చేయలేదు. రుణాలు, దానిపై వడ్డీ తడిసి మోపెడైంది. ఇకపై ఆర్థికంగా నిలదొక్కుకుంటాం. – కె.పద్మావతి, ఆనందపురం మండల సమాఖ్య సభ్యురాలు, విశాఖపట్నం మా కుటుంబాల్లో గౌరవం పెరిగింది.. సుదీర్ఘ పాదయాత్రలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఇస్తామన్నారు. అనుకున్నట్టే మాకు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ పావలా వడ్డీ కింద రుణాలు ఇచ్చారు. మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయం. మా కుటుంబాల్లో మాకు గౌరవం పెరిగింది. దిశ చట్టాన్ని తీసుకు వచ్చి.. మహిళలకు పూర్తి రక్షణ ఇస్తున్నారు. – సుగుణకుమారి, మదర్‌థెరిస్సా మహిళా సంఘం సభ్యురాలు, కాకినాడ -
సేంద్రియ మహిళా రైతుల బజార్!
తమిళనాడు ప్రభుత్వం స్వయం ఉపాధి సంఘాలకు చెందిన వేలాది మంది మహిళలను సేంద్రియ సాగుకు ప్రోత్సహించడంతోపాటు.. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు దేశంలోనే తొలి మహిళా రైతుల బజార్‌ను ఏర్పాటు చేయటం ప్రశంసనీయం. గ్రామీణ ప్రాంతాల నుంచి సేంద్రియ ఉత్పత్తులను చెన్నై నగర వినియోగదారుల వద్దకు చేర్చడంలో తమిళనాడు కార్పొరేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ విమెన్, ఆర్గానిక్ ఫార్మర్స్ మార్కెట్(ఓఎఫ్ఎమ్) సంయుక్తంగా మహిళా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. చెన్నై వల్లువర్‌కోట్టం హైరోడ్డులోని మదర్ థెరిసా ఉమెన్ కాంప్లెక్స్‌లో ప్రతి నెలా మొదటి శని, ఆదివారాల్లో మహిళల నేతృత్వంలో సేంద్రియ ఉత్పత్తుల బజార్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా మహిళా రైతులు తమ సేంద్రియ ఉత్పత్తులను ఇక్కడకు తెచ్చి విక్రయించుకోగలుగుతున్నారు. కూరగాయలు, పండ్లు, దేశవాళీ రకాల వరి బియ్యం, చిరుధాన్యాల బియ్యం, పప్పుధాన్యాలు, గానుగ నూనెలతోపాటు.. విలువను జోడించిన వివిధ ఉత్పత్తులను మహిళా సేంద్రియ రైతులు విక్రయిస్తున్నారు. ఒకే ఉత్పత్తిపై ఎక్కువమంది దృష్టి పెట్టి ధరపడిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. సేంద్రియ సాగు, మార్కెటింగ్‌లో ఆరోగ్యకరమైన పోటీకి అద్దంపడుతున్నారు. తమా ఊరంతా సేంద్రియ సేద్యమే! మా ముత్తాత కాలం నుంచీ మా కుటుంబం వ్యవసాయంలో ఉంది. నేను నాలుగో తరం రైతును. గతంలో సాధారణ వ్యవసాయం చేసి, రెండేళ్ల క్రితం నుంచే సేంద్రియ సేద్యం చేస్తున్నాను. ఎనిమిదెకరాల్లో వరి, మూడెకరాల్లో కాయగూరలు పండిస్తున్నాం. వరిలో పెద్దగా లాభం రాకున్నా కాయగూరల్లో మంచి గిట్టుబాటుంది. గత నెల ఏర్పాటు చేసిన తొలి ఎగ్జిబిషన్ స్టాల్లో ఒకే రోజున రూ.12 వేల విలువైన కూరగాయలు అమ్మాను. రెండోరోజు స్టాల్ ఉన్నా సరకులేకపోయింది. మా ఊళ్లో రైతులంతా సేంద్రియ సాగే చేస్తున్నారు. – జయ, కారణపట్టి గ్రామం, కడలూరు జిల్లా 20 రకాల సేంద్రియ ఉత్పత్తులను అమ్ముతున్నా.. నా సొంతూరు తిరుత్తణి. తిరువళ్లూరులో పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చదివి కొన్నేళ్లు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేశాను. సొంత ఊరు, వ్యవసాయంపై మమకారంతో తిరిగొచ్చేశా. వ్యవసాయంతోపాటు గోశాల, చేపల పెంపకం ఉంది. 2012లో పొలం కొన్నప్పటి నుంచి సేంద్రియ సేద్యంలోకి మారాను. నాలుగు తరాలుగా మా కుటుంబాలకు వ్యవసాయమే అధారం. ఉసిరి తదితరాలతో తయారు చేసిన 20 సేంద్రియ ఉత్పత్తులను అమ్ముతాను. సౌందర్య పోషక సామాగ్రిని తయారు చేసి అమ్మటం మా ప్రత్యేకత. ఇంట్లోనే స్టాక్ పెట్టుకొని తమిళనాడులోని అనేక ఆర్గానిక్ షాపులకు సౌందర్య సామాగ్రిని సరఫరా చేస్తాను. – అనురాధ బాలాజీ, పెరియపాళయం, తిరువళ్లూరు జిల్లా 12 సంవత్సరాలుగా సేంద్రియ ఉత్పత్తులు అమ్ముతున్నా.. బీఎస్సీ చదివాను. 12 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. నాలుగు ఎకరాల్లో వరి, ఒక ఎకరా కొబ్బరి తోట వేశాను. 18 పాడి ఆవులు, 22 బర్రెలు ఉన్నాయి. నేను, మా వారు కలిసి వీటి పనులు చూసుకుంటాం. 7 రకాల దేశవాళీ బియ్యం, నెయ్యి, పసుపు, కొబ్బరి నూనె, వర్మికంపోస్ట్, పంచగవ్య సహా 12 ఉత్పత్తులు తయారు చేసి అమ్ముతున్నాం. – సీతాలక్ష్మి, అరలికోటై్ట గ్రామం, శివగంగా జిల్లా వ్యవసాయం చేస్తున్నానని చెప్పుకునేందుకు గర్విస్తున్నా! ప్లస్‌టూ వరకు చదువుకున్నాను. వంశపారంపర్యంగా వ్యవసాయం చేస్తూ రైతును అని చెప్పుకునేందుకు గర్వబడుతున్నా. యజమాని పంట పొలాల్లో దిగి పని చేసినప్పుడే కూలీలు కూడా శ్రద్ధగా పని చేస్తారు. రెండెకరాల్లో వరి, ఒక ఎకరాలో పప్పు ధాన్యాలు, ఉసిరి కాయలు, చిరుధాన్యాలను పండిస్తున్నా. ఆరోగ్యదాయకమైన మురుకులు, వాంపొడి వంటి వాటితో చిరుతిళ్లలతోపాటు సుమారు 20 రకాల వస్తువులు తయారు చేసి అమ్ముతున్నాను. ఈ ఉత్పత్తుల వల్ల ఎదుటి వారికి ఆరోగ్యం లభించడం వల్ల నాకు ఆదాయం, పుణ్యం రెండూ లభిస్తున్నాయి. సేంద్రియ సేద్యంపై రైతులకు శిక్షణ ఇస్తున్నాను. గత నెలలో స్టాల్ పెట్టినప్పుడు మొదటి రోజునే రూ. 15 వేలు, రెండో రోజున రూ. 17 వేలు అమ్మాను. – కవితా ఇళంగోవన్, పులియకుడి, తంజావూరు జిల్లా చదువు రాకపోయినా ఆర్థికంగా నిలదొక్కుకున్నా మా గ్రూప్‌లో 12 మంది మహిళా రైతులం కలసి సేంద్రియ పంటలు పండించి ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కోల్కత్తా, ముంబై తదితర రాష్ట్రాల నుంచి మాకు ఆర్డర్లు వస్తుంటాయి. కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్నాం. కొరియర్ ఖర్చులు కూడా వినియోగదారులే భరిస్తారు. 12 రకాల మసాలా వస్తువులు, పది రకాల టీ పొడులు అమ్ముతున్నా. తీరిక వేళల్లో నీలగిరిలోని సేంద్రీయ టీ ఆకు తోటల్లో పని చేస్తున్నా. రాయడం, చదవడం నాకు బొత్తిగా రాకున్నా, సేంద్రియ వ్యవసాయం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకున్నా. – ఎస్.గోమతి, నీలగిరి ఉద్యోగం వదిలేసి వచ్చా.. బీఈ పాస్సై కొన్నాళ్లు ఐటీ కంపెనీలో పని చేశాను. సేంద్రియ వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం వదిలి ఈ రంగంలోకి వచ్చాను. సోప్ నట్స్, శీకాకాయలు, కుంకుళ్లు వినియోగించి 40 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాను. మల్టీపర్పస్ క్లీనింగ్ ల్విక్విడ్ ఎంతో మేలైనది. ప్రకృతికి దగ్గరగా జీవితాన్ని గడపాలని రెండేళ్ల క్రితం నుంచి ఆర్గానిక్ ఫుడ్ ట్రైనింగ్, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నా. – ప్రియదర్శిని, చెన్నై ఉత్పత్తులకు రైతమ్మలే గిట్టుబాటు ధర నిర్ణయించుకుంటారు! సేంద్రియ ఉత్పత్తులు తినటంపై ప్రజలు ఎక్కువ ఆసక్తి కనబర్చడం వల్ల అమ్మకాలు సులువైనాయి. వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా సేంద్రియ రైతులు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకుంటున్నారు. ఆర్డర్లు వస్తున్నాయి. ఇక ధర ల విషయానికి వస్తే ఇతర ఉత్పత్తులకు భిన్నంగా ఏమీ లేదు. డిమాండ్, దిగుబడిని బట్టి ధర పలుకుతోంది. మధుమేహ రోగులకు ప్రీతిపాత్రమైన బియ్యం మంచి ధర పలుకుతుంది. రైతులు తమ ప్రాంతాల్లో వనరులు, సాగుబడి ఖర్చులు, మార్కెట్‌కు చేరవేయండం తదితర ఖర్చులను బేరీజు వేసుకొని ఎవరికి వారే గిట్టుబాటు ధరను నిర్ణయించుకుంటారు. స్టాక్ ఎక్కువైనపుడు ధర పడిపోవడం సహజం. నేను రైతును కాను. అయితే, సమాజం, మార్కెటింగ్‌పై ఉన్న అవగాహనతో రైతమ్మలకు మార్గదర్శకం చేస్తుంటాను. – శుభ భరద్వాజ్(94449 26128), సమన్వయకర్త, సేంద్రియ మహిళా రైతుల మార్కెట్, చెన్నై ఉచితంగా స్టాళ్లు.. ప్రయాణ ఖర్చులు సేంద్రియ ఉత్పత్తులకు ప్రజల్లో బాగా ఆదరణ పెరిగింది. ఒకే చోట క్రమం తప్పకుండా ప్రజలకు సేంద్రియ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడానికి ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేశాం. ప్రతి నెలా రెండు రోజుల పాటు సేంద్రియ మహిళా రైతులకు స్టాళ్లను ఉచితంగా ఇవ్వడంతోపాటు ప్రయాణ ఖర్చులు, భత్యం కూడా చెల్లించి ప్రోత్సహిస్తున్నాం. – సెంథిల్ కుమార్(97875 04035), తమిళనాడు పౌరసరఫరాలు, మార్కెటింగ్ విభాగం అధికారి, చెన్నై – కథనం: కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
సాధికారతతో సమస్యలపై పోరు
న్యూఢిల్లీ: ఆర్థిక సాధికారత సాధించిన మహిళలు సామాజిక సమస్యలపై పోరాడగలుగుతారని ప్రధాని మోదీ అన్నారు. మహిళల్లో అపార శక్తి దాగి ఉందని, తమ శక్తి సామర్థ్యాలేమిటో వారు గుర్తించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు కోటి మంది స్వయంసహాయక బృందాల మహిళలతో నమో యాప్ ద్వారా ముచ్చటించారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని ఉద్ఘాటించారు. ‘మహిళా సాధికారతకు ఆర్థిక స్వాతంత్య్రం ముఖ్యం. మహిళలు ప్రతిభావంతులు. వారికి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. తామేంటో నిరూపించుకునేందుకు వారికి అవకాశం ఇస్తే చాలు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళా సాధికారతకు దోహదపడుతుంది. ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడిన మహిళలు అన్ని సామాజిక దురాచారాలకు ఎదురొడ్డి నిలుస్తారు’ అని కితాబిచ్చారు. గ్రామీణాభివృద్ధిలో స్వయం సహాయక బృందాల పాత్రను ఆయన కొనియాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 20 లక్షల స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేశామని, 2.25 కోట్లకు పైగా కుటుంబాలను వాటిలో భాగం చేశామని తెలిపారు. ప్రస్తుతం 45 లక్షల స్వయం సహాయక బృందాల్లో సుమారు 5 కోట్ల మంది మహిళలు క్రియాశీలకంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి ఈ బృందాలు పునాది వేస్తున్నాయని ప్రశంసించారు. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన వ్యవసాయం, పశుపోషణ రంగాలు మహిళలు లేకుండా మనుగడ సాగించలేవని అన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలు తమ జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును, స్ఫూర్తిదాయక గాథలను పలువురు మహిళలు ప్రధానితో పంచుకున్నారు. ‘వారసత్వ’ రక్షణకు ప్రజా భాగస్వామ్యం దేశ వారసత్వ సంపద పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రాచీన కట్టడాలను విస్మరించడంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని..వాటి ప్రాముఖ్యతను యువ తరానికి తెలియజేసి వారి వైఖరిలో మార్పు తీసుకురావాలని అభిలషించారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో మోదీ గురువారం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..మన ప్రాచీన వారసత్వ కట్టడాలు, సంపదను కాపాడుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని నొక్కి చెప్పారు. కొన్ని కట్టడాల వద్ద ప్రజలు ఫొటోలు, సెల్ఫీలు దిగకుండా నిషేధాజ్ఞలు విధించడాన్ని తప్పు పట్టారు. ‘విదేశాల్లో ఎక్కడికెళ్లినా ప్రాచీన కట్టడాల వద్ద రిటైర్ అయిన వారే గైడుగా పనిచేస్తూ కనిపిస్తారు. వాటిని కాపాడుకునే బాధ్యతను సమాజమే తీసుకుంటుంది. అలాంటి విలువలనే భారత్‌లోనూ పాదుకొల్పాలి. పాఠశాలల సిలబస్‌లో వారసత్వ కట్టడాల సమాచారాన్ని చేరిస్తే, విద్యార్థులు వాటి గురించి తెలుసుకుంటూ పెరుగుతారు. టూరిస్ట్ గైడుగా పనిచేసేలా యువతను ప్రోత్సహించాలి. వారసత్వ స్థలాల పరిరక్షణలో పాలుపంచుకునేలా కార్పొరేట్ కంపెనీలను ఒప్పించాలి’ అని అన్నారు. -
వడ్డీ పడతలే..
సాక్షి, సిద్దిపేట: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వం.. పావలా వడ్డీకి రుణాలు అందిస్తే.. టీఆర్ఎస్ సర్కార్ వడ్డీ లేకుండా రుణాలు అందిస్తామని ప్రకటించి మహిళలను సంతోషంలో ముంచేసింది. ఈ ప్రకటన మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతోంది. మూడు సంవత్సరాలుగా జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు వడ్డీ డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదు. తీసుకున్న రుణాలను వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు తెగేసి చెప్పడంతో మహిళలు ఆందోళన చెందుతున్నాయి. ఈక్రమంలో రుణ గడువు ముగిసే నా టికి వడ్డీ డబ్బులు చెల్లించాల్సిన ప్రభుత్వం.. డబ్బులు విడుదల చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ కోసం ఎదురుచూపులు మహిళా సంఘాలు బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తోంది. ఒకవేళ మహిళలు ముందుగా చెల్లించే వడ్డీ డబ్బులను సైతం వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మహిళా సంఘాలు సంతోషడ్డాయి. అయితే, మూడేళ్లుగా అప్పునకు అసలు పోగా వడ్డీ డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో నని మహిళలు ఎదు రు చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 22 మండలాల పరిధి లో 712 గ్రామైక్య సంఘాలు, 17,432 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఆయా సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు, వికలాంగులకు చెందిన సంఘాల్లో మొత్తం 1,88,990 మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి మూడేళ్లుగా రూ.77.68 కోట్ల వడ్డీ డబ్బులు రావాల్సి ఉందని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇందులో 2015–16 ఆర్థిక సంవత్సరానికి రూ.26.65 కోట్లు, 2016–17 ఆర్థిక సంవత్సరానికి రూ.30.03 కోట్లు, 2017–18 సంవత్సరానికి రూ.21 కో ట్లు ఉన్నాయి. ప్రభుత్వం వడ్డీ లేకుండా రుణం ఇస్తుందని.. అప్పులు తీసుకుంటే మూడు సంవత్సరాలుగా వడ్డీ రాకపోవడంతో అప్పు లు చేసి రుణం తీర్చామని మహిళలు చెబుతున్నారు. వడ్డీ డబ్బులు వస్తే పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు ఉపయోగించుకుంటామంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధు లు స్పందించి ప్రభుత్వం నుంచి వడ్డీ డబ్బులు త్వరగా విడుదల చేసేలా కృషి చేయాలని మహిళలు కోరుతున్నారు. త్వరలో విడుదలవుతాయి మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు చెల్లించిన వారికి వడ్డీ ప్రభుత్వం ఇస్తుంది. జిల్లాలోని అన్ని సంఘాలకు సంబంధించిన వడ్డీ బకాయిలు విడుదల చేయాలని ఉన్నతాధికారులకు వివరించాం. ప్రభుత్వం నుంచి వడ్డీ డబ్బులు త్వరలో విడుదలవుతాయి. నేరుగా బ్యాంకుల ద్వారా వారి అకౌంట్లలో జమ చేసేలా చర్యలు తీసుకుంటాం. – స్వామి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రూ.4 లక్షల అప్పు తీసుకున్నం.. మాది వర్షం మహిళా గ్రూపు. మా సంఘంలో సభ్యులంతా కలిసి బ్యాంకుల రూ.4 లక్షల అప్పు తీస్కున్నం. నెలనెలా క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లించాం. సక్రమంగా చెల్లించిన రుణాలకు వడ్డీ మాఫీ అన్నరు. మూడెండ్లవుతున్నా ఇప్పటి వరకు వడ్డీ మాఫీ అయినా పైసల్ మా ఖాతాల జమ కాలేదు. మాఫీ అయిన వడ్డీ రుణాలను ఎప్పుడిస్తరని ఐకేపీ సార్లను, బ్యాంకు సార్లను అడిగినా ఫలితం లేకుండే. – ఎర్రోల్ల ఎల్లవ్వ, మహిళా గ్రూపు సభ్యురాలు, మిరుదొడ్డి ఇప్పటి వరకు జమ కాలె.. బ్యాంకు రుణాలు ప్రతినెలా చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుందంటే మా మహిళా గ్రూపు సభ్యులమంతా కలిసి బ్యాంకుల రూ.5 లక్షల రుణం తీసుకున్నం. బ్యాంకుల తీసుకున్న రుణాలకు నెలనెలా అప్పు చెల్లించినం. చెల్లించిన రుణాలకు వడ్డీ మాఫీ చేస్తమన్నరు. మాఫీ అయిన వడ్డీ మా ఖాతాల జమ అయితయన్నరు. ఇప్పటికి మూడెళ్లయితుంది. మాఫీ అయిన వడ్డీ పైసలు ఇప్పటి వరకు జమకాలే. – సునంద, మహిళా గ్రూపు సభ్యురాలు, లింగుపల్లి -
ఆపరేషన్ బ్లాక్‌మనీ
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : నల్లధనాన్ని మార్చుకునేందుకు అధికార పార్టీ నేతలు కొత్త వ్యూహం పన్నారు. డ్వాక్రా మహిళలను లక్ష్యంగా చేసుకుని పాత పెద్దనోట్లను మార్చే పనిలో పడ్డారు. తమకు అనుకూలంగా ఉన్న గ్రూపులను ఇందుకు ఎంచుకుంటున్నారు. ఆయా గ్రూపుల్లోని సభ్యులు బ్యాంకులో తీసుకున్న రుణం ఏమాత్రం ఉందో తెలుసుకుని వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు. డ్వాక్రా మహిళలు పాత రుణం చెల్లిస్తే మరోసారి రుణం తీసుకునే అవకాశం ఉండటంతో.. తాము కట్టిన సొమ్మును కొత్త రుణం వచ్చాక తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు డీఆర్డీఏ అధికారులపై ఒత్తిళ్లు తెస్తూ.. డ్వాక్రా గ్రూపులను తమకు అనుకూలంగా పనిచేయించేలా చూడాలని కోరుతున్నారు. జ¯ŒSధ¯ŒS ఖాతాలపై ఆంక్షలతో.. పేదలు, మహిళలు ప్రారంభించిన జ¯ŒSధ¯ŒS ఖాతాలను కొందరు నల్ల ధనం మార్పిడికి ఉపయోగించుకుంటున్నారనే అనుమానంతో ఈ ఖాతాల్లో రూ.50 వేలకు మించి పాతనోట్లను జమ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలను చెల్లించే ఎత్తుగడతో టీడీపీ నేతలు ముందుకు వస్తున్నట్టు సమాచారం. నగదు రాలేదంటూ బోర్డులు చాలా బ్యాంకుల వద్ద నగదు ఇంకా రాలేదంటూ గురువారం ఉదయం బోర్డులు పెట్టారు. తపాలా కార్యాలయాల్లోనూ నగదు ఇవ్వలేదు. ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. లింగపాలెం మండలం కె.గోకవరం పోస్టాఫీసులో రూ.500, రూ.1000 పాతనోట్లకు చిల్లర ఇవ్వకపోవడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. మరోవైపు కొత్త నోట్లపై ప్రజలకు పూర్తిగా అవగాహన లేకపోవడంతో వీటిని అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడే ప్రబుద్ధుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం పంచాయతీ పరిధిలోని గౌరీ శంకరపురం గ్రామానికి చెందిన పొలిమెరశెట్టి సత్యనారాయణ, బొబ్బేటి ఆనందరావు రూ.2 వేల నోటును కలర్ జిరాక్సు తీయించి, దాంతో మక్కినవారిగూడెంలోని మద్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. అక్కడ వాగ్వాదానికి దిగడంతో పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. పెళ్లిళ్లకు ఊరట పెళ్లికి సంబంధించి ఆ కుటుంబ స్వీయ ధ్రువీకరణ, పా¯ŒS కార్డు వివరాలు సమర్పించి ఒకేసారి రూ.2.50 లక్షలు తీసుకునే వెసులుబాటు కల్పించడం కొంత ఊరటనిస్తోంది. వరుడు లేదా వధువు, వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కల్పించారు. పెళ్లి నిమిత్తం ఒకరి ఖాతా నుంచి మాత్రమే అనుమతించిన మేరకు డబ్బు తీశామని.. మరే ఖాతా నుంచి పెళ్లి పేరుతో నగదు తీసుకోలేదని స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సదరు వ్యక్తి బ్యాంకులో అందజేయాలి. పంట రుణం పొందిన, కిసా¯ŒS క్రెడిట్ కార్డు ఉన్న రైతు తన ఖాతా నుంచి వారానికి రూ.25 వేలు నగదు తీసుకునే అవకాశం కల్పించారు. -
‘స్త్రీ శక్తి’కి గ్రహణం
సాక్షి, కొత్తగూడెం: స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు మండల స్థాయిలో వేదికలైన స్త్రీ శక్తి భవనాలకు గ్రహణం పట్టుకుంది. మండలాలకు ఈ భవనాలు మంజూరై రెండేళ్లయినా.. కొన్ని చోట్ల ఇంకా నిర్మాణాలు పూర్తికాక పోగా, మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో ఐకేపీ పరిధిలో నిర్వహించే కార్యకలాపాలు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. మండలానికో భవనం చొప్పున జిల్లా వ్యాప్తంగా 46 మండలాలకు 46 భవనాలు, మున్సిపాలిటీ పరిధిలో మరో 6 స్త్రీ శక్తి భవనాలను ప్రభుత్వం 2011 నవంబర్‌లో మంజూరు చేసింది. మొత్తం 52 భవనాలకు ఒక్కోభవనానికి రూ.25 లక్షల చొప్పున రూ.13 కోట్లను విడుదల చేసింది. జిల్లాలో 47,818 స్వయం సహాయక గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)లున్నాయి. సంఘాల కార్యకలాపాలకు సంబంధించి సమావేశాల చర్చలకు వేదికగా ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలుచోట్ల నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతుండగా...పనులు పూర్తయిన చోట ప్రారంభానికి నోచుకోలేదు. మెప్మా పరిధిలో ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఈ భవనాలు మంజూరైతే కేవలం కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరులో భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఖమ్మం, పాల్వంచ, ఇల్లెందులో స్థలం దొరకలేదన్న కారణంతో ఈ నిర్మాణాలను అధికారులు మరువడం వారి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ పట్టణాల్లో ప్రభుత్వ భూమిని అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నా చోద్యం చూస్తున్నారే తప్ప.. ప్రజాహిత భవనాలకు స్థల సేకరణలో శ్రద్ధచూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణం పూర్తి అయినా మీనమేషాలు.... ఏజెన్సీలో పలు మండలాల్లో స్త్రీశక్తి భవనాల నిర్మాణం పూర్తి అయింది. అయితే రాజకీయ నాయకుల జోక్యంతో ఈ భవనాల ప్రారంభోత్సవానికి గ్రహణం పట్టింది. భద్రాచలం డివిజన్లో వెంకటాపురం మినహా మిగతా చోట్ల నిర్మాణాలు పూర్తి అయినా ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. గుండాల, వెంకటాపురం,కొణిజర్ల, కుక్కునూరు, మధిర, బోనకల్, చింతకాని, ఎర్రెపాలెం, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో అసలు నిర్మాణమే పూర్తికాలేదు. మైదాన ప్రాంతంలోని పలు మండలాల్లో నిర్మాణం పూర్తి అయినా ప్రారంభోత్సవానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు ఈ భవనాల ప్రారంభోత్సవానికి గడువులు పెడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. అయితే పూర్తి అయిన భవనాలు తమకు ఎప్పుడు అప్పగిస్తారోనని మండల మహిళా సమాఖ్యలు ఎదురుచూస్తున్నాయి. ప్రైవేట్ భవనాలకు నెలకు రూ.వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నామని, నిర్మాణం పూర్తి అయినా భవనాలను ఎందుకు ప్రారంభించడం లేదని సమాఖ్యల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. నిధులున్నా నిర్లక్ష్యం.. ఈ భవనాలు మంజూరుకు నిధులు విడుదలైనా కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని చోట్ల నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. రెండేళ్లు గడిచినా సంబంధిత అధికారులు ఆయా కాంట్రాక్టర్లను హెచ్చరించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే నిర్మాణాలు పూర్తి అయిన చోట కాంట్రాక్టర్లు నాణ్యతను పాటించ లేదనే ఆరోపణలున్నాయి. భద్రాచలం ఏజెన్సీలో ఈ భవనాల నిర్మాణంలో నాసిరకం సిమెంట్‌ను వాడారని ఆరోపణలు వెలువడుతున్నాయి. నిర్మాణాలను పర్యవేక్షించాల్సిన అధికారులకు కాంట్రాక్టర్లు చేయి తడపడంతో ఇష్టారీతిన నిర్మించారని, ఇక ఈ భవనాలు మున్నాళ్ల ముచ్చటగా మారనున్నాయినే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘వడ్డీ’కి సర్కారు ఎగనామం
70 లక్షల మంది మహిళలకు ఇక్కట్లు వడ్డీలేని రుణ పథకానికి సంబంధించి నాలుగు నెలలుగా బ్యాంకులకు వడ్డీ చెల్లించని ప్రభుత్వం రూ. 415 కోట్లకు చేరిన బకాయిలు మహిళా సంఘాల ముక్కుపిండి వసూలు చేస్తున్న బ్యాంకులు బడ్జెట్ కేటాయింపులోనే సర్కారు చిన్నచూపు రూ.1,600 కోట్లు అవసరమైతే రూ.700 కోట్లతో సరిపుచ్చిన వైనం ‘‘మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను సక్రమంగా అందిస్తున్నాం.. పథకాన్ని గ్రీన్‌చానల్‌లో పెట్టాం. ఏ నెలకు ఆ నెల ఆర్థిక శాఖ ఆమోదం అవసరం లేకుండానే నేరుగా నిధులు వెళ్తాయి. మహిళా సంఘాలు వడ్డీ లేకుండా కేవలం అసలు కడితే సరిపోతుంది..’ అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనేకసార్లు ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. కానీ బ్యాంకులు మహిళల ముక్కు పిండి మరీ వడ్డీ వసూలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మాటలపై విశ్వాసంతో వడ్డీ చెల్లించని మహిళలు ఇప్పుడు బకాయిలు పేరుకుపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో బ్యాంకులు వడ్డీ ఒకేసారి చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయని ఫిర్యాదులున్నాయి. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకుగాను నాలుగు నెలలుగా ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ చెల్లించకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ప్రభుత్వం చెల్లించకపోవడంతో బ్యాంకులు మహిళా సంఘాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో మహిళా సంఘాల నాయకురాళ్లు సభ్యుల నుంచి అసలుకు వడ్డీ కలిపి బ్యాంకులకు కట్టిస్తున్నారు. నాలుగు నెలల వడ్డీ కింద ప్రభుత్వం సుమారు రూ.415 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. ప్రభుత్వం తమను కేవలం అసలు మొత్తమే చెల్లించాలని చెప్పింది అని మహిళలు వాపోతున్నా బ్యాంకు అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ఒక్కో సంఘంలో సగటున పది మంది సభ్యులు ఉంటే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల సంఘాల మహిళలు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. 2012 జనవరి ఒకటో తేదీ నుంచి వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మహిళా సంఘాలు ప్రతినెలా నిర్ణీత గడువులోగా అసలు మొత్తం చెల్లిస్తేనే వడ్డీకి అర్హులవుతారని నిబంధన పెట్టింది. మరోవైపు ప్రభుత్వమే తాను చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని సక్రమంగా బ్యాంకులకు చెల్లించకుండా మహిళలను ఇక్కట్ల పాలు చేస్తోంది. వడ్డీ చెల్లింపులకు సంబంధించిన నిధులు విడుదల చేయాల్సిందిగా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రెండుసార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపినా. ఇప్పటివరకు విడుదల కాకపోవడం గమనార్హం. రూ.1600 కోట్లకు రూ.700 కోట్లే కేటాయింపు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద వడ్డీ చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.700 కోట్లు మాత్రమే కేటాయించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పాత బకాయిలు కలుపుకొని రూ.506 కోట్లు మాత్రమే విడుదల చేసింది. జూలై నుంచి అక్టోబర్ వరకు చెల్లించాల్సిన దాదాపు రూ.415 కోట్ల బకాయిలు మాత్రం ఇప్పటివరకు విడుదల చేయలేదు. గతంలో ఆర్థికశాఖ పే అండ్ అకౌంట్స్ విభాగం నుంచి నిధుల విడుదలకు ఆనుమతించేది. ఇప్పుడా అధికారాన్ని ట్రెజరీ విభాగానికి బదలాయించారు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రుణాల కింద చెల్లించాల్సిన వడ్డీ దాదాపు రూ.1600 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడే చేతులెత్తేస్తే మున్ముందు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారవుతుందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం రూ.1600 కోట్లు అవసరమైతే బడ్జెట్ కేటాయింపే రూ.700 కోట్లు ఉందని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. వడ్డీలేని రుణాలంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయకుండా చోద్యం చూస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ, పట్టణ సంఘాలకు వడ్డీ లేని రుణ పథకం అమలవుతుండగా ఎవరికీ వడ్డీ బకాయిలు విడుదల కాకపోవడం శోచనీయం. -
ఆకాశమే హద్దుగా సాక్షి మైత్రి మహిళ
స్త్రీ అంటే ఆకాశంలో సగం అన్న ఆదర్శం మరింత సాకారం చేసి, ఆకాశమే హద్దుగా ఎదిగే ఆత్మవిశ్వాసం ఆమెలో నింపేందుకు సాక్షి చేపట్టిన ఒక విన్నూత్న కార్యక్రమమే సాక్షి మైత్రి మహిళ. మహిళా సాధికారత కాగితాలకే పరిమితం కాకూడదన్న సదాశయంతో, మెరుగైన జీవితాన్ని పొందటానికి ఒక కొత్త నమ్మకాన్ని అందించే ప్రయత్నమే సాక్షి మైత్రి మహిళ. వివిధ రంగాల్లో మహిళల నైపుణ్యాలని వెలికి తీసి, వారి ప్రతిభకి మరింత మెరుగు పెట్టే ప్రయత్నమిది. వేలుపట్టి నడిపించే కార్యక్రమం కాదు, వారి వెన్నంటి ప్రోత్సహించే సౌహార్ద్ర సన్నాహం. మహిళల ప్రతిభని గుర్తించి, వారి ఆకాంక్షలకి అద్దం పట్టి, వారి అభివృద్ధికి దోహదపడే మైత్రిపూర్వకమైన యత్నం. ఇందులో, వంట, హస్త కళలు, వ్యాపారం, వ్యక్తిత్వ వికాసం,స్వయం సహాయక గ్రూపులు... వంటి వివిధ రంగాలకు చెందిన మహిళల సాధికారతను నిజం చేసే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కాలంతో పాటు వడివడిగా స్త్రీ అడుగులు పడేందుకు సాక్షి తన వంతుగా ఈ కార్యక్రమాలని రూపొందించింది. రేపటి సవాళ్లని ఆడవారు మరింత ధైర్యంగా, ఇంకా సమర్థవంతంగా, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా సాక్షి మైత్రి మహిళ చేయూతనిస్తుంది. పదహారేళ్లు దాటిన మహిళ ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ఈ దిగువ లింకు ద్వారా ఫారం డౌన్లోడ్ చేసుకొని వారి ఫొటో ఐడెంటిటీ కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ, లేదా రేషన్ కార్డు) జిరాక్స్ జత చేసి సాక్షి కార్యాలయాల్లో నవంబర్ 10 లోపు అందించాల్సి ఉంటుంది. ఫారం డౌన్లోడ్ కోసం క్ల్లిక్ చేయండి.... మరిన్ని వివరాలకు 040 23356138, 040-23256139 నంబర్ల ద్వారా సమాచారం పొందవచ్చు.