organic farmers
-
మట్టింట్లో బంగారు పంటలు
సావిత్రి విజయవంతమైన రైతు. ఆమెది మహారాష్ట్ర, లాతూర్ జిల్లా, గంగాపూర్ గ్రామం. ఆమెకున్నది ము΄్పావు ఎకరా మాత్రమే. అందులోనే ఏడాదికి రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని చూస్తోందామె. భర్త ఆరోగ్యం దెబ్బతినడంతో అతడికి వైద్యం చేయించడానికి ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి పొలంలో అడుగు పెట్టింది సావిత్రి. ‘మొదట్లో నా పొలంలో జొన్న, గోధుమ పండించేదాన్ని. ఆర్ట్ ఆఫ్ లివింగ్స్ నేచురల్ ఫార్మింగ్ అనే స్వచ్ఛంద సంస్థ వాళ్లు మా ఊరికి వచ్చి నాచురల్ ఫార్మింగ్ గురించి చెప్పి 350 జామ మొక్కలిచ్చారు. నిజానికి వాటి పెంపకం కోసం పెద్దగా శ్రమించాల్సిందేమీ లేదు. పాదులు చేసి తగినంత నీరు పెడితే చాలు. ఇక అంతర పంటలుగా వేరు శనగ, వంకాయ వంటి కూరగాయలు పండిస్తున్నాను. మా అమ్మాయి పన్నెండవ తరగతి వరకు చదివి సొంతంగా టైలరింగ్ షాపు నడుపుకుంటోంది. ఉద్యోగం వెతుక్కోవడానికి ముంబయికెళ్లిన మా అబ్బాయి కూడా చిన్న ఉద్యోగాల అవసరం లేదని మా ఊరికి తిరిగి వచ్చేశాడు. మా కుటుంబం స్వయంసమృద్ధి సాధించిందనడానికి నిదర్శనం ఇంకేం కావాలి’ అంటోంది సావిత్రి. ఆమె సక్సెస్‌తో ఆమె కొడుకు ఉద్యోగం వదిలి పొలం బాట పడితే తెలుగురాష్ట్రాల్లో ఓ లెక్చరర్ సునంద మూడేళ్ల కిందట నేచురల్ ఫార్మింగ్‌లో అడుగుపెట్టి ఇప్పుడు పాతిక ఎకరాలు సాగుచేస్తోంది.పాఠాల నుంచి పంటలకు...కడప జిల్లా రామాపురానికి చెందిన యువతి సునంద. ఆమె ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసి తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో లెక్చరర్‌గా మూడేళ్లు పని చేసింది. తర్వాత పెళ్లి చేసుకుని భర్త ఉద్యోగ రీత్యా ముంబయి వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కి వచ్చారు. లయోలా కాలేజ్‌లో లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ తన అభిరుచిని సంతృప్తి పరుచుకోవడం ముఖ్యమనే అభి్రపాయానికి వచ్చింది. అప్పటికే నైట్‌షిఫ్ట్‌లు, వర్క్ ప్రెషర్‌తో భర్త ఆరోగ్యం దెబ్బతిన్నది. నేచురల్ ఫుడ్తోనే అతడి ఆరోగ్యానికి స్వస్థత చేకూరింది. అదే సమయంలో భర్త స్నేహితుని హఠాన్మరణం ఆమెను ఆలోచింప చేసింది. మంచి ఆహారం లేనప్పుడు ఎంత డబ్బు సంపాదించినా ఏం లాభం అనుకుంది.ఇక ఉద్యోగమా, వ్యవసాయమా అనే ఊగిసలాట నుంచి బయటపడి అత్తగారి ఊరు ఆదిలాబాద్, కౌటాల మండలంలోని విజయనగరం బాట పట్టింది. ఎనిమిది ఎకరాలతో భార్యాభర్తలిద్దరూ సేంద్రియ సేద్యం మొదలు పెట్టారు. అప్పటి వరకు సుభాష్ పాలేకర్, సీవీఆర్ వ్యవసాయ పద్ధతులను చదివి ఆకళింపు చేసుకున్న జ్ఞానమే ఆమెది. మామగారి సూచనలతో మొక్క నాటడం నుంచి ప్రతి పనినీ నేర్చుకుంది.సేంద్రియ సేద్యం చేసే రైతు నిలదొక్కుకోవాలంటే మార్కెటింగ్ ప్రధాన సమస్య అని గుర్తించింది. కొనుగోలు దారులకు అందుబాటులో ఉండడమూ అవసరమే అని గుర్తించింది. ఇప్పుడు శంషాబాద్ దగ్గర షాబాద్ మండలం పెదవేడు గ్రామంలో పాతిక ఎకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తోంది. దళారీ దోపిడీ బారిన పడకుండా సొంతంగా మార్కెటింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. – వాకా మంజులారెడ్డి ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి -
Sagubadi: ‘ఐ గ్రో యువర్ ఫుడ్’.. ఉద్యమం!
అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ ఉద్యమ సంస్థల సమాఖ్య (ఐ.ఎఫ్.ఓ.ఎ.ఎం. –ఐఫోమ్) పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు ఈ నెల 10వ తేదీన ‘ఐ గ్రో యువర్ ఫుడ్’ పేరిట వినూత్న ప్రచారోద్యమాన్ని చేపట్టారు. ప్రజల కోసం రసాయనాల్లేకుండా ఆరోగ్యదాయకంగా చేపట్టిన సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్ తీరుతెన్నులు.. సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి ప్రజలు చేయగల సహాయం ఏమిటి? వంటి అంశాలపై తమ అభి్రపాయాలతో కూడిన వీడియోలను సేంద్రియ రైతులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.ఐగ్రోయువర్ఫుడ్.. బయో పేరిట ఏర్పాటైన ప్రత్యేక వెబ్సైట్లో, ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్‌కు చెందిన వెబ్సైట్/ఎక్స్/యూట్యూబ్/ఇన్‌స్టా తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రపంచ దేశాల సేంద్రియ రైతుల షార్ట్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చూసిన ప్రజలు/వినియోగదారులు తమ అభి్రపాయాలను, సూచనలను పంచుకోవడానికి వీలుంది.ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ 1972లో ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. వంద దేశాల్లోని సుమారు 700 సేంద్రియ వ్యవసాయ సంస్థలకు ఇప్పుడు ఐఫోమ్ సభ్యత్వం ఉంది. ఆరోగ్యం, పర్యావరణం, న్యాయం, శ్రద్ధ అనే నాలుగు మూల సూత్రాలపై ఆధారపడి సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింపజేయటమే ఐఫోమ్ తన లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రియ వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించటంతో పాటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజన్సీలకు అక్రెడిటేషన్ ఇస్తుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఆహారోత్పత్తి చేసి ప్రజలకు అందిస్తున్న రైతుల్లో 80% మంది చిన్న, సన్నకారు రైతులేనని ఐఫోమ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో 90% క్షేత్రాలు ఒంటరి రైతులు లేదా రైతు కుటుంబాలే నడుపుతున్నారు. సంస్థలు/కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ క్షేత్రాలు మిగతా పది శాతం మాత్రమే. https://igrowyourfood.bio/కేరళలో కౌలు సేద్యం చేస్తున్నా..!నా పేరు షమికా మోనే, మహారాష్ట్రలో పుట్టా. పరిశోధనలు వదలి పెట్టి సేంద్రియ రైతుగా మారా. కేరళలో భూమిని కౌలుకు తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. అనేక రకాల దేశీ వరితో పాటు కూరగాయలు పండిస్తున్నా. పంట విత్తిన దగ్గర నుంచి నూర్పిడి,ప్రాసెసింగ్ వంటి పనులు సాధ్యమైనంత వరకు నేనే చేసుకోవటం అద్భుతమైన అనుభవం. నేను పండించిన ఆహారోత్పత్తుల్ని తింటున్న స్నేహితులు, బంధువులు చాలా సంతోషంగా ఉన్నారు. సీజన్‌కు ముందే డబ్బు పెట్టుబడిగా ఇస్తారు. పంటలు పండించిన తర్వాత.. తమకు అవసరమైన ఆహారోత్పత్తుల్ని తీసుకుంటున్నారు. దేశీ వరి బియ్యం, అటుకులతో చేసిన స్థానిక సంప్రదాయ వంటకాలను పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ‘ఐగ్రోయువర్ఫుడ్’ ఉద్యమంలో భాగస్వామిని కావటం సంతోషంగా ఉంది.– షమిక మోనె, సేంద్రియ యువ మహిళా రైతు, కేరళ -
విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన
దేశంలోనే దిగ్గజ ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం.. దాదాపు 17 ఏళ్లు పనిచేసిన అనుభవం.. ఉద్యోగానికి రాజీనామా.. ఏదైనా ఐటీ కంపెనీ స్థాపిస్తాడేమోనని అనుకుంటాం. కానీ వ్యవసాయం ప్రారంభించాడు. ఏటా ఏకంగా రూ.205 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఏ పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాడు? అంత సంపాదన ఎలా సాధ్యమైందో ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన శశికుమార్ 17 ఏళ్లపాటు ఐటీరంగంలో సేవలందించారు. అందులో 13 ఏళ్లు దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ విప్రోలో విధులు నిర్వర్తించారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయానికి మాత్రం ప్రత్యామ్నాయం లేదని గ్రహించారు. రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, సేంద్రియ ఆహారం అందించాలని భావించారు. దాంతో ఆర్గానిక్ పద్ధతులతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తను చేస్తున్న ఉద్యోగం మానేశారు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పడంతో వారూ తనకు సహాయం అందించారు. దాంతో 2010లో 9 మంది మిత్రులు కలిసి అక్షయకల్ప ఆర్గానిక్‌ని ప్రారంభించారు. శశికుమార్ మొదట్లో కేవలం ముగ్గురు రైతులతో పాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే అక్షయకల్ప ఆర్గానిక్ నిర్వాహకులు పాలతో ఆగకుండా.. సేంద్రియ కూరగాయలు, పండ్లను పండించడం ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని ప్రజలకు ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరిస్తూ వారికి చేరువవుతున్నారు. ఆర్గానిక్ పద్ధతులతో పండిస్తున్న రైతుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. రైతుల ఆదాయాలను పెంచుతున్నారు. ప్రస్తుతం అక్షయకల్ప ఆర్గానిక్ ద్వారా పాలఉత్పత్తిలో భాగంగా 700 మంది రైతులు సహకారం అందిస్తున్నారు. దాదాపు 60,000 లీటర్ల సేంద్రియ పాలను ఉత్పత్తి చేస్తున్నట్లు శశికుమార్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో మార్కెటింగ్ సేవలందించేందుకు 500 మందికి పైగా శిక్షణ ఇస్తున్నారు. సేంద్రియ పాలపై మొదట్లో వినియోగదారులకు అవగాహన కల్పించడం పెద్ద సవాలుగా మారిందని శశికుమార్ తెలిపారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తన స్నేహితులు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఇటీవల రూ.10 కోట్లతో కొత్త డెయిరీ ప్లాంట్ ప్రారంభించామన్నారు. దాని ద్వారా రోజుకు లక్ష లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: 11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత సేంద్రియ కూరగాయలు, పండ్ల వ్యాపారం గతంలో కంటే మెరుగవుతుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో అక్షయకల్ప ఆర్గానిక్ స్టార్టప్ రూ.205 కోట్లు ఆర్జించింది. 2023-24లో ఆదాయం మరో 25 శాతం పెరుగుతుందని శశి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ 5 వేల గ్రామాలు, 5 వేల మంది రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. -
ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న గిరిజన మహిళకు పురస్కారం
-
ఏపీ రైతులు భళా.. నీతి ఆయోగ్ కథనాల్లో 21 మందికి స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం ఆవశ్యకతను తెలుపుతూ నీతి ఆయోగ్ విడుదల చేసిన సేంద్రియ వ్యవసాయదారుల స్ఫూర్తిదాయక కథనాల్లో 21 మంది ఏపీ రైతులకు స్థానం దక్కింది. వీరంతా వరి, వేరుశనగ, కందులు, ఉల్లిపాయలు, కూరగాయలు తదితర పంటలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించారు. సేంద్రియ వ్యవసాయంతో తమ ఆదాయం పెంచుకున్న వీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారంటూ నీతి ఆయోగ్ ‘కాంపెడియం ఆఫ్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్’ పేరిట దేశవ్యాప్తంగా 110 మంది కథనాలు ప్రచురించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 21 మంది ఉన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సతీమణి, చీపురుపల్లి ఉప సర్పంచ్ బెల్లాన శ్రీదేవి కూడా వీరిలో ఉన్నారు. చదవండి: ఇక్కట్లు లేని ‘ఇల’ పంటలు! ఏపీ రైతులు వీరే.. (ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన..) ♦చిర్తి నారాయణమూర్తి, పి.కొత్తగూడెం, నాతవరం, విశాఖ జిల్లా ♦అనుగుల వెంకటసుగుణమ్మ, నాగమంగళం, పలమనేరు, చిత్తూరు జిల్లా ♦బెల్లాన శ్రీదేవి, చీపురుపల్లి, విజయనగరం జిల్లా ♦ఆర్.భాస్కర్‌రెడ్డి, ఎన్.గుండ్లపల్లి, బెలుగుప్ప, అనంతపురం జిల్లా ♦చందు సత్తిబాబు, అమ్మపాలెం, పెదవేగి, పశ్చిమగోదావరి జిల్లా ♦ఎస్.దిలీప్‌కుమార్, పెదకొండూరు, దుగ్గిరాల, గుంటూరు జిల్లా ♦గమ్మెలి లక్ష్మి, ఐతగుప్ప, పాడేరు, విశాఖ జిల్లా ♦గెడ్డ అప్పలనాయుడు, గజపతినగరం, విజయనగరం జిల్లా ♦హనుమంతు ముత్యాలమ్మ, కోసరవానివలస, పార్వతీపురం, విజయనగరం జిల్లా ♦కంటిపూడి సూర్యనారాయణ, తీపర్రు, పెరపలి, పశ్చిమగోదావరి జిల్లా ♦కిల్లో ధర్మారావు, రంగసిల, హుకుంపేట, విశాఖ జిల్లా ♦కొత్తపల్లి శివరామయ్య, టి.కొత్తపల్లి, మైదుకూరు, కడప జిల్లా ♦మాగంటి చంద్రయ్య, ఎన్.గొల్లపాలెం, మచిలీపట్నం, కృష్ణా జిల్లా ♦మన్నేటి గంగిరెడ్డి, చెన్నమరాజుపల్లి, పెండ్లిమర్రి, వైఎస్సార్ జిల్లా ♦ముప్పాల నిర్మలమ్మ, అరిమేనుపాడు, ఓజిలి, నెల్లూరు జిల్లా ♦వై.పద్మావతమ్మ, లొడ్డిపల్లి, ఓర్వకల్లు,కర్నూలు జిల్లా ♦బి.రామకోటేళ్వరరావు, గ్రామనపల్లె, కలసపాడు, వైఎస్సార్ జిల్లా ♦శ్యాం రఘునాథ్, బంగారుపేట, బుచ్చయ్యపేట, విశాఖ జిల్లా ♦బి.శ్రీనివాసరావు, కొణితివాడ, వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా ♦కె.వెంకటరమణ, దుద్దుకూరు, దేవరపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ♦టి.యామిని, ఇన్నుగుంట, ఓజిలి, నెల్లూరు జిల్లా -
అనస్తీషియా వైద్యుడు..సేంద్రియ రైతుగా ఎలా మారాడంటే..
వ్యవసాయం, పశుపోషణను రసాయనాల ‘మత్తు’ నుంచి విడిపించేందుకు ఓ సీనియర్ మత్తు వైద్యుడు సేంద్రియ రైతుగా మారారు. సుమారు రూ. పది కోట్ల పెట్టుబడితో, విలక్షణ సమీకృత సేంద్రియ సేద్యానికి నమూనాగా నిలిచేలా భారీ వ్యవసాయ క్షేత్రాన్ని సొంత డిజైన్‌తో నిర్మించారు. రసాయనిక అవశేషాల్లేని బియ్యం, కూరగాయలతోపాటు.. దేశీ ఆవులు / ముర్రా గేదెల పాలను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో దాదాపు 250 మంది వైద్యులు, మరెందరో ఆరోగ్యాభిలాషుల మనసులు దోచుకుంటున్నారు. ఆయన పేరు డాక్టర్ యు. శేషఫణి (56). కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అనస్తీషియా విభాగానికి అధిపతి. వైద్య విధుల్లో నిత్యం తీరిక లేకుండా గడిపే ఆయన డాక్టర్‌గా రాణిస్తూనే.. భారీ ప్రణాళికతో పెద్ద సమీకృత సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. మహానంది మండలం గోపవరం గ్రామంలో సొంత ఆలోచనతోనే వ్యసాయ క్షేత్రాన్ని ఔరా అనిపించేలా డిజైన్ చేసుకున్నారు. భూగర్భంలో 2 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన సంప్‌ను నిర్మించి, అందులోకి ఆవులు/ గేదెల మూత్రం, పేడ, కడిగిన నీరు వెళ్లేలా ఏర్పాటు చేసి.. అక్కడే సులువుగా జీవామృతం తయారు చేసుకుంటున్నారు. సంపులో నుంచే నేరుగా పంట పొలాలకు 4 అంగుళాల పైపులతో జీవామృతాన్ని తోడి పోసే విధంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టడం విశేషం. సొంత భూమి 12 ఎకరాలు ఉండగా.. 25 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. 13 ఎకరాల్లో వరి, కూరగాయలతోపాటు పశుగ్రాసాలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నారు. పండించిన ధాన్యం 4 నెలలు మాగబెట్టిన తర్వాత బియ్యం పట్టించి గిట్టుబాటు ధరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. పంటలపై సస్యరక్షణకు అవసరాన్ని బట్టి వేస్ట్ డీకంపోజర్, గోమూత్రం, వేపనూనె పిచికారీ చేస్తారు. మామిడి, సపోట, బాదం, అంజూర, బత్తాయి, దానిమ్మ, నేరేడు, జామతో పాటు, కొబ్బరి, టేకు చెట్లు పెంచుతున్నారు. దేశీ ఆవులు, ముర్రా గేదెల నమూనా క్షేత్రం రసాయనాలు, ఆక్సీటోసిన్ ఇంజక్షన్లు వాడకుండా.. దేశీ ఆవులు, ముర్రా గేదెలతో నాణ్యమైన పాల ఉత్పత్తితోపాటు ప్రమాణాలతో కూడిన ఆవు, గేదెల సంతతిని వృద్ధి చేస్తున్నారు డా. శేషఫణి. 2016లో ఒక పశువైద్యుడి సలహాతో 4 దేశీవాళీ ఆవులు, 6 ముర్రా గేదెలతో ఫామ్ పెట్టారు. ఈ ఫామ్ నేడు విశేషంగా అభివృద్ధి చెందింది. 38 ఒంగోలు, 4 సాహివాల్ ఆవులతోపాటు 130 ముర్రా గేదెలను శ్రద్ధగా, ఆరోగ్యవంతంగా పోషిస్తూ రసాయనిక అవశేషాల్లేని పాలు ఉత్పత్తి చేస్తున్నారు. ప్యాకెట్లను ఇంటింటికీ అందిస్తున్నారు. 400 ఆవులు, గేదెలకు సరిపోయేలా మౌలిక సదుపాయాలు కల్పించారు. 17 ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాసాలు సాగు చేస్తున్నారు. 200 ఎకరాల వరి గడ్డి, జొన్న చొప్ప కొని భారీ గోదాములో నిల్వ చేసుకొని ఏడాది పొడవునా మేపుతున్నారు. సొంత దినుసులతోనే దాణా తయారు చేసుకొని ఖర్చు తగ్గించుకుంటూ సత్ఫలితాలు సాధిస్తుండటం విశేషం. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నందుకు సంతృప్తిగా ఉంది జాతి పశువులు అంతరించిపోకుండా ఉండాలనే లక్ష్యంతో దేశవాళీ ఆవులు, ముర్రా గేదెలతో ప్రత్యేక ఫామ్‌ను అభివృద్ధి చేశాం. నంద్యాల పరిశోధనా స్థానం నుంచి నాణ్యమైన ఒంగోలు గిత్తల సెమెన్ వాడుతున్నాం. సెక్స్డ్ సెమన్‌తో మేలు జాతి ముర్రా జాతి పశువులను ప్రత్యేక సొసైటీ ద్వారా శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నాం. ఆరోగ్యదాయకమైన ఎ2 పాలను, బియ్యం, ఇతర ఆహారోత్పత్తులను అందిస్తున్నాం. ఇటు గోసేవ, అటు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నందుకు సంతృప్తిగా ఉంది. – డా. శేషఫణి (94400 70234), గోపవరం, మహానంది మండలం, కర్నూలు జిల్లా -
మార్చి 1–3 తేదీల్లో హైదరాబాద్‌లో సేంద్రియ ఉత్పత్తుల మేళా
సేంద్రియ రైతులతో నేరుగా సంబంధాలు కలిగిన ఏకలవ్య ఫౌండేషన్, గ్రామభారతి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, భారతీయ కిసాన్ సంఘ్ కలిసి గో ఆధారిత రైతుమిత్ర సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్‌లో మార్చి 1, 2, 3 తేదీల్లో సేంద్రియ ఉత్పత్తుల మేళాను నిర్వహిస్తుండటం విశేషం. హైటెక్ సిటీలోని శిల్పారామం నైట్ బజార్లో జరగనున్న ఈ మేళాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్.ఐ.పి.హెచ్.ఎం, సి.ఎఫ్.టి.ఆర్.ఐ., ఎన్.ఐ.ఎన్. సంస్థలు కూడా ఈ మేళాలో పాలుపంచుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సేంద్రియ రైతులు, దుకాణదారులు తమ సేంద్రియ ఉత్పత్తులను అమ్మకానికి పెడతారు. సేంద్రియ ఆహారోత్పత్తులతోపాటు 200 రకాల ఔషధ మొక్కలు, హెర్బల్ ఉత్పత్తులు, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ కూడా అందుబాటులో ఉంటాయని గో ఆధారిత రైతు మిత్ర సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు. మార్చి 1న ఉ. 10 గంటలకు మహా రైతు సమ్మేళనం ప్రారంభమవుతుంది. మ. 3 గం. కు కోత అనంతరం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై సి.ఎఫ్.టి.ఆర్.ఐ. నిపుణులతో సదస్సు, సేంద్రియ వ్యవసాయంపై ఇష్టాగోష్టి ఉంటాయి. 2న సా. 3 గం.కు సేంద్రియ వ్యవసాయంపై సదస్సు, జాతీయ పోషకాహార సంస్థ నిపుణుల ఆధ్వర్యంలో ఆహార సదస్సు ఉంటుంది. 3న సా. 3 గం.కు జరిగే పర్యావరణ అనుకూల సేంద్రియ వ్యవసాయంపై సదస్సు ఉంటుంది. 4 గం.కు సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి ప్రసంగం, చర్చాగోష్టి ఉంటాయి. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు ఉచితంగా టేబుల్ స్పేస్ పొందే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు.. 76598 55588, 91001 02229, 92465 33243, 98666 47534. 3న బసంపల్లిలో గో ఆధారిత వ్యవసాయంపై శిక్షణ అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో మార్చి 3(ప్రతి నెలా మొదటి ఆదివారం)న ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన రైతులు ముందుగా తమపేర్లు నమోదు చేయించుకోవాలి. రుసుము రూ. 100 (భోజనం సహా). వివరాలకు.. 94407 46074, 96636 67934 3న కొర్నెపాడులో బొప్పాయి, కూరగాయల సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయవిధానంలో బొప్పాయి, కూరగాయల సాగుపై మార్చి 3(ఆదివారం)న సీనియర్ రైతులు శరత్‌బాబు (ప్రకాశం జిల్లా), శివనాగమల్లేశ్వరరావు (గుంటూరుజిల్లా) రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. 1న డ్రయ్యర్‌తో మామిడి ఆమ్‌చుర్, తాండ్ర తయారీపై ఉచిత శిక్షణ మామిడి కాయలతో ఒరుగులు (స్లైసెస్), మామిడి కాయల పొడి (ఆమ్చూర్), మామిడి తాండ్రలను తక్కువ ఖర్చుతో త్వరగా ఎండబెట్టే డ్రయ్యర్ సాంకేతికత–నిర్వహణపై మార్చి 1 (శుక్రవారం)న ఉ. 10 గం.ల నుంచి గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకుడు ఎల్. శ్రీనివాసరావు తెలిపారు. ఒక హెచ్.పి. విద్యుత్తు లేదా వంట చెరకుతో ఈ డ్రయ్యర్ నడుస్తుంది. వివరాలకు.. 99123 47711. -
సేంద్రియ సేద్యంపై నెల రోజుల ఉచిత సర్టిఫికెట్ కోర్సు
కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం (ఎన్.సి.ఒ.ఎఫ్.), జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు సేంద్రియ సేద్యంలో మార్చి 7 నుంచి ఏప్రిల్ 5 వరకు రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహించనున్నట్లు ఎన్.సి.ఒ.ఎఫ్ శాస్త్రవేత్త డా. వి. ప్రవీణ్ తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని మేనేజ్‌లో ఈ కోర్సును నిర్వహిస్తారు. శిక్షణ, భోజన, వసతులు ఉచితం. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన గ్రామీణ స్త్రీలు, పురుషులు అర్హులు. వయోపరిమితి లేదు. మొత్తం 30 సీట్లలో 4 ఎస్సీలకు, 2 ఎస్టీలకు, 8 ఓబీసీలకు, మైనారిటీలకు ఒకటి కేటాయించారు. 20 రోజులు పాఠాలు నేర్చుకొని, 10 రోజులు పొలంలో పనిచేయాలి. ఈ క్రింది వెబ్సైట్లో నుంచి దరఖాస్తు నమూనాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://ncof.dacnet.nic.in/DowloadableForms/ApplicationFormFor Training.pdf నింపిన దరఖాస్తును స్కాన్ చేసి కోర్సు ప్రారంభానికి కనీసం 7 పనిదినాల ముందే praveenvootla85@gmail.com కు మెయిల్ చెయ్యాలి. కోర్సు సమన్వయకర్త డా.ప్రవీణ్‌కుమార్‌ను 92478 09764 నంబరులో వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. 24న భీమవరం, తణుకులో డా. ఖాదర్ వలి ప్రసంగాలు ప.గో. జిల్లా భీమవరం, తణుకులో ఈ నెల 24 (ఆదివా రం)న సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగించనున్నారు. భీమవరంలోని ఎ.ఎస్.ఆర్. నగర్‌లోని శ్రీ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో 24న ఉ. 9 గం. నుంచి మ. 1 గం. వరకు డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారని నిర్వాహకులు లయన్ డాక్టర్ పి. బి. ప్రతాప్‌కుమార్(94401 24253), సుబ్రహ్మణ్యం రాజు(76598 55588) తెలిపారు. తణుకులోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ ఆవరణ(గవర్నమెంటు హాస్పిటల్ పక్కన, మెయిన్ రోడ్డు)లో 24వ తేదీ సా. 4.30 గం. నుంచి రా. 7 గం. వరకు జరిగే ఈ సదస్సులో డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 70939 73999, 98493 12629. 23న కరీంనగర్లోసేంద్రియ రైతు సమ్మేళనం జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం (ఎన్.సి.ఓ.ఎఫ్.) ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్స్ (కలెక్టరేట్ ఎదురుగా)లో ఈ నెల 23 (శనివారం) ఉ. 9 గం. నుంచి సా. 5 గం. వరకు సేంద్రియ రైతు సమ్మేళనం జరగనుంది. వేస్ట్ డీ కంపోజర్‌తో సేంద్రియ సేద్యం, పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్, మార్కెట్ అనుసంధానంపై ఎన్.సి.ఓ.ఎఫ్. డైరెక్టర్ డా. కృష్ణచంద్ర, శాస్త్రవేత్త డా. ప్రవీణ్ కుమార్ పాల్గొని రైతులకు అవగాహన కల్పిస్తారని విశ్రాంత జె.డి.ఎ. జనార్దన్‌రావు తెలిపారు. వివరాలకు.. 93969 69217, 84640 09350 కట్టె గానుగల నిర్వహణపై 3 రోజుల శిక్షణ సహజ సాగు పద్ధతిలో పండించిన నూనెగింజలతో ఎటువంటి రసాయనాల్లేకుండా కట్టె గానుగలో వంట నూనెలను వెలికితీయడంపై యువతీ యువకులకు మార్చి 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్లో శిక్షణ ఇవ్వనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షిండె శివశంకర్ తెలిపారు. కనీసం పదో తరగతి చదివిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. వివరాలను ఈ నెల 25లోగా 81210 08002, 70133 09949లలో ఏదో ఒక నంబర్‌కు ఎస్.ఎం.ఎస్./వాట్సప్ ద్వారా సమాచారం పంపాలన్నారు. -
సేంద్రియ రైతుల్లో భారతీయులే ఎక్కువ!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూమిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా 1.2% విస్తీర్ణంలో వ్యవసాయం జరుగుతున్నది, ఏటేటా విస్తరిస్తూ ఉంది. పదిహేను దేశాల్లో ఉన్న వ్యవసాయ భూమిలో 10% కన్నా ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన సేంద్రియ వ్యవసాయ పరిశోధనా సంస్థ– ఎఫ్.ఐ.బి.ఎల్., జర్మనీలోని బాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఐ.ఎఫ్.ఓ.ఎ.ఓం. ఆర్గానిక్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఏటేటా శాస్త్రీయమైన పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయ, వాణిజ్య గణాంకాలు సేకరిస్తుంటాయి. 2018లో ఈ సంస్థలు వెలువరించిన గణాంకాల ప్రకారం.. 178 దేశాల్లో గత సంవత్సరం వరకు రసాయనిక వ్యవసాయం చేసి 2016 నుంచే సేంద్రియ వ్యవసాయం ప్రారంభించిన విస్తీర్ణం కూడా కలుపుకొని.. మొత్తం 5 కోట్ల 78 లక్షల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది. అంటే.. ఇంత విస్తీర్ణంలో భూములు రసాయనాల బారిన పడి నిర్జీవంగా మారకుండా ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను అందిస్తున్నాయన్నమాట. సేంద్రియ వ్యవసాయంలో ఉన్న భూమి 1999లో కోటి 10 లక్షల హెక్టార్లే. ప్రస్తుతం అత్యధికంగా ఆస్ట్రేలియాలో 2.71 కోట్ల హెక్టార్లు, అర్టెంటీనాలో 30 లక్షల హెక్టార్లు, చైనాలో 23 లక్షల హెక్టార్లలో సేంద్రియ సేద్యం జరుగుతోంది. సేంద్రియ వ్యవసాయ విస్తీర్ణం ఆసియా దేశాల్లో 2016లో 34 శాతం లేదా 9 లక్షల హెక్టార్లు పెరిగింది. ఐరోపాలో 6.7 శాతం లేదా 10 లక్షల హెక్టార్లు పెరిగింది. అయితే, రసాయనాలు వాడకుండా నేలతల్లికి ప్రణమిల్లుతూ ప్రకృతికి అనుకూలమైన పద్ధతుల్లో పంటలు పండిస్తున్న రైతుల సంఖ్య మన దేశంలోనే ఎక్కువ. 2016 నాటికి ప్రపంచవ్యాప్తంగా వీరి సంఖ్య 27 లక్షలు. ఇందులో 40% ఆసియా దేశాల రైతులే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య 24 లక్షలు. వీరిలో 8,35,000 మంది సేంద్రియ రైతులు భారతీయులు కావటం విశేషం. ఉగాండాలో 2,10,352, మెక్సికోలో 2,10,000 మంది సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇంతకీ ఈ గణాంకాలు క్షేత్రస్థాయి వాస్తవాలను ఎంత వరకూ ప్రతిబింబిస్తున్నాయి? భారత్ సహా కొన్ని దేశాలు తాజా గణాంకాలను అందించడంలో విఫలమవుతున్నాయని, అందుబాటులో ఉన్న వరకు క్రోడీకరిస్తున్నట్లు అధ్యయన సంస్థలు పేర్కొంటున్నాయి. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తుల రిటైల్ అమ్మకాల విలువలో 20% వార్షిక వృద్ధి నమోదవుతోంది. -
సేంద్రియ మహిళా రైతుల బజార్!
తమిళనాడు ప్రభుత్వం స్వయం ఉపాధి సంఘాలకు చెందిన వేలాది మంది మహిళలను సేంద్రియ సాగుకు ప్రోత్సహించడంతోపాటు.. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు దేశంలోనే తొలి మహిళా రైతుల బజార్‌ను ఏర్పాటు చేయటం ప్రశంసనీయం. గ్రామీణ ప్రాంతాల నుంచి సేంద్రియ ఉత్పత్తులను చెన్నై నగర వినియోగదారుల వద్దకు చేర్చడంలో తమిళనాడు కార్పొరేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ విమెన్, ఆర్గానిక్ ఫార్మర్స్ మార్కెట్(ఓఎఫ్ఎమ్) సంయుక్తంగా మహిళా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. చెన్నై వల్లువర్‌కోట్టం హైరోడ్డులోని మదర్ థెరిసా ఉమెన్ కాంప్లెక్స్‌లో ప్రతి నెలా మొదటి శని, ఆదివారాల్లో మహిళల నేతృత్వంలో సేంద్రియ ఉత్పత్తుల బజార్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా మహిళా రైతులు తమ సేంద్రియ ఉత్పత్తులను ఇక్కడకు తెచ్చి విక్రయించుకోగలుగుతున్నారు. కూరగాయలు, పండ్లు, దేశవాళీ రకాల వరి బియ్యం, చిరుధాన్యాల బియ్యం, పప్పుధాన్యాలు, గానుగ నూనెలతోపాటు.. విలువను జోడించిన వివిధ ఉత్పత్తులను మహిళా సేంద్రియ రైతులు విక్రయిస్తున్నారు. ఒకే ఉత్పత్తిపై ఎక్కువమంది దృష్టి పెట్టి ధరపడిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. సేంద్రియ సాగు, మార్కెటింగ్‌లో ఆరోగ్యకరమైన పోటీకి అద్దంపడుతున్నారు. తమా ఊరంతా సేంద్రియ సేద్యమే! మా ముత్తాత కాలం నుంచీ మా కుటుంబం వ్యవసాయంలో ఉంది. నేను నాలుగో తరం రైతును. గతంలో సాధారణ వ్యవసాయం చేసి, రెండేళ్ల క్రితం నుంచే సేంద్రియ సేద్యం చేస్తున్నాను. ఎనిమిదెకరాల్లో వరి, మూడెకరాల్లో కాయగూరలు పండిస్తున్నాం. వరిలో పెద్దగా లాభం రాకున్నా కాయగూరల్లో మంచి గిట్టుబాటుంది. గత నెల ఏర్పాటు చేసిన తొలి ఎగ్జిబిషన్ స్టాల్లో ఒకే రోజున రూ.12 వేల విలువైన కూరగాయలు అమ్మాను. రెండోరోజు స్టాల్ ఉన్నా సరకులేకపోయింది. మా ఊళ్లో రైతులంతా సేంద్రియ సాగే చేస్తున్నారు. – జయ, కారణపట్టి గ్రామం, కడలూరు జిల్లా 20 రకాల సేంద్రియ ఉత్పత్తులను అమ్ముతున్నా.. నా సొంతూరు తిరుత్తణి. తిరువళ్లూరులో పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చదివి కొన్నేళ్లు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేశాను. సొంత ఊరు, వ్యవసాయంపై మమకారంతో తిరిగొచ్చేశా. వ్యవసాయంతోపాటు గోశాల, చేపల పెంపకం ఉంది. 2012లో పొలం కొన్నప్పటి నుంచి సేంద్రియ సేద్యంలోకి మారాను. నాలుగు తరాలుగా మా కుటుంబాలకు వ్యవసాయమే అధారం. ఉసిరి తదితరాలతో తయారు చేసిన 20 సేంద్రియ ఉత్పత్తులను అమ్ముతాను. సౌందర్య పోషక సామాగ్రిని తయారు చేసి అమ్మటం మా ప్రత్యేకత. ఇంట్లోనే స్టాక్ పెట్టుకొని తమిళనాడులోని అనేక ఆర్గానిక్ షాపులకు సౌందర్య సామాగ్రిని సరఫరా చేస్తాను. – అనురాధ బాలాజీ, పెరియపాళయం, తిరువళ్లూరు జిల్లా 12 సంవత్సరాలుగా సేంద్రియ ఉత్పత్తులు అమ్ముతున్నా.. బీఎస్సీ చదివాను. 12 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. నాలుగు ఎకరాల్లో వరి, ఒక ఎకరా కొబ్బరి తోట వేశాను. 18 పాడి ఆవులు, 22 బర్రెలు ఉన్నాయి. నేను, మా వారు కలిసి వీటి పనులు చూసుకుంటాం. 7 రకాల దేశవాళీ బియ్యం, నెయ్యి, పసుపు, కొబ్బరి నూనె, వర్మికంపోస్ట్, పంచగవ్య సహా 12 ఉత్పత్తులు తయారు చేసి అమ్ముతున్నాం. – సీతాలక్ష్మి, అరలికోటై్ట గ్రామం, శివగంగా జిల్లా వ్యవసాయం చేస్తున్నానని చెప్పుకునేందుకు గర్విస్తున్నా! ప్లస్‌టూ వరకు చదువుకున్నాను. వంశపారంపర్యంగా వ్యవసాయం చేస్తూ రైతును అని చెప్పుకునేందుకు గర్వబడుతున్నా. యజమాని పంట పొలాల్లో దిగి పని చేసినప్పుడే కూలీలు కూడా శ్రద్ధగా పని చేస్తారు. రెండెకరాల్లో వరి, ఒక ఎకరాలో పప్పు ధాన్యాలు, ఉసిరి కాయలు, చిరుధాన్యాలను పండిస్తున్నా. ఆరోగ్యదాయకమైన మురుకులు, వాంపొడి వంటి వాటితో చిరుతిళ్లలతోపాటు సుమారు 20 రకాల వస్తువులు తయారు చేసి అమ్ముతున్నాను. ఈ ఉత్పత్తుల వల్ల ఎదుటి వారికి ఆరోగ్యం లభించడం వల్ల నాకు ఆదాయం, పుణ్యం రెండూ లభిస్తున్నాయి. సేంద్రియ సేద్యంపై రైతులకు శిక్షణ ఇస్తున్నాను. గత నెలలో స్టాల్ పెట్టినప్పుడు మొదటి రోజునే రూ. 15 వేలు, రెండో రోజున రూ. 17 వేలు అమ్మాను. – కవితా ఇళంగోవన్, పులియకుడి, తంజావూరు జిల్లా చదువు రాకపోయినా ఆర్థికంగా నిలదొక్కుకున్నా మా గ్రూప్‌లో 12 మంది మహిళా రైతులం కలసి సేంద్రియ పంటలు పండించి ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కోల్కత్తా, ముంబై తదితర రాష్ట్రాల నుంచి మాకు ఆర్డర్లు వస్తుంటాయి. కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్నాం. కొరియర్ ఖర్చులు కూడా వినియోగదారులే భరిస్తారు. 12 రకాల మసాలా వస్తువులు, పది రకాల టీ పొడులు అమ్ముతున్నా. తీరిక వేళల్లో నీలగిరిలోని సేంద్రీయ టీ ఆకు తోటల్లో పని చేస్తున్నా. రాయడం, చదవడం నాకు బొత్తిగా రాకున్నా, సేంద్రియ వ్యవసాయం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకున్నా. – ఎస్.గోమతి, నీలగిరి ఉద్యోగం వదిలేసి వచ్చా.. బీఈ పాస్సై కొన్నాళ్లు ఐటీ కంపెనీలో పని చేశాను. సేంద్రియ వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం వదిలి ఈ రంగంలోకి వచ్చాను. సోప్ నట్స్, శీకాకాయలు, కుంకుళ్లు వినియోగించి 40 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాను. మల్టీపర్పస్ క్లీనింగ్ ల్విక్విడ్ ఎంతో మేలైనది. ప్రకృతికి దగ్గరగా జీవితాన్ని గడపాలని రెండేళ్ల క్రితం నుంచి ఆర్గానిక్ ఫుడ్ ట్రైనింగ్, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నా. – ప్రియదర్శిని, చెన్నై ఉత్పత్తులకు రైతమ్మలే గిట్టుబాటు ధర నిర్ణయించుకుంటారు! సేంద్రియ ఉత్పత్తులు తినటంపై ప్రజలు ఎక్కువ ఆసక్తి కనబర్చడం వల్ల అమ్మకాలు సులువైనాయి. వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా సేంద్రియ రైతులు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకుంటున్నారు. ఆర్డర్లు వస్తున్నాయి. ఇక ధర ల విషయానికి వస్తే ఇతర ఉత్పత్తులకు భిన్నంగా ఏమీ లేదు. డిమాండ్, దిగుబడిని బట్టి ధర పలుకుతోంది. మధుమేహ రోగులకు ప్రీతిపాత్రమైన బియ్యం మంచి ధర పలుకుతుంది. రైతులు తమ ప్రాంతాల్లో వనరులు, సాగుబడి ఖర్చులు, మార్కెట్‌కు చేరవేయండం తదితర ఖర్చులను బేరీజు వేసుకొని ఎవరికి వారే గిట్టుబాటు ధరను నిర్ణయించుకుంటారు. స్టాక్ ఎక్కువైనపుడు ధర పడిపోవడం సహజం. నేను రైతును కాను. అయితే, సమాజం, మార్కెటింగ్‌పై ఉన్న అవగాహనతో రైతమ్మలకు మార్గదర్శకం చేస్తుంటాను. – శుభ భరద్వాజ్(94449 26128), సమన్వయకర్త, సేంద్రియ మహిళా రైతుల మార్కెట్, చెన్నై ఉచితంగా స్టాళ్లు.. ప్రయాణ ఖర్చులు సేంద్రియ ఉత్పత్తులకు ప్రజల్లో బాగా ఆదరణ పెరిగింది. ఒకే చోట క్రమం తప్పకుండా ప్రజలకు సేంద్రియ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడానికి ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేశాం. ప్రతి నెలా రెండు రోజుల పాటు సేంద్రియ మహిళా రైతులకు స్టాళ్లను ఉచితంగా ఇవ్వడంతోపాటు ప్రయాణ ఖర్చులు, భత్యం కూడా చెల్లించి ప్రోత్సహిస్తున్నాం. – సెంథిల్ కుమార్(97875 04035), తమిళనాడు పౌరసరఫరాలు, మార్కెటింగ్ విభాగం అధికారి, చెన్నై – కథనం: కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
రెండేళ్లుగా కరువున్నా నీటికొరత లేదు!
తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి ప్రాంతం రెండున్నరేళ్ల క్రితం తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నది. ఆ జిల్లా ఉదయంపులి గ్రామంలో సేంద్రియ రైతు కె.జయచంద్రన్కు చెందిన 200 ఎకరాల సర్టిఫైడ్ సేంద్రియ (బయోడైనమిక్) వ్యవసాయ క్షేత్రంలో అప్పట్లో తీవ్ర నీటికొరత ఏర్పడింది. ఆ దశలో గుంటూరుకు చెందిన తన మిత్రుడు, సేంద్రియ రైతు ప్రకాశ్‌రెడ్డి సలహా మేరకు.. జయచంద్రన్ తన ఉద్యాన తోటల మధ్యలో వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. అప్పుడు కందకాలు తవ్వటం వల్ల గత రెండు సంవత్సరాలుగా పెద్దగా వర్షాలు లేకపోయినా.. తోటల సాగుకు ఎటువంటి నీటి కొరతా లేకుండా సజావుగా దిగుబడులను అందుకోగలుగుతున్నానని జయచంద్రన్ ‘సాగుబడి’తో చెప్పారు. 200 వ్యవసాయ క్షేత్రంలో 5–6 ఎకరాలకు ఒక క్లస్టర్‌గా విభజించుకున్న జయచంద్రన్.. వేర్వేరు క్లస్టర్లలో ఉసిరి, మామిడి, కొబ్బరి, సపోట, బొప్పాయి, నిమ్మ, అరటి, మునగ తోటలను బయోడైనమిక్ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీటితోపాటు 5 నుంచి 25 సంవత్సరాల్లో కోతకు వచ్చే అనేక జాతుల కలప చెట్లను వేలాదిగా పెంచుతున్నారు. వీటికి బిందు సేద్యం ద్వారా నీరందిస్తున్నారు. క్లస్టర్ల మధ్యలో మట్టి కట్టల వెంట 9 అడుగుల వెడల్పు, 6–7 అడుగుల లోతున కందకాలు తవ్వించారు. కందకాలలో ప్రతి వంద మీటర్లకు ఒక చోట చెక్ వాల్స్ నిర్మించారు. స్వల్ప ఖర్చుతో నిర్మించిన కందకాల ద్వారా వాన నీరంతా భూమిలోకి ఇంకడం వల్ల 27 బోర్లు, 6 పెద్ద వ్యవసాయ బావుల్లో నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. గత రెండేళ్లుగా నీటి కొరత సమస్యే లేదని జయచంద్రన్(96772 20020) తెలిపారు. సాక్షి, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం సంయుక్తంగా ‘చేను కిందే చెరువు’ పేరిట ఐదేళ్ల క్రితం నుంచి నిర్వహిస్తున్న ప్రచారోద్యమ స్ఫూర్తితోనే తన మిత్రుడు జయచంద్రన్కు కందకాల గురించి సూచించానని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. -
ఎండిన బోరు, బావిలో పుష్కలంగా నీరు!
వాన నీటిని కందకాల ద్వారా నేలతల్లికి తాపితే.. ఎండిన బోర్లు, బావులు వెంటనే జలకళను సంతరించుకుంటాయనడానికి యువ సేంద్రియ రైతు మార్తి శ్యాంప్రసాద్‌రెడ్డికి కలిగిన తాజా అనుభవమే ప్రబల నిదర్శనంగా చెప్పొచ్చు. ఎనిమిదిన్నరేళ్లు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసి.. వ్యవసాయంపై మక్కువతో తిరిగి వచ్చేసిన శ్యాంప్రసాద్‌రెడ్డి ఏడాది క్రితం నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం గజ్జెనవారిగూడెంలో 20 ఎకరాల ఎర్రగరప నేలను కొనుగోలు చేశారు. గతేడాది 4 ఎకరాల్లో శ్రీవరి, 16 ఎకరాల్లో చిరుధాన్యాలు, దేశీ పుచ్చ (విత్తనం కోసం) సాగు చేశారు. పొలంలో రెండు బోర్లు, బావి ఉన్నాయి. అయితే, ఈ ఎండాకాలంలో ఒక బోరుతోపాటు బావి కూడా ఎండిపోయింది. గత ఏడాది అధిక వర్షపాతం నమోదైనా.. ఈ వేసవిలో బోరు, బావి ఎండిపోయాయి. ఈ దశలో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009)లను సంప్రదించి.. వారి సూచనల మేరకు గత నెలలో కందకాలు తవ్వించారు. తూర్పు నుంచి పడమరకు ఏటవాలుగా ఉన్న ఈ భూమిలోకి పై నుంచి కూడా వాన నీటి వరద వస్తూ ఉంటుంది. వాన నీటిని పూర్తిగా భూమిలోకి ఇంకింపజేసుకోవాలన్న లక్ష్యంతో పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వించారు. నెల తిరగక ముందే 4 పెద్ద వర్షాలు పడ్డాయి. వారమంతా వర్షం కురిసింది. కురిసిన 2–3 గంటల్లోనే కందకాల ద్వారా భూమి లోపలికి ఇంకిందని శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వర్షాలు కురిసిన వెంటనే బోరు, బావి తిరిగి జలకళను సంతరించుకున్నాయని ఆయన సంతోషంగా చెప్పారు. బోరు రెండించుల నీరు పోస్తున్నదని, 7హెచ్.పి. మోటారుకు రోజుకు ఐదారు గంటలు బావి నీరు అందుతున్నాయన్నారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో డ్రమ్ సీడర్‌తో వరి విత్తటానికి దమ్ము చేస్తున్నామని, మిగతా 16 ఎకరాల్లో సిరిధాన్యాలు సాగు చేస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో వర్షం కురిస్తే పైనుంచి కూడా వచ్చే వరద వల్ల పడమర భాగంలో భూమి కోసుకుపోయేదని, మట్టి కట్ట వేసినా ప్రయోజనం లేకుండా పోయిన పరిస్థితుల్లో కందకాలు తవ్వటం వల్ల చుక్క నీరు, పిడికెడు మట్టి కూడా బయటకు కొట్టుకుపోలేదన్నారు. ఇంకో 2–3 వానలు పడితే ఈ ఏడాది సాగునీటికి ఇబ్బంది ఉండబోదన్నారు. వర్షాలకు ముందు కందకాలు తవ్వటం వల్ల కొద్ది రోజుల్లోనే బోరు, బావి జలకళను సంతరించుకోవడం సంతోషకరమని యువ రైతు శ్యాంప్రసాద్‌రెడ్డి (84640 76429) తెలిపారు. మార్తి శ్యాంప్రసాద్ రెడ్డి -
పచ్చగన్నేరు, కలబంద ద్రావణంతో చీడపీడలు అవుట్!
ప్రకృతిలో లభించే ఔషధ మొక్కలే సేంద్రియ రైతులకు బాసటగా నిలుస్తున్నాయి. ద్రావణాలను స్వయంగా తయారు చేసుకొని పురుగుమందులకు బదులుగా వాడుతూ నాణ్యమైన పంట దిగుబడులు సాధిస్తున్న రైతులెందరో ఉన్నారు. పచ్చగన్నేరు, కలబంద మొక్కలతో తయారు చేసిన ద్రావణం వివిధ పంటల్లో చీడపీడలను అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేస్తున్నదని కడప జిల్లాకు చెందిన పలువురు సేంద్రియ రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఆ వివరాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. కడప జిల్లా వెంపల్లె మండలం టి. వెలమవారిపల్లెకు చెందిన ఆదర్శ సేంద్రియ రైతు కె. విజయ్‌కుమార్ పచ్చగన్నేరు, కలబందలతో తయారు చేసిన ద్రావణాన్ని పంటలపై చీడపీడల నివారణకు వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. పచ్చ గన్నేరు, కలబంద దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ దొరికేవే. పొలాలు, చెరువు కట్టల వెంబడి విరివిగా కనిపిస్తాయి. వీటిని పశువులు మేయవు, చీడపీడలు ఆశించవు. అందుకే.. వీటితో ద్రావణం తయారు చేసి చీడపీడలను అరికట్టవచ్చన్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టి విజయకుమార్ సత్ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలను చూసి మరికొందరు రైతులూ తయారు చేసుకొని వాడుతున్నారు. వరి, మిర్చి, వేరుశనగ, వంగ, టొమాటో, బెండ, ఆకుకూరల పంటలతోపాటు నిమ్మ, బత్తాయి తోటల్లో దోమ, రెక్కల పురుగులు, అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగుల నివారణకు ఈ ద్రావణం సమర్థవంతంగా పనిచేస్తోందని విజయకుమార్ తెలిపారు. ద్రావణం తయారీకి కావలసిన వస్తువులు : పచ్చగన్నేరు కొమ్మలు (పూలు, కాయలతో) = 5 కిలోలు కలబంద కాడలు = 5 కిలోలు ద్రావణం తయారీ విధానం.. పచ్చ గన్నేరు కొమ్మలను రోలు లేదా గ్రైండర్తో మెత్తని ముద్దగా చేసుకోవాలి. బాగా కండ పట్టిన 5 కిలోల అలోవీరా (కలబంద) కాడలకు తొక్క తీసి నుజ్జుగా చేయాలి. ఈ రెంటిని కలిపి 200 లీటర్ల నీరు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ము లేదా మట్టి లేదా సిమెంటు తొట్టెలో వేయాలి. ఇందులో 5 లీటర్ల పశువుల మూత్రం లేదా మనుషుల మూత్రం పోయాలి. గాడిద మూత్రం అయితే ఒక లీటరు సరిపోతుంది. వీటిన్నిటినీ వేసి కర్రతో బాగా కలపాలి. తరువాత 180 లీ. నీటిని పోయాలి. డ్రమ్ములో ఉన్న ద్రావణానికి గాలి, వెలుతురు తగిలేలా పైన పలుచటి గుడ్డ లేదా గోనె సంచిని కప్పాలి. వారం రోజుల పాటు ఈ ద్రావణాన్ని నీడలో నిల్వ ఉంచాలి. ఈ ద్రావణం 6 నెలల పాటు పనిచేస్తుంది. ఏ యే పంటకు ఎంత మోతాదు? ఈ ద్రావణాన్ని ఏ పంటపైనైనా పిచికారీ చేసుకోవచ్చు. ఉద్యాన, కూరగాయ పంటలపై మొదటిసారి పిచికారీ చేసేటప్పుడు.. 60 లీ. నీటికి ఒక లీటరు ద్రావణాన్ని, రెండో పిచికారీలో 80 లీ. నీటికి లీ. ద్రావణాన్ని, మూడో పిచికారీలో 100 లీ. నీటికి లీటరు ద్రావణాన్ని కలిపి చెట్లు మొదలు, ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఆకుకూర పంటలపై లీ. ద్రావణాన్ని 60 లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మోతాదు మించకూడదు. ఈ ద్రావణాన్ని ఏడేళ్లుగా వాడుతున్నా.. పచ్చగన్నేరు, కలబంద ద్రావణాన్ని బత్తాయి, చిన్న నిమ్మ, సపోట, వేరుశనగ పంటలపై గత ఏడేళ్లుగా పిచికారీ చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నామని విజయ్‌కుమార్ (98496 48498) తెలిపారు. ‘చిన్న నిమ్మలో ఆకుముడతను, సపోటలో కాయ తొలిచే పురుగును, వేరుశనగలో ఆకుముడత, దోమలను, వరిలో దోమను ఇది సమర్థవంతంగా నివారించింది. తీగజాతి కూరగాయ పంటల (బీర, చిక్కుడు, కాకర..)పై పూతరాక మునుపే రెండు నుంచి నాలుగు దఫాలు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు వచ్చాయి. వంగ, టొమాటో, బెండ వంటి పంటలపై.. ముఖ్యంగా వంగలో దోమ, కాండం తొలిచే పురుగును నివారించ గలిగాం. ఈ ద్రావణం కొద్దిగా జిగురుగా ఉంటుంది. కాబట్టి రెక్కల పురుగులను నివారించటంలో సమర్థవంతంగా పని చేసింద’ని ఆయన వివరించారు. ఎన్. రవీంద్రరెడ్డి (99597 00559), కె. ప్రతాప్ (81060 51130) తదితరులు ఈ ద్రావణాన్ని అనేక సంవత్సరాలుగా వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారు. - సాగుబడి డెస్క్ ద్రావణం వాడకంలో మెలకువలు - పంట పూత దశలో ద్రావణాన్ని పిచికారీ చేయకూడదు. - పచ్చగన్నేరు కాయలు, రసం విష ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దీన్ని తయారు చేసుకొనేటప్పుడు చేతులకు తగలకుండా జాగ్రత్తపడాలి. పచ్చగన్నేరు చెట్లు పూత, కాయలతో ఉన్నప్పుడు వాడితేనే ఫలితం బాగుంటుంది. - తెల్లదోమ, పచ్చదోమను నివారించేందుకు ఈ ద్రావణాన్ని సాయంకాలం గాలి ఉధృతి తగ్గిన తరువాత గాలి వాటంగానే పిచికారీ చేయాలి. గాలి బాగా వీచేటప్పుడు దోమ లేచి పోతుంది. అప్పుడు ద్రావ ణాన్ని పిచికారీ చే స్తే ఫలితం ఉండదు. పిచికారీ చేసే వ్యక్తి ముఖానికి గుడ్డ కట్టుకోవాలి. - 20 రోజుల పంటపై 8 రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారీ చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. - చల్లని వాతావరణంలోనే ద్రావణాన్ని తగు మోతాదులో పిచికారీ చేయాలి. మోతాదు ఎక్కువైతే పంట మాడిపోతుంది. - ఆకుకూరలపై పిచికారీ చేస్తే.. కనీసం మూడు రోజుల తరువాతే వినియోగించాలి.