
21 ఉపగ్రహాలతో జల్లెడ!
మలేసియా విమానం కోసం చైనా గాలింపు కంప్యూటర్ ప్రోగ్రామ్‌తో బోయింగ్‌ను దారి మళ్లించారు!
ఐదుగురు భారతీయులు సహా 239 మంది ఉన్న మలేసియా విమానం ఆచూకీ కోసం గాలింపు ముమ్మరమైంది. 11 రోజుల కిందట కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ గల్లంతైన బోయింగ్ జాడ కనుక్కోవడానికి 21 ఉపగ్రహాలను, ఒక రాడార్‌ను రంగంలోకి దింపినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మంగళవారం తెలిపారు.
విమాన ప్రయాణికుల్లో అత్యధికంగా 154 మంది తమ దేశీయులే కావడంతో చైనా అన్వేషణను తీవ్రం చేసింది. విమానం కనిపించకుండా పోయిన ఉత్తర కారిడార్ వెంబడి టిబెట్, జింజియాంగ్‌లలో గాలింపు ప్రారంభించామని మలేసియాలోని చైనా రాయబారి తెలిపారు. బోయింగ్ హైజాక్‌కు గురై ఉంటే అందులో తమ దే శీయుల ప్రమేయం ఉండదన్నారు. విమానం తమ ప్రాంతాల మీదుగా కజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌లవైపు వెళ్లలేదని భారత్, పాకిస్థాన్ సహా పలు దేశాలు చెప్పడంతో చైనా, ఇతర దేశాలు ఉత్తర కారిడార్(కజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్ సరిహద్దు నుంచి ఉత్తర థాయ్‌లాండ్ వరకు), దక్షిణ కారిడార్(ఇండోనేసియా నుంచి హిందూ మహాసముద్ర దక్షిణప్రాంతం వరకు)లలో గాలింపు జరుపుతున్నాయి. విమానాన్ని ఉద్దేశపూర్వకంగానే దారి మళ్లించారని మలేసియా ప్రభుత్వం పునరుద్ఘాటించింది. 77 లక్షల చదరపు కి.మీ. విస్తీర్ణంలో 26 దేశాలు గాలిస్తున్నాయంది.
కాగా, విమానాన్ని చేతితో కాకుండా కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా కాక్‌పిట్‌లోని కంప్యూటర్ మీటలను ఏడెనిదిసార్లు నొక్కి దారి మళ్లించారని అమెరికా అధికారులను ఉటంకిస్తూ ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. గత కొన్ని రోజుల్లో నేలపై, నీటిలోఎక్కడా విమానం కూలలేదని ఐక్యరాజ్య సమితికి చెందిన అణు నిఘా సంస్థ పేర్కొంది. మరోపక్క.. మలేసియా నుంచి బయల్దేరిన ప్యాసింజర్ విమానం గమన దిశ మార్చుకుని మళ్లీ మలేసియాలోని బుటర్‌వర్త్ నగరం మీదుగా వెళ్లినట్లు తమ రాడార్ గుర్తించిదని, అయితే అది గల్లంతైన విమానమో కాదో తెలియడం లేదని థాయ్‌లాండ్ తెలిపింది.