మేలు.. చూడండి | CM Jagan Credited Sunna Vaddi Subsidy to farmers accounts | Sakshi
Sakshi News home page

మేలు.. చూడండి

Published Tue, Nov 29 2022 5:43 AM | Last Updated on Tue, Nov 29 2022 7:32 AM

CM Jagan Credited Sunna Vaddi Subsidy to farmers accounts - Sakshi

పంట నష్ట పరిహారం, పెట్టుబడి రాయితీ చెక్కును రైతులకు అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచి చేయిపట్టి నడిపిస్తున్నాం. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి కూడా ఎన్నో అమలు చేయడం ద్వారా వారికెంతో మేలు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఎంత మేలు జరిగింది? ఇప్పుడు గత మూడున్నరేళ్లలో ఎంత మేలు జరిగిందో ఒక్కసారి తేడా గమనించమని కోరుతున్నా. మంచి చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నా.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లుగా ప్రతి అడుగులోనూ రైతులకు తోడుగా నిలిచి మేలు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ పంట రుణాలివ్వడంతో పాటు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌ ముగియకముందే ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లిస్తూ కొత్త ఒరవడి తెచ్చామన్నారు. రైతులపై పైసా కూడా భారం పడకుండా పంటల బీమా పథకాన్ని అమలు చేయడంతోపాటు నష్టపోతే బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది ఆ సీజన్‌ రాకముందే అందిస్తూ ఆదుకుంటున్నామన్నారు.

రబీ 2020–21, ఖరీఫ్‌–2021 సీజన్లకు సంబంధించి సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్‌–2022లో వరదలు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ సొమ్ముతో కలిపి మొత్తం రూ.200 కోట్లను క్యాంపు కార్యాలయం నుంచి సీఎం సోమవారం బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న రైతులనుద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలివీ..
కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

రైతన్నకు ఎంత చేసినా తక్కువే
రైతులకు ఎంత చేసినా తక్కువే. వారంతా  సంతోషంగా ఉండాలని అడుగులు వేస్తున్నాం. ఈ ఏడాది జూలై – అక్టోబర్‌ మధ్య వరదలు, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న 45,998 మంది రైతులకు ఇవాళ రూ.39.39 కోట్లను వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన 21.31 లక్షల మంది రైతులకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవాళ ఇస్తున్న సొమ్ముతో కలిపి ఇప్పటివరకూ రూ.1,834.78 కోట్లను ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందించాం.

రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించే సన్న, చిన్నకారు రైతులు, వాస్తవ సాగుదారులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీని చెల్లిస్తూ అండగా నిలుస్తున్నాం. వరుసగా మూడో ఏడాది ఈ పథకం కింద రబీ 2020–21, ఖరీఫ్‌ –2021 సీజన్‌లలో అర్హత పొందిన 8,22,411 మంది రైతులకు ఈరోజు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము జమ చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి ఈరోజు ఇస్తున్న మొత్తంతో 73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం.  

బాబొచ్చారు.. బంగారం పోయింది!
రైతన్నలకు అందించే సాయంలో గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో కొన్ని ఉదాహరణలు మీ ముందుకు తెస్తున్నా. గతంలో వైఎస్సార్‌ రైతు భరోసా లాంటి పథకం లేదు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను బేషరతుగా రుణమాఫీ చేస్తామని, బ్యాంకుల్లో ఉన్న బంగారమంతా ఇంటికి తిరిగి రావాలంటే ‘బాబు’ సీఎం కావాలంటూ ప్రచారం చేసి చివరకు నిలువునా మోసగించారు.

అప్పులపై వడ్డీలు, వడ్డీల మీద చక్రవడ్డీలు కలిపి రైతులకు తడిసి మోపెడయ్యాయి. నాడు నోటీసులు ఇచ్చి బ్యాంకుల్లో కుదువబెట్టిన బంగారాన్ని వేలం వేయడం పేపర్లలో చూశాం. ఐదేళ్లలో ఆ పెద్దమనిషి రుణమాఫీ పేరిట చెల్లించింది రూ.15 వేల కోట్లు మాత్రమే. అది కూడా రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొట్టి. అప్పటివరకు అందుబాటులో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు ఒక్క వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారానే మూడున్నరేళ్లలో మన ప్రభుత్వం రూ.25,971 కోట్లను రైతన్నలకు అందించింది. 

నాడు ఐదేళ్లూ కరువు కాటకాలే..
గతంలో పంటల బీమా కోసం తమ వాటా ప్రీమియాన్ని రైతులే చెల్లించారు. ఆ ఐదేళ్లలో వరుసగా కరువు కాటకాలే. ప్రతి సీజన్‌లోనూ కరువు మండలాలను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్‌ సొమ్ము పెరగాలి. కానీ అలా జరగలేదు. ఆ ఐదేళ్లలో బీమా కింద చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే. మన ప్రభుత్వం వచ్చాక రైతులపై భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం.

ఈ–క్రాప్‌ ద్వారా పంటలు వేసే ప్రతి రైతుకూ పంటల బీమా వర్తింపచేశాం. రైతుల ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ఇప్పటివరకు రూ.6,685 కోట్ల మేర పంటల బీమా పరిహారాన్ని రైతులకు చెల్లించాం. గతంలో కొంతమందికే ఇన్సూరెన్స్‌ రాగా ఇప్పుడు ప్రతి రైతుకూ వర్తిస్తోంది. 

కరువు సాయంలో తేడా చూస్తే..
కరువు సాయం అందించడంలో గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి. మన పాలనలో ఒక్కటైనా కరువు మండలాన్ని ప్రకటించాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటున ఏటా సగం కరువు మండలాలే. సాయం మాత్రం అంతంత మాత్రమే. 2015 నవంబర్, డిసెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు రూ.260 కోట్లు, 2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో రూ.1,832 కోట్లు, రబీలో రూ.356 కోట్ల మేర పంట నష్టం వాటిల్లితే అందించిన సాయం సున్నా. అదే మన ప్రభుత్వ హయాంలో చూస్తే సీజన్‌ ముగియకుండానే పరిహారం అందిస్తున్నాం.

2020 జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన 3.80 లక్షల మంది రైతులకు రూ.285 కోట్ల పంట నష్ట పరిహారాన్ని అదే ఏడాది అక్టోబర్‌లో అందజేశాం. 2020 నవంబర్‌లో నివర్‌ తుపాను వల్ల నష్టపోయిన 8.35 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని నెల తిరగకుండానే డిసెంబర్‌లో జమ చేశాం. 2021 సెప్టెంబర్‌లో గులాబ్‌ తుపాను, నవంబర్‌లో కురిసిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన 6.31 లక్షల మంది రైతులకు రూ.564 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే ఏడాది నవంబర్‌లో అందజేశాం. ఇలా ఇప్పటి వరకు సీజన్‌ ముగియకుండానే రూ.1,835 కోట్లకుపైగా ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు అందించాం

సున్నా వడ్డీలో ఎంత తేడా అంటే.. 
సున్నా వడ్డీ విషయంలో గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,180 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును పూర్తిగా చెల్లించడమే కాకుండా 73.88 లక్షల మంది రైతులకు మూడున్నరేళ్లలో మొత్తం రూ.1,834.55 కోట్లు అందజేశాం. గత ప్రభుత్వం ఏనాడూ  రైతులకు పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వలేకపోయింది. మన ప్రభుత్వం 9 గంటల పాటు క్వాలిటీ విద్యుత్‌ను పగటిపూట అందిస్తోంది. సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.1,700 కోట్లు ఖర్చుచేశాం.

గతంలో రైతులకివ్వాల్సిన రూ.9 వేల కోట్లు విద్యుత్‌ బకాయిలు ఎగ్గొట్టింది కూడా చంద్రబాబే. గత ప్రభుత్వం ధాన్యం సేకరణకు సంవత్సరానికి రూ.7–8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే మన ప్రభుత్వం రూ.13 వేల కోట్లు వెచ్చిస్తోంది. గత సర్కారు ఐదేళ్లలో ధాన్యం సేకరణ కోసం చేసిన ఖర్చును మనం మూడేళ్లలోనే అధిగమించి ధాన్యం సేకరణ చేస్తున్నాం.

2014 నుంచి 2019 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నులు కాగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లలోనే సగటున 167 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఏడాదికి 13 లక్షల టన్నులు దిగుబడిలో పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు అమూల్‌ రాకతో ప్రైవేట్‌ డెయిరీలు, కంపెనీల పాల సేకరణ ధరలు ఏ రకంగా పెరిగాయో రాష్ట్రమంతా కనిపిస్తోంది. కార్యక్రమంలో మంత్రి కాకాణి తదితరులు పాల్గొన్నారు. 

విత్తనం నుంచి విక్రయం వరకూ అండగా..
ఆర్బీకేలు రైతన్నలకు నాణ్యమైన, సర్టిఫైడ్‌ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను  అందిస్తున్నాయి. అన్నదాతలకు సలహాలు ఇస్తున్నాయి. పారదర్శకంగా ఈ–క్రాప్‌ నమోదు చేస్తున్నాయి. ప్రతి పథకాన్ని పారదర్శకంగా అర్హులైన ప్రతి రైతుకు అందించడంతో పాటు పంటల కొనుగోలు సమయంలో ఇబ్బంది కలగకుండా సహాయకారిగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి గొప్ప వ్యవస్థ మన కళ్లముందే కనిపిస్తోంది.

ఇలాంటి విధానం గతంలో లేదు. కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఇన్‌పుట్‌ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టారు. 2–3 సీజన్ల తర్వాత అరకొరగా అందించిన పరిస్థితులు చూశాం. ఇప్పుడు ఈ–క్రాప్‌ ఆధారంగా వాస్తవ సాగుదారులందరికీ ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌ ముగిసేలోగా నేరుగా వారి ఖాతాల్లోనే పరిహారాన్ని జమ చేస్తున్నాం. పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేస్తున్నాం.

రైతు భరోసా కేంద్రాలలో అర్హుల జాబితాను ప్రదర్శిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి కూడా పొరపాటున జాబితాలో పేరు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. వాటిని మళ్లీ వెరిఫై చేసి ఏటా జూలై, డిసెంబరులో మిస్‌ అయిన వారికి మేలు చేస్తున్నాం.

రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది
బీసీ కులానికి చెందిన ఒంటరి మహిళనైన నాకు మూడెకరాల పొలం ఉంది. రూ.87 వేల రుణం తీసుకొని సకాలంలో చెల్లించా. సున్నా వడ్డీ కింద రూ.1,791 వచ్చాయి. కంది సాగు చేసి నష్టపోతే ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.42 వేలు అందాయి. ఖరీఫ్‌ పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్నా. ఆర్బీకేలో రసీదు ఇచ్చారు. గతంలో విత్తనాల కోసం క్యూ లైన్లలో నిలబడి అవస్థలు పడ్డాం.

ఇప్పుడన్నీ ఆర్బీకేల ద్వారా అందుతున్నాయి.   ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందని రుజువు చేశారు. పదికాలాల పాటు మీరే సీఎంగా ఉండాలి.     
– జయమ్మ,రైతు, ఎర్రవంకపల్లి, శ్రీసత్యసాయి జిల్లా

ఇంట్లో అందరికీ అన్నీ..
గోదావరి వరదల సమయంలో మీరు నాటు పడవలో మా లంక గ్రామానికి వచ్చి ప్రతి ఒక్కరినీ పలుకరించారు. ప్రభుత్వం నుంచి సాయం అందిందా లేదా? అని అడిగారు. అందని వారికి మరుసటి రోజే రూ.2 వేలు ఆర్థ్ధిక సాయం అందేలా చేశారు. గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి మా లంక గ్రామాలకు రాలేదు. మాకు వంతెన కూడా మంజూరు చేశారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. 
– నక్కా శ్రీనివాసరావు, రైతు, జి. పెద్దపూడి లంక, బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా
గ్రామంలో వంతెన నిర్మాణ పనుల పురోగతిపై  కలెక్టర్‌ నుంచి సీఎం వివరాలు తెలుసుకున్నారు. అనుమతులు రాగానే వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

ఈ ప్రభుత్వంలో రూ.5 లక్షల సాయం 
నాకు రెండెకరాల భూమి ఉంది. రూ.93 వేల రుణం తీసుకుని సకాలంలో చెల్లించా. రూ.3,700 వడ్డీ రాయితీ వచ్చింది. ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్‌ నమోదు బాగుంది. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ అందుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు బాగా పండుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా సచివాలయంలో పరిష్కరిస్తున్నారు. నాకు రైతు భరోసా, చేయూత, నా పిల్లలకు అమ్మ ఒడి సాయం అందింది. నేను ఈ ప్రభుత్వంలో రూ.5 లక్షలు అందుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నాలా చాలా మంది లబ్ధి పొందారు.
    – వెంకట లక్ష్మి, మహిళా రైతు, ముద్దాడ, శ్రీకాకుళం జిల్లా

దేశానికే ఆదర్శంగా
గతంలో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. ఈరోజు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు ఈ–క్రాప్‌ ఆధారంగా అందిస్తున్నారు. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. మూడేళ్లుగా మంచి వర్షాలు కురుస్తున్నాయి. ముందుగానే సాగునీరు విడుదల చేయగలిగాం. ఊహకు అందని కార్యక్రమాలను ఈ ప్రభుత్వం చేస్తోంది.  టీడీపీ హయాంలో నిత్యం కరువు కాటకాలతో రాష్ట్రం విలవిలలాడింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేలే గ్రూపులుగా విడిపోయి నీళ్ల కోసం ఘర్షణలకు దిగిన పరిస్థితి. టీడీపీ హయాంలో 1,623 కరువు మండలాలు ప్రకటించగా ఇప్పుడు మూడేళ్లుగా ఒక్క కరువు మండలం కూడా లేదు. 
    – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement