
కొత్త దారి
పొలాలే బడులుగా రైతులకు సరికొత్త వ్యవసాయ పాఠాలు చెబుతుంది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట (Akkannapet) మండలంలోని రామవరం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిణి (ఏఈవో) కరంటోతు శ్రీలత. ఆమె పాఠాలు వృథా పోలేదు. సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత నుంచి మల్చింగ్ (mulching) పద్ధతిలో కూరగాయల సాగు వరకు ఎన్నో విషయాలను అవగాహన చేసుకొని కొత్తదారిలో ప్రయాణిస్తున్నారు అన్నదాతలు...
అక్కన్నపేట మండలం పంతులు తండాకు చెందిన శ్రీలతకు ఏఈవో ఉద్యోగం వచ్చినప్పుడు ‘నాకు ఉద్యోగం వచ్చింది’ అనే సంతోషం కంటే ‘ఈ ఉద్యోగం వల్ల ఎంతోమంది రైతులకు సహాయంగా నిలబడవచ్చు’ అనే సంతోషమే ఎక్కువ. రైతు కుటుంబంలో పుట్టిన శ్రీలతకు రైతుల కష్టాలు, నష్టాలు తెలియనివేమీ కాదు. సాగులో మెలకువలు పాటించకపోవడం వల్ల పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. అయితే మెలకువలు పాటించకపోవడం నిర్లక్ష్యం వల్ల కాదు... అవగాహన లేకపోవడం వల్లే జరుగుతోందని గ్రహించిన శ్రీలత రంగంలోకి దిగింది.
ఆమె పొలం దగ్గరికి వస్తే ఎక్కడి నుంచో అగ్రికల్చరల్ ఆఫీసర్ (Agriculture Officer) వచ్చినట్లు ఉండదు. తెలిసిన వ్యక్తో, చుట్టాలమ్మాయో వచ్చినట్లుగా ఉంటుంది. ఎలాంటి బేషజాలు లేకుండా అందరితో కలిసిపోయి వారి సమస్యలు తెలుసుకుంటుంది. పొలం దగ్గరికి వచ్చినప్పుడు శ్రీలత కూడా రైతుగా మారిపోతుంది. తానే స్వయంగా ట్రాక్టర్‌తో వరి పొలం దున్నుతుంది. వరిలో కాలిబాటల ప్రయోజనాల గురించి చెబుతుంది. ఎరువులు ఎంత మోతాదులో చల్లాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తోంది.
వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నూతన సాగు పద్ధతులను తెలుసుకుంటూ, వాటిని తన క్లస్టర్ పరిధిలోని రామవరం, గండిపల్లి, కుందన్‌వానిపల్లి, మైసమ్మవాగు తండా రైతులకు చెబుతుంటుంది. రసాయనిక మందుల వినియోగం లేకుండా సేంద్రియ పద్దతిలో సాగు చేసే విధంగా రైతులనుప్రోత్సహిస్తోంది. గిరిజన గ్రామాల్లో సైతం మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు ఎక్కువగా సాగు చేసేలా చేస్తోంది.
చదవండి: చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!
పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రియ ఎరువులప్రాధాన్యత గురించి ఒకటికి పదిసార్లు చెప్పడమే కాదు సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలని అనే అంశంపై ప్రత్యేక వీడియోను తయారు చేసింది. జీవ ఎరువుల వినియోగంపై కూడా ప్రత్యేక వీడియోను తయారు చేసి రైతులకు అవగాహన కలిగిస్తోంది.
క్షేత్రస్థాయిలోకి...
రైతు అంటే నా దృష్టిలో ఒక పొలానికి యజమాని మాత్రమే కాదు... మన ఇంటి వ్యక్తి. మనకు అన్నం పెట్టే అన్నదాత. రైతుకు మంచి జరిగితే లోకానికి మంచి జరిగనట్లే. నా ఉద్యోగం ద్వారా రైతులకు ఏదో రకంగా మేలు చేసే సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది.
– శ్రీలత
– గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట
– మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేట
Comments
Please login to add a commentAdd a comment