పోచంపట్నం
పల్లె అంటే పెద్దరికం, నిండుదనం, సంప్రదాయం.
పట్నం అంటే అల్లరికం, ఆకర్షకం, ఆధునికం.
పోచంపల్లి వస్త్రాలతో ఇంత వరకు పల్లెల్నే నేస్తున్నాం.
ఇప్పుడు వాటితో పట్నాలనూ డిజైన్ చేస్తున్నారు!
పోచంపల్లి... ఇలా పోచంపట్నం అయితే...
ఎంత వెరైటీగా ఉంటుందో చూడండి.
పోచంపల్లి క్లాత్ అనగానే బామ్మలు కట్టుకునే చీరలు, అమ్మాయిలు వేసుకునే సల్వార్ కమీజ్‌లు, కొన్ని రకాల దుప్పట్లు వాటిలోని డిజైన్లు మన కళ్లకు కనిపిస్తాయి. అంతవరకే ఆ మెటీరియల్ గురించి ఆలోచిస్తాం. అందువల్లే పోచంపల్లి క్లాత్ ఫ్యాషనబుల్ ఫ్యాబ్రిక్ కాదు అనే ముద్ర పడిపోయింది. ముందెన్నడో వందల ఏళ్ల క్రితం పోచంపల్లి డిజైన్స్ చీరలతో మొదలయ్యాయి. తర్వాత సల్వార్ కమీజులు వచ్చాయి. ఆ తర్వాత మరో ఎంపిక లేకపోవడంతో ఇందులో అంతగా అభివృద్ధి జరగలేదు. అందువల్ల వినియోగదారులు కూడా ఈ ఫ్యాబ్రిక్‌కి చాలా పరిమితంగా ఉంటున్నారు. దీంతో చేనేతకారుడి జీవనాధారానికి ఆదరణ అంతకంతకూ తగ్గుతూ వస్తోంది.
ఇక్కడ మొదలు
హైదరాబాద్‌కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో పోచంపల్లి గ్రామం ఉంది. మనం కట్టుకునే బట్టలు ఎంత కష్టపడి నేస్తే ఇంత అందంగా తయారయ్యాయో తెలుసుకునే అవకాశం అలాంటి చేనేత గ్రామాలను సందర్శిస్తేనే తెలుస్తుంది. అంతేకాదు భూదాన్ ఉద్యమంతో ముడిపడి ఉన్న గ్రామం కూడా కావడంతో ‘భూదాన్ పోచంపల్లి’గా మారిపోయింది. అక్కడికే వెళ్లి నేరుగా కొనుగోలు చేస్తే దళారీలకు చెల్లించేది తగ్గి, నేతన్నకి గిట్టుబాటుధర లభిస్తుంది.
వేసవికి ప్రత్యేకం
ఎండకాలం నూలు వస్త్రాలలోని సౌకర్యాన్ని దేహం కోరుకుంటుంది. అందుకే కాటన్ వస్త్రాలకు ఈ కాలం డిమాండ్ ఎక్కువ. పోచంపల్లి డిజైన్ పరంగానూ, సీజనల్ సౌకర్యంగానూ రెండు విధాల ఆకర్షించే అందమైన ఫ్యాబ్రిక్. పోచంపల్లి మెటీరియల్‌లో లేత నుంచి ముదురు రంగుల వరకు లభిస్తున్నాయి. వేసవికి.. ఆకుపచ్చ, నీలం, నిమ్మపండు రంగు, క్రీమ్ .. ఇలా అన్నింటిలోనూ లేత రంగులను ఎంచుకుంటే మరీ బాగుంటుంది.
యువతరం మెచ్చేలా..
చేనేత అనగానే పెద్దవారు ధరించేదిగానే గుర్తిస్తాం. కానీ యువతరం మెచ్చేలా సూట్స్, ప్యాంట్స్, అనార్కలీ, లెహంగా.. ఇలా పోచంపల్లి ఫ్యాబ్రిక్స్తోనూ రకరకాల డిజైన్స్ సృష్టించవచ్చు. అలాంటి డ్రెస్సులు చేయమని డిజైనర్స్‌ని కోరవచ్చు.
కార్పొరేట్ కళ...
కార్పొరేట్‌లోనూ మహిళల డ్రెస్సింగ్‌లో పోచంపల్లిని ప్రవేశపెట్టవచ్చు. కాలర్ ఉన్న ప్లెయిన్ కాటన్ బ్లౌజ్ ధరించి పోచంపల్లి చీర కట్టుకుంటే ఎంతో హుందాగా కనిపిస్తారు.
అంతర్జాతీయ వేదికపై పోచంపల్లి
ప్యారిస్ ఫ్యాషన్ షోలో నేను మన పోచంపల్లి ఇకత్ డిజైన్స్ ప్రదర్శించినప్పుడు వచ్చిన రెస్పాన్స్ మాటల్లో చెప్పలేనిది. ‘భారతదేశం నుంచి పోచంపల్లి డిజైన్స్’ అన్న అనౌన్స్ మెంట్ వేదిక మీద వినపడగానే అందరి లోనూ ఏదో ఉత్సాహం గమనించాను. పోచంపల్లి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాదు. డిజైన్సే ప్రధానంగా కనిపిస్తాయి. ఈ ఫ్యాబ్రిక్‌తో సూట్స్, జంప్ సూట్స్, ప్యాంట్స్, అనార్కలీ, లాంగ్ రెడ్‌కార్పెట్ గౌన్ కూడా డిజైన్ చేశాను. చేనేతకారులు తమ పిల్లలను ఈ రంగం లోకి రానివ్వడం లేదు. దాంతో రాబోయేతరం ఆ కళను నేర్చు కోవడం లేదు. ప్రభుత్వం ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి, చేనేతకారుల నుంచి వస్త్రాన్ని తీసుకొని, డిజైనర్లకు అందుబాటులో ఉంచితే వందల ఏళ్ల చేనేత మున్ముందు కాలాల్లోనూ బతికే అవకాశాలు న్నాయి. ప్రస్తుతం ఒక డిజైనర్ తనకు కావల్సిన రంగులో డిజైన్ ఫ్యాబ్రిక్ కావాలంటే చేనేతకారుడిని వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తోంది. ఫ్యాషన్ రంగంలో సమయ పాలన అనేది చాలా ముఖ్యం. ఒక సీజన్‌కి తగ్గ దుస్తులను తయారుచేయడానికి, ఆ సీజన్‌కే ప్రత్యేకం అనిపించే మెటీరియల్ తప్పక అందుబాటులో ఉండాలి. అలా లేదంటే కొత్త డిజైన్స్ పుట్టుకురావు. చేనేతకారుల శ్రమకు తగ్గ ఫలమూ దక్కదు.
- శిల్పారెడ్డి, మోడల్, ఫ్యాషన్ డిజైనర్
రంగుల మాయాజాలం
పూర్తి నూలు, లేదా పట్టు కలయికలతో పోచంపల్లి డిజైన్ మెటీరియల్, చీరలు లభిస్తున్నాయి. మొట్టమొదట పేటెంట్ హక్కులు పొందిన ప్రత్యేకత కూడా దీనికి ఉంది. ఆ నేతలో ఎన్ని డిజైన్లు పొందుపరుస్తారో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రంగుల దారాల్లో నెమళ్లు నర్తిస్తాయి. చిలుకలు పలకరిస్తాయి. ఏనుగులు గంభీరంగా నిలబడతాయి. పూవులు విరబూస్తాయి. ఆకులు అందంగా రూపుకడతాయి.. ఇలా రకరకాల ఆకృతులు మన ముందు ఆవిష్కృతమవుతాయి. భారీ జరీలు నిండిన చీరలకు విరుద్ధంగా ఈ డిజైన్లలో రంగుల మాయాజాలానికే ప్రాధాన్యత ఉంటుంది. బట్టలు వేసిన తర్వాత రంగులద్దడం చాలా సులువు. కానీ పోచంపల్లి నేత ప్రత్యేకత నేయడానికి తీసి పెట్టుకున్న దారానికి రంగులద్ది, తర్వాత నేయడం. కాంబినేషన్లో సరైన శ్రద్ధ లేకపోతే ఆకృతి సరిగా రానే రాదు. చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రకియ ఇది.