ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిసెస్ గ్రాండ్ సీ వరల్డ్ 2023 (29–40 ఏళ్లలోపు పెళ్లైన మహిళలకు నిర్వహించే కాంటెస్ట్) పోటీల్లో హైదరాబాద్ వాసి శ్రీమతి మహతి కౌమారి 2వ స్థానం దక్కించుకుంది. మలేషియా దక్షిణాఫ్రికా సహా 15 దేశాల నుంచి 45 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడం గురించి, తనను తాను కొత్తగా మెరుగు పరుచుకునే విధానాల గురించి వివరించింది మహతి కౌమారి. ‘మన పరిధిని విస్తరించుకుంటేనే అవకాశాలు పెరుగుతాయి, ఏ కిరీటాలైనా దక్కుతాయి’ నవ్వుతూ వివరించింది.
‘‘సొంతంగా ఎదగాలన్న ఆలోచనే ఈ రోజు నన్ను ఎల్లలు దాటేలా చేసింది. పదేళ్లు ఐటీ కంపెనీలలో వర్క్ చేశాను. పెళ్లి, ఇద్దరు పిల్లలు, కుటుంబం.. జీవితం ఒక దశ నుంచి మరో దశకు తీసుకెళుతూనే ఉంది. దీనితోపాటు నా కలలను కూడా తీర్చుకునే క్రమంలో నాతో నేనే పోటీపడుతుంటాను.
కాలేజీ రోజుల నుంచి నా డ్రెస్సులు నేనే స్వయంగా డిజైన్ చేసుకునేదాన్ని. రీ సైక్లింగ్ మీద ఎక్కువ ఆసక్తి చూపేదాన్ని. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా నా ఈ అలవాటు మానుకోలేదు. నా స్నేహితులు, సహోద్యోగులు నా డ్రెస్సింగ్ గురించి అడిగేవారు. వాళ్లూ తమకు డ్రెస్‌లు డిజైన్ చేయమని కోరేవారు. అలా మా బంధుమిత్రుల్లో అడిగిన వారికి నాకున్న ఖాళీ సమయాన్ని కేటాయించి డిజైన్ చేసిచ్చేదాన్ని. నేను డిజైన్ చేసిచ్చిన డ్రెస్సుల్లో వారిని చూసినప్పుడు చాలా ఆనందం కలిగేది.
సొంతంగా డిజైనింగ్ స్టూడియో
పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. కుటుంబం, ఉద్యోగం అనే వ్యాపకాలు ఉన్న నాకు సొంతంగా నా డిజైన్ స్టూడియో పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన పెరగడానికి నా డిజైన్స్ ఇష్టపడే బంధుమిత్రులే కారణం. మా కుటుంబం కూడా ఆమోదం తెలపడంతో ఉద్యోగం వదిలి, డ్రెస్ డిజైనింగ్‌లోకి వచ్చేశాను. ఎనిమిదేళ్లుగా డిజైనింగ్ స్టూడియో నడుపుతున్నాను. మొదట ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చిన నేను, ఇప్పుడు పదిహేనుమందికి ఉపాధి చూపించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు క్లాసులు కూడా ఇస్తుంటాను.
బ్యూటీ కాంటెస్ట్‌తో మరో అడుగు
‘తెలిసిన వారికి వర్క్ చేసిస్తే సరిపోదు, నేను చాలామందికి రీచ్ అవ్వాలి. ఎక్కువ మంది మహిళలకు పని కల్పించేలా నన్ను నేను మలుచుకోవాలి..’ ఈ ఆలోచన నన్ను అవకాశాల కోసం వెతికేలా చేసింది. ఆన్‌లైన్‌లో మిసెస్ బ్యూటీ కాంటెస్ట్ అడ్వర్‌టైజ్‌మెంట్ చూసినప్పుడు నా స్కూల్, కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాను. కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నాను. మన దేశం నుంచే కాదు మరో పదిహేను దేశాల నుంచి చాలామంది మహిళలు ఈ పోటీలకు అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూ తర్వాత మన దేశం నుంచి నేను ఎంపిక అయ్యాను. రెండు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకుని, పోటీల్లో పాల్గొన్నాను.
ఇప్పుడు నాకు విదేశాలలోనూ స్నేహితులు పెరిగారు. పోటీలకు వచ్చిన వారందరితోనూ మంచి స్నేహం ఏర్పడింది. దీంతో నాకున్న అవకాశాలను వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నాను’’ అని వివరించి ఈ బ్యూటీ.
మనసును సేదతీర్చేలా...
కర్ణాటక సంగీతం నాకున్న మరో హాబీ. కుటుంబం, బిజినెస్ బాధ్యతలు ఎన్ని ఉన్నా నాకు ఇష్టమైన సంగీతాన్ని నిత్యం సాధన చేస్తూనే ఉంటాను. హాబీస్‌కి నాకంటూ కొంత సమయం
కేటాయించుకోవడంలో ఏ మాత్రం అలక్ష్యం చేయను. పిల్లలు కూడా నా ఇష్టాలను ప్రోత్సహిస్తుంటారు.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment