సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. పాదయాత్రలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, మేమంతా మీ వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలో తమకు అండగా ఉన్న మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని, ఈ రాష్ట్రానికి మీ మార్గనిర్దేశం కావాలని పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన అనంతరం వివిధ జిల్లాల నుంచి పొదుపు సంఘాల మహిళలు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల అక్కచెల్లెమ్మలు ఇలా అభిప్రాయపడ్డారు.
తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు..
► దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వడ్డీ భారం తగ్గించడానికి పావలా వడ్డీ ప్రారంభించారు. దురదృష్టం కొద్దీ ఆయన్ని కోల్పోయాం. గత ప్రభుత్వంలో జీరో వడ్డీ లేదు, రుణమాఫీ లేదు.
► పాదయాత్రలో మీరు మా కష్ట సుఖాలను తెలుసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా మా అభ్యున్నతి కోసం సున్నా వడ్డీ పథకం తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. – ఖాజా మున్నీసా, నురానీ పొదుపు సంఘం సభ్యురాలు, ఓర్వకల్లు, కర్నూలు జిల్లా
కష్ట సమయంలో ఆదుకున్నారు..
► గత ప్రభుత్వ సమయంలో మమ్మల్ని మీటింగుల కోసం తిప్పుకున్నారు. ఇవాళ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
► కరోనా సమయంలో ఆదుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రానికి మీ మార్గనిర్దేశం కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరు ఆయు రారోగ్యాలతో చల్లగా ఉండాలి.
– రమణమ్మ, నెల్లూరు మండల సమాఖ్య ఉపాధ్యక్షురాలు
అనంతపురం జిల్లా గుత్తిలో సోప్ సొల్యూషన్స్‌ను విక్రయిస్తున్న డ్వాక్రా మహిళలు
మాట నిలుపుకున్నారు..
► అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంది. వలంటీర్లు చాలా సేవ చేస్తున్నారు. వెయ్యి రూపాయలు, మూడుసార్లు రేషన్ ఇవ్వడం చాలా మంచి నిర్ణయాలు.
► మాస్క్‌ల తయారీ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడం పట్ల సంతోషిస్తున్నాం. అరటి లాంటి ఉత్పత్తులను మహిళా సంఘాల ద్వారా అమ్మకాలు చేయిస్తున్నారు. తద్వారా కూడా ఉపాధి పొందుతున్నాం.
► గత ప్రభుత్వం మీటింగుల కోసం మమ్మల్ని వాడుకుందే తప్ప.. ఏమీ చేయలేదు.
– ఆర్.లక్ష్మి, ప్రగతి సంఘం అధ్యక్షురాలు, కరవది, ప్రకాశం జిల్లా
ఇన్ని ఇబ్బందుల్లో వడ్డీ ఊహించలేదు..
మాది లక్ష్మీ తిరుపతమ్మ స్వయం సహాయక సంఘం. ఎన్నికల తేదీ నాటికి రూ.8 లక్షల అప్పు ఉంది. అంతకు ముందు సున్నా వడ్డీ రాయితీ లేకపోవడం వల్ల రూ.75 వేలకు పైగా వడ్డీ చెల్లించాం. ప్రస్తుతం జగన్ ప్రారంభించిన సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపు రూ.80 వేలు వడ్డీ మా ఖాతాల్లో జమ అయింది. ఇన్ని ఇబ్బందుల్లో వడ్డీ సొమ్ము ఇస్తారని మేము అసలు ఊహించ లేదు. ముఖ్యమంత్రికి రుణ పడి ఉంటాం.
–ఎస్.వెంకట శివకుమారి, కృష్ణా జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment