సాగును బాగు చేశాం | CM YS Jagan Comments On Farmers Agriculture Sector | Sakshi
Sakshi News home page

సాగును బాగు చేశాం

Published Thu, Mar 7 2024 4:48 AM | Last Updated on Thu, Mar 7 2024 4:48 AM

CM YS Jagan Comments On Farmers Agriculture Sector - Sakshi

బటన్‌ నొక్కి నిధులు విడుదల చేస్తున్న సీఎం జగన్‌ , పంట నష్టపరిహారం–పెట్టుబడి రాయితీ చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

వ్యవసాయంలో కొత్త ఒరవడి తీసుకొచ్చాం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

58 నెలల్లో రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలిచాం

తొలిసారిగా రైతన్నపై పైసా భారం పడకుండా పంటల బీమా అమలు

ఆర్బీకేలు, సచివాలయాలతో గ్రామ స్థాయిలో పరిస్థితులు మారాయి

11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

సాక్షి, అమరావతి: ‘సచివాలయాలు, ఆర్బీకేలు లాంటి గొప్ప వ్యవస్థల ఏర్పాటుతో గ్రామ స్థాయి­లో పరిస్థితులు మారిపోయాయి. వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తెచ్చి రైతులకు తోడుగా నిలిచాం. వారికి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టు­కున్నాం. అందుకే ఈ ఐదేళ్లలో వారి జీవితాల్లో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది’ అని సీఎం జగన్‌  పేర్కొన్నారు. ఖరీఫ్‌ 2023లో వర్షాభావంతో ఏర్పడిన కరువు, గత డిసెంబర్‌లో మిచాంగ్‌ తుపానుతో నష్టపోయిన 11,59,126 మంది వ్యవసాయ, ఉద్యాన రైతులకు రూ.1,294.58 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

అవినీతి, వివక్షకు తావు లేకుండా..
పారదర్శకంగా మంచి జరుగుతుందా? అని ఎవ­రైనా ఐదేళ్ల క్రితం ప్రశ్నిస్తే అది అయ్యే పని కాదనే సమాధానం వచ్చేది. ఎందుకంటే ఆరోజు పార­దర్శకంగా ఏ ఒక్క పని జరిగేది కాదు కాబట్టి. మొట్టమొదటిసారిగా అటువంటి  పరిస్థితులు మా­రాయి. ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థ తోడుగా ఉంది. ప్రతి ఎకరాను ఇ–క్రాప్‌ చేయడం వల్ల సచివాలయ పరిధిలో ఏ పంటను ఎవరు ఎన్ని ఎకరాల్లో వేశారో పూర్తి డేటా అందుబాటులోకి వచ్చింది.

వైపరీత్యాల వల్ల ఏ పంటకు నష్టం జరిగినా అత్యంత పారదర్శకంగా అర్హుల జాబితాలను ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే వెసులు­బాటు ఉంది. ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లే­కుండా పూర్తి పారదర్శకంగా అర్హులైన ప్రతి రైతు­కూ సహాయం సకాలంలో అందుతున్న పరిస్థితి ఈ 58 నెలల పాలనలోనే జరుగుతోందని చెప్పడా­నికి ఆనందపడుతున్నా. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పడానికి సంతోషపడుతున్నా. 

తడిసిన ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం మనదే..
తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదన్న సంకల్పంతో రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని మొట్టమొదటిసారిగా కొనుగోలు చేస్తూ అడుగులు పడ్డాయి. మిచాంగ్‌ తుపాన్‌ వేళ దాదాపు 3.25 లక్షల టన్నులు రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలిచిందీ ప్రభుత్వం. నాలుగేళ్ల పాటు సమృద్ధిగానే వర్షాలు పడ్డాయి. గతేడాది ఖరీఫ్‌లో కొంత మేర వర్షం తక్కువగా నమోదు కావడంతో 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాల్సి వచ్చింది.

ఈ మండలాల్లో పంటలు నష్టపోయిన 6.96 లక్షల మంది రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.847 కోట్లు విడుదల చేస్తున్నాం. మిచాంగ్‌ తుపాను వల్ల పంటలు నష్టపోయిన 4.61 లక్షల మంది రైతన్నలకు మరో రూ.442 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేస్తున్నాం. ఈ రెండూ కలిపి 11.61 లక్షల మంది రైతన్నలకు మొత్తంగా రూ.1,294.58 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేసే మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల జరుగుతోంది.

80 శాతం సబ్సిడీపై విత్తనాలందించాం
కరువు, తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు సబ్సిడీ­పై విత్తనాలను అందించి అండగా నిలిచాం. ఉల­వలు, అలసంద, మినుము, పెసర, కంది, రాగి, మొక్కజొన్న లాంటి స్వల్ప కాలిక పంటల సాగు కోసం 30 వేల క్వింటాళ్లను రూ.26 కోట్లతో 1.14 లక్షల మంది రైతు­లకు సరఫరా చేయగలిగాం. మిచాంగ్‌ తుపా­ను వల్ల డిసెంబర్‌ 4న నష్టం జరి­గితే డిసెంబర్‌ 8వ తేదీకల్లా రూ.31 కోట్లతో 80% సబ్సిడీ మీద రాయితీతో 49,758 క్వింటాళ్ల విత్తనా­లను 71,415 మంది రైతులకు ఆర్బీకేల ద్వారా సరఫరా చేసి తోడుగా నిలబడగలిగాం. జూన్‌­­లో వారికి పంటల బీమా పరిహారం అందిస్తాం.

పైసా భారం లేకుండా పంటల బీమా 
చంద్రబాబు పాలనలో ఏటా కరువు కాటకాలే నెలకొన్నా 2014–19 మధ్య 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు మాత్రమే బీమా పరిహారం ఇచ్చిన పరిస్థితిని చూశాం. ఇప్పుడు దేవుడి దయతో ఏటా మంచి వర్షాలు పడుతున్నాయి. ఒక్క సంవత్సరమే కొద్దో గొప్పో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగేళ్లలో ఎప్పుడూ ఒక్కటి కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. మనం 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్ల బీమా పరిహారం ఇచ్చి తోడుగా నిలబడ్డాం.

పైసా కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేసి రైతులకు తోడుగా నిలబడింది ఈ ప్రభుత్వమే. ఇ– క్రాప్‌ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్‌ ఆటోమేటిక్‌గా వర్తింపజేసే అడుగులు మొదటి­సారిగా పడ్డాయి. గతంలో రుణాల కోసం బ్యాంకులకు వెళ్లినప్పుడు 5 శాతం ప్రీమియం కింద జమ చేసుకుని ఇన్సూరెన్స్‌ వర్తింపజేసేవారు. రుణాలు తీసుకోని రైతులకు, ఆ విషయం తెలియ­ని వారికి ఇన్సూరెన్స్‌ వచ్చే అవకాశమే ఉండేది కాదు. అలాంటిది ఈరోజు పంటల బీమా అమలు­లో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించమని ప్రతి రైతన్ననూ కోరుతున్నా. 

చిన్న రైతుకు పెద్ద భరోసా
ప్రతి రైతుకూ పెట్టుబడి సహాయంగా రూ.13,500 అందించడం ఇంతకు ముందెన్నడూ లేదు. చంద్రబాబు హయాంలో రైతులు పంటలు వేసేటప్పు­డు వారికి తోడుగా నిలబడాలనే ఆలోచన చేయ­లేదు. తాజా లెక్కల ప్రకారం దాదాపు 63%మంది రైతులకు అర హెక్టారు లోపు మాత్రమే భూములు­న్నాయి. హెక్టారు లోపు భూమి ఉన్న వారు మరో 24% మంది ఉన్నారు. ఈ 87%మంది రైతులు దాదాపు 70% విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అర హెక్టార్‌ లోపు పొలం ఉన్న రైతులకు  రూ.13,500 రైతు భరోసా సాయం 80% పెట్టుబడి సాయంగా ఉపయోగపడు­తోంది. ఇటువంటివన్నీ గత 58 నెలలుగా మాత్రమే జరుగుతున్నాయి. 
► మంత్రి కాకాణితో పాటు సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్జీ రంగా వర్సిటీ పాలనా భవనం ప్రారంభం
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంటిగ్రేటెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. గుంటూరు లాంలోని వర్సిటీ ప్రాంగణంలో 5.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.110 కోట్లతో నూతనంగా నిర్మించిన ఈ అత్యాధునిక భవన సముదాయం ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. గత సర్కారు కేవలం శంకుస్ధాపన చేసి సరిపుచ్చగా సీఎం జగన్‌ పూర్తి చేసి ప్రారంభించడం సంతోషకరమని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు లాం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్శిటీ ఉపకులపతి డాక్టర్‌ శారద జయలక్ష్మిదేవి, జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి రాజకుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ఇంతకుముందు విత్తనాల కోసం లాఠీ దెబ్బలు తినేవాళ్లం
నాకు ఐదెకరాలున్నాయి. ఖరీఫ్‌లో 2 ఎకరాల్లో మొక్కజొన్న వేశా. సకాలంలో వర్షాలు రాక నష్టపోయా. ఇప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. రైతుల కష్టాలను గుర్తించి సాయం చేస్తున్నారు. గతంలో పెట్టుబడుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోయేవాళ్ళం. నేడు ఏటా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్నారు. పంటల బీమా వస్తుంది. సున్నా వడ్డీ రాయితీ వస్తోంది. గతంలో విత్తనాల కోసం లాఠీ దెబ్బలు తినేవాళ్ళం. ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేల ద్వారా ఇస్తున్నారు. గతంలో వ్యవసాయం చేయాలంటే చాలా అవస్థలు పడేవాళ్లం. మీరు వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. పంటలకు మద్దతు ధర ఇస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మా గ్రామంలో హెరిటేజ్‌ డెయిరీ మాత్రమే ఉండేది.

అందులో లీటర్‌ పాలకు రూ. 20 నుంచి రూ. 25 మాత్రమే ఇచ్చేవారు. కానీ నేడు లీటర్‌కు రూ. 35 నుంచి రూ. 40 వస్తున్నాయి. పాడి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. పిల్లలను మంచి చదువులు చదివిస్తున్నాను. గత 57 నెలల్లో వ్యవసాయ పథకాల ద్వారా రూ.88,392 వచ్చాయి. మా నాన్నకు పింఛను రూ. 1,35,750, నా భార్యకు వైఎస్సార్‌ ఆసరా కింద రూ. 54,000, సున్నా వడ్డీ కింద రూ. 5,369, పిల్లలకు విద్యా దీవెన కింద రూ. 66,000, వసతి దీవెన కింద రూ. 58,000 వచ్చాయి. అన్నీ కలిపి రూ. 4,06,761 వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో  సాయం అందడం ఇదే ప్రథమం. అదీ లంచాలతో పని లేకుండా నేరుగా మా ఖాతాలో జమ చేశారు. ఇంత కంటే ఇంకేం కావాలి. మళ్లీ మీరే సీఎం కావాలి.
– జనార్ధన్‌ రెడ్డి, రైతు, భైరాపురం, శ్రీ సత్యసాయి జిల్లా

ఇంతలా ఆలోచించే సీఎంను ఎన్నడూ చూడలేదు
నేను 1.20 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. గతేడాది డిసెంబర్‌లో మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంట దక్కదేమోనని అనుకున్నాం. సకాలంలో పూడికలు తీయించడం వల్ల వర్షం నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోయింది. గతంలో తుపాను వస్తే పట్టించుకునేవారు కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. తడిసిన ధాన్యం కొంటున్నారు. మిల్లుకు పంపిన 13 రోజుల్లో డబ్బు వస్తోంది. ట్రాక్టర్‌ బాడుగ, గోతాలకు కూడా సొమ్ములిచ్చారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నారు. తుపాను నష్టం సాయం అందుతోంది. రైతుల కోసం ఇంతలా ఆలోచించే సీఎంను ఎన్నడూ చూడలేదు. గతంలో పంట నష్ట పరిహారం వారికి అనుకూలమైన వారికే ఇచ్చారు.

నేడు పార్టీలకతీతంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మేం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మా ఊళ్లోనే మాకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స చేయించుకున్నా. ఇంటికొచ్చే సమయంలో డబ్బులు కూడా ఇచ్చారు. మా పాప చదువుతున్న ప్రభుత్వ పాఠశాలను చాలా బాగా అభివృద్ధి చేశారు. చిన్నమ్మాయికి ట్యాబ్‌ ఇచ్చారు. మంచి ఆహారం ఇస్తున్నారు. ఎక్కడా రూపాయి లంచం ఇవ్వకుండా అర్హత ఉంటే చాలు అన్ని పథకాలు అందిస్తున్నారు. నా ఒక్క కుటుంబానికే రూ.3.10 లక్షల సాయం అందింది. మీరు మాట ఇస్తే జరిగినట్లే. మళ్ళీ మీరే సీఎంగా ఉండాలి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట కాలువలు బాగు చేయాలని కోరుతున్నా. 
–మోషే, రైతు, నర్రావారి పాలెం, కర్లపాలెం మండలం, బాపట్ల

చెప్పిన మాటకు మించి సాయం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో చెప్పిన దానికి మించి సాయం అందిస్తున్నారు. గతంలో మాదిరి కా­కుండా సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి, పారదర్శకంగా, నేరుగా రైతులే వెరిఫై చేసుకున్న తర్వాత లబ్ధిదారుల తుది జాబితాలు ప్రకటిస్తున్నాం. మిచాంగ్‌ తుపా­నుకు దెబ్బతిన్న పంటలకు రికార్డు టైంలో నాలుగు రోజుల్లోనే సబ్సిడీ విత్తనాలు ఇచ్చాం. దీనివల్ల రైతులు వెంటనే నారుమళ్ళు పోసుకుని విత్తుకో­గలి­గారు. ఈ ప్రభుత్వంలో 34.43 లక్షల మంది రైతు­లకు రూ.3,262 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చాం. గ­తంలో బాబుప్రభుత్వం రూ.2,560 కోట్ల బ­కా­­యిలు పెట్టి రైతులను మోసం చేసింది.

సీఎం జగన్‌ ఇచ్చిన మాటకంటే మిన్నగా వైఎస్సార్‌ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇలా ప్రతిదీ ఇస్తున్నారు. చంద్రబాబు హ­యాంలో 39 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.1180.66 కోట్ల సున్నా వడ్డీ బకాయిలను సైతం వైఎస్‌ జగన్‌ చెల్లించారు. పంటల బీమా, విత్తన, బిందు సేద్యం బకాయిలనూ చెల్లించారు. టీడీపీ ప్రభుత్వం రైతులను వంచిస్తే వైఎస్‌ జగన్‌ రైతు పక్షపాతిగా నిలిచారు. రైతులను కంటిపాపలా కాపాడుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు అన్నదాతలు ఆశీస్సులు అందించాలి. మరో 3 నెలల్లో సీఎం జగన్‌ మరోసారి ముఖ్యమంత్రి అయ్యి ఇదే రీతిలో అండగా నిలుస్తారు.
– కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement