సేంద్రియ మహిళా రైతుల బజార్‌! | Organic Women Farmers Bazaar in tamil nadu | Sakshi
Sakshi News home page

సేంద్రియ మహిళా రైతుల బజార్‌!

Published Tue, Oct 16 2018 5:49 AM | Last Updated on Tue, Oct 16 2018 5:49 AM

Organic Women Farmers Bazaar in tamil nadu - Sakshi

చెన్నైలో సేంద్రియ మహిళా రైతుల బజార్‌. స్టాల్‌లో కూరగాయలు విక్రయిస్తున్న మహిళా రైతు (ఇన్‌సెట్‌లో)

తమిళనాడు ప్రభుత్వం స్వయం ఉపాధి సంఘాలకు చెందిన వేలాది మంది మహిళలను సేంద్రియ సాగుకు ప్రోత్సహించడంతోపాటు.. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు దేశంలోనే తొలి మహిళా రైతుల బజార్‌ను ఏర్పాటు చేయటం ప్రశంసనీయం. గ్రామీణ ప్రాంతాల నుంచి సేంద్రియ ఉత్పత్తులను చెన్నై నగర వినియోగదారుల వద్దకు చేర్చడంలో తమిళనాడు కార్పొరేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ విమెన్, ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ మార్కెట్‌(ఓఎఫ్‌ఎమ్‌) సంయుక్తంగా మహిళా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.

చెన్నై వల్లువర్‌కోట్టం హైరోడ్డులోని మదర్‌ థెరిసా ఉమెన్‌ కాంప్లెక్స్‌లో ప్రతి నెలా మొదటి శని, ఆదివారాల్లో మహిళల నేతృత్వంలో సేంద్రియ ఉత్పత్తుల బజార్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా మహిళా రైతులు తమ సేంద్రియ ఉత్పత్తులను ఇక్కడకు తెచ్చి విక్రయించుకోగలుగుతున్నారు. కూరగాయలు, పండ్లు, దేశవాళీ రకాల వరి బియ్యం, చిరుధాన్యాల బియ్యం, పప్పుధాన్యాలు, గానుగ నూనెలతోపాటు.. విలువను జోడించిన వివిధ ఉత్పత్తులను మహిళా సేంద్రియ రైతులు విక్రయిస్తున్నారు. ఒకే ఉత్పత్తిపై ఎక్కువమంది దృష్టి పెట్టి ధరపడిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. సేంద్రియ సాగు, మార్కెటింగ్‌లో ఆరోగ్యకరమైన పోటీకి అద్దంపడుతున్నారు.

తమా ఊరంతా సేంద్రియ సేద్యమే!
మా ముత్తాత కాలం నుంచీ మా కుటుంబం వ్యవసాయంలో ఉంది. నేను నాలుగో తరం రైతును. గతంలో సాధారణ వ్యవసాయం చేసి, రెండేళ్ల క్రితం నుంచే సేంద్రియ సేద్యం చేస్తున్నాను. ఎనిమిదెకరాల్లో వరి, మూడెకరాల్లో కాయగూరలు పండిస్తున్నాం. వరిలో పెద్దగా లాభం రాకున్నా కాయగూరల్లో మంచి గిట్టుబాటుంది. గత నెల ఏర్పాటు చేసిన తొలి ఎగ్జిబిషన్‌ స్టాల్లో ఒకే రోజున రూ.12 వేల విలువైన కూరగాయలు అమ్మాను. రెండోరోజు స్టాల్‌ ఉన్నా సరకులేకపోయింది. మా ఊళ్లో రైతులంతా సేంద్రియ సాగే చేస్తున్నారు.

– జయ, కారణపట్టి గ్రామం, కడలూరు జిల్లా

20 రకాల సేంద్రియ ఉత్పత్తులను అమ్ముతున్నా..
నా సొంతూరు తిరుత్తణి. తిరువళ్లూరులో పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ చదివి కొన్నేళ్లు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేశాను. సొంత ఊరు, వ్యవసాయంపై మమకారంతో తిరిగొచ్చేశా. వ్యవసాయంతోపాటు గోశాల, చేపల పెంపకం ఉంది. 2012లో పొలం కొన్నప్పటి నుంచి సేంద్రియ సేద్యంలోకి మారాను. నాలుగు తరాలుగా మా కుటుంబాలకు వ్యవసాయమే అధారం. ఉసిరి తదితరాలతో తయారు చేసిన 20 సేంద్రియ ఉత్పత్తులను అమ్ముతాను. సౌందర్య పోషక సామాగ్రిని తయారు చేసి అమ్మటం మా ప్రత్యేకత. ఇంట్లోనే స్టాక్‌ పెట్టుకొని తమిళనాడులోని అనేక ఆర్గానిక్‌ షాపులకు సౌందర్య సామాగ్రిని సరఫరా చేస్తాను.

– అనురాధ బాలాజీ, పెరియపాళయం, తిరువళ్లూరు జిల్లా

12 సంవత్సరాలుగా సేంద్రియ ఉత్పత్తులు అమ్ముతున్నా..
బీఎస్సీ చదివాను. 12 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. నాలుగు ఎకరాల్లో వరి, ఒక ఎకరా కొబ్బరి తోట వేశాను. 18 పాడి ఆవులు, 22 బర్రెలు ఉన్నాయి. నేను, మా వారు కలిసి వీటి పనులు చూసుకుంటాం. 7 రకాల దేశవాళీ బియ్యం, నెయ్యి, పసుపు, కొబ్బరి నూనె, వర్మికంపోస్ట్, పంచగవ్య సహా 12 ఉత్పత్తులు తయారు చేసి అమ్ముతున్నాం.

      – సీతాలక్ష్మి, అరలికోటై్ట గ్రామం, శివగంగా జిల్లా

వ్యవసాయం చేస్తున్నానని చెప్పుకునేందుకు గర్విస్తున్నా!
ప్లస్‌టూ వరకు చదువుకున్నాను. వంశపారంపర్యంగా వ్యవసాయం చేస్తూ రైతును అని చెప్పుకునేందుకు గర్వబడుతున్నా. యజమాని పంట పొలాల్లో దిగి పని చేసినప్పుడే కూలీలు కూడా శ్రద్ధగా పని చేస్తారు. రెండెకరాల్లో వరి, ఒక ఎకరాలో పప్పు ధాన్యాలు, ఉసిరి కాయలు, చిరుధాన్యాలను పండిస్తున్నా. ఆరోగ్యదాయకమైన మురుకులు, వాంపొడి వంటి వాటితో చిరుతిళ్లలతోపాటు సుమారు 20 రకాల వస్తువులు తయారు చేసి అమ్ముతున్నాను. ఈ ఉత్పత్తుల వల్ల ఎదుటి వారికి ఆరోగ్యం లభించడం వల్ల నాకు ఆదాయం, పుణ్యం రెండూ లభిస్తున్నాయి. సేంద్రియ సేద్యంపై రైతులకు శిక్షణ  ఇస్తున్నాను. గత నెలలో స్టాల్‌ పెట్టినప్పుడు మొదటి రోజునే రూ. 15 వేలు, రెండో రోజున రూ. 17 వేలు అమ్మాను.  

– కవితా ఇళంగోవన్, పులియకుడి, తంజావూరు జిల్లా

చదువు రాకపోయినా ఆర్థికంగా నిలదొక్కుకున్నా
మా గ్రూప్‌లో 12 మంది మహిళా రైతులం కలసి సేంద్రియ పంటలు పండించి ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై తదితర రాష్ట్రాల నుంచి మాకు ఆర్డర్లు వస్తుంటాయి. కొరియర్‌ ద్వారా సరఫరా చేస్తున్నాం. కొరియర్‌ ఖర్చులు కూడా వినియోగదారులే భరిస్తారు. 12 రకాల మసాలా వస్తువులు, పది రకాల టీ పొడులు అమ్ముతున్నా. తీరిక వేళల్లో నీలగిరిలోని సేంద్రీయ టీ ఆకు తోటల్లో పని చేస్తున్నా. రాయడం, చదవడం నాకు బొత్తిగా రాకున్నా, సేంద్రియ వ్యవసాయం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకున్నా.

– ఎస్‌.గోమతి, నీలగిరి

ఉద్యోగం వదిలేసి వచ్చా..
బీఈ పాస్సై కొన్నాళ్లు ఐటీ కంపెనీలో పని చేశాను. సేంద్రియ వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం వదిలి ఈ రంగంలోకి వచ్చాను. సోప్‌ నట్స్, శీకాకాయలు, కుంకుళ్లు వినియోగించి 40 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాను. మల్టీపర్పస్‌ క్లీనింగ్‌ ల్విక్విడ్‌ ఎంతో మేలైనది. ప్రకృతికి దగ్గరగా జీవితాన్ని గడపాలని రెండేళ్ల క్రితం నుంచి ఆర్గానిక్‌ ఫుడ్‌ ట్రైనింగ్, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నా.

– ప్రియదర్శిని, చెన్నై

ఉత్పత్తులకు రైతమ్మలే గిట్టుబాటు ధర నిర్ణయించుకుంటారు!
సేంద్రియ ఉత్పత్తులు తినటంపై ప్రజలు ఎక్కువ ఆసక్తి కనబర్చడం వల్ల అమ్మకాలు సులువైనాయి. వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా సేంద్రియ రైతులు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకుంటున్నారు. ఆర్డర్లు వస్తున్నాయి. ఇక ధర ల విషయానికి వస్తే ఇతర ఉత్పత్తులకు భిన్నంగా ఏమీ లేదు. డిమాండ్, దిగుబడిని బట్టి ధర పలుకుతోంది. మధుమేహ రోగులకు ప్రీతిపాత్రమైన బియ్యం మంచి ధర పలుకుతుంది. రైతులు తమ ప్రాంతాల్లో వనరులు, సాగుబడి ఖర్చులు, మార్కెట్‌కు చేరవేయండం తదితర ఖర్చులను బేరీజు వేసుకొని ఎవరికి వారే గిట్టుబాటు ధరను నిర్ణయించుకుంటారు. స్టాక్‌ ఎక్కువైనపుడు ధర పడిపోవడం సహజం. నేను రైతును కాను. అయితే, సమాజం, మార్కెటింగ్‌పై ఉన్న అవగాహనతో రైతమ్మలకు మార్గదర్శకం చేస్తుంటాను.

– శుభ భరద్వాజ్‌(94449 26128), సమన్వయకర్త, సేంద్రియ మహిళా రైతుల మార్కెట్, చెన్నై 

ఉచితంగా స్టాళ్లు.. ప్రయాణ ఖర్చులు
సేంద్రియ ఉత్పత్తులకు ప్రజల్లో బాగా ఆదరణ పెరిగింది. ఒకే చోట క్రమం తప్పకుండా ప్రజలకు సేంద్రియ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడానికి ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేశాం. ప్రతి నెలా రెండు రోజుల పాటు సేంద్రియ మహిళా రైతులకు స్టాళ్లను ఉచితంగా ఇవ్వడంతోపాటు ప్రయాణ ఖర్చులు, భత్యం కూడా చెల్లించి ప్రోత్సహిస్తున్నాం.

– సెంథిల్‌ కుమార్‌(97875 04035), తమిళనాడు పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ విభాగం అధికారి, చెన్నై

– కథనం: కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement