70 లక్షల మంది మహిళలకు ఇక్కట్లు
వడ్డీలేని రుణ పథకానికి సంబంధించి నాలుగు నెలలుగా బ్యాంకులకు వడ్డీ చెల్లించని ప్రభుత్వం
రూ. 415 కోట్లకు చేరిన బకాయిలు
మహిళా సంఘాల ముక్కుపిండి వసూలు చేస్తున్న బ్యాంకులు
బడ్జెట్ కేటాయింపులోనే సర్కారు చిన్నచూపు
రూ.1,600 కోట్లు అవసరమైతే రూ.700 కోట్లతో సరిపుచ్చిన వైనం
‘‘మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను సక్రమంగా అందిస్తున్నాం.. పథకాన్ని గ్రీన్‌చానల్‌లో పెట్టాం. ఏ నెలకు ఆ నెల ఆర్థిక శాఖ ఆమోదం అవసరం లేకుండానే నేరుగా నిధులు వెళ్తాయి. మహిళా సంఘాలు వడ్డీ లేకుండా కేవలం అసలు కడితే సరిపోతుంది..’ అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనేకసార్లు ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. కానీ బ్యాంకులు మహిళల ముక్కు పిండి మరీ వడ్డీ వసూలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మాటలపై విశ్వాసంతో వడ్డీ చెల్లించని మహిళలు ఇప్పుడు బకాయిలు పేరుకుపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో బ్యాంకులు వడ్డీ ఒకేసారి చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయని ఫిర్యాదులున్నాయి. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకుగాను నాలుగు నెలలుగా ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ చెల్లించకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ప్రభుత్వం చెల్లించకపోవడంతో బ్యాంకులు మహిళా సంఘాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో మహిళా సంఘాల నాయకురాళ్లు సభ్యుల నుంచి అసలుకు వడ్డీ కలిపి బ్యాంకులకు కట్టిస్తున్నారు. నాలుగు నెలల వడ్డీ కింద ప్రభుత్వం సుమారు రూ.415 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. ప్రభుత్వం తమను కేవలం అసలు మొత్తమే చెల్లించాలని చెప్పింది అని మహిళలు వాపోతున్నా బ్యాంకు అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ఒక్కో సంఘంలో సగటున పది మంది సభ్యులు ఉంటే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల సంఘాల మహిళలు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. 2012 జనవరి ఒకటో తేదీ నుంచి వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మహిళా సంఘాలు ప్రతినెలా నిర్ణీత గడువులోగా అసలు మొత్తం చెల్లిస్తేనే వడ్డీకి అర్హులవుతారని నిబంధన పెట్టింది. మరోవైపు ప్రభుత్వమే తాను చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని సక్రమంగా బ్యాంకులకు చెల్లించకుండా మహిళలను ఇక్కట్ల పాలు చేస్తోంది. వడ్డీ చెల్లింపులకు సంబంధించిన నిధులు విడుదల చేయాల్సిందిగా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రెండుసార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపినా. ఇప్పటివరకు విడుదల కాకపోవడం గమనార్హం.
రూ.1600 కోట్లకు రూ.700 కోట్లే కేటాయింపు
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద వడ్డీ చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.700 కోట్లు మాత్రమే కేటాయించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పాత బకాయిలు కలుపుకొని రూ.506 కోట్లు మాత్రమే విడుదల చేసింది. జూలై నుంచి అక్టోబర్ వరకు చెల్లించాల్సిన దాదాపు రూ.415 కోట్ల బకాయిలు మాత్రం ఇప్పటివరకు విడుదల చేయలేదు. గతంలో ఆర్థికశాఖ పే అండ్ అకౌంట్స్ విభాగం నుంచి నిధుల విడుదలకు ఆనుమతించేది. ఇప్పుడా అధికారాన్ని ట్రెజరీ విభాగానికి బదలాయించారు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రుణాల కింద చెల్లించాల్సిన వడ్డీ దాదాపు రూ.1600 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడే చేతులెత్తేస్తే మున్ముందు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారవుతుందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం రూ.1600 కోట్లు అవసరమైతే బడ్జెట్ కేటాయింపే రూ.700 కోట్లు ఉందని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. వడ్డీలేని రుణాలంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయకుండా చోద్యం చూస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ, పట్టణ సంఘాలకు వడ్డీ లేని రుణ పథకం అమలవుతుండగా ఎవరికీ వడ్డీ బకాయిలు విడుదల కాకపోవడం శోచనీయం.