ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూమిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా 1.2% విస్తీర్ణంలో వ్యవసాయం జరుగుతున్నది, ఏటేటా విస్తరిస్తూ ఉంది. పదిహేను దేశాల్లో ఉన్న వ్యవసాయ భూమిలో 10% కన్నా ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన సేంద్రియ వ్యవసాయ పరిశోధనా సంస్థ– ఎఫ్.ఐ.బి.ఎల్., జర్మనీలోని బాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఐ.ఎఫ్.ఓ.ఎ.ఓం. ఆర్గానిక్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఏటేటా శాస్త్రీయమైన పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయ, వాణిజ్య గణాంకాలు సేకరిస్తుంటాయి.
2018లో ఈ సంస్థలు వెలువరించిన గణాంకాల ప్రకారం.. 178 దేశాల్లో గత సంవత్సరం వరకు రసాయనిక వ్యవసాయం చేసి 2016 నుంచే సేంద్రియ వ్యవసాయం ప్రారంభించిన విస్తీర్ణం కూడా కలుపుకొని.. మొత్తం 5 కోట్ల 78 లక్షల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది. అంటే.. ఇంత విస్తీర్ణంలో భూములు రసాయనాల బారిన పడి నిర్జీవంగా మారకుండా ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను అందిస్తున్నాయన్నమాట.
సేంద్రియ వ్యవసాయంలో ఉన్న భూమి 1999లో కోటి 10 లక్షల హెక్టార్లే. ప్రస్తుతం అత్యధికంగా ఆస్ట్రేలియాలో 2.71 కోట్ల హెక్టార్లు, అర్టెంటీనాలో 30 లక్షల హెక్టార్లు, చైనాలో 23 లక్షల హెక్టార్లలో సేంద్రియ సేద్యం జరుగుతోంది. సేంద్రియ వ్యవసాయ విస్తీర్ణం ఆసియా దేశాల్లో 2016లో 34 శాతం లేదా 9 లక్షల హెక్టార్లు పెరిగింది. ఐరోపాలో 6.7 శాతం లేదా 10 లక్షల హెక్టార్లు పెరిగింది.
అయితే, రసాయనాలు వాడకుండా నేలతల్లికి ప్రణమిల్లుతూ ప్రకృతికి అనుకూలమైన పద్ధతుల్లో పంటలు పండిస్తున్న రైతుల సంఖ్య మన దేశంలోనే ఎక్కువ. 2016 నాటికి ప్రపంచవ్యాప్తంగా వీరి సంఖ్య 27 లక్షలు. ఇందులో 40% ఆసియా దేశాల రైతులే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య 24 లక్షలు. వీరిలో 8,35,000 మంది సేంద్రియ రైతులు భారతీయులు కావటం విశేషం. ఉగాండాలో 2,10,352, మెక్సికోలో 2,10,000 మంది సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు.
ఇంతకీ ఈ గణాంకాలు క్షేత్రస్థాయి వాస్తవాలను ఎంత వరకూ ప్రతిబింబిస్తున్నాయి? భారత్ సహా కొన్ని దేశాలు తాజా గణాంకాలను అందించడంలో విఫలమవుతున్నాయని, అందుబాటులో ఉన్న వరకు క్రోడీకరిస్తున్నట్లు అధ్యయన సంస్థలు పేర్కొంటున్నాయి. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తుల రిటైల్ అమ్మకాల విలువలో 20% వార్షిక వృద్ధి నమోదవుతోంది.
Published Tue, Jan 1 2019 9:50 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment