నేల మీద పెట్టుకున్న నమ్మకం వమ్ముకాదని నిరూపించారీ మహిళలు. మగవాళ్లు సులువైన కెమికల్ ఫార్మింగ్‌ను
వదలడానికి తటపటాయిస్తుంటే మహిళలు మాత్రం
నాచురల్ ఫార్మింగ్ అవసరాన్ని గుర్తించి ముందుతరాలకు
మంచి బాట వేయడానికి శ్రమిస్తున్నారు.
సావిత్రి విజయవంతమైన రైతు. ఆమెది మహారాష్ట్ర, లాతూర్ జిల్లా, గంగాపూర్ గ్రామం. ఆమెకున్నది ము΄్పావు ఎకరా మాత్రమే. అందులోనే ఏడాదికి రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని చూస్తోందామె. భర్త ఆరోగ్యం దెబ్బతినడంతో అతడికి వైద్యం చేయించడానికి ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి పొలంలో అడుగు పెట్టింది సావిత్రి.
‘మొదట్లో నా పొలంలో జొన్న, గోధుమ పండించేదాన్ని. ఆర్ట్ ఆఫ్ లివింగ్స్ నేచురల్ ఫార్మింగ్ అనే స్వచ్ఛంద సంస్థ వాళ్లు మా ఊరికి వచ్చి నాచురల్ ఫార్మింగ్ గురించి చెప్పి 350 జామ మొక్కలిచ్చారు. నిజానికి వాటి పెంపకం కోసం పెద్దగా శ్రమించాల్సిందేమీ లేదు. పాదులు చేసి తగినంత నీరు పెడితే చాలు. ఇక అంతర పంటలుగా వేరు శనగ, వంకాయ వంటి కూరగాయలు పండిస్తున్నాను. మా అమ్మాయి పన్నెండవ తరగతి వరకు చదివి సొంతంగా టైలరింగ్ షాపు నడుపుకుంటోంది.
ఉద్యోగం వెతుక్కోవడానికి ముంబయికెళ్లిన మా అబ్బాయి కూడా చిన్న ఉద్యోగాల అవసరం లేదని మా ఊరికి తిరిగి వచ్చేశాడు. మా కుటుంబం స్వయంసమృద్ధి సాధించిందనడానికి నిదర్శనం ఇంకేం కావాలి’ అంటోంది సావిత్రి. ఆమె సక్సెస్‌తో ఆమె కొడుకు ఉద్యోగం వదిలి పొలం బాట పడితే తెలుగురాష్ట్రాల్లో ఓ లెక్చరర్ సునంద మూడేళ్ల కిందట నేచురల్ ఫార్మింగ్‌లో అడుగుపెట్టి ఇప్పుడు పాతిక ఎకరాలు సాగుచేస్తోంది.
పాఠాల నుంచి పంటలకు...
కడప జిల్లా రామాపురానికి చెందిన యువతి సునంద. ఆమె ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసి తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో లెక్చరర్‌గా మూడేళ్లు పని చేసింది. తర్వాత పెళ్లి చేసుకుని భర్త ఉద్యోగ రీత్యా ముంబయి వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కి వచ్చారు. లయోలా కాలేజ్‌లో లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ తన అభిరుచిని సంతృప్తి పరుచుకోవడం ముఖ్యమనే అభి్రపాయానికి వచ్చింది. అప్పటికే నైట్‌షిఫ్ట్‌లు, వర్క్ ప్రెషర్‌తో భర్త ఆరోగ్యం దెబ్బతిన్నది. నేచురల్ ఫుడ్‌తోనే అతడి ఆరోగ్యానికి స్వస్థత చేకూరింది. అదే సమయంలో భర్త స్నేహితుని హఠాన్మరణం ఆమెను ఆలోచింప చేసింది. మంచి ఆహారం లేనప్పుడు ఎంత డబ్బు సంపాదించినా ఏం లాభం అనుకుంది.
ఇక ఉద్యోగమా, వ్యవసాయమా అనే ఊగిసలాట నుంచి బయటపడి అత్తగారి ఊరు ఆదిలాబాద్, కౌటాల మండలంలోని విజయనగరం బాట పట్టింది. ఎనిమిది ఎకరాలతో భార్యాభర్తలిద్దరూ సేంద్రియ సేద్యం మొదలు పెట్టారు. అప్పటి వరకు సుభాష్ పాలేకర్, సీవీఆర్ వ్యవసాయ పద్ధతులను చదివి ఆకళింపు చేసుకున్న జ్ఞానమే ఆమెది. మామగారి సూచనలతో మొక్క నాటడం నుంచి ప్రతి పనినీ నేర్చుకుంది.
సేంద్రియ సేద్యం చేసే రైతు నిలదొక్కుకోవాలంటే మార్కెటింగ్ ప్రధాన సమస్య అని గుర్తించింది. కొనుగోలు దారులకు అందుబాటులో ఉండడమూ అవసరమే అని గుర్తించింది. ఇప్పుడు శంషాబాద్ దగ్గర షాబాద్ మండలం పెదవేడు గ్రామంలో పాతిక ఎకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తోంది. దళారీ దోపిడీ బారిన పడకుండా సొంతంగా మార్కెటింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంది. – వాకా మంజులారెడ్డి ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment