ఛత్తీస్‌గఢ్‌లో వినూత్న కార్యక్రమం
అదే బాటన జార్ఖండ్, ఒడిశా!
లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమాలెన్నో జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బలరామ్‌పూర్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలు చేసిన ‘సంప్రదాయ’ కృషి వీటన్నింట్లో ఎంతో ఆసక్తికరం. మూడో దశలో భాగంగా ఈ నెల 7న రాష్ట్రంలో ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.
బలరామ్‌పూర్ జిల్లాలోని సర్గూజా లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు చింతాకులు, అక్షితలు అందించారు. తప్పకుండా ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక సంప్రదాయాలను ఇలా వినూత్నంగా వాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది.
‘చింతాకులు, అక్షితలు అందించడం మా సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లకు, మా సంఘం కార్యక్రమానికి ఇలాగే ఆహా్వనిస్తాం. అదే పద్ధతిలో విధిగా ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాం. దీనికి స్పందన కూడా చాలా బాగా వచి్చంది’’ అని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యురాలు విమలా సింగ్ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించినట్టు జిల్లా నోడల్ అధికారి రైనా జమీల్ పేర్కొన్నారు.
ఓటర్లను ఇలా వినూత్నంగా పోలింగ్ బూత్‌లకు తరలాల్సిందిగా కోరిన తీరు పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిశాలను కూడా ఆకట్టుకుంది. ఆ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం మే 13న నాలుగు విడతలో మొదలై జూన్ 1న ఏడో విడత దాకా కొనసాగనుంది. అక్కడ కూడా ఇలా ఓటర్లను సంప్రదాయ పద్ధతిలో ఓటేసేందుకు ఆహా్వనించాలని పలు జిల్లాల ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment