kuala Lumpur
-
గాల్లో మంటలు.. హైదరాబాద్-కౌలా లంపూర్ విమానానికి తప్పిన ప్రమాదం
రంగారెడ్డి, సాక్షి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. గాల్లో ఎగిరిన విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగగా, పైలట్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగలిగారు.హైదరాబాద్ నుంచి కౌలా లంపూర్(మలేషియా) వెళ్లాల్సిన విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే కుడి వైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అది గుర్తించిన పైలట్ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్) ల్యాండింగ్‌కు అఉనమతి ఇచ్చారు. ఈ గ్యాప్‌లో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులందరినీ హుటాహుటిన బయటకు తెచ్చారు. సిబ్బంది సహా విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడం.. అంతా సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేత సంజన
చంద్రగిరి (తిరుపతి జిల్లా): జైపూర్‌లో స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్‌కి చెందిన ది పేజెంట్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా–2024 టైటిల్‌ను చంద్రగిరికి చెందిన ఆలత్తూరు పావని, సుబ్రమణ్యం కుమార్తె సంజన వరద(18) గెలుచుకున్నారు. ఈ నెల 7–12 వరకు మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిస్ టీన్ గ్లోబల్–2024 పోటీలో భారత్‌కు సంజన వరద ప్రాతినిథ్యం వహించింది.ఈ పోటీల్లో ఆమె 1వ రన్నరప్‌గా నిలిచింది. సంజన బెంగళూరులో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతూ గతంలో జాతీయస్థాయిలో అవార్డును గెలుచుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయంతోపాటు, సంజన వరద సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ అవార్డు, పాపులర్ అవార్డును కూడా అందుకుంది. ఇంకా ఆమె తన పిత్తా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం చేయడంలో చేసిన కృషికి అత్యుత్తమమైన దాతృత్వ అవార్డుతో గ్లోబల్ సంస్థ సత్కరించింది. అంతర్జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కీరీటాన్ని సాధించడమే తన ధ్యేయమని, దానికోసమే కష్టపడతానని స్టార్ మిస్ టీన్ ఇండియా గ్రహీత సంజన వరద అన్నారు. -
Mahati Kaumari: నాతో నేనే పోటీ పడ్డాను..!
ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిసెస్ గ్రాండ్ సీ వరల్డ్ 2023 (29–40 ఏళ్లలోపు పెళ్లైన మహిళలకు నిర్వహించే కాంటెస్ట్) పోటీల్లో హైదరాబాద్ వాసి శ్రీమతి మహతి కౌమారి 2వ స్థానం దక్కించుకుంది. మలేషియా దక్షిణాఫ్రికా సహా 15 దేశాల నుంచి 45 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడం గురించి, తనను తాను కొత్తగా మెరుగు పరుచుకునే విధానాల గురించి వివరించింది మహతి కౌమారి. ‘మన పరిధిని విస్తరించుకుంటేనే అవకాశాలు పెరుగుతాయి, ఏ కిరీటాలైనా దక్కుతాయి’ నవ్వుతూ వివరించింది. ‘‘సొంతంగా ఎదగాలన్న ఆలోచనే ఈ రోజు నన్ను ఎల్లలు దాటేలా చేసింది. పదేళ్లు ఐటీ కంపెనీలలో వర్క్ చేశాను. పెళ్లి, ఇద్దరు పిల్లలు, కుటుంబం.. జీవితం ఒక దశ నుంచి మరో దశకు తీసుకెళుతూనే ఉంది. దీనితోపాటు నా కలలను కూడా తీర్చుకునే క్రమంలో నాతో నేనే పోటీపడుతుంటాను. కాలేజీ రోజుల నుంచి నా డ్రెస్సులు నేనే స్వయంగా డిజైన్ చేసుకునేదాన్ని. రీ సైక్లింగ్ మీద ఎక్కువ ఆసక్తి చూపేదాన్ని. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా నా ఈ అలవాటు మానుకోలేదు. నా స్నేహితులు, సహోద్యోగులు నా డ్రెస్సింగ్ గురించి అడిగేవారు. వాళ్లూ తమకు డ్రెస్‌లు డిజైన్ చేయమని కోరేవారు. అలా మా బంధుమిత్రుల్లో అడిగిన వారికి నాకున్న ఖాళీ సమయాన్ని కేటాయించి డిజైన్ చేసిచ్చేదాన్ని. నేను డిజైన్ చేసిచ్చిన డ్రెస్సుల్లో వారిని చూసినప్పుడు చాలా ఆనందం కలిగేది. సొంతంగా డిజైనింగ్ స్టూడియో పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. కుటుంబం, ఉద్యోగం అనే వ్యాపకాలు ఉన్న నాకు సొంతంగా నా డిజైన్ స్టూడియో పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన పెరగడానికి నా డిజైన్స్ ఇష్టపడే బంధుమిత్రులే కారణం. మా కుటుంబం కూడా ఆమోదం తెలపడంతో ఉద్యోగం వదిలి, డ్రెస్ డిజైనింగ్లోకి వచ్చేశాను. ఎనిమిదేళ్లుగా డిజైనింగ్ స్టూడియో నడుపుతున్నాను. మొదట ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చిన నేను, ఇప్పుడు పదిహేనుమందికి ఉపాధి చూపించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు క్లాసులు కూడా ఇస్తుంటాను. బ్యూటీ కాంటెస్ట్‌తో మరో అడుగు ‘తెలిసిన వారికి వర్క్ చేసిస్తే సరిపోదు, నేను చాలామందికి రీచ్ అవ్వాలి. ఎక్కువ మంది మహిళలకు పని కల్పించేలా నన్ను నేను మలుచుకోవాలి..’ ఈ ఆలోచన నన్ను అవకాశాల కోసం వెతికేలా చేసింది. ఆన్లైన్లో మిసెస్ బ్యూటీ కాంటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు నా స్కూల్, కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాను. కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను. మన దేశం నుంచే కాదు మరో పదిహేను దేశాల నుంచి చాలామంది మహిళలు ఈ పోటీలకు అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూ తర్వాత మన దేశం నుంచి నేను ఎంపిక అయ్యాను. రెండు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకుని, పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పుడు నాకు విదేశాలలోనూ స్నేహితులు పెరిగారు. పోటీలకు వచ్చిన వారందరితోనూ మంచి స్నేహం ఏర్పడింది. దీంతో నాకున్న అవకాశాలను వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నాను’’ అని వివరించి ఈ బ్యూటీ. మనసును సేదతీర్చేలా... కర్ణాటక సంగీతం నాకున్న మరో హాబీ. కుటుంబం, బిజినెస్ బాధ్యతలు ఎన్ని ఉన్నా నాకు ఇష్టమైన సంగీతాన్ని నిత్యం సాధన చేస్తూనే ఉంటాను. హాబీస్‌కి నాకంటూ కొంత సమయం కేటాయించుకోవడంలో ఏ మాత్రం అలక్ష్యం చేయను. పిల్లలు కూడా నా ఇష్టాలను ప్రోత్సహిస్తుంటారు. – నిర్మలారెడ్డి -
మలేసియాలో ఘనంగా భారత గణతంత్ర వేడుకలు
కౌలాలంపూర్: భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా మలేసియాలోని భారత హైకమిషనర్ బిన్ రెడ్డి భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మలేసియా భారత స్నేహ పూర్వ సంబంధాల గురించి మాట్లాడారు. అలాగే మలేసియాలో నివసిస్తున్న భారతీయుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చర్యల గురించి వివరించారు. వీసా సెంటర్, కాన్సులర్ సెంటర్లలో కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకోవడానికి ప్రతి నెల ఒక రోజు ఓపెన్ డే నిర్వహిస్తుమన్నారు. దీనికి ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా హాజరుకావొచ్చని వెల్లడించారు. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ‘ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్’గా డిక్లేర్ చేసిన సందర్భంగా మిల్లెట్స్ చిరుధాన్యాలను ప్రమోట్ చేయడంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన విద్యార్థుల నృత్యాలు, ఆలపించిన దేశభక్తి గీతాలు అందరినీ అలరించాయి. (క్లిక్ చేయండి: కువైట్ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన) -
కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. 50 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కౌలాలంపూర్‌కు సమీపంలోని సెలాంగోర్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులు, అధికారులు క్యాంపులో నిద్రపోతున్న సమయంలో కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 79 మంది క్యాంప్‌లో ఉండగా అందులో 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు మరణించారు. 51 మంది ఆచూకీ గల్లంతయ్యారు. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో క్యాంప్‌పై కొండచరియలు పడినట్లు చెప్పారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి: గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పైనుంచి దూకి భారత సంతతి బాలుడు ఆత్మహత్య -
‘నెలంతా కురవాల్సిన వర్షం నిన్న ఒక్కరోజే కురవడంతో 30 వేల మంది నిరాశ్రయులయ్యారు'
More than 30,000 people were evacuated from their homes in Malaysia మలేషియా: దేశంలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఆదివారం కురిసిన వర్షపాతానికి సుమారు 30 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ప్రధాన రహదారులు తెగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా మలేషియాలో ఆదివారం వరదలు ముంచెత్తడంతో 30,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. మలేషియా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలకు చెందిన 30 వేలకు పైగా వరద బాధితులను అధికారికంగా లెక్కించింది. వారిలో 14 వేల మంది పహంగ్‌కు చెందినవారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అత్యంత రిచెస్ట్ ప్రాంతమైన సెలంగోర్‌లో దాదాపు 10,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారని ఆ దేశ ప్రధాని ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ మీడియాకు తెలిపారు. ఒక నెలమొత్తంలో కురవాల్సిన వర్షం ఆదివారం ఒక్కరోజే కురిసిందని, వరద బాధితులకు సత్వర సహాయం నిమిత్తం 179 కోట్ల నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం నాడు 6 సెంట్రల్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రమాదకరస్థాయిలో వరదనీళ్లు చేరాయని ఆయన అన్నారు. డజన్ల కొద్ది బస్సు రోడ్లతోపాటు, రైలు సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయని మీడియాకు తెలిపారు. ప్రతి ఏడాది చివరిలో దేశంలోకి ప్రవేశించే తుపానులతో కూడిన రుతుపవనాల కారణంగా తరచూ అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. ఈ డిసెంబర్లో ప్రమాదకర స్థాయిలో వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా 2014లో మలేషియాలో అత్యంత దారుణమైన వరదలు సంభవించాయి. నాటి వరదల కారణంగా దాదాపు 1,18,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చదవండి: మళ్లీ లాక్డౌన్! నేటి నుంచి జనవరి 14 వరకు కఠిన ఆంక్షలతో.. -
రాజీనామా చేయనున్న మలేషియా ప్రధాని!
కౌలాలంపూర్: మలేషియా దేశ ప్రధాన మంత్రి ముహిద్దీన్ యాసిన్ రేపు(సోమవారం) రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ముహిద్దీన్ ప్రధాని పదవికి రాజీనామా చేయన్నుట్లు ఆ దేశ అధికార పోర్టల్ ఆదివారం వెల్లడించింది. బల నిరూపణలో భాగంగా మలేషియా ప్రధాని మెజారిటీ కోల్పోయారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత పోరుతో ముహిద్దీన్ మెజారిటీ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆర్దిక మాంద్యం, కరోనా కేసులతో మలేషియాలో మరింత అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. మలేషియా ప్రధానిగా ముహిద్దీన్ 17 నెలల పాటు సేవలందించారు. ఇక తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై మలేషియా రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా నిర్ణయింస్తారని సమాచారం. -
కౌలాలంపూర్ నుంచి అంటుకుందా?
సాక్షి, న్యూఢిల్లీ: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఒక్క సదస్సు దక్షిణాసియాలోని అనేక దేశాలు ఇప్పుడు వణికిపోయేలా చేస్తోంది. దక్షిణాసియాలోని పలు దేశాల్లో కరోనా సోకిన వారిలో అత్యధికులు తబ్లిగి జమాత్ సదస్సులకు హాజరైన వారే ఉన్నారు. నిజాముద్దీన్ మర్కజ్ కేంద్రంగా అంతర్జాతీయంగా ఇస్లాం మత బోధన చేస్తున్న తబ్లిగి జమాత్ సంస్థకు వందేళ్ల చరిత్ర ఉంది. ప్రవక్త చెప్పిన ఇస్లాం జీవనశైలి కలిగి ఉండాలని బోధిస్తుంది. ఈ సంస్థ కౌలాలంపూర్‌లోని పెటాలింగ్ మసీదులో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు 16 వేల మందితో సదస్సు నిర్వహించింది. దీనికి 1500 మంది విదేశీయులు హాజరయ్యారు. సదస్సుకు హాజరైన 34 ఏళ్ల మలేసియన్ 17న మృతిచెందాడు. అక్కడి పాజిటివ్ కేసుల్లో మూడో వంతు కేసులు జమాత్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తులవేనని వార్తలొచ్చాయి. సదస్సుకు హాజరైనS ప్రతినిధులు తమ సొంత దేశాల్లో, ఇతర దేశాల్లో ఆ వైరస్ వ్యాప్తికి కారణమయ్యారు. కౌలాలంపూర్ సదస్సుకు హాజరైన ఇండోనేసియన్లలో 31 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్æ సమావేశాల్లో పాల్గొన్నారు. నిజాముద్దీన్ మర్కజ్‌కు ఇలా.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉన్న తబ్లిగి జమాత్ మర్కజ్‌కు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇది ఏడాది పొడవునా జరుగుతుంది. తబ్లిగి జమాత్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జనవరి 1 నుంచి మన దేశానికి 2,100 మంది ప్రతినిధులు రాగా.. మార్చి 21 నాటికి 1040 మంది ప్రతినిధులు దేశంలోనే ఉన్నారని, మిగిలిన వారు లాక్ డౌన్‌కు ముందే వెళ్లిపోయి ఉంటారని కేంద్ర హోం శాఖ తెలిపింది. మార్చి 21 నాటికి దేశవ్యాప్తంగా 824 మంది విదేశీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉండగా.. మర్కజ్లో 216 మంది ఉన్నారని ప్రకటించింది. 1500 మంది స్వదేశీ ప్రతినిధులు మర్కజ్లో ఉన్నట్టు తెలిపింది. 2,100 మంది స్వదేశీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించే పనిలో ఉన్నట్టు తెలిపింది. ఢిల్లీలో మార్చి 13–15తేదీల్లో ‘ఇజ్తెమా’ పేరుతో జరిగిన సమావేశాలకు నాలుగైదు వేల మంది స్వదేశీ, విదేశీ ప్రతినిధులు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ముందే కౌలాలంపూర్ సదస్సులో పాల్గొన్న 31 మంది ఇండోనేసియా దేశస్తులు, ఇతర దేశస్తులు ఢిల్లీ చేరుకుని మర్కజ్లో సమావేశాలకు హాజరైనట్టు తెలుస్తోంది. దేశం నలుమూలలకు.. : ‘ఇజ్తెమా’ ముగిసిన తరువాత మార్చి 16 నుంచి అనేకమంది తమ స్వస్థలాలకు వెళ్లడం ప్రారంభించారు. మార్చి 22 నాటి జనతా కర్ఫ్యూ అనంతరం మార్చి 23న 1500 మంది స్వస్థలాలకు వెళ్లిపోయారని, లాక్డౌన్ ప్రకటనతో సమావేశాలు నిలిపి వేశామని, కానీ విధిలేని పరిస్థితుల్లో వెయ్యి మంది అందులోనే ఉండిపోవాల్సి వచ్చిందని తబ్లిగి జమాత్ వెల్లడించింది. వీరిని స్వస్థలాలకు చేర్చేందుకు వాహనాలను అనుమతించాల్సిందిగా తాము సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌కు లేఖ రాశామని, ఇదే విషయాన్ని హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఇచ్చిన నోటీస్‌కు జవాబులో తెలిపామని వివరించింది. చట్టబద్ధమైన ఆదేశాలను తాము ఉల్లంఘించలేదని పేర్కొంది. అయితే తాజాగా వీరిలో 24 మందికి కరోనా పాజిటివ్ తేలిందని, కరోనా లక్షణాలు ఉన్న 411 మందిని ఆసుపత్రులకు పంపామని ఢిల్లీ సీఎం ప్రకటించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 1339 మంది జమాత్ ప్రతినిధులను క్వారంటైన్‌కు తరలించామని హోం శాఖ ప్రకటించింది. టూరిస్ట్ వీసాపై వచ్చి మతపరమైన మిషనరీ పనుల్లో పాల్గొనరాదని ఇదివరకే హోం శాఖ ఆదేశాలు ఉన్నాయని, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆయా ప్రతినిధుల వీసా కేటగిరీని తనిఖీ చేయాలని రాష్ట్రాల పోలీస్ యంత్రాంగానికి సూచనలు ఇచ్చామని తెలిపింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 824 మంది విదేశీ ప్రతినిధులను, వారికి జిల్లాల వారీగా, స్థానికంగా సమన్వయం చేస్తున్న 2,137 మంది స్వదేశీ ప్రతినిధులను స్క్రీనింగ్ చేసి క్వారంటైన్‌కు తరలించినట్టు తెలిపింది. వీరందరూ ఎక్కడెక్కడ తిరిగారో వారి కదలికలను గుర్తించాలని రాష్ట్రాలను మార్చి 29న ఆదేశించినట్టు తెలిపింది. పాజిటివ్ కేసులు ఇలా వెలుగులోకి.. నిజాముద్దీన్æ సమావేశాలకు హాజరై స్వస్థలాలకు వెళ్లిన వారిలో పలువురికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో రామగుండంకు వచ్చిన ఇండోనేసియన్లలో 10 మందికి మార్చి 20నే పాజిటివ్ అని తేలింది. ఈ సదస్సుకు హాజరైన కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి మార్చి 26న తన స్వస్థలంలో కరోనాతో మరణించారు. మార్చి 27న మర్కజ్ నుంచి ఆరుగురిని, 28న 33 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఈ సమావేశాలకు హాజరైన వారిలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. అండమాన్‌లో బయటపడ్డ పాజిటివ్ కేసులకు మర్కజ్ సమావేశాలకు సంబంధం ఉన్నట్టు తేలింది. ఇతర దేశాల్లోనూ ఇదే తీరు.. దక్షిణాసియాలోని వివిధ దేశాల్లో కేసులకు కౌలాలంపూర్ సదస్సుకు లింక్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. మలేషియాలో 2,400 కేసుల్లో మూడో వంతు కేసులకు ఈ సదస్సుకు సంబంధం ఉందని అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి. లాహోర్ సమీపంలో గల రాయ్‌విండ్‌లో తబ్లిగీ జమాత్ అక్కడి మర్కజ్లో వార్షిక సదస్సు నిర్వహించినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ సభ్యులు 27 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏ ప్రాంతాల వారు హాజరయ్యారు మర్కజ్‌కు గడిచిన రెండు నెలలుగా ఇండోనేసియా, నేపాల్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, మయన్మార్, అల్జీరియా, కిర్గిస్తాన్, ఇంగ్లండ్, సింగపూర్ దేశాలకు చెందిన 2,100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే మన దేశం నుంచి 20కి పైగా రాష్ట్రాలకు చెందిన దాదాపు ఐదారు వేలకు మందికి పైగా ప్రతినిధులు హాజరైనట్టు ప్రాథమిక అంచనా. తబ్లిగి సమావేశాలకు హాజరైన వారిని గుర్తించేందుకు పశ్చిమ బెంగాల్, అసోం, మణిపూర్‌లతోపాటు కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కర్ణాటక నుంచి 54 మంది పాల్గొనగా 13 మందిని గుర్తించామని వీరందరికీ వైరస్ సోకలేదని పరీక్షల ద్వారా స్పష్టమైందని ఆ రాష్ట్రం తెలిపింది.హిమాచల్ ప్రదేశ్ నుంచి 17 మంది ఈ సమావేశాలకు హాజరయ్యారని అంచనా. కాగా దేశవ్యాప్తంగా తబ్లిగి జమాత్ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్న 824 మంది విదేశీ ప్రతినిధుల వివరాలను కేంద్రం సేకరించింది. ఇలా తెలంగాణలో 82 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 24 మంది విదేశీ ప్రతినిధులు ఉన్నట్టు తెలిపింది. -
సురక్షితంగా వైద్య విద్యార్థుల రాక
సాక్షి, విశాఖపట్నం: కౌలాలంపూర్‌లో చిక్కుకుపోయిన వైద్య విద్యార్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులు కరోనా కారణంగా స్వస్థలాలకు బయలుదేరి, మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో విమాన సర్వీసులు రద్దు కావడంతో 185 మంది చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిలో విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన 91 మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్.. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన వారున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అభయమిచ్చింది. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు చేశారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం.. కౌలాలంపూర్ నుంచి ఢిల్లీ, విశాఖలకు ఎయిర్ ఏషియా విమాన సర్వీసు పునరుద్దరణకు అనుమతించింది. దీంతో 185 మంది విద్యార్థులు బుధవారం సాయంత్రం 6.20 గంటలకు విశాఖ చేరుకొని (మరో 85 మంది ఢిల్లీ వెళ్లారు) ఊపిరి పీల్చుకున్నారు. వారికి స్క్రీనింగ్ నిర్వహించగా ఎవ్వరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ 14 రోజుల పాటు ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచిస్తూ వారిని 6 ప్రత్యేక బస్సుల్లో ఆయా ప్రాంతాలకు పంపించేశారు. -
మైట ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పూల పరిమళాలతో మలేషియా పరవశించింది. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను ప్రవాసులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. మలేషియా కౌలాలంపూర్‌లోని ఎస్డబ్ల్యూ బాంక్వెట్ హాల్, టీఎల్‌కే కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణ వాసులు భారీగా తరలి వచ్చారు. సంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమైన పూలతో చేసిన బతుకమ్మలను చిన్నా పెద్దా తేడా లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేశారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మలేషియాలోని సెలంగోర్ స్టేట్ మినిస్టర్ గణపతి రావు, మలేషియా తెలుగు సంఘం ప్రెసిడెంట్ డా. దాతో అచ్చయ్య కుమార్ రావు, మలేషియా తెలుగు పునాది ప్రెసిడెంట్ దాతో కాంతారావు, ఇండియన్ హైకమిషన్ లేబర్ వింగ్ సెక్రటరీ లక్ష్మీకాంత్, పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, మలేషియా తెలంగాణ రాష్ట్ర సమితి వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, సాండ్స్టోన్ మనికంట పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలలో మహిళలు, చిన్నారులు బతుకమ్మలను అక్కడ దొరికే రంగు రంగుల పువ్వులతో అందంగా పేర్చారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మా, ఒక్కొక్క పువ్వేసి చందమామ, ఒక్క జాము ఆయే చందమామ, వంటి పాటలతో మలేషియా మారుమోగింది. తెలంగాణ కళాకారుల పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రుచికరమైన తెలంగాణ వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ గా వచ్చిన సాండ్ స్టోన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్పాన్సర్స్ హెచ్‌యూ డెక్కన్, కేవీటీ గోల్డ్, జాస్ డెకొరేటర్స్, మినీ మార్ట్ అప్, టీఆర్ఎస్ మలేషియా, మలబార్ గోల్డ్, మై బిర్యానీ రెస్టారెంట్ , మై81 రెస్టారెంట్, ఏపీ భవన్ రెస్టారెంట్, ప్రబలీ రెస్టారెంట్, ఎమ్ఎస్ స్పైసెస్, ఎన్ఎస్ క్యాష్ పాయింట్, గాజా ఎట్ 8 రెస్టారెంట్, మోడరన్ స్టోర్స్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం కావడానికి సహకరించిన మైట కోర్ కమిటీని వాలంటీర్లుగా ముందుకి వచ్చిన సభ్యులను, మైట సభ్యులను అయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య , వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేజరర్ మారుతీ జాయింట్ ట్రేజరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ, కృష్ణ వర్మ, కిరణ్ గాజంగి, హరి ప్రసాద్, వివేక్, రాములు, సుందర్, కృష్ణ రెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, వైస్ ప్రెసిడెంట్-అశ్విత , యూత్ వింగ్ యూత్ ప్రెసిడెంట్ - కార్తీక్, యూత్ వైస్ ప్రెసిడెంట్ - కిరణ్ గౌడ్, యూత్ వైస్ ప్రెసిడెంట్ - రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, ఓం ప్రకాష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్ , సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కౌలాలంపూర్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
కౌలాలంపూర్ : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 స్థానాలతో విజయదుందుబి మోగించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ అభిమానులుగా ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ మలేషియా సభ్యులు తెలిపారు. కౌలాలంపూర్‌లోని సెరిండా జలపాతం దగ్గర వైఎస్సార్సీపీ విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు. గుంటూరుకు చెందిన శ్యాం అనిల్ కుమార్, పెదకూరపాడుకు చెందిన వెంకటరెడ్డి, రాంబాబుల ఆధ్వర్యములో ఈ కార్యక్రమం జరిగింది. కట్టెపోగు కిషోర్, రోహిత్ క్రుపాల్, సంజీవ్ దాసి, చంద్రపాల్ బాబు పుల్లగూర, నెల్సన్, హరీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ కుటుంబాలతో కలిసి రోహిత్ ప్రార్ధన చేయగా శ్యాం అనిల్ కుమార్, చంద్రపాల్ బాబు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం అనిల్ కుమార్, రోహిత్, రంబాబు, రాజేష్, రవికాంత్ తదితరులు మాట్లాడుతూ వైఎస్ జగన్ దేవుని దీవెనలతో ప్రజారంజకమైన పరిపాలన అందించాలని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా అద్భుతమైన పరిపాలన అందిచాలని కోరారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులకు, విజయ సారధి వైఎస్ జగన్‌కిశుభాకాంక్షలు తెలిపారు. -
మైటా ఆధ్వర్యంలో నిరంజన్ రెడ్డితో మీట్ అండ్ గ్రీట్
కౌలాలంపూర్ : మలేషియా తెలంగాణా అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరంజన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా మలేషియాలోని వివిధ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి క్షేత్రాలను, వివిధ రకాల పంటలు సాగు చేసే క్షేత్రాలను సందర్శించి వ్యవసాయంలో మలేషియా వాసులు అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులను తెలుసుకున్నారు. చివరి రోజున మలేషియా కౌలాలంపూర్‌లోని లిటిల్ ఇండియాలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ సభ్యులు నిరంజన్ రెడ్డితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బిజీ షెడ్యుల్‌లో కూడా తెలంగాణ ప్రవాసులను కలుసుకోవాలని ఈ కార్యక్రమానికి వచ్చిన నిరంజన్ రెడ్డికి మలేషియా తెలంగాణ ప్రెసిడెంట్ సైదం తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పనకు కృషిచేయాల్సిందిగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ తరపున కోరారు. మైటా గత ఆరు సంవత్సరాలుగా చేసిన ముఖ్య కార్యక్రమాలను, ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు. మైటా డిప్యూటీ ప్రెసిడెంట్ చోపరి సత్య, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, మహిళా విభాగం ప్రెసిడెంట్ కిరణ్మయి, యూత్ ప్రెసిడెంట్ కార్తీక్, నిరంజన్ రెడ్డిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ను అయన అభినందించారు. అలాగే తెలంగాణలో కూడా విదేశాలకు వెళ్లాలని అనుకునే యువతకి అవేర్నెస్ కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా మైటాను అయన కోరారు. తెలంగాణ బిడ్డలందరు గర్వపడేటట్లు తెలంగాణ మంత్రులంతా ఉమ్మడి బాధ్యత తీసుకొని కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, యూత్ ప్రెసిడెంట్ కార్తీక్, ముఖ్య కార్యవర్గ సభ్యులు సందీప్, మారుతీ, చందు, సందీప్, కిరణ్, ప్రతీక్ ,రవితేజ, సందీప్ నరేందర్, సంతోష్, స్వప్న, అశ్విత, సాహితి సాయిచరని, అనూష తదితరులు పాల్గొన్నారు. -
‘బిడ్డను మరచి విమానం ఎక్కిన నీకు దండం తల్లి’
రియాధ్ : మాములుగా ప్రయాణమంటేనే చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది విమాన ప్రయాణమంటే మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఇక వస్తువుల విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్‌చేసుకోని మరి ఫ్లైట్ ఎక్కుతాం. ఏ వస్తువు మరిచిపోయినా అత్యవసరమైతే తప్పా.. ఫ్లైట్‌ను వెనక్కి రప్పించలేం. అయితే, ఓ తల్లి మాత్రం ఏకంగా తన కన్న బిడ్డనే మర్చిపోయి విమానమెక్కేసింది. అంతేకాకుండా తీరా మార్గమధ్యంలో తన బిడ్డను మరిచాననే విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని బోరుమంది. వెయింటిగ్ హాల్లోనే తన నవజాత శిశువును వదిలేసి విమానం ఎక్కానని విమాన సిబ్బందికి చెప్పడంతో వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించి ఫ్లైట్‌ను వెనక్కి తిప్పారు. పైలట్ చెప్పిన విషయం విన్న ఏటీసీ అధికారులు ఆశ్చర్యపోయారు. అనంతరం మానవతా దృక్పథంతో విమానం వెనక్కి రావడానికి అనుమతిని ఇచ్చారు. విమానం ల్యాండయ్యాక ఎయిర్‌పోర్టు సిబ్బంది శిశువును ఆమె తల్లికి అప్పగించడంతో ఈ కథ సుఖాంతమైంది. సినిమాటిక్ తరహాలో జరిగిన ఈ ఘటన సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. జెడ్డా నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏటీసీతో పైలట్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో.. విమానంలోని ఓ ప్రయాణీకురాలు తన నవజాత శిశువును ఎయిర్‌పోర్ట్‌లోని వెయిటింగ్ హాల్లో మరిచిపోయిందని వెనక్కి రావాడానికి అనుమతినివ్వండని ఫ్లైట్ సిబ్బంది ఏటీసీని కోరగా... చాలా ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి కేసు ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదని ఏటీసీ అధికారులు సంభాషించినట్లు ఉంది. సొంతబిడ్డను మరిచి విమానమెక్కిన నీకు దండం తల్లే! అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
‘మీ సరదా కోసం చిన్నారిని హింసిస్తారా?’
కౌలాలంపూర్ : ప్రపంచ పర్యటనకై డబ్బులు సేకరించేందుకు ఓ రష్యన్ జంట తమ చిన్నారి పట్ల క్రూరంగా ప్రవర్తించింది. వీధుల్లో నాలుగు నెలల పసికందుతో విన్యాసాలు చేస్తూ తమాషా చేసింది. దీంతో ఆగ్రహించిన మలేషియా పోలీసులు సోమవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. రష్యాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ప్రపంచ పర్యటన చేయాలని భావించాడు. ఇందులో భాగంగా సోమవారం కౌలాలంపూర్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో పర్యటన ఖర్చుల నిమిత్తం డబ్బు సేకరించేందుకు సదరు వ్యక్తి తన కూతురిని గాల్లోకి ఎగురవేస్తూ వివిధ రకాల విన్యాసాలు చేశాడు. ఆమె ఏడుస్తున్నా పట్టించుకోకుండా తలకిందులుగా వేలాడదీస్తూ తన ఆటను కొనసాగించాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న చిన్నారి తల్లి.. ‘ మేము ప్రపంచ పర్యటన చేస్తున్నాం’ అనే ప్లకార్డు పట్టుకుని కూర్చుని ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియోపై మండిపడిన నెటిజన్లు.. ‘ స్టుపిడ్.. మీ సరదా కోసం చిన్నారిని ఇలా హింసిస్తారా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
బ్రిక్స్‌ఫీల్డ్స్‌లో శత నృత్య యాగం
కౌలాలంపూర్ : పిరమిడ్ సొసైటీ అఫ్ మలేషియా, జెన్ పైడా ఇంటర్నేషనల్, మలేషియా తెలుగు ఫౌండేషన్, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్, తెలుగు ఇంటెలెక్చువల్ సొసైటీ అఫ్ మలేషియా సంయుక్తంగా నిర్వహించిన శత నృత్య మహా యాగం బ్రిక్స్‌ఫీల్డ్స్‌లోని టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో జరిగింది. భారతదేశం నుండి 100 మందికి పైగా వచ్చిన కళాకారుల బృందం పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకులని అలరించారు. ఇందులో భాగంగా బతుకమ్మ, దసరా సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగు ఎమ్మెల్యే శివనేశ్వరన్, వైబీ గణపతి రావు, కాంతారావు, సైదం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కౌలాలంపూర్ : మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మలేషియా కౌలాలంపూర్‌లోని పీపీపీఎమ్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు భారీగా తరలి వచ్చారు. సాంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమైన పూలతో చేసిన బతుకమ్మలను చిన్నా పెద్దా తేడా లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేశారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరమళ్ళ ప్రకాష్ రావు, ఇండియన్ కౌన్సిలర్ అఫ్ మలేషియా నిషిత్ కుమార్ ఉజ్వల్‌తోపాటూ పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం జాతిపిత మహాత్మా గాంధీ 150వ జన్మదినం కావున భారత ప్రభుత్వం వారి జ్ఞాపకార్థం ఈ సంవత్సరం పొడుగునా గాంధీ జన్మదిన వేడుకల్ని జరపాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్, ఇండియన్ హైకమిషన్ అఫ్ మలేషియా సంయుక్తంగా గాంధీపైన వీడియో ప్రెజెంటేషన్, పిల్లలకు వ్యాస పోటీలు, క్విజ్‌లలో పాల్గొన్న వారికి, విజేతలకు బహుమతులను అందజేశారు. లక్కీ డ్రా విజేతలకు, అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి ముఖ్య అతిథు చేతుల మీదుగా 6 గ్రాముల బంగారాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ప్రవాస తెలంగాణ వాసులు తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా బతుకమ్మ, తెలంగాణ పండుగలు జరుపోకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ మొట్టమొదట మలేసియా వచ్చినపుడు ఏర్పాటు చేసిన మొదటి సమావేశం తరువాత మొదటి బతుకమ్మ వేడుకలతో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ఈ సంబరాలను ప్రతి ఏటా ఘనంగానిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ను అభినందించారు. మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రారంభం కావడానికి కృషిచేసిన వ్యక్తి ప్రకాష్ అని అన్నారు. ఈ సంవత్సరం ఐదు రోజుల పాటు తెలుగు వారు ఉండే ప్రతి చోట బతుకమ్మ వేడుకలను తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ గా వచ్చిన స్పేస్ విజన్ గ్రూప్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కో స్పాన్సర్స్ జాస్ బెలూన్ అండ్ డెకొరేటర్స్, సంక్రాంతి ఇండియన్ క్యూసిన్, ప్రబలీ రెస్టారెంట్, మై 81రెస్టారెంట్, తడ్కా, ఎమ్టీఆర్ స్పైసెస్‌లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మసంబరాలను విజయవంతం చేయడానికి సహకరించిన మైట కోర్ కమిటీని వాలంటీర్లు గా ముందుకి వచ్చిన సభ్యులను అయన అభినందించారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ 2018-2020 కి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నికయింది. బతుకమ్మ పండుగ సందర్బంగా ప్రకాష్ రావు ప్రకటించారు. నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు ప్రెసిడెంట్ - సైదం తిరుపతి డిప్యూటీ ప్రెసిడెంట్ - చొప్పరి సత్య వైస్ ప్రెసిడెంట్ - బూరెడ్డి మోహన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ - నరేంద్రనాథ్ జనరల్ సెక్రటరీ - రవి చంద్ర జాయింట్ సెక్రటరీ - సందీప్ ట్రేసరర్- మారుతీ జాయింట్ ట్రేసరర్ - రవీందర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ -రవి వర్మ,కృష్ణ వర్మ,కిరణ్ గాజంగి,హరి ప్రసాద్,వివేక్,రాములు,సుందర్,కృష్ణ రెడ్డి ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ - కిరణ్మయి వైస్ ప్రెసిడెంట్ - స్వప్న వైస్ ప్రెసిడెంట్ - అశ్విత యూత్ వింగ్ యూత్ ప్రెసిడెంట్ - కార్తీక్ యూత్ వైస్ ప్రెసిడెంట్ - కిరణ్ గౌడ్ యూత్ వైస్ ప్రెసిడెంట్ - రవితేజ కల్చరల్ వింగ్ మెంబర్స్ -విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్ , రంజిత్ , సంతోష్ , ఓం ప్రకాష్, అనూష ,దివ్య , సాహితి , సాయిచరని, ఇందు. మైగ్రంట్ వింగ్ మెంబర్స్ -ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్ , సందీప్ గౌడ్ -
జకీర్ నాయక్‌తో మనకూ ప్రమాదమే?!
కౌలాలంపూర్ : వివాదస్పద ముస్లిం మత బోధకుడు జకీర్ నాయక్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని మలేషియాలోని మానవహక్కుల సంఘాలు కౌలాలంపూర్ హైకోర్టును అశ్రయించాయి. ప్రధానంగా మలేషియాలో జకీర్ నాయక్ శాశ్వత నివాస అనుమతి రద్దు చేయాలని 17 మానవ హక్కుల సంఘాలు కౌలాలంపూర్ హైకోర్టును కోరాయి. జకీర్ నాయక్‌పై భారత దేశంలో అనేక కేసులు నమోదవడంతో పాటు.. అక్కడి భారత దర్యాప్తు సంస్థలు అతన్ని వాంటెడ్ క్రిమినల్‌గా పేర్కొన్న విషయాన్ని.. మానవహక్కుల సంఘాలు కోర్టుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ వల్ల మలేషియా భద్రత ప్రమాదంలో పడే అవకాశముందని.. అందువల్ల అతనికి గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టును కోరింది. మలేషియాలోని మలయా హక్కుల సంఘం నేతృత్వంలో ఏర్పడ్డ ఒక బృందం ఇది వరకే జకీర్ నాయక్‌పై దేశ బహిష్కరణ విధించాలని కోర్టులో కేసును పెట్టింది. ఈ కేసు ఈ నెల 21 కోర్టులో విచారణకు రానుంది. జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను భారత్ నిషేధించిన విషయాన్ని హక్కుల సంఘం కోర్టుకు తెలిపింది. -
రేప్‌లు, నేరాలు జరుగతాయనే భయంతో..
కౌలాలంపూర్ : మలేషియాలో ప్రతియేటా నిర్వహించే బీర్ ఫెస్టివల్‌ను రద్దు చేసినట్లు కౌలాలంపూర్ పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఫెస్టివల్ లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉండటంతోపాటు పార్టీ పేరిట, నేరాలు, లైంగిక దాడులు, స్వేచ్ఛాయుత లైంగిక కార్యక్రమాలకు ఆస్కారం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 6000మంది హాజరవుతారని అంచనా. ఈ పార్టీకి దాదాపు 11 దేశాల నుంచి ఉత్సాహవంతులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల మేరకు ఈ ఫెస్టివల్ నిర్వహించ వద్దని నిర్వాహకులకు తెలియజేశారు. -
కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో వైగో నిర్బంధం
సాక్షి, చెన్నై: తమిళ నేత, ఎండీఎంకే చీఫ్ వైగోను మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలోనే అధికారులు అడ్డుకున్నారు. ఎల్టీటీఈతో సంబంధాలపై అక్కడే చాలాసేపు ప్రశ్నించిన అధికారులు.. ఆయన్ను దేశంలోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ‘మలేసియాకు ప్రమాదకారుల’ జాబితాలో వైగో పేరు ఉండడమే అందుకు కారణమన్నారు. వైగోను మలేసియా ఎయిర్‌లైన్స్ విమానంలో తిరిగి భారత్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. పెనాంగ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పి.రామస్వామి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవడానికి వైగో మలేసియాకు చేరుకున్నారు. -
సమ్మర్ హాలిడేస్: చౌకగా విదేశీయానం
ముంబై: వేసవి సెలవులు వచ్చేశాయి. ఎక్కడికైనా సరదాగా వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం బ్యాగులు సర్దుకుని, విదేశీ ప్రయాణానికి సిద్ధం కండి. ఎందుకంటే ఈ సమ్మర్ లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లడం చాలా చౌకగా మారిందట. లండన్, సింగపూర్, సిడ్ని, కౌలాలంపూర్ వంటి విదేశాలకు వెళ్లడానికి విమాన ఛార్జీలు కిందకి దిగొచ్చాయని వెళ్లడైంది. అంతర్జాతీయ మార్గాల్లో విమాన ఛార్జీలు 28 శాతం వరకు పడిపోయాయని తెలిసింది. బ్రూసెల్స్ విమానయాన సంస్థ వంటి విదేశీ క్యారియర్స్ ఆగమనంతో 2016 ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విమానసంస్థల టిక్కెట్ ధరలు కిందకి దిగొచ్చాయని టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ కాక్స్ అండ్ కింగ్స్ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం ప్రకారం ఢిల్లీ నుంచి లండన్ ప్రయాణం రూ.31,800కి దిగొచ్చిందని, గతేడాది ఇదే నెలలో టిక్కెట్ ధర రూ.39,497గా ఉందని తెలిసింది. అంటే గతేడాది కంటే 19 శాతం తగ్గిపోయింది. అదేవిధంగా ఢిల్లీ నుంచి సింగపూర్ ప్రయాణ ఛార్జీలు కూడా 22 శాతం పడిపోయి, రూ.22,715గా నమోదైనట్టు కాక్స్ అండ్ కింగ్స్ అధ్యయనం పేర్కొంది. 2016 ఏప్రిల్ లో ఈ ధర 29,069 రూపాయలుగా ఉన్నట్టు తెలిసింది. తమ రిపోర్టు ప్రకారం ఈ సమ్మర్ లో విమాన టిక్కెట్ ఖర్చులు గతేడాది కంటే తగ్గినట్టు తెలిసిందని కాక్స్ అండ్ కింగ్స్ బిజినెస్ హెడ్ జాన్ నాయర్ చెప్పారు. అన్నింటి కంటే ముంబాయి-కౌలాలంపూర్ ధర దాదాపు 28 శాతం వరకు తగ్గిపోయి, 20,377 రూపాయలుగా ఉందని రిపోర్టు పేర్కొంది. విదేశీ ఎయిర్ లైన్స్ ఎంట్రీతో పాటు ఇంధన ధరలు దిగిరావడంతో విమానసంస్థలు ధరలు తగ్గించినట్టు రిపోర్టు వెల్లడించింది. -
విమానంలో వైద్యం చేసిన భారతీయ డాక్టర్
కైలాలంపూర్: గాల్లో విమానం ఉంది. అందులో అత్యవసరంగా వైద్య సదుపాయం కావాల్సి వచ్చింది. ఆసమయంలో ఓభారతీయ వైద్యురాలు స్పందించి ప్రాధమిక వైద్య సదుపాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే మలేషియ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం న్యూజిలాండ్ ఎక్లాండ్ నుంచి మలేషియా కైలాలంపూర్ వెళ్తోంది. ఉన్నట్టుండి ఎయిర్ హోస్టస్ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో తనకు అత్యవసర వైద్యసహాయం అందించాల్సి వచ్చింది. చికిత్స అనంతరం ఎయిర్‌హోస్టెస్ కళ్లు తెరిచింది. దీంతో ప్రయాణికులంతా చప్పట్లతో అంచితను అభినందించారు. ఎమర్జెన్సీ లాండింగ్‌కు పైలట్ సిద్దమయ్యారు. ఎమర్జెన్సీ లాండింగ్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లడానికి రెండుగంటలు, ఆక్లాండ్ వెళ్లడానికి గంట సమయం పడుతుందని భావించిన సిబ్బంది విమానంలో ఎవరైనా డాక్టర్ ఉంటే సహాయం అందించాలని కోరారు. దీంతో భారత్‌కు చెందిన డాక్టర్ అంచిత స్పందించారు. ఎయిర్ హోస్టెస్ కు ప్రాధమిక వైద్యం అందించారు. ఈ సంఘటన గురించి అంచిత భర్త కుమార్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అత్యవసర సమయంలో వైద్యమందించిన వ్యక్తి తన భార్య కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. -
సుందర ప్రదేశాలను చుట్టొద్దాం
జీవితంలో నిత్యం ఉండే ఈ ఒత్తిళ్ల మధ్య కుటుంబంతో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కానీ ఖర్చులు గుర్తొస్తే... వామ్మో ఫ్యామిలీతో హాలిడే ట్రిప్పా... ఎప్పుడూ అదో పెద్ద సమస్య. ఎక్కడికైనా ప్రయాణానికి ప్లాన్ చేసుకోవాలనుకున్నా... టిక్కెట్లు బుక్ చేసుకోవడం, హోటల్ గదులు రిజర్వ్ చేసుకోవడం, మనకు కావలసిన ఐటెనరీ తెలియజేయడం... వంటివెన్నో మనకు ప్రతిబంధకాలుగా కనిపిస్తాయి. అలాంటి సందర్భాల్లో అసలు ఫ్యామిలీ ట్రిప్పు ఎందుకులే అనుకునే వారూ ఉంటారు. (ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్) కానీ, ప్రపంచంలోని ఎన్నో వింతలు, ఎన్నెన్నో అబ్బుర పరిచే ప్రాంతాలను సందర్శించాలన్న కోరిక ఎలాగూ ఉంటుంది. అలాంటి వారికి మార్గాలు లేకపోలేదు. అలా ప్రముఖమైన ప్రదేశాలను చూసిరావడానికి ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం, దానికి తగిన ఏర్పాట్లు చేసే విషయంలో ఇప్పుడు ఎయిర్ ఏషియా ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. "గ్రేట్ హాలిడే ట్రిప్" కు ఇప్పుడు ఎయిర్ ఏషియా ఒక మంచి ఆఫర్ ను ప్రకటించింది. ఎంతో ఖరీదైన విమాన ప్రయాణాన్ని సైతం అందుబాటు ధరల్లో ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. బడ్జెట్ లో ప్రపంచంలోనే అద్భుతమైన ప్రదేశం కౌలాలంపూర్ ను సందర్శించి మంచి అనుభూతిని మిగుల్చుకునే అవకాశం కల్పిస్తోంది ఎయిర్ ఏషియా. సౌకర్యవంతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణించేలా ఎయిర్ ఏషియా ఆఫర్ చేస్తోంది. కొంచెం కష్టమైనా.. కౌలాలంపూర్, మలేషియా లాంటి దేశాలను చూడాలని ఆశపడే వారి అభిలాషను ఎయిర్ ఏషియా నెరవేర్చేస్తోంది. హాలిడే ప్లానింగ్‌కు ఎప్పుడూ ముందుండే ఎయిర్ ఏషియా... సందర్శకుల కోసం ముందస్తుగా బడ్జెట్ ధరల్లో సీట్లు, హోటల్స్‌ను బుక్ చేస్తోంది. ఎయిర్ ఏషియా ఆఫర్ చేస్తున్న కౌలాలంపూర్, మలేసియా దేశ రాజధాని. నోరూరించే స్ట్రీట్ ఫుడ్, షాపింగ్, సీతాకోకచిలుక పార్కులు, ట్విన్ టవర్స్‌ను పోలిన భవంతులు, మ్యూజియంలు, ప్రశాంతతకు నిలయంగా పేరుపొందిన దేవాలయాలు... ఇలా ఒక్కటేమిటి ఆ నగరంలో ప్రతి ఒక్కటీ అబ్బురపరిచేదే. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాలన్నా.. స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి వెళ్లినా మలేసియాకు మించిన అద్భుతమైన పర్యాటక ప్రదేశం మరేది ఉండదంటే ఎలాంటి సందేహం ఉండదు. మీకు బీచ్‌లో సరదాగా గడపాలని ఉంటే, రాత్రి నుంచి ఉదయం వరకు అక్కడ పార్టీలు జరుగుతూనే ఉంటాయి. ఆ దేశం కూడా అనువైన ధరల్లోనే పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుంది. ఒక్క కౌలాలంపూర్ మాత్రమే కాదు, జార్జ్ టౌన్ లేదా మిరీ వంటి మలేషియాలో అతి ముఖ్యమైన ప్రాంతాలను బడ్జెట్లో చుట్టిరావచ్చు. తక్కువ ధరల్లో సేవలు అందించే ఎయిర్‌లైన్‌గా పేరున్న ఎయిర్ ఏషియా కూడా జేబుకి ఎలాంటి చిల్లు పెట్టకుండానే ప్రయాణికులకు మరపురాని అనుభూతిని అందిస్తోంది. ఇంకో విషయమేంటంటే... ఆసియాలో 100 పర్యాటక ప్రాంతాలకు అతి తక్కువ ధరలకే చుట్టొచ్చేలా ఎయిర్ ఏషియా ఆన్లైన్లో బంపర్ ఆఫర్ అందిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏంచక్కా ఎయిర్ ఏషియా విమానం ఎక్కేసి, ప్రపంచంలోనే అద్భుతమైన మలేసియాను సందర్శించేసిరండి. మరిన్ని వివరాలకు.. ఎయిర్ ఏషియా వెబ్‌సైట్‌ను సందర్శించండి (ఇక్కడ క్లిక్ చేయండి) (అడ్వర్టోరియల్ ఆర్టికల్) -
ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్
కొత్త సంవత్సరాది కొంగొత్త ఆలోచనలతో న్యూఇయర్‌కు స్వాగతం పలుకాలనుకుంటున్నారా? ప్రతీసారి కంటే విభిన్నంగా ఎక్కడికైనా వెళ్లి ఫ్యామిలీతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం బ్యాగులు సర్దుకుని, కౌలాలంపూర్ ప్రయాణానికి సిద్ధం కండి. అయ్యో ఎయిర్‌లైన్ టిక్కెట్లు బుక్ చేసుకోలేదు. న్యూఇయర్ సందర్భంగా ఎకనామికల్ బోనస్‌లు ఎలా అని సందేహ పడకండి. 15 సంవత్సరాలుగా విమానయాన సర్వీసులు అందిస్తున్న ఎయిర్ ఏషియా మీకోసం ఓ స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్‌గా కౌలాలంపూర్‌కు సూపర్ ఎకనామికల్ టూర్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ పర్యటన సందర్భంగా మలేషియా రాజధానిగా ఉన్న కౌలాలంపూర్‌లో చూడదగ్గ ప్రదేశాలు, అబ్బురపరిచే విశేషాలు మీకోసం అందించబోతోంది.... ట్విన్ టవర్స్‌ను పోలిన భవంతులు : కౌలాలంపూర్‌లో అడుగుపెట్టగానే మొదటి సందర్శకులకు దర్శనమిచ్చేది పెట్రోనాస్ టవర్స్. ప్రపంచంలో ఇట్లాంటి టవర్స్‌ను బహుశా మీరెక్కడ చూసుండరేమో. ఆకాశానంటే జంట సౌధాల కలయికనే ఈ టవర్స్. వీటినే పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అని కూడా పిలుస్తుంటారు. విద్యుత్ దీపాలు వెలిగినప్పుడు కౌలాలంపూర్ కన్వెక్షన్ పార్కు నుంచి ఈ టవర్స్‌ను చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. జలాన్ అలోర్ : పసందైన వంటకాలకు పెట్టింది పేరు జలాన్ అలోర్ స్ట్రీట్. రోడ్డు సైడ్ తినుబండారాల దుకాణాలకు ఈ ప్రాంతం ఎక్కువగా ప్రసిద్ధి చెందినది. ఎప్పుడైతే సూర్యుడు తన అమ్మ ఒడిలోకి సేదతీరడానికి పయనమవుతుంటాడో ఇక అప్పటినుంచి ఆ ప్రాంతం కస్టమర్ల రాకపోకలతో బిజీగా మారిపోతుంది. మిఠాయిల దగ్గర్నుంచి స్పయిసీ చెట్నీల వరకు అన్ని రకాల వంటకాలను ఇక్కడి రెస్టారెంట్లు ఆఫర్ చేస్తాయి. మంచి స్ట్రీట్ ఫుడ్‌ని తిన్న అనుభూతిని జలాన్ అలోర్ సందర్శకులకు అందిస్తుందనడంలో సందేహమే లేదు. మెనరా టవర్స్ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడాలలో మెనరా టవర్స్ కూడా ఒకటి. వీటినే కేఎల్ టవర్స్ అని కూడా అంటారు. ఈ టవర్స్ నుంచి నగరమంతటిన్నీ తిలకించవచ్చు. ముస్లిం తమ పవిత్రవమైన మాసం రంజాన్‌లో నెలవంకను ఈ టవర్స్ పై నుంచే చూస్తారట. టవర్స్ పైనుంచి సిటీని చూసినా.. గాలిలో ఎగురుతున్న ఏయిర్ ఏషియా ఫ్లయిట్ నుంచి చూసినా రెండు ఒకేమాదిరిగా కనిపిస్తాయట. పక్షి ప్రేమికుల ప్రేమాలయం : పక్షులను ఎక్కువగా ఇష్టపడే వారికి కౌలాలంపూర్ ఓ ప్రేమాలయం లాంటిదేనట. ఎందుకంటే కౌలాలంపూర్ బర్డ్ పార్క్‌లో దాదాపు 3000 పైగా జాతులకు సంబంధించిన పక్షులు మనకు కనువిందుచేస్తాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పక్షిశాల కూడా ఇదే కావడం విశేషం. ఈ పార్క్‌లో ఇతర దేశాల నుంచి దిగుమతిచేసుకున్న పక్షులు కూడా ఉంటాయి. కానీ స్థానిక పక్షులే అక్కడ హీరోలుగా ఫోజులిస్తాయట. ఇది ఓపెన్ బర్డ్ పార్క్. సందర్శకులు ఆ పార్కుకి వెళ్లినప్పుడు, పక్షులు కూడా వారితో పాటు నడుస్తూ, ఎగురుతూ భలే కనువిందు చేస్తాయట. మలై సంప్రదాయానికి ప్రతీక : కౌలాలంపూర్ సందర్శనానికి వెళ్లిన ప్రతిఒక్కరూ చూడాల్సిన ప్రదేశం నేషనల్ మ్యూజియం. మలై సంప్రదాయానికి, చరిత్రకి ఇది ఓ ప్రతీకలా నిలుస్తోంది. లేక్ గార్డెన్‌కి దగ్గర్లోనే ఈ మ్యూజియం ఉంటుంది. పురాతన ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, ఆధునిక పద్ధతుల కలగొలుపుగా ఈ మ్యూజియం రూపుదిద్దుకుంది. మలేషియా దేశ రైల్వే చరిత్రను, విధానాన్ని ఇతర దేశాలకు చాటిచెప్పేందుకు రైల్వే మ్యూజియంను కూడా ఆ దేశం ఏర్పాటు చేసింది. షాపింగ్ అడ్డా : ఎయిర్ ఏషియాలో తిరుగుప్రయాణం అయ్యేటప్పుడు పిల్లలు, మహిళలు ఎక్కువగా మెచ్చే ఈ ప్రదేశానికి కచ్చితంగా వెళ్లాల్సిందే. అదేమిటంటే సూరియా కౌలాలంపూర్ సిటీ సెంటర్. అతిపెద్ద షాపింగ్ సెంటర్‌గా దీనికి పేరుంది. సినిమాలు, ఫుడ్ కోర్టు, రైడ్స్, సూపర్ మార్కెట్ ఇలా ఒక్కటేమిటీ ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్లో షాపింగ్ చేయాలనుకుంటున్న వారికి బుకిట్ బిన్ట్యాంగ్ ప్రాంతం కూడా ఎంతో అనువైనది. అత్యంత సౌకర్యవంతమైన కేఎల్ మోనోరైల్ నుంచి సులభంగా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. స్ట్రీట్ షాపింగ్ ఇష్టపడే వారికి బుకిట్ బిన్ట్యాంగ్ ప్రాంతం మంచి అనుభూతిని కలిగిస్తోంది. బ్యాగేజీ అలవెన్స్‌ను కూడా ఎయిర్ఏషియా తమ ప్రయాణికులకు అందిస్తోంది. దీంతో ప్రయాణికులు ఎంత మొత్తంలోనైనా షాపింగ్‌ను నిరభ్యంతరాయంగా ముగించుకోవచ్చు. హలో చైనా టౌన్ : మలేషియాలో ఎక్కువ జనాభా చైనీస్‌దే. దీనికి నిదర్శనం పెటాలింగ్ స్ట్రీట్. దీన్నే మినీ చైనాగా అభివర్ణిస్తారు. చైనా ఫుడ్ స్టాల్స్, చైనా బజార్స్, చైనా టెంపుల్స్ అన్నీ చైనీస్‌వే ఇక్కడ దర్శనమిస్తుంటాయి. సీతాకోకచిలుకల పార్క్ : 120 రకాల సీతాకోక చిలుకలకు కౌలాలంపూర్ పుట్టినిల్లు. కౌలాలంపూర్ బటర్‌ఫ్లై పార్క్ అచ్చం ఓ అడవి మాదిరి ఉంటుంది. కేఎల్లోని సీతాకోక చిలుకల పార్క్ లాంటిది ప్రపంచంలోనే మరెక్కడా లేదు. ఇది సీతాకోక చిలుకలు స్వేచ్ఛగా వచ్చి నివసించు, పునరుత్పత్తి చేసుకొను, రక్షణ పొందు కేంద్రము. ఇక్కడికి వచ్చే సందర్శకులకు పార్క్‌లోని సీతాకోక చిలుకలు పునరుత్పత్తి, జీవిత కాలం వంటి వివరాలను అక్కడి ప్రతినిధులు వివరిస్తుంటారు. నీటి క్షీరదాల నిలయం : కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో కల అక్వేరియం 5,000లకు పైగా నీటి క్షీరదాలకు నిలయంగా ఉంటుంది. 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సముద్రమట్టానికి 100 అడుగుల కింద 300 అడుగులు భారీ టన్నెళ్లతో ఈ అక్వేరియంను ఏర్పాటుచేశారు. మలేషియా రాజుల ప్యాలెస్ : మలేషియా రాజుల అధ్యక్ష భవనంగా ఇస్తానా నెగరా ఎంతో కాలంగా ప్రసిద్ధి చెందింది. 2011లో కొత్త అధ్యక్ష భవనం నిర్మించేవరకు మలేషియా రాజులందరూ ఇక్కడే ఉండేవారు. మలేషియా రాజత్వంను తెలుసుకోవడానికి ప్రస్తుతం దీన్ని చారిత్రాత్మక మ్యూజియంగా మలిచారు. ఈ భవనంలో కొన్ని గదులను పర్యటకులు కూడా వీక్షించవచ్చు. ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మలేషియా దేశం ఇక్కడే సెలబ్రేట్ చేస్తోంది. బటు గుహలు : ప్రశాంతతకు మారుపేరైన మలేషియాలో బటు గుహలు- బటు కేవ్స్ అద్భుత ప్రకృతి రమణీయ ప్రాంతం. అక్కడి రమణీయతకు మరో అందం అక్కడి షణ్ముఖాలయం. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటి. ప్రధాన నగరం నుంచి ఈ ప్రాంతం తక్కువ దూరంలోనే ఉంటుంది. మలేషియాలో తమిళ భక్తులు ఎక్కువగా ఆ ప్రాంతానికి వస్తుంటారు. దీనికి 150కి పైగా మార్గాలున్నాయి. ప్రతీదానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ గుహల వరకు హైకింగ్ చేయడం సందర్శకుల పర్యటనలో మరిచిపోలేని అనుభూతి. అద్భుతమైన మధురానుభూతిని మిగిల్చే మీ ఈ పర్యటనలో చివరిప్రాంతం ఇదే ఉంటుంది. ఇలా ఏయిర్ ఏషియా ఆఫర్ చేస్తున్న ఈ ట్రిప్‌ను ఎంజాయ్ ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకుండా తిరుగు ప్రయాణానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. (అడ్వర్టోరియల్) ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాలకు వెంటనే క్లిక్ చేయండి Click Here -
రాయబారిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు
-
రాయబారిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు
కౌలాలంపూర్: శ్రీలంక రాయబారి ఇబ్రహిం సాహిద్ అన్సర్‌కు కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా విమానాశ్రయంలోనే ఆయనపై నిరసనకారులు దాడి చేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు మలేషియా పోలీసులు తెలిపారు. మలేషియాలో శ్రీలంక హైకమిషనర్‌గా పనిచేస్తున్న అన్సర్‌పై విమానాశ్రయంలో నిరసనకారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆయనను చుట్టుముట్టిన నలుగురైదుగురు వ్యక్తులు పిడిగుద్దులు కురిపిస్తూ.. దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఈ దాడిలో ఆయనకు స్వల్పగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే, నిరసనకారులు ఎవరు? వారు ఎందుకు ఆయనపై దాడి చేశారనే వివరాలను మలేషియా పోలీసులు తెలుపలేదు. మరోవైపు ఈ ఘటనపై శ్రీలంక ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంలోని మలేషియా రాయబారికి సమన్లు జారిచేసి.. తమ నిరసన తెలియజేసింది. -
ఆ శిథిలాలు... ఆ విమానానివే !
కౌలాలంపూర్ : దక్షిణాఫ్రికా, మారిషస్‌లో దొరికిన శిథిలాలు రెండేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎమ్హెచ్ 370 విమానానివే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మలేషియా రవాణా శాఖ మంత్రి లీవో టింగ్ లాయి గురువారం మాట్లాడుతూ.... సదరు విమాన శిథిలాలను అంతర్జాతీయ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు. అవి గల్లంతైన ఎమ్హెచ్ 370 విమాన శిథిలాలేనని వారు పేర్కొన్నారని తెలిపారు. అలాగే ఈ శిథిలాలను దాదాపు 13 దర్యాప్తు బృందాలు పరిశీలించాయని కూడా తెలిపారు. ఈ ఏడాది మార్చిలో మొజాంబిక్‌లో దొరికిన శిథిలాలను పరిశీలించగా అవి ఎమ్హెచ్ 370 విమానంకు చెందినవే గుర్తించినట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో దొరికిన ఇంజన్‌లోని పరికరంపై రోల్స్ రాయిస్ సంస్థ గుర్తు ఉందని.... అలాగే రోడ్రిగస్ ద్వీపంలో విమాన క్యాబిన్‌లోని అంతర్గత ప్యానల్ ముక్క దొరికిందని మంత్రి లీవో గుర్తు చేశారు. ఆ రెండు శిథిలాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. ఈ మేరకు మలేషియాన్ స్టార్ వెల్లడించింది. 2014 మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... నాటి నుంచి ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన సంగతి తెలిసిందే. -
కౌలాలంపూర్‌లో ‘ఎంఎస్ఎంఈ’ ట్రేడ్ ఫెయిర్
హైదరాబాద్: చిన్న సంస్థలకు సంబంధించి ఈ ఏడాది జూన్‌లో కౌలాలంపూర్ (మలేషియా), జొహానెస్బర్గ్ (దక్షిణాఫ్రికా)ల్లో జరిగే 2 అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్స్లో జరగనున్నట్లు చిన్న, మధ్యతరహా సంస్థల శాఖ డెవలప్మెంట్ విభా గం తెలిపింది. వీటిలో పాల్గొనదల్చుకునే సంస్థలు కౌలాలంపూర్ ఫెయిర్ కోసం ఏప్రిల్ 29లోగా, జొహానెస్బర్గ్ ఫెయిర్ కోసం మే 11లోగా దర ఖాస్తు చేసుకోవాలని ఎంఎస్ఎంఈ-డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ డి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. సదరు ఎంఎస్ఈలకు విమాన చార్జీలు, స్టాల్ వ్యయాలను గరిష్టంగా రూ. 1.25 లక్షల దాకా ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని ఒక ప్రకటనలో వివరించారు. -
ఆ విమాన శిథిలాలు అక్కడే దొరకవచ్చు !
వాషింగ్టన్ : రెండేళ్ల క్రితం ఆదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన శకలాలు పశ్చిమ ఆఫ్రికా తీరంలో దొరికే అవకాశం ఉందని ఎన్బీసీ వార్తా సంస్థ గురువారం వాషింగ్టన్లో తన నివేదికలో వెల్లడించింది. ఆ విమాన శకలాలు ముంజాబిక్, మెడాగస్కర్ మధ్య లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సదరు ప్రాంతంలో ఆ విమానానికి సంబంధించిన శిథిలాలకు సంబంధించిన చిత్రాలను యూఎస్, మలేషియా, ఆస్ట్రేలియాన్ నావికులు గుర్తించినట్లు తెలిపింది. ఇదే ప్రాంతంలో ఎంహెచ్ 370 కి చెందిన పోడవైన విభాగంకు చెందిన వస్తువును ఎన్బీసీ పేర్కొంది. అయితే ఈ నివేదికను రాయిటర్స్ మాత్రం ధృవపరచలేదు. మొజాంబిక్ అధికారులు కూడా సదరు ప్రాంతాంలో విమాన శిథిలాలు దొరికినట్లు సమాచారం లేదని ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. 2014 మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ దొరకలేదు. దీంతో అదృశ్యమైన విమానం మిస్టరీ ఎప్పటికీ వీడేనో. -
డ్రీమ్‌లైనర్ విమానం.. మళ్లీ తుస్!
డ్రీమ్ లైనర్ విమానంలో మళ్లీ సమస్య తలెత్తింది. జపాన్ డ్రీమ్‌లైనర్ విమానం ఇంజన్ వేడెక్కడంతో కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన విమానం.. గంటలోపే వెనక్కి తిరిగి వచ్చేసింది. ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అనేక ఇబ్బందులను చవిచూస్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ తాజా ఘటనలతో మరో సమస్యలో పడినట్లు జపనీస్ ఎయిర్ లైన్స్ చెబుతోంది. కుడి ఇంజన్లో సమస్య వచ్చే సమయానికి విమానంలో 203 మంది ప్రయాణికులతో పాటు, 11 మంది సిబ్బంది ఉన్నారు. ఉదయం 8 గంటలకు కౌలాలంపూర్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం ఇంజన్ తీవ్రంగా వేడెక్కడంతో అప్రమత్తమైన సిబ్బంది.. 9.30 గంటల ప్రాంతంలో కౌలాలంపూర్‌లో మళ్లీ ల్యాండ్ చేశారని అధికారులు తెలియజేశారు. ప్రమాదాన్ని గుర్తించి అత్యవసరంగా దింపేయడంతో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, పెద్ద ముప్పు తప్పిందని తెలిపారు. మధ్యాహ్నం 3.15 గంటలకు విమానం నరితా ఎయిర్ పోర్టుకు చేరాల్సి ఉండగా.. ఉన్నట్లుండి విమానంలోని కుడి ఇంజన్లో ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో గుర్తించిన సిబ్బంది విమానాన్ని వెనక్కి తిప్పాల్సివచ్చిందని ఎయిర్ వేస్ ప్రతినిధి షోచిరో హోరీ తెలిపారు. అయితే అత్యధిక వేడి సమస్య ఎందుకు తలెత్తిందన్న విషయంపై విచారిస్తున్నట్లు తెలిపారు. ఇంధన వాడకాన్ని తగ్గించడంలో భాగంగా తేలికైన మిశ్రమ పదార్థాలతో డ్రీమ్ లైనర్ విమానాలను తయారు చేశారు. అభివృద్ధి దశలో వచ్చిన అనేక సమస్యలను దాటి ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ) 2011లో తొలి వాణిజ్య విమానాన్ని పరిచయం చేసింది. అనంతరం 2013లో డ్రీమ్‌లైనర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక విద్యుత్ సమస్య తలెత్తింది. సంవత్సరం మొదట్లో బ్యాటరీ సమస్యతో అనేక విమానాల్లో సమస్యలు తెలత్తగా, ఒక విమానం బ్యాటరీ వేడెక్కడంతో అగ్నిప్రమాదం కూడా సంభవించింది. దీంతో లోపాలను సరిదిద్దేందుకు ఓ పక్క ప్రయత్నాలు జరుగుతుండగా తాజాగా కౌలాలంపూర్ విమానం ఘటన వెలుగుచూసింది. -
కౌలాలంపూర్ పోలీస్ బాస్‌గా భారత సంతతి పౌరుడు
కౌలాలంపూర్: మలేషియాలో భారత సంతతి పౌరుడికి అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతి సిక్కు పోలీసు అధికారి అమర్ సింగ్ కౌలాలంపూర్ కమిషనర్ ఆఫ్ పోలీసు చీఫ్ గా నియామకం అయ్యారు. తాజుద్దీన్ మహ్మద్ అనే పోలీసు అధికారి స్థానంలో అమర్ సింగ్ అనే భారత సంతతి పౌరుడు కొనసాగనున్నారు. తాజుద్దీన్ మహ్మద్ సీఐడీలోని వాణిజ్య విభాగ డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో భారత సంతతి పౌరుడికి ఈ అవకాశం దక్కింది. గతంలో ఈ పోస్టుకు ఇదే సిక్కు మతానికి చెందిన సంతోఖ్ సింగ్ అనే వ్యక్తి ఎంపికయ్యారు. అమర్ సింగ్ తండ్రి, తాత కూడా పోలీసు అధికారులే. అమర్ తండ్రి ఇషార్ సింగ్ 1939లో మాలే స్టేట్ పోలీసు విభాగంలో చేరారు. -
ఉగ్రవాదిలాగా మహిళపై దూకి..
కౌలాలంపూర్: ఉగ్రవాద భావజాలంలో మునిగిపోయిన పదహారేళ్ల యువకుడు మలేసియాలో హల్ చల్ చేశాడు. కాసేపు పోలీసు అధికారులకు ముచ్చెమటలు పట్టించాడు. ఓ మహిళపైకి దూకి ఆమె గొంతుపై కత్తిపెట్టి చీరేస్తానని బెదిరిస్తూ ఆమె గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. చివరకు ఏదోలా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద భావజాలంపట్ల ప్రేరేపితుడైన ఓ 16 ఏళ్ల యువకుడు కెదాహ్ రాష్ట్రంలోని సుంగాయ్ పఠానీలోగల మార్కెట్ వద్ద చేతిలో కత్తి తీసుకొని నేరుగా వెళ్లి ఓ మహిళ గొంతుకు పెట్టి బెదిరించాడు. ఆమెను జిహాదీ జాన్ లాగా తాను కూడా చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంతో కష్టపడి ఆ మహిళకు హానీ జరగకుండా ఆ యువకుడిని అరెస్టు చేశారు. అతడి పూర్వపరాలు పరిశీలించగా తరుచుగా సోషల్ మీడియాలో ఉగ్రవాదులకు సంబంధించిన అంశాలను శోధించాడని, ఇస్లామిక్ స్టేట్ ప్రభావంతో తాను కూడా అలాగే చేయగలనని నిరూపించుకునేందుకే ఆ మహిళపై పట్టపగలే ఈ ప్రయోగానికి దిగినట్లు వెల్లడించారు. -
'ఆ విషయంలో మలేషియా భేష్'
-
'ఆ విషయంలో మలేషియా భేష్'
కౌలాలంపూర్: భారత్-మలేషియాలు భద్రత విషయంలో పకడ్బందీగా ఉన్నాయని, ఇరు దేశాల మధ్య రక్షణపరమైన సహకారం ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తీవ్ర వాదాన్ని, జాతి వివక్షతను రూపుమాపడంలో మలేషియా చర్యలు అద్భుతం అన్నారు. ఇస్లాం మత అసలైన విలువలు ఎత్తిచూపడంలో మలేషియా అగ్రభాగాన ఉందన్నారు. మూడు రోజుల ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా మలేషియాలో ఉన్న మోదీ సోమవారం ఉదయం కౌలాలంపూర్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ పుత్రజయ వద్ద మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఆ దేశ సైనికులు గౌరవ వందనం చేశారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ, నజీబ్ మధ్య ముఖ్యంగా రక్షణ, సైబర్ సెక్యూరిటీవంటి అంశాలు చర్చకు రావడమే కాకుండా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మలేషియా సహకారాన్ని కోరారు. భారత్ లో పలు నగరాలను స్మార్ట్ సిటీలుగా మర్చనున్న నేపథ్యంలో వాటి నిర్మాణం కోసం సహకారం అందించాలని కూడా మోదీ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మలేషియా విద్యార్థులు భారత్ లో చదువుకునేందుకు రావాల్సిందిగా కూడా ఆహ్వానించారు. తోరణ గేట్ ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని నజీబ్ కలిసి లిటిల్ ఇండియాగా భావించే కౌలాలంపూర్ లో తోరణ గేట్ ను ప్రారంభించారు. భారత స్మృతి చిహ్నం సాంఛీ స్తూపాన్ని పోలి ఉండేలా దీనిని నిర్మించారు. 2010 దీని నిర్మాణంపై ప్రకటన చేసి పూర్తిగా భారత్ నిధులతో దీనిని నిర్మించారు. దీని ప్రారంభానికి మోదీ వచ్చిన సందర్భంగా అక్కడి భారతీయులు, మలేషియా పౌరులు భారీ సంఖ్యలో ఉత్సాహంతో పాల్గొన్నారు. మోదీని చూసేందుకు పోటీపడ్డారు. తోరణ గేట్ ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇది కేవలం రాతి కట్టడం మాత్రేమే కాదని ఇరు దేశాలకు సంస్కృతికి ప్రతిబింబం అని కొనియాడారు. తోరణ గేట్ ను ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. -
మోదీకి ఆత్మీయ స్వాగతం
కౌలాలంపూర్: ప్రధాని నరేంద్రమోదీకి మలేషియాలో ఘన స్వాగతం లభించింది. ఆగ్నేయాసియాలో మూడో రోజు పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఉదయం మలేషియాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ పుత్రజయ వద్ద మోదీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆ దేశ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. నిన్న (ఆదివారం) మోదీ 13వ ఏషియాన్ -ఇండియా, పదోవ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. సోమవారం మోదీ, నజీబ్ మధ్య ద్వైపాక్షి చర్చలు, ఇరు దేశాల మధ్య వర్తక సంబంధమైన అంశాలు చర్చకు రానున్నాయి. -
లీ, అబేలతో మోదీ భేటీ
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చైనా, జపాన్, మలేసియా సహా పలు దేశాధినేతలతో వరుస భేటీలు జరిపారు. ఆర్థిక పురోగతిలో మందగమనం, వాతావరణ మార్పులు, తీవ్రవాదంపై పోరాటం వంటి కీలక అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రధాని లీ కిక్వింగ్ తో చర్చించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ దానిని అధిగమించగలిగిందని లీ కిక్వింగ్ అన్నారు. త్వరలో పారిస్ లో జరగనున్న కాప్ దేశాల సదస్సుపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. సౌరశక్తి వంటి సాంప్రదాయేతల ఇంధన వనరులపై భారత్ దృష్టిసారించిన దరిమిలా ఆమేరకు చైనా కూడా తోడ్పాటును అందించాలని మోదీ కోరగా, అందుకు లీ అంగీకరించారు. భారత్ లో పెట్టుపడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని లీ తెలిపారు. మరికొన్ని ద్వైపాక్షిక అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇక జపాన్ ప్రధాని షింజో అబే.. భారత ప్రధాని మోదీకి విందు ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం వీరిద్దరూ కలిసి లంచ్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరుదేశాల అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమంటూ షింజో గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన మోదీ.. ఇండియాలో పర్యటించాల్సిందిగా షింజోను ఆహ్వానించారు. -
ఆకాశంలో ఈత మార్గం..
రెండు ఆకాశహర్మ్యాలను కలుపుతూ మధ్యలో బ్రిడ్జి ఉండటం కొత్తేమీ కాదు. కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ ట్విన్ టవర్లను కలుపుతూ 41, 42 అంతస్తుల్లో ఇలాంటి బ్రిడ్జి విఖ్యాతి చెందింది కూడా. అయితే లండన్‌లోని నైన్ ఎల్మ్స్ జిల్లాలో మాత్రం కొత్త బ్రిడ్జి రాబోతోంది. ఒక భవనం నుంచి మరో భవనానికి వెళ్లాలంటే ఈత కొట్టాల్సిందే. ఎందుకంటే... రెండు పదంతస్తుల భవనాలను కలుపుతూ ఏకంగా ఓ స్విమ్మింగ్ పూల్‌ను నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా గాజుతో ఉంటుంది. అంటే అందులో ఈతకు దిగిన వారికి కిందనున్నవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. 90 అడుగుల పొడవు, 4 అడుగుల లోతు ఉండే ఈ స్విమ్మింగ్‌పూల్ నుంచి చూస్తే బ్రిటన్ పార్లమెంటు భవనం ఏరియల్ వ్యూ అద్భుతంగా కనిపిస్తుందట! -
మలేసియాలో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
కౌలాలంపూర్: ఇస్లామిక్ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం మలేసియాలో అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఖలీద్ అబు బాకర్ వెల్లడించారు. నగరంలో జూలై 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపిన తనిఖీలలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అరెస్ట్ చేసిన సదరు వ్యక్తులను వేర్వేరు ప్రాంతాలలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరి మలేసియాలో విధ్వంసం సృష్టించడానికి కౌలాలంపూర్తోపాటు పక్కనే ఉన్న సెలంగార్ రాష్ట్రంలో పలుమార్లు సమావేశమైనట్లు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలలో విధ్వంసం సృష్టించడానికి యూరప్‌లోని ఐఎస్ తీవ్రవాదుల నుంచి వారిలో ఒకరికి సంకేతాలు అందాయన్నారు. సిరియాలో ఆ తీవ్రవాద సంస్థలోని సీనియర్ సభ్యులతో వీరు మలేసియాలో దాడి చేసేందుకు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని ఖలీద్ అబు బాకర్ తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో ఒకరికి 28 ఏళ్ల, మరోకరికి 31 ఏళ్లు ఉంటాయని చెప్పారు. -
'ఆ విమానం' గాలింపు నిలిపివేస్తాం !
సిడ్నీ: 239 మంది ప్రయాణికులు... విమాన సిబ్బందితో మలేసియా నుంచి బయలుదేరిన ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యం మిస్టరీ ఛేదించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. దీంతో విమాన ఆచూకీ ప్రయత్నాలు విరమించే యోచనలో ఉన్నట్లు ఆస్ట్రేలియాలోని జాయింట్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ సెంటర్ (జేఏసీసీ) గురువారం ప్రకటించింది. వచ్చే ఏడాది అంటే 2016 ఏడాది మొదట్లో గాలింపు చర్యలు నిలిపివేస్తామని వెల్లడించింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామో కూడా జేఏసీసీ వివరించింది. గాలింపు చర్యలు కఠినతరంగా ఉందని అలాగే ఖర్చు మరింత పెరిగిందని పేర్కొంది. విమానం కోసం లక్షా ఇరవై వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టామని... అందుకు సంబంధించిన చిన్న సమాచారం ఇప్పటి వరకు లభించలేదని విశదీకరించింది. అలాగే మలేసియా, చైనా, ఆస్ట్రేలియా పరిధిలో నేటి వరకు చేపట్టిన గాలింపు చర్యలను సంగతి ఈ సందర్భంగా జేఏసీసీ గుర్తు చేసింది. అయితే 2016 ఏడాది మొదట్లో ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ తెలుసుకుంటామని జేఏసీసీ ఆశాభావం వ్యక్తం చేసింది. విమాన ఆచూకీ కోసం ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 80 మిలియన్ డాలర్లు... మలేసియా 45 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని తెలిపింది. సముద్రంలో చలికాలంలో గాలింపు చర్యలకు ఎదురవుతున్న అవరోధాలను ఈ సందర్భంగా సోదాహరణగా వివరించింది. అలాగే విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత వేగవంతం చేస్తామని జేఏసీసీ స్పష్టం చేసింది. దాదాపు 50 వేల చదరపు కిలోమీటర్ల మేర సముద్రం అడుగుభాగంలో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేదని తెలిపింది. అయితే ఎమ్హెచ్ 370 విమానంలోని మొత్తం ప్రయాణికులు మరణించారని... వారి మృతదేహాలు... విమాన శిథిలాలు దొరికే అవకాశం లేదని మలేసియా ఉన్నతాధికారులు ఈ ఏడాది జనవరిలో వెల్లడించిన సంగతి తెలిసిందే. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం గత ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు ఐదుగురు భారతీయులు, నలుగురు ఫ్రెంచ్ జాతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ విమానం కోసం 'గుప్పెడు మనస్సు' ఆరాటం
ఇంటి నుంచి గడప దాటి బయటకు వెళ్లిన వారు... గమ్యస్థానానికి చేరినట్లు వారి నుంచి 'ఐ యామ్ సేఫ్' అంటూ ఒక్క ఫోన్ కాల్ లేదా చిన్న ఎస్ఎంఎస్ లేక ఈ మెయిల్ వస్తే చాలు మనిషి గుప్పెడు మనసు హమ్మయ్య అంటూ రిలాక్స్ అవుతుంది. ఎందుకు టెన్షన్ ... నాలుగైదు గంటలలో గమ్యస్థానం చేరుకుంటాం... క్షేమంగా వెళ్లి లాభంగా కాదు... క్షేమంగా వెళ్లి ఇంటి్కి క్షేమంగా తిరిగి వస్తాం... ఏ మాత్రం ఆందోళన వద్దంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి... వారిలో కొండంత ధైర్యం నింపి... బై బై అంటూ విమానం ఎక్కారు. ఎయిర్ పోర్ట్‌లో వారికి సెండాఫ్ ఇచ్చి... వారి కుటుంబ సభ్యులు ఆనందంతో ఇంటి ముఖం పట్టారు. వాళ్లు విమానం ఎక్కి నాలుగు గంటలు దాటిందంటూ గడియారం వంక చూశారు. ఓ వైపు గంటల ముల్లు చక్రంలా తిరుగుతుంది. దాని వెంటనే నిముషాల ముల్లు నీ వెంటే నేను అంటూ పోటీ పడి మరీ పరుగులు పడుతోంది. అయితే వెళ్లిన వారు నుంచి చిన్నపాటి సందేశం కూడా రాలేదు... బిజీగా ఉండి ఉంటారని వారికివారు తమ మనసుకు సమాధానం చెప్పుకున్నారు. సెల్ ఫోన్‌కు ఫోన్ చేస్తే .. స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది.. మనసులో ఏదో మూల కీడు శంకిస్తుంది. టెన్షన్ తట్టుకోలే... టీవీ పెట్టారు. మలేసియా నుంచి బీజింగ్ బయలుదేరిన ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యం అంటూ ప్లాష్ న్యూస్ టీవీ స్క్రీన్‌పై కనిపించడం బంధువులకు 'షాక్'. ఇంతకీ విమానం ఏమైంది... తమ వారి ఆచూకీ ఎక్కడ అంటూ కుటుంబీకులు మలేసియా ఎయిర్‌పోర్ట్‌కు పరుగులు పెట్టారు. ఆచూకీ తెలిసిందన్న వార్త కోసం ఒకటి రెండు కాదు దాదాపు నెల రోజులు విమానాశ్రయంలో పడిగాపులు కాశారు. కళ్లు కాయాలు కాసేలా ఎదురు చూశారు. అయినా ఫలితం రాలేదు. విమానం కూలిపోయింది. తీవ్రవాదులు హైజాక్ చేశారంటూ పూకార్లు షికార్లు చేశాయి. దీంతో వారి గుప్పెడంత గుండెలు అవిసిపోయేలా రోదించాయి. విమానం కోసం ప్రపంచదేశాలు ఏకమై గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా ఫలితం శూన్యం. రేపైనా ఆ విమానం ఆచూకీ తెలుస్తుందని ఓ చిన్న ఆశ పెట్టుకుని కళ్లలో వత్తులు వేసుకుని ఏడాదిగా ఎదురు చూస్తునే ఉన్నారు....చూస్తున్నారు కూడా. కాగా 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం సరిగ్గా గత ఏడాది 08-03-2014 మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. కుటుంబసభ్యులు, బంధువులతోనే కాదు ఈ ప్రపంచంతోనే ఆ విమానంలోని ప్రయాణికులు డిస్కనెక్ట్ అయ్యారు. ప్రపంచ చరిత్రలోనే ఇంతమంది ప్రయాణికులతో వెళ్తూ గల్లంతైన విమానంగా ఎమ్హెచ్ 370 ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ విమానం కూలిపోయిందని ఎలా చెబుతారు?
కౌలాలంపూర్: గమ్యస్థానం చేరగానే ఫోన్ చేస్తామని... విమానం ఎక్కారు. బయలుదేరిన కొన్ని నిమిషాలకే ఆ విమానం అదృశ్యమైంది. ఆ వార్త వినగానే ప్రయాణికుల బంధువుల మనస్సుల్లో అలజడి మొదలైంది. అసలు విమానం ఏమైందో నేడు కాకుంటే రేపు అయినా తెలుస్తుందని చిగురంత ఆశతో ఉన్నారు. ఒకటి, రెండు కాదు... ఏకంగా 11 నెలలు అయింది. ఇంతవరకు విమానం కాని బంధువుల జాడ కాని తెలియలేదు. వారంతా ఏమయ్యారో అని సతమతమవుతున్న తరుణంలో విమానం కూలిపోయింది... అందులోని 239 మంది మరణించారని మలేసియా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రకటించడంతో సదరు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.... ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలా కాదు మలేసియా ప్రభుత్వంతో తాడో పేడో తెల్చుకోవాలని భావించారు. అందులోభాగంగా విమాన ప్రమాదంలో ఆచూకీ తెలియకుండా పోయిన చైనాకు చెందిన 21 కుటుంబాలు ఆగమేఘాల మీద శుక్రవారం కౌలాలంపూర్ చేరుకున్నారు. విమానం కూలిపోయిందంటూ చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు మలేసియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విమాన శకలాలు, మృతదేహాలు ఆచూకీ తెలియకుండా ప్రమాదం జరిగిందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. విమాన ప్రమాద వార్తతో తమ కుటుంబాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనుభస్తున్న ఆవేదన మీకు అర్థం కావడం లేదంటూ మలేసియా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విమాన ఆచూకీ కోసం గట్టి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. విమానం అదృశ్యమైన ప్రాంతంలో గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని మలేసియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం గత ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
విమాన ఆచూకీ కోసం స్పీడ్ పెంచిన మలేసియా
కౌలాలంపూర్: గతేడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అందుకోసం నాలుగు నౌకలు రంగంలోకి దింపినట్లు మలేసియా రవాణా శాఖ మంత్రి లియోవ్ టియాంగో లాయి గురువారం వెల్లడించారు. విమానం ఆదృశ్యమైన ప్రాంతం... దక్షిణ బంగాళఖాతంలో నౌకలు అణువణువు శోధన చేస్తున్నాయని తెలిపారు. ఓ నౌక మంగళవారమే గల్లంతైన విమానాన్ని శోధించేందుకు రంగంలోకి దిగిందని పేర్కొన్నారు. అయితే ఎమ్హెచ్ 370 అదృశ్యమై దాదాపు ఏడాది కావస్తున్న ఇప్పటి వరకు ఆచూకీ కనుగొనక పోవడంపై సదరు విమాన ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మలేసియా ప్రభుత్వంపై ఇప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న సంగతి తెలిసిందే. ఎమ్హెచ్ 370 విమానం కోసం ప్రార్థన చేస్తున్నాం అనే అక్షరాలు గల ఏరుపు రంగు టీ షర్ట్ ధరించి.. తెల్లని టోపి పెట్టుకుని గల్లంతైన వారి బంధువులు 15 మంది మంగళవారం పౌర విమానయాన శాఖ కార్యాలయం ఎదుట నిలబడ్డారు. ఈ ప్రమాదం నిన్న వారికి జరిగింది. నేడు, రేపో మీలో మాలో ఎవరో ఒకరికి ఇదే సంఘటన ఎదురు కావచ్చు' అంటూ రాసిన ప్లకార్డులు వారు చేతిలో పట్టుకున్నారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. ఎమ్హెచ్ 370 ప్రమాదానికి గురైందని మలేసియా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అధికారికంగా ప్రకటించడంతో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ విమానంలో 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ విమాన ఆచూకీ కోసం గాలింపు చేపట్టండి ... ప్లీజ్
బీజింగ్: గతేడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం ప్రమాదానికి గురైందని ... ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 239 మంది ప్రయాణికులు మరణించారని మలేసియా ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాద ఘటనపై చైనా ప్రభుత్వం శుక్రవారం స్పందించింది. విమాన ఆచూకీ కనుగొనేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని మలేసియా ప్రభుత్వానికి చైనా ప్రధాని లీ కెకియాంగ్ విజ్ఞప్తి చేశారు. విమాన ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బంగాళాఖాతంలో దాదాపు 60 వేల చదరపు కిలోమీటర్లు మేర ప్రపంచ దేశాల సహాయంతో విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయిందని లీ కెకియాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వం ఇంకా గాలింపు చర్యలు జరుపుతూనే ఉందని గుర్తు చేశారు. మలేసియా కూడా గాలింపు చర్యల చేపడితే విమాన జాడ కనుక్కోవచ్చని చైనా ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో ఫ్రెంచ్ ప్రధాని ఎం వాల్స్ కూడా పాల్గొన్నారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. విమానం ఎమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం తెలియక సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు. విమాన ఆచూకీ కనుగోనడంలో విఫలమైందంటూ వారు మలేసియా ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఎమ్హెచ్ 370 ప్రమాదానికి గురైందని మలేసియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ విమానంలో 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ నుంచి ఫ్లై త్రూ: ఎయిర్ఏషియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమాన సేవల సంస్థ ఎయిర్ ఏషియా ఫ్లై త్రూ సేవలను హైదరాబాద్‌కూ విస్తరించింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించొచ్చు. ఫ్లై త్రూ ప్రయాణికులకు కౌలాలంపూర్‌లో అదనపు చెక్ ఇన్ ఉండదు. ట్రాన్సిట్ వీసా తీసుకోనక్కరలేదు. లగేజీని గమ్యస్థానానికి చేరుకున్నాకే తీసుకోవచ్చు. బ్రూనే, హాంగ్‌కాంగ్, జకార్తా, సింగపూర్, హోచిమిన్, గోల్డ్‌కోస్ట్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీ తదితర నగరాలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించొచ్చని ఎయిర్ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీగ్ట్రాండ్ టెహ్ తెలిపారు. -
6 నెలలు గడచినా.. జాడలేని 'ఎంహెచ్ 370'
కౌలాలంపూర్: మలేసియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమై ఆరు నెలలు పూర్తయినా ఇంకా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఈ విమానం కోసం విస్తృతంగా గాలించినా ఒక్క ఆధారం కూడా కనుగొనలేకపోయారని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. గత మార్చి 8న 239 ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన ఎంహెచ్ 370 విమానం గల్లంతయిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత సాంకేతాలు అందుకుండా పోయాయి. విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సముద్రంలో గాలించినా ఇప్పటికీ జాడ తెలుసుకోలేకపోయారు. బాధితుల కుటుంబ సభ్యులు ప్రమాదం గురించి తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. -
'ఎంహెచ్ 370' బాధితుల సొమ్ము చోరీ
కౌలాలంపూర్: ఎంహెచ్ 370 విమాన ప్రమాద బాధితుల సొమ్ము నొక్కేసిన మలేసియా బ్యాంకు అధికారి, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చోరీతో సంబంధమున్న పాకిస్థాన్ వ్యక్తిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. బ్యాంకు అధికారి, ఆమె భర్త విమాన ప్రమాద బాధితుల బ్యాంకు ఖాతా నుంచి 34,850 డాలర్లు కాజేసినట్టు అధికారులు గుర్తించారు. ఇద్దరు మలేసియా, మరో ఇద్దరు చైనా బాధితుల ఖాతాల నుంచి వీరు డబ్బు తీసుకున్నట్టు గుర్తించారు. మలేసియా సీఐడీ అధికారులు వీరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. వీరికి ఆదివారం వరకు రిమాండ్ విధించారు. అరెస్టైన బ్యాంకు ఉద్యోగిని పదేళ్లుగా ఓ పేరులేని బ్యాంకులో పనిచేస్తుండగా, ఆమె భర్త అంపాంగ్ లో మెకానిక్ పనిచేస్తున్నాడని అధికారులు వెల్లడించారు. -
త్రీ ఇన్ వన్ అద్భుతం
సింగపూర్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీస్.. ఆసియాలోనే క్లీనెస్ట్ సిటీగా పేరుపొందిన దేశం సింగపూర్. అలాంటి దేశాన్ని ఒక్కసారన్నా చూడాలన్న కోరిక ఇటీవలే తీరింది. మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న మా మిత్రుణ్ణి కలవడానికి ముగ్గురు స్నేహితులం కలిసి 12 రోజులకు టూర్ ప్లాన్ చేసుకున్నాం. కౌలాలంపూర్ నుంచి సింగపూర్ వెళ్లాలనేది మా ప్లాన్. ముందుగా చెన్నై నుంచి కౌలాంపూర్ వెళ్లి, తిరిగి చెన్నై రావడానికి మూడు నెలల ముందు ఆఫర్లో బుక్ చేసుకుంటే రూ.14 వేల రూపాయలకు టికెట్ లభించింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఏషియా విమానమెక్కి కౌలాలంపూర్ చేరుకున్నాం. స్నేహితుణ్ణి కలిసి, అటు నుంచి కౌలాలంపూర్ నుండి సింగపూర్ బయల్దేరాం. సింగపూర్‌కు విమానాలు, ఓడల సదుపాయాలు ఉన్నాయి. అయినా మేం రోడ్డు మార్గాన్నే ఎంచుకున్నాం. కౌలాలంపూర్ - సింగపూర్: మా స్నేహితుడు ముందుగా బుక్ చేసిన డబుల్ డెక్కర్ బస్సులో (రూ. 4 వేలు ఒక్కొక్కరికి) కౌలాలంపూర్ నుంచి సింగపూర్‌కి చేరుకున్నాం. ఎటు చూసినా ఎత్తై బిల్డింగ్లు అబ్బురపరుస్తూ ఆహ్వానం పలికాయి. ఆస్ట్రేలియా, చైనా, న్యూజిలాండ్, ఇండియా.. దేశాలకు సింగపూర్ అతి పెద్ద జంక్షన్. సింగపూర్ సిటీ నుంచి లోకల్ ట్రైన్లో ‘సెంటోసా ఐలాండ్’కి బయల్దేరాం. అబ్బురపరిచే ట్రాఫిక్ వ్యవస్థ... దారంతటా విశాలమైన రోడ్లు, పకడ్బందీగా ఉండే సిగ్నలింగ్ వ్యవస్థ, పౌరుల క్రమశిక్షణ.. మెచ్చుకోకుండా ఉండలేం. వెహికిల్స్ అన్నీ క్రమప్ధతిలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసినట్లుగా వెళుతుండటం చూసి ముచ్చటేసింది. ఇక్కడ మన బడ్జెట్‌కు అనుగుణంగా మూడు రకాల టాక్సీలు అందుబాటులో ఉంటాయి. పర్యాటకుల సందడి సెంటోసా ఐలాండ్: నగరంలోని ఆకాశ హర్మ్యాలను తిలకిస్తూ ‘సెంటోసా ఐలాండ్’కు చేరుకున్నాం. అందమైన దీవులు ఈ దేశపు స్పెషల్ అట్రాక్షన్. అన్ని వయసుల వారిని అలరించేలా రకరకాల గేమ్స్ ఉంటాయిక్కడ. ఒకే షెల్టర్ కింద వేలాదిమంది క్యాసినో ఆడుతూ కనిపిస్తారు. ఇక్కడ జరిగే గాంబ్లింగ్ అంతా చట్టబద్ధం కావడంతో ఎలాంటి మోసాలకు తావుండదు. మేమూ కాసేపు క్యాసినో ఆడి, సరదా తీర్చుకున్నాం. సెంటోసా ఐలాండ్ క్యాంపస్‌లోనే గల యూనివర్సల్ స్టూడియో ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. సింగపూర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇదో ముఖ్యమైన స్టూడియో. ‘సెంటోసా ఐలాండ్’లో మిస్ కాకుండా చూడాల్సినది ఈవెంట్ లేజర్ షో. సముద్రపు ఒడ్డున ఏర్పాటు చేసిన సెట్లో జరిగే ఈ షో చూసి తీరాల్సిందే. లిటిల్ ఇండియా: సింగపూర్ పొరుగు దేశం కావడం వల్ల ఇండియా ప్రభావం ఇక్కడ చాలా ఎక్కువ. ఇక్కడ తమిళియన్స్ పెద్దసంఖ్యలో సెటిల్ అయ్యారు. సింగపూర్‌లోని ఏ ప్రాంతానికి వెళ్లినా వీళ్ళు కనిపిస్తారు. ఇండియా నుంచి వెళ్లినవారు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ‘లిటిల్ ఇండియా’ అని పిలుస్తారు. అక్కడి వాతావరణం చూస్తే మనం ఉన్నది సింగపూర్లోనేనా అన్న అనుమానం కలుగుతుంది. ముస్తఫా షాపింగ్ మాల్: షాపింగ్ అంటే ఆసక్తి ఉన్న పర్యాటకులకు సింగపూర్ స్వర్గధామం. సింగపూర్‌లో షాపింగ్ చేయాల్సిన ప్రదేశాల్లో ‘ముస్తాఫా షాపింగ్ మాల్’ ఒకటి. ఇక్కడ గుండుసూది నుంచి ఫర్నీచర్ వరకు అన్నీ లభ్యమవుతాయి. ఈ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ప్రతిరోజూ 24 గంటలు ఈ షాపింగ్‌మాల్ పనిచేస్తూనే ఉంటుంది. మూడురోజులు సింగపూర్‌లో ఉండి, తిరిగి కౌలాలంపూర్ చేరుకున్నాం. అటు నుంచి ఫిబ్రవరి 8న చెన్నై, అటు నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చాం. ఒక దేశం, ఒక ద్వీపం, ఒక నగరం.. ఈ మూడూ ఎలా ఉంటాయో చూడాలనుకుంటే ఒక్క సింగపూర్‌ని చూస్తే చాలు. ఈ మూడింటిని చూసిన అనుభూతి ఏకకాలంలో కలుగుతుంది. - కె.ప్రేమ్‌కుమార్, హైదరాబాద్ -
వృద్ధురాలి నుంచి రెండున్నర కిలోల బంగారం స్వాధీనం
చెన్నై: మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని తరలిస్తున్న అరవై ఏళ్ల మహిళను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. కౌలాలంపూర్ నుంచి సోమవారం తెల్లవారుజామున చెన్నైకు ఓ విమానం చేరుకుంది. అందులోని ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. ఆ సమయంలో ఓ మహిళ హాండ్‌బ్యాగ్‌ను, సూట్‌కేసును తనిఖీలు చేయగా ఏమీ లభించలేదు. అయితే ఆమె ధరించిన దుస్తుల పట్ల అధికారులకు అనుమానం వేసింది. ఆమెను ప్రత్యేక గదికి తీసుకువెళ్లి మహిళా అధికారులు తనిఖీలు జరపగా లోదుస్తుల్లో బంగారాన్ని దాచినట్లు తెలిసింది. ఆమె వద్ద జరిపిన విచారణలో దిరేష్ సెల్వరాణి (60) అని, విరుదునగర్‌కు చెందినదని తెలిసింది. ఆమె వద్ద రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ అంతర్జాతీయ స్థాయిలో రూ.85 లక్షలు. దిరేష్ సెల్వరాణిని అధికారులు అరెస్టు చేశారు. ఈమెకు స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. విదేశాల నుంచి 60 ఏళ్ల మహిళ బంగారాన్ని అక్రమంగా తరలించడం విమానాశ్రయంలో సంచలనం కలిగించింది. -
370... 130... 17
అదేంటో గాని మలేషియా ఎయిర్ లైన్స్ విమానాలని ప్రమాదాలు నిడలా వెంటాడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం మన జ్ఞాపకాల దొంతర నుంచి చెరిగిపోక మునుపే గురువారం సాయంత్రం ఎమ్హెచ్ 17 విమానం కుప్పకూలింది. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విమానంలోని మృతుల్లో అత్యధికులు అంటే సగానికి సగం మంది డచ్ దేశానికి చెందిన వారే ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ దొరకలేదు. దాంతో తమ బంధువుల ఆచూకీ తెలుసుకోవడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమాన ప్రయాణికుల బంధువులు స్నేహితులు మలేషియా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. మలేషియా ప్రభుత్వానికి ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ కనుగోవడం పెద్ద తల నొప్పిగా తయారైంది. అంతలో నిన్న సాయంత్రం మరో విమానం ప్రమాదం జరగడంతో మలేషియా ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ రెండు విమాన ప్రమాదాలు కేవలం 130 రోజులు తేడాలో జరిగాయి. -
విమానం ఏమైందో... ఆచూకీ తెలిసే వరకు...
ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన విమానం ఏమైందో అర్థంకావడం లేదని... అయితే ఆ విమానం జాడ కనుగొనే వరకు విశ్రమించేది లేదని మలేషియా ప్రభుత్వం స్సష్టం చేసింది. విమానం అదృశ్యమై వంద రోజులు పూరైన సందర్బంగా ఆ దేశ ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ఈ మేరకు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల అదృశ్యంతో వారి బంధువులు తీవ్ర వేదనతో చెందుతున్నారని.... ఆ విషయాన్ని తమ ప్రభుత్వం మనస్పూర్తిగా అర్థం చేసుకుందని ఆ దేశ రవాణశాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ వివరించారు. అయితే విమానం అదృశ్యమై ఇంత కాలమైన తమ బంధువులు ఏమైయ్యారో అర్థం కావడం లేదని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మలేషియా విమానం జాడ కనుక్కోవడం మలేషియా ప్రభుత్వ తీవ్ర వైఫల్యమేనని ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన 227 మంది ప్రయాణికులు... 12 మంది సిబ్బందితో మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విమానం చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. అయితే కొన్ని గంటల వ్యవధిలో ఆ విమానం మలేషియా ఎయిర్పోర్ట్ ఏటీసీతో ఉన్న సంబంధాలు తెగిపోయాయి. అనాటి నుంచి జాడ తెలియకుండా పోయిన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దాంతో విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ విమాన ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయు ఉన్న విషయం విదితమే. -
వచ్చే ఏడాదిలోనే 'మలేషియా విమానం' ఆచూకీ
అదృశ్యమైన మలేషియా విమానం ఆచూకీ తెలుసుకోవాలంటే మరింత సమయం పట్టనుందా అంటే అవుననే అంటున్నారు ఆ దేశ ఉన్నతాధికారులు. గల్లంతైన విమాన కోసం కనిష్టంగా 8 నుంచి గరిష్టంగా12 నెలలు సమయం పడుతుందని సదరు విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన బృందానికి నాయకత్వం వహించిన రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అన్ఘుస్ హ్యూస్టన్ వెల్లడించారు. శుక్రవారం కౌలాలంపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానం కోసం గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే విమాన జాడ కనుక్కోవడంలో పూర్తిగా విఫలమైందని ఇప్పటికే విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో హ్యుస్టన్ ప్రకటనతో ప్రయాణికుల బంధువుల ఆగ్రహనికి అగ్నికి అజ్యం పోసినట్లు అయింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2014, మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎమ్హెచ్ -370 విమానం బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం వినాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో నాటి నుంచి విమాన ఆచూకీ కోసం చైనా, బీజింగ్, అమెరికా, భారత్‌తో పాటు పలుదేశాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయిన ఇప్పటికి ఆ విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో విమానం జాడ కనుగోనడంలో మలేసియా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రయాణికుల బంధువులతో పాటు స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదృశ్యమైన విమానంలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్న విషయం విదితమే. -
మలేషియా విమాన ఘటనలో కుట్రకోణం?
మలేషియా నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానాన్ని ఉన్నట్టుండి ఎందుకు ఎమర్జెన్సీ లాండింగ్ చేయాల్సి వచ్చింది? 166 మందితో వెళ్తున్న ఆ విమానాన్ని కిందకు దింపడం వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా? ఈ అనుమానాలన్నీ ఇప్పుడు మలేషియా పోలీసులకు వచ్చాయి. అందుకే వాళ్లు ఈ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. టైరు పేలిపోవడం, ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్192 విమానాన్ని అత్యవసరంగా దించేసిన విషయం తెలిసిందే. విమానం బయల్దేరేసరికి అందులో ఎవరైనా కుట్రదారులు ఉన్నారేమో దర్యాప్తు చేస్తున్నట్లు ఐజీపీ ఖాలిద్ అబూ బకర్ తెలిపారు. ఈ విషయమై మలేషియా రవాణా శాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ ఫోన్ చేసి అడగడంతో ఈ విషయం తెలిపారు. 159 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో కౌలాలంపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న బోయింగ్ 737-800 విమానాన్ని అత్యవసరంగా దించారు. టేకాఫ్ తీసుకునే సమయంలో కుడివైపు ఒక టైరు పేలిపోవడం, ప్రధాన ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్లే ఇలా దించాల్సి వచ్చిందని మలేషియా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. టైరుకు సంబంధించిన కొన్ని ముక్కలు రన్‌వే మీద కనపడటంతో ఏటీసీ నుంచి విమాన కెప్టెన్‌కు హెచ్చరిక సందేశం వెళ్లింది. భద్రత దృష్ట్యా వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పాల్సి వచ్చిందని అంటున్నారు. విమానం వెనక్కి రాగానే మొత్తం 159 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది దిగిపోయారు. ఈ విమానం మళ్లీ మధ్యాహ్నం 3.30 గంటలకు కౌలాలంపూర్ నుంచి బయల్దేరి సాయంత్రం 5 గంటలకు బెంగళూరు వస్తుంది. -
మలేషియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం
న్యూఢిల్లీ : మలేషియాకు చెందిన మరో విమానానికి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. కౌలాలంపూర్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన కాసేపటికే ఎంహెచ్ 192 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని వెంటనే వెనక్కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న 157 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి ఈ విమానం రాత్రి 11:35కు బెంగళూరుకు చేరుకోవాల్సింది. అయితే సాంకేతిక లోపంతో తిరిగి కౌలాలంపూర్లోనే సురక్షితంగా దిగిందని అధికారులు ప్రయాణికుల బంధువులకు సమాచారమిచ్చారు. తమవారు క్షేమంగా ఉన్నారని తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. -
మళ్లీ హామిల్టన్‌కే...
మెర్సిడెస్ డ్రైవర్‌కు వరుసగా రెండో ‘పోల్ పొజిషన్’ నేడు మలేసియా గ్రాండ్‌ప్రి రేసు కౌలాలంపూర్: సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో ఎదురైన చేదు ఫలితాన్ని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వెనక్కినెట్టాడు. రెండో రేసు మలేసియా గ్రాండ్‌ప్రిలో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో దుమ్మురేపాడు. మూడు క్వాలిఫయింగ్ సెషన్స్‌లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకున్న ఈ ప్రపంచ మాజీ చాంపియన్ సీజన్లో వరుసగా రెండోసారి ‘పోల్ పొజిషన్’ను సొంతం చేసుకున్నాడు. చివరిదైన మూడో క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 59.431 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలోనూ ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ తన కారు ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రెండో ల్యాప్‌లోనే వైదొలిగాడు. రెండో రేసులో హామిల్టన్ అదృష్టం ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. హామిల్టన్ మాదిరిగానే తొలి రేసులో వెటెల్‌కు నిరాశ ఎదురైంది. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానం నుంచి... పెరెజ్ 14వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. -
మలేషియా విమాన అన్వేషణలో భారత్
-
విమానం ఆధారం దొరికింది!
హిందూ మహాసముద్రంలో రెండు వస్తువులు ఒకటి విమానం రెక్కలోనిది కావొచ్చని అనుమానం ఆస్ట్రేలియా శాటిలైట్ చిత్రాల్లో వస్తువుల గుర్తింపు తేలాడే వస్తువులు ఉన్న ప్రాంతానికి బయల్దేరిన నిఘా విమానాలు కనుక్కోలేకపోయిన అమెరికా నేవీ విమానం కౌలాలంపూర్/మెల్బోర్న్/న్యూఢిల్లీ: గల్లంతైన మలేసియా బోయింగ్ విమానం జాడ కనుక్కోవడానికి తొలిసారిగా మంచి ఆధారం దొరికింది! దక్షిణ హిందూ మహాసముద్రంలో రెండు భారీ వస్తువులు తేలాడుతూ కనిపించాయి. ఇవి 13 రోజుల కిందట అదృశ్యమైన మలేసియా విమాన శకలాలో, కావో నిర్ధారించేందుకు ఆస్ట్రేలియా సైన్యం నేతృత్వంలో నిఘా విమానాలు గురువారం ఆ ప్రాంతానికి బయల్దేరాయి. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఒకటైన ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి నైరుతి దిశలో 2,500 కి.మీ దూరంలో రెండు తేలాడే వస్తువులను నాలుగు రోజుల కిందట తమ శాటిలైట్ చిత్రాల్లో గుర్తించినట్లు ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. వీటిలో ఒకటి 24 మీటర్లు(80 అడుగులు), మరొకటి ఐదు మీటర్ల(15 అడుగులు) పొడవు ఉంది. పెద్దదాని కొలతను బట్టి అది విమానం రెక్కలో పెద్ద భాగం కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా తమ సైనిక విమానం ఆ వస్తువులు ఎక్కడున్నాయో కనిపెట్టలేకపోయిందని, అయితే మిగతా విమానాలు గాలింపు కొనసాగిస్తాయని, దీనికి సమయం పడుతుందని అస్ట్రేలియా అధికారులు చెప్పారు. బోయింగ్ కోసం ఇంతవరకు దశా, దిశా లేకుండా సాగిన గాలింపులో పలు తప్పుడు ఆధారాలు బయటపడ్డంతో ఈ వస్తువులకు సంబంధించి ముందస్తు నిర్ధారణకు రాకూడదన్నారు. ఇవి వేల మీటర్ల దూరం నుంచి కొట్టుకొచ్చినట్లు కనిపిస్తోందని తెలిపారు. వీటి గుర్తింపు ప్రస్తుతానికి మంచి ఆధారం కావొచ్చని ఆస్ట్రేలియా సముద్ర భద్రతా సంస్థ అధికారి జాన్ యాంగ్ తెలిపారు. అయితే సరుకు రవాణా నౌకల నుంచి అప్పుడప్పుడూ కంటైనర్లు జారి నీటిలో పడుతుంటాయి కనుక ఈ వస్తువులు సముద్రంలో చెత్త అయ్యుండే అవకాశమూ ఉందన్నారు. విశ్వసనీయ ఆధారం: మలేసియా తేలాడే వస్తువుల గురించి ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ గురువారం ఉదయం తమ ప్రధాని నజీబ్ రజాక్‌కు ఫోన్లో తెలిపారని మలేసియా రక్షణ, రవాణా మంత్రి హిషాముద్దీన్ హుసేన్ చెప్పారు. తమకు విశ్వసనీయ ఆధారం దొరికిందని, ధ్రువీకరించడానికి సమయం పడుతుందని అన్నారు. వస్తువులు కనిపించిన ప్రాంతాన్ని గుర్తించేందుకు డేటా మార్కర్ బాల్స్‌ను విమానాల ద్వారా జారవిడవనున్నట్లు చెప్పారు. ఈలోగా దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ, మధ్య ఆసియా వరకు ఉన్న రెండు కారిడార్లలో గాలింపు సాగుతుందన్నారు. వస్తువులున్న చోటికి న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియాల సైనిక విమానాలు, నౌకలు పయనమయ్యాయి. కాగా, వస్తువులు కనిపించిన ప్రాంతంలో గురువారం పొద్దుపోయాక గాలించిన తమ నేవీ నిఘా విమానం ఎలాంటి వస్తువులనూ కనుక్కోలేకపోయిందని అమెరికా తెలిపింది. ఈ ప్రాంతానికి నార్వే నౌక కూడా చేరుకుంది. అక్కడికి మంచును పగలగొట్టే తమ నౌకను పంపాలని చైనా యోచిస్తోంది. మరోపక్క.. విమానాన్ని గాలించేందుకు అండమాన్ సముద్రంలోకి తమ నాలుగు యుద్ధనౌకలను అనుమతించాలన్న చైనా విజ్ఞప్తిని భారత్ తోసిపుచ్చింది. తమ భద్రతా బలగాలు అభ్యంతరం చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాం తంలో భారత నేవీ, వాయుసేనలు ఇప్పటికే గాలిస్తున్న నేపథ్యంలో చైనా వినతిని తోసిపుచ్చారు. గాలింపు కోసం భారత్ భారీ విస్తీర్ణంలో గాలించగల పీ-81, సూపర్ హెర్క్కు లస్ నిఘా విమానాలను రంగంలోకి దింపనుంది. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ఈ నెల 8న ఐదుగురు భారతీయులు సహా 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళ్తూ.. బయల్దేరిన గంటకే అదృశ్యమవడం, దాని ఆచూకీ కోసం 26 దేశాలు గాలిస్తుండడం తెలిసిందే. -
మలేషియా విమానం ప్రమాదానికే గురైందా?
లోహ విహంగం మృత్యు విహంగంగా మారిందా? అదృశ్యమైన మలేషియా విమానం ప్రమాదానికే గురైందా? అందువల్లే ఆ విమానం జాడ గుర్తించడం ఆలస్యమయిందా? విమానంలో ప్రయాణిస్తున్న 239 మంది ప్రయాణికులు మృత్యువాత పడినట్లేనా? ఆస్ట్రేలియా ప్రధాని తాజా వ్యాఖ్యలతో ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాకు సమీపంలోని దక్షిణ హిందూ సముద్ర పరిసరాల్లో విమాన శకలాలను గుర్తించామని, అవి మలేషియా విమానానికి చెందినవి కావొచ్చంటూ ఆస్ట్రేలియా ప్రధాని చేసిన వ్యాఖ్యలు గత అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. మలేషియ విమానం హిందూ మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చంటూ మూడు రోజుల క్రితం కథనాలు వెలువడ్డాయి. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్ వెల్లడించిన తాజా సమాచారం ఈ కథనాలకు బలం చేకూరుస్తున్నాయి. ఒకవేళ దక్షిణ హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో గుర్తించిన శకలాలు మలేషియన్ విమానానివే అయితే... ప్రమాదం జరిగే ఉంటుందని, విమానం కూలిపోవడం వల్లే ఆ ప్రమాదం జరిగి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సముద్రంలో విమానం కూలిపోవడం వల్లే శకలాల గుర్తింపు ఆలస్యం అయిందని పేర్కొంటున్నారు. మరోవైపు... టోనీ అబ్బోట్ తాజా వ్యాఖ్యలు విమాన ప్రయాణికుల కుటుంబాల్లో కలకలం రేపుతున్నాయి. విమానం ఆచూకీ లభించక 13 రోజులు గడిచి పోయినా తమ వారు బతికి ఉండే ఉంటారనుకుంటూ కాస్తో కూస్తో పెట్టుకున్న ఆశలు తాజా సమాచారంతో ఆవిరైపోయినట్లేనని అభిప్రాయపడుతున్నారు. కాగా విమానం మలేసియా, వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంటోల్ సరిహద్దులో ఉన్నప్పుడు అందులోని ట్రాన్స్‌పాండర్‌ను స్విచాఫ్ చేశారు. ఆ తర్వాత విమానం వెనక్కి వెళ్లి, పశ్చిమంగా, వాయవ్య దిశగా వెళ్లింది. ఇవన్నీ అందులోని ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగా చేసిన పనులే. ఈ నెల 7న అర్ధరాత్రి దాటాక 12.41కి బయల్దేరిన విమానం నుంచి 8న ఉదయం 8.11 గంటలకు శాటిలైట్ చివరి సిగ్నల్ అందింది. అంటే విమానం కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోయాక 7 గంటలకు పైగా గాల్లోనే ఉంది. కొత్త విషయాలు తెలుస్తుండడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులపై మళ్లీ విచారణ జరపాల్సిన అవసరముంది. -
మలేషియా విమాన ఆచూకీ లభ్యం !
-
అదృశ్యమైన మలేషియా విమాన శకలాలు గుర్తింపు?
కౌలాలంపూర్ : దాదాపు రెండు వారాలు క్రితం గల్లంతు అయిన మలేషియా విమానం ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. ఎమ్హెచ్-370 విమానం భాగాలు ఆస్ట్రేలియాలో కనిపించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో విమాన శకలాలను పోలిన చిత్రాలను ఉపగ్రహా ఛాయాచిత్రాల ద్వారా గుర్తించామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబ్బోట్ వెల్లడించారు. విమానం గుర్తింపునకు ఉద్దేశించిన ఉపగ్రహాలు రెండు భాగాలను గుర్తించాయని, ఆ శకలాలు ఎమ్హెచ్-370 బోయింగ్ విమానానికి సంబంధించినవి కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మలేషియా ప్రధానికి తెలిపానని చెప్పారు. శకలాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించడానికి ఓ యుద్ధ విమానాన్ని పంపించామని తెలిపిన ఆస్ట్రేలియా ప్రధాని మరో మూడు ఎయిర్క్రాప్ట్లను కూడా పంపించనున్నట్లు వివరించారు. అయితే ఆ ప్రాంతాన్ని గుర్తించే పని చాలా కష్టంతో కూడిన పని అని పేర్కొన్న ఆయన.... ఆ శకలాలు ఎమ్హెచ్-370విమానానివి సంబంధించినవి కాకుండా పోయే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు... విమాన గుర్తింపు ప్రక్రియను అమెరికా, న్యూజీలాండ్‌లు మరింత తీవ్రం చేశాయి. ఆస్ట్రేలియాతో కలిసి విమాన శోధన ప్రక్రియ ముమ్మరం చేసిన యూఎస్, కివీస్‌లు... దక్షిణ హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో తమ అన్వేషణను కొనసాగిస్తున్నాయి. -
21 ఉపగ్రహాలతో జల్లెడ!
మలేసియా విమానం కోసం చైనా గాలింపు కంప్యూటర్ ప్రోగ్రామ్‌తో బోయింగ్‌ను దారి మళ్లించారు! ఐదుగురు భారతీయులు సహా 239 మంది ఉన్న మలేసియా విమానం ఆచూకీ కోసం గాలింపు ముమ్మరమైంది. 11 రోజుల కిందట కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ గల్లంతైన బోయింగ్ జాడ కనుక్కోవడానికి 21 ఉపగ్రహాలను, ఒక రాడార్‌ను రంగంలోకి దింపినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మంగళవారం తెలిపారు. విమాన ప్రయాణికుల్లో అత్యధికంగా 154 మంది తమ దేశీయులే కావడంతో చైనా అన్వేషణను తీవ్రం చేసింది. విమానం కనిపించకుండా పోయిన ఉత్తర కారిడార్ వెంబడి టిబెట్, జింజియాంగ్‌లలో గాలింపు ప్రారంభించామని మలేసియాలోని చైనా రాయబారి తెలిపారు. బోయింగ్ హైజాక్‌కు గురై ఉంటే అందులో తమ దే శీయుల ప్రమేయం ఉండదన్నారు. విమానం తమ ప్రాంతాల మీదుగా కజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌లవైపు వెళ్లలేదని భారత్, పాకిస్థాన్ సహా పలు దేశాలు చెప్పడంతో చైనా, ఇతర దేశాలు ఉత్తర కారిడార్(కజకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ సరిహద్దు నుంచి ఉత్తర థాయ్‌లాండ్ వరకు), దక్షిణ కారిడార్(ఇండోనేసియా నుంచి హిందూ మహాసముద్ర దక్షిణప్రాంతం వరకు)లలో గాలింపు జరుపుతున్నాయి. విమానాన్ని ఉద్దేశపూర్వకంగానే దారి మళ్లించారని మలేసియా ప్రభుత్వం పునరుద్ఘాటించింది. 77 లక్షల చదరపు కి.మీ. విస్తీర్ణంలో 26 దేశాలు గాలిస్తున్నాయంది. కాగా, విమానాన్ని చేతితో కాకుండా కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా కాక్‌పిట్‌లోని కంప్యూటర్ మీటలను ఏడెనిదిసార్లు నొక్కి దారి మళ్లించారని అమెరికా అధికారులను ఉటంకిస్తూ ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. గత కొన్ని రోజుల్లో నేలపై, నీటిలోఎక్కడా విమానం కూలలేదని ఐక్యరాజ్య సమితికి చెందిన అణు నిఘా సంస్థ పేర్కొంది. మరోపక్క.. మలేసియా నుంచి బయల్దేరిన ప్యాసింజర్ విమానం గమన దిశ మార్చుకుని మళ్లీ మలేసియాలోని బుటర్‌వర్త్ నగరం మీదుగా వెళ్లినట్లు తమ రాడార్ గుర్తించిదని, అయితే అది గల్లంతైన విమానమో కాదో తెలియడం లేదని థాయ్‌లాండ్ తెలిపింది. -
ఆరో రోజూ జాడలేని మలేసియా విమానం
కౌలాలంపూర్/న్యూఢిల్లీ: మలేసియా విమానం అదృశ్యంపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. గురువారం ఆరో రోజు కూడా దాని ఆచూకీ దొరకలేదు. భారత్‌తోపాటు పలు దేశాలకు చెందిన 43 నౌకలు, 40 విమానాలు గాలించినా ఫలితం లేకపోయింది. గాలింపులో భారత్‌కు చెందిన నాలుగు యుద్ధనౌకలు, ఆరు విమానాలు పాల్గొంటున్నాయి. మరోపక్క.. విమానం కూలిపోయినట్లు అనుమానిస్తున్న వియత్నాం, మలేసియా మధ్య గల సముద్ర జలాల్లో మూడుచోట్ల తేలా డే వస్తువులను చైనా ఉపగ్రహాలు గుర్తించాయి. అయితే అక్కడికెళ్లిన తమ విమానాలకు, నౌకలకు శకలాల్లాంటివేవీ కనిపించలేదని మలేసియా, వియత్నాం ప్రభుత్వాలు తెలిపాయి. విమానం కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాక కూడా నాలుగు గంటలు ప్రయాణించినట్లు రాడార్ సంకేతాల ద్వారా తెలుస్తోందని అమెరికా దర్యాప్తు అధికారులు చెప్పారు. అయితే మలేసియా దీన్ని తోసిపుచ్చింది. -
విమానం కోసం ఉపగ్రహ వేట!
-
ఇంకా ఆచూకీ లేని మలేసియా విమానం
-
గల్లంతైన విమానం... తిరిగి వస్తుంది !
కాలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తు మొన్న అర్థరాత్రి అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం తిరిగి వస్తుందని మలేషియా పౌర విమానాయానశాఖ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన విమానం తిరగి కౌలాలంపూర్ వస్తుందని మిలటరీ రాడార్ సూచనలు చేస్తుందని తెలిపారు. చైనా, బీజింగ్, వియత్నాం దేశాలతోపాటు అమెరికా 22 విమానాలు, 40 ఓడలను రంగంలోకి దిగి ఇప్పటికే గల్లంతైన విమానం కోసం అన్వేషణను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. విమాన ఆచూకీ కోసం కనుగొనే క్రమంలో ఇండోనేషియా సహకారాన్ని కూడా కోరామని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి తెలిపారు. విమానం ఓ వేళ సముద్రంలో కూలిపోయి ఉంటే విమాన శకలాలు లేకుంటే ప్రయాణికుల వస్తువులు నీటిపై తేలియాడుతూ ఉండేవన్నారు. విమానం అదృశ్యమై 24 గంటలు గడిచిన అంటువంటి ఏవి సముద్రం నీటిపై కనిపించిన దాఖలాలు లేవని గాలింపు చేపట్టిన సిబ్బంది వెల్లడించారని తెలిపారు. అయితే విమాన ప్రయాణికుల జాబితాపై దృష్టి సారించామని, అందులో నకిలీ పాస్‌పోర్ట్‌లతో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. ఆ ఇద్దరిలో ఒకరిది ఇటలీ కాగా, మరోకరిది ఆస్ట్రేయా దేశానికి చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో కోలాలంపూర్ నుంచి శుక్రవారం అర్థరాత్రి విమానం బీజింగ్ బయలుదేరింది. రెండు గంటల అనంతరం ఆ విమానం మలేషియా విమానాశ్రయంలోని ఎటీసీ కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. విమానం అదృశ్యం కావడంతో ఆ ఇరుదేశాల ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తు గాలింపు చర్యలు చేపట్టారు. వియత్నాం సమీపంలో ఆ విమానం కూలిపోయిందని శనివారం వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే గాలింపు చర్యలలో ఎక్కడ ఎటువంటి శకలాలు లభ్యం కాకపోవడంతో మలేషియా పౌర విమానాయానశాఖ విమానం తప్పక తీరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విమానం అదృశ్యం కావడంతో ప్రయాణీకుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. -
లీ చోంగ్ వీ రికార్డు
కౌలాలంపూర్: ఈ ఏడాది తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లీ చోంగ్ వీ 21-10, 21-12తో సుగియార్తో (ఇండోనేసియా)ను ఓడించాడు. ఈ క్రమం లో లీ చోంగ్ వీ ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను నాలుగుసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ మలేసియా స్టార్ 2008 నుంచి 2010 వరకు వరుసగా మూడుసార్లు ఈ టైటిల్‌ను గెల్చుకున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో జురుయ్ లీ 21-8, 21-14తో తాయ్ జూ యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. సింగిల్స్ విజేతలు లీ చోంగ్ వీ, జురుయ్ లీలకు 40 వేల డాలర్ల (రూ. 24 లక్షల 87 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
రికార్డుకు చేరువలో లీ చోంగ్ వీ
కౌలాలంపూర్: మరో విజయం సాధిస్తే... ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్‌ను అత్యధికసార్లు నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టిస్తాడు. 2008 నుంచి 2010 వరకు వరుసగా మూడుసార్లు పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన లీ చోంగ్ వీ నాలుగోసారి ఈ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో లీ చోంగ్ వీ 21-14, 21-16తో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)పై గెలిచాడు. రికార్డుస్థాయిలో మూడుసార్లు ఈ టైటిల్‌ను సాధించిన మహిళల జోడి వాంగ్ జియోలీ-యూ యాంగ్ (చైనా); పురుషుల జంట మథియాస్ బో-కార్స్టెన్ మోగెన్సన్ (డెన్మార్క్) ఈసారి సెమీఫైనల్లోనే నిష్ర్కమించాయి. దాంతో అత్యధికసార్లు ఈ టైటిల్ సాధించనున్న రికార్డుకు లీ చోంగ్ వీ మరో విజయం దూరంలో ఉన్నాడు.