
ఇకత్ చీరతో వేడుకలో వెలిగిపోతాం. నారాయణపేట మెటీరియల్‌తో డిజైనర్ బ్లవుజ్ కుట్టించుకుంటాం. మన సంప్రదాయ వస్త్రధారణ మనల్ని ఫ్యాషన్ పెరేడ్‌లో తళుక్కుమని తారల్లా మెరిపిస్తోంది. ఇవి ఇంత అందంగా ఎలా తయారవుతాయి. ఒక డిజైన్‌ని విజువలైజ్ చేసి వస్త్రం మీద ఆవిష్కరించే చేనేతకారులు ఏం చదువుతారు... ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేశారు మిసెస్ ఇండియా (Mrs India) విజేత సుష్మ.
ఈ వస్త్రాలను నేసే చేతులను, ఆ వేళ్ల మధ్య జాలువారుతున్న కళాత్మకతను దగ్గరగా చూడాలనిపించింది. పోచంపల్లి బాట పట్టారామె. కళాత్మకత అంతా చేనేతకారుల చేతల్లోనే తప్ప వారి జీవితాల్లో కనిపించలేదు. నూటికి రెండు–మూడు కుటుంబాలు ఆర్థికంగా బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఈ కళను తమ తరంతో స్వస్తి పలకాలనుకుంటున్న వాళ్లే.
మరి... ఇంత అందమైన కళ తర్వాతి తరాలకు కొనసాగకపోతే? ఒక ప్రశ్నార్థకం. దానికి సమాధానంగా ఆమె తనను తాను చేనేతలకు ప్రమోటర్‌గా మార్చుకున్నారు. చేనేతకారుల జీవితాలకు దర్పణంగా నిలిచే డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. తాను పాల్గొనే ఫ్యాషన్ పెరేడ్‌లు, బ్యూటీ కాంటెస్ట్‌లలో మన చేనేతలను ప్రదర్శిస్తున్నారు. ఆ చేనేతలతోనే విజయాలు సొంతం చేసుకుంటున్నారు. స్వతహాగా ఎంటర్‌ప్రెన్యూర్ అయిన సుష్మా ముప్పిడి (Sushma Muppidi) మన హస్తకళలు, చేనేతలను ప్రపంచవేదిక మీదకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేశారు.
వైఫల్యమూ అర్థవంతమే!
చీరాలకు చెందిన సుష్మ ముప్పిడి బీటెక్, ఎంబీఏ చేశారు. కొంతకాలం గుంటూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంతోపాటు మరో ప్రైవేట్ కాలేజ్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేశారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో ఉద్యోగం... ఈ జర్నీలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఉద్యోగం కోసం తన హండ్రెడ్‌పర్సెంట్ ఇస్తోంది. పిల్లల కోసం గడిపే సమయం తగ్గిపోతోంది. వెనక్కి చూస్తే తనకు మిగిలిందేమిటి? సివిల్ సర్వీసెస్ ప్రయత్నం సఫలం కాలేదు.
ఉనికి లేని సాధారణ ఉద్యోగంతో తనకు వచ్చే సంతృప్తి ఏమిటి? సమాజానికి పని చేయడంలో సంతృప్తి ఉంటుంది, తనకో గుర్తింపునిచ్చే పనిలో సంతోషం ఉంటుంది. ఇలా అనుకున్న తర్వాత యూత్‌లో సోషల్ అవేర్‌నెస్ కోసం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ప్రయాణంలో అనుకోకుండా బ్యూటీ కాంపిటీషన్‌లో పాల్గొనవడం విజేతగా నిలవడం జరిగింది.
సోషల్ ఇనిషియేటివ్, వెల్ స్పోకెన్, బెస్ట్ కల్చరల్ డ్రెస్, మిసెస్ ఫ్యాషనిష్టా వంటి గుర్తింపులతోపాటు ‘యూఎమ్‌బీ ఎలైట్ మిసెస్ ఇండియా 2024’ విజేతగా నిలిచారు. ఈ ఏడాది మార్చి ఒకటిన ఇటలీలోని మిలన్ నగరంలో, ఎనిమిదవ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగే ఫ్యాషన్ షోలలో భారత చేనేతలు అసోం సిల్క్, మల్బరీ సిల్క్‌లను ప్రదర్శించనున్నారు. జూన్‌లో యూఎస్, ఫ్లోరిడాలో జరిగే మిసెస్ యూనివర్సల్ వేదిక మీద మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు సుష్మ. ఇవన్నీ ఆత్మసంతృప్తినిచ్చే పనులు. ఇక తనకు రాబడి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు.
హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీస్ నుంచి యూఎస్, దుబాయ్, సింగపూర్‌లలో డైమండ్ బిజినెస్ (Diamond Business) నిర్వహిస్తున్నారు. ‘‘జీవితంలో గెలవాలి, నా కోసం కొన్ని సంతోషాలను పూస గుచ్చుకోవాలి. నన్ను నేను ప్రశంసించుకోవడానికి సమాజానికి నా వంతు సర్వీస్ ఇవ్వాలి’’ అన్నారు సుష్మ. ‘‘వయసు దేనికీ అడ్డంకి కాదు. అంతా మన అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. మీ కలలను నిజం చేసుకోవాలంటే ఒక ముందడుగు వేయండి. సక్సెస్ అవుతామా, విఫలమవుతామా అనే సందేహాలు వద్దు. ఏ ప్రయత్నమూ చేయకపోవడం కంటే ప్రయత్నించి విఫలమైనా కూడా అది అర్థవంతమయిన వైఫల్యమే. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోకూడదు’’ అని మహిళలకు సందేశమిచ్చారు.
ఇది నా చేయూత
పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిరిసిల్లలకు వెళ్లి స్వయంగా పరిశీలించాను. మన చేనేత కుటుంబాలు కళకు దూరం కాకుండా ఉండాలన్నా, ఇతరులు ఈ కళాత్మక వృత్తిని చేపట్టాలన్నా ఇది ఉపాధికి సోపానంగా ఉండాలి. అందుకోసం చేనేతలను కార్పొరేట్ స్థాయికి చేరుస్తాను. సమావేశాలకు ఉపయోగించే ఫైల్ ఫోల్డర్స్, ఇంట్లో ఉపయోగించే సోఫా కవర్స్, వేడుకల్లో ధరించే బ్లేజర్స్ వంటి ప్రయోగాలు చేసి మన చేనేతలను ప్రపంచవేదికలకు తీసుకెళ్లాలనేదే నా ప్రయత్నం. నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎల్లలు దాటి విదేశాలకు విస్తరించాను.
చదవండి: అన్నదాత మెచ్చిన రైతుబిడ్డ
కాబట్టి నాకున్న ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుని మన చేనేతలను ప్రమోట్ చేయగలుగుతున్నాను. కలంకారీ కళ కోసం అయితే ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించి కలంకారీ కళాకారులకు ఉచితంగా స్టాల్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశాను. పారిస్, యూఎస్ కార్యక్రమాల తర్వాత ఆ పని. సివిల్స్ సాధించినా కూడా ప్రత్యేకంగా ఒక అంశం మీద సమగ్రంగా పని చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక కళాత్మక సమాజానికి ఇస్తున్న సర్వీస్ నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. ప్రపంచ ఫ్యాషన్ వేదిక మీద మన భారతీయ చేనేతకు ప్రాతినిధ్యం వహించాలి. మన నేతలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలనేది నా లక్ష్యం.
– సుష్మ ముప్పిడి, మిసెస్ ఇండియా
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment