పండ్ల తోటలను పరిశీలిస్తున్న డాక్టర్ శేషఫణి
వ్యవసాయం, పశుపోషణను రసాయనాల ‘మత్తు’ నుంచి విడిపించేందుకు ఓ సీనియర్ మత్తు వైద్యుడు సేంద్రియ రైతుగా మారారు. సుమారు రూ. పది కోట్ల పెట్టుబడితో, విలక్షణ సమీకృత సేంద్రియ సేద్యానికి నమూనాగా నిలిచేలా భారీ వ్యవసాయ క్షేత్రాన్ని సొంత డిజైన్‌తో నిర్మించారు. రసాయనిక అవశేషాల్లేని బియ్యం, కూరగాయలతోపాటు.. దేశీ ఆవులు / ముర్రా గేదెల పాలను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో దాదాపు 250 మంది వైద్యులు, మరెందరో ఆరోగ్యాభిలాషుల మనసులు దోచుకుంటున్నారు.
ఆయన పేరు డాక్టర్ యు. శేషఫణి (56). కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అనస్తీషియా విభాగానికి అధిపతి. వైద్య విధుల్లో నిత్యం తీరిక లేకుండా గడిపే ఆయన డాక్టర్‌గా రాణిస్తూనే.. భారీ ప్రణాళికతో పెద్ద సమీకృత సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. మహానంది మండలం గోపవరం గ్రామంలో సొంత ఆలోచనతోనే వ్యసాయ క్షేత్రాన్ని ఔరా అనిపించేలా డిజైన్ చేసుకున్నారు.
భూగర్భంలో 2 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన సంప్‌ను నిర్మించి, అందులోకి ఆవులు/ గేదెల మూత్రం, పేడ, కడిగిన నీరు వెళ్లేలా ఏర్పాటు చేసి.. అక్కడే సులువుగా జీవామృతం తయారు చేసుకుంటున్నారు. సంపులో నుంచే నేరుగా పంట పొలాలకు 4 అంగుళాల పైపులతో జీవామృతాన్ని తోడి పోసే విధంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టడం విశేషం.
సొంత భూమి 12 ఎకరాలు ఉండగా.. 25 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. 13 ఎకరాల్లో వరి, కూరగాయలతోపాటు పశుగ్రాసాలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నారు. పండించిన ధాన్యం 4 నెలలు మాగబెట్టిన తర్వాత బియ్యం పట్టించి గిట్టుబాటు ధరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. పంటలపై సస్యరక్షణకు అవసరాన్ని బట్టి వేస్ట్ డీకంపోజర్, గోమూత్రం, వేపనూనె పిచికారీ చేస్తారు. మామిడి, సపోట, బాదం, అంజూర, బత్తాయి, దానిమ్మ, నేరేడు, జామతో పాటు, కొబ్బరి, టేకు చెట్లు పెంచుతున్నారు.
దేశీ ఆవులు, ముర్రా గేదెల నమూనా క్షేత్రం
రసాయనాలు, ఆక్సీటోసిన్ ఇంజక్షన్లు వాడకుండా.. దేశీ ఆవులు, ముర్రా గేదెలతో నాణ్యమైన పాల ఉత్పత్తితోపాటు ప్రమాణాలతో కూడిన ఆవు, గేదెల సంతతిని వృద్ధి చేస్తున్నారు డా. శేషఫణి. 2016లో ఒక పశువైద్యుడి సలహాతో 4 దేశీవాళీ ఆవులు, 6 ముర్రా గేదెలతో ఫామ్ పెట్టారు. ఈ ఫామ్ నేడు విశేషంగా అభివృద్ధి చెందింది. 38 ఒంగోలు, 4 సాహివాల్ ఆవులతోపాటు 130 ముర్రా గేదెలను శ్రద్ధగా, ఆరోగ్యవంతంగా పోషిస్తూ రసాయనిక అవశేషాల్లేని పాలు ఉత్పత్తి చేస్తున్నారు.
ప్యాకెట్లను ఇంటింటికీ అందిస్తున్నారు. 400 ఆవులు, గేదెలకు సరిపోయేలా మౌలిక సదుపాయాలు కల్పించారు. 17 ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాసాలు సాగు చేస్తున్నారు. 200 ఎకరాల వరి గడ్డి, జొన్న చొప్ప కొని భారీ గోదాములో నిల్వ చేసుకొని ఏడాది పొడవునా మేపుతున్నారు. సొంత దినుసులతోనే దాణా తయారు చేసుకొని ఖర్చు తగ్గించుకుంటూ సత్ఫలితాలు సాధిస్తుండటం విశేషం.
– గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్)
ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నందుకు సంతృప్తిగా ఉంది
జాతి పశువులు అంతరించిపోకుండా ఉండాలనే లక్ష్యంతో దేశవాళీ ఆవులు, ముర్రా గేదెలతో ప్రత్యేక ఫామ్‌ను అభివృద్ధి చేశాం. నంద్యాల పరిశోధనా స్థానం నుంచి నాణ్యమైన ఒంగోలు గిత్తల సెమెన్ వాడుతున్నాం. సెక్స్‌డ్ సెమన్‌తో మేలు జాతి ముర్రా జాతి పశువులను ప్రత్యేక సొసైటీ ద్వారా శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నాం. ఆరోగ్యదాయకమైన ఎ2 పాలను, బియ్యం, ఇతర ఆహారోత్పత్తులను అందిస్తున్నాం. ఇటు గోసేవ, అటు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నందుకు సంతృప్తిగా ఉంది.
– డా. శేషఫణి (94400 70234),
గోపవరం, మహానంది మండలం,
కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment