ఢిల్లీలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ప్రాచీన వస్తువులను పరిశీలిస్తున్న మోదీ
న్యూఢిల్లీ: ఆర్థిక సాధికారత సాధించిన మహిళలు సామాజిక సమస్యలపై పోరాడగలుగుతారని ప్రధాని మోదీ అన్నారు. మహిళల్లో అపార శక్తి దాగి ఉందని, తమ శక్తి సామర్థ్యాలేమిటో వారు గుర్తించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు కోటి మంది స్వయంసహాయక బృందాల మహిళలతో నమో యాప్ ద్వారా ముచ్చటించారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని ఉద్ఘాటించారు. ‘మహిళా సాధికారతకు ఆర్థిక స్వాతంత్య్రం ముఖ్యం. మహిళలు ప్రతిభావంతులు.
వారికి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. తామేంటో నిరూపించుకునేందుకు వారికి అవకాశం ఇస్తే చాలు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళా సాధికారతకు దోహదపడుతుంది. ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడిన మహిళలు అన్ని సామాజిక దురాచారాలకు ఎదురొడ్డి నిలుస్తారు’ అని కితాబిచ్చారు. గ్రామీణాభివృద్ధిలో స్వయం సహాయక బృందాల పాత్రను ఆయన కొనియాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 20 లక్షల స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేశామని, 2.25 కోట్లకు పైగా కుటుంబాలను వాటిలో భాగం చేశామని తెలిపారు.
ప్రస్తుతం 45 లక్షల స్వయం సహాయక బృందాల్లో సుమారు 5 కోట్ల మంది మహిళలు క్రియాశీలకంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి ఈ బృందాలు పునాది వేస్తున్నాయని ప్రశంసించారు. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన వ్యవసాయం, పశుపోషణ రంగాలు మహిళలు లేకుండా మనుగడ సాగించలేవని అన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలు తమ జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును, స్ఫూర్తిదాయక గాథలను పలువురు మహిళలు ప్రధానితో పంచుకున్నారు.
‘వారసత్వ’ రక్షణకు ప్రజా భాగస్వామ్యం
దేశ వారసత్వ సంపద పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రాచీన కట్టడాలను విస్మరించడంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని..వాటి ప్రాముఖ్యతను యువ తరానికి తెలియజేసి వారి వైఖరిలో మార్పు తీసుకురావాలని అభిలషించారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో మోదీ గురువారం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..మన ప్రాచీన వారసత్వ కట్టడాలు, సంపదను కాపాడుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని నొక్కి చెప్పారు.
కొన్ని కట్టడాల వద్ద ప్రజలు ఫొటోలు, సెల్ఫీలు దిగకుండా నిషేధాజ్ఞలు విధించడాన్ని తప్పు పట్టారు. ‘విదేశాల్లో ఎక్కడికెళ్లినా ప్రాచీన కట్టడాల వద్ద రిటైర్ అయిన వారే గైడుగా పనిచేస్తూ కనిపిస్తారు. వాటిని కాపాడుకునే బాధ్యతను సమాజమే తీసుకుంటుంది. అలాంటి విలువలనే భారత్‌లోనూ పాదుకొల్పాలి. పాఠశాలల సిలబస్‌లో వారసత్వ కట్టడాల సమాచారాన్ని చేరిస్తే, విద్యార్థులు వాటి గురించి తెలుసుకుంటూ పెరుగుతారు. టూరిస్ట్ గైడుగా పనిచేసేలా యువతను ప్రోత్సహించాలి. వారసత్వ స్థలాల పరిరక్షణలో పాలుపంచుకునేలా కార్పొరేట్ కంపెనీలను ఒప్పించాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment