పరిహారం..పరిహాసం | Chandra Babu government cut crop loss compensation | Sakshi
Sakshi News home page

పరిహారం..పరిహాసం

Published Sat, Sep 28 2024 5:07 AM | Last Updated on Sat, Sep 28 2024 5:07 AM

Chandra Babu government cut crop loss compensation

పంట నష్ట పరిహారంలో కోత పెట్టిన బాబు సర్కారు

పెట్టుబడికంటే ఇచ్చిన పరిహారం చాలా తక్కువ

వరికి రూ.25 వేలు పెట్టుబడి అయితే ఇచ్చింది రూ.10 వేలే

పంట విస్తీర్ణంలోనూ కోతలు

కృష్ణా జిల్లాలో 48,641 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా

కేంద్ర బృందానికి అధికారులూ ఇదే నివేదిక ఇచ్చారు

పరిహారం దగ్గరకొచ్చేసరికి సగానికి పైగా కోత

21,661.02 హెక్టార్లలోనే నష్టం వాటిల్లినట్లు లెక్క

అంతమేరకే పరిహారం చెల్లింపు

ఇదేమి న్యాయం అంటున్న రైతులు

కంకిపాడు: ఎకరా వరి పంటకు పెట్టుబడి కనీసం రూ.25 వేలు. పసుపు పంటకు రూ.1.50 లక్షలు. కందకు రూ.1.70 లక్షలు, తమలపాకుకు రూ.2 లక్షలు. ఇలా ఏ పంట వేసినా రైతు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సాయం ఎకరాకు రూ.10 వేలు మాత్రమే. 

అదీ.. కొంతమందికే వచ్చింది. వారికీ పంట వేసిన విస్తీర్ణంలో కొంత మొత్తానికే ఇస్తున్నారు. ఇందుకు ఈడే సాంబశివరావే ఉదాహరణ. ఆయన 3.70 ఎకరాల్లో వరి వేస్తే ఇచ్చిన పరిహారం ఎకరాకు రూ.10 వేలే. అంటే దాదాపు లక్ష రూపాయలు పెట్టుబడి వరదలో కొట్టుకుపోతే బాబు సర్కారు విదిల్చింది రూ.20 వేలే. 

ఇటీవలి కృష్ణా, బుడమేరు వరదలు, భారీ వర్షాలతో పంట నాశనమైపోయిన అనేక గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇదే. చేతికి దిగుబడి అందే తరుణంలో పంటలు దెబ్బతినడం, ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో ఆదుకోకపోవడంతో అన్నదాత తల్లడిల్లిపోతున్నాడు.

కౌలు రైతుకు మొండిచేయి
వాస్తవంగా రైతులకంటే కౌలుదారుల చేతుల్లోనే సాగు అధికంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులకూ మొండి చేయి చూపింది. కొన్ని చోట్ల కౌలుకు తీసుకున్న భూముల్లో కౌలుదారుకు కాకుండా భూ యజమాని ఖాతాలో ప్రభుత్వం పరిహారాన్ని జమ చేసింది. దీంతో కౌలుదారులు పూర్తిగా దెబ్బతిన్నారు. పలువురు రైతులకు బ్యాంకు ఖాతాతో ఆధార్‌ అను
సంధానం జరగకపో­వటంతో పరిహారం విడుదలైనా చేతికి అందే పరిస్థితి లేదు.

దయలేని సర్కారు
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రకృతి విపత్తులకు పంట నష్టపోయిన ప్రతి రైతునీ ఆదుకుని, అండగా నిలిచేది. పెట్టుబడి సాయం, బీమా వర్తింపజేసి అన్నదాతను ఆదుకొనేది. కానీ కూటమి సర్కారు మాత్రం అన్నదాత పట్ల దయలేకుండా వ్యవహరిస్తోంది. ఉదాహరణకు కృష్ణా జిల్లావ్యాప్తంగా 48,641 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు. 

ఇందులో 44,521 హెక్టార్లలో వరి, వేరుశనగ, మినుములు, చెరకు, ఇతర పంటలు, 4,700 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 50 హెక్టార్లలో పట్టు పంట దెబ్బతిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిబంధనల పేరుతో నష్టం అంచనాల్లో భారీగా కోత వేసింది. కృష్ణా జిల్లాలో 21,661.02 హెక్టార్లలోనే పంట నష్టం వాటిల్లిందని సగానికిపైగా కోత వేసింది. ఇవే లెక్కలతో రైతులు వాస్తవంగా నష్టపోయినదానికంటే అతి తక్కువ పరిహారం అందించి రైతులను నట్టేట ముంచింది.

కౌలు రైతుల పరిస్థితి దారుణం  
గ్రామంలో 20 ఎకరాలు కౌలు తీసుకుని వరి సాగు చేస్తున్నా. బుడమేరు వరదతో పంట అంతా నీటి పాలైంది. ఎకరాకు రూ 25 వేలు వరకూ పెట్టుబడి అయ్యింది. తిరిగి మళ్లీ పంట సాగు చేసుకోవ­టానికి చేతిలో డబ్బు లేదు. ప్రభుత్వం పరిహారం కూడా మాకు ఇవ్వలేదు. అప్పులు చేసి సాగుకు వెళ్లాల్సిన పరిస్థితి. కౌలు రైతుగా నా పరిస్థితి దారుణంగా ఉంది. – కొలకలూరి కోటయ్య, కౌలురైతు, మంతెన

బ్యాంకు ఖాతా లింక్‌ అవ్వలేదు అంటున్నారు 
నా పొలం మూడెకరాలు కౌలుకి ఇచ్చాం. బుడమేరు ముంపుతో దెబ్బతింది. దాని తాలూకా డబ్బులు వచ్చాయి. ఎకరం నిమ్మతోట వేశాను. వరదకి పంట కుళ్లిపోయింది. పంట ఆనవాళ్లు కూడా లేవు. ప్రభుత్వం నుంచి మెసేజ్‌ ఫోన్‌కి వచ్చింది. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ లింక్‌ కాలేదని. మిగిలిన డబ్బులు వస్తున్నాయి. ఇది మాత్రం కొర్రీ పెట్టారు. అధికారులు స్పందించి పరిహారం అందేలా చూడాలి.    – బద్దల శ్రీనివాసరావు, రైతు, మంతెన

రైతు పేరు ఈడే సాంబశివరావు. మంతెన గ్రామం. కేసరపల్లి గ్రామం పరిధిలో 3.70 ఎకరాల పొలం ఉంది. బుడమేరు వరదతో ఈ పొలాల్లో వేసిన వరి పూర్తిగా నీటి మునిగి కుళ్లిపోయింది. అధికారులు నష్టం నమోదు చేశారు. కానీ రెండెకరాలకు మాత్రమే ఎకరాకు రూ 10 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలో పడ్డాయి. నష్టం భారీగా జరిగితే.. పరిహారం ఇంత తక్కువ వచ్చిందని సాంబశివరావు ఆవేదన చెందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement