
అదృశ్యమైన మలేషియా విమాన శకలాలు గుర్తింపు?
కౌలాలంపూర్ : దాదాపు రెండు వారాలు క్రితం గల్లంతు అయిన మలేషియా విమానం ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. ఎమ్‌హెచ్-370 విమానం భాగాలు ఆస్ట్రేలియాలో కనిపించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో విమాన శకలాలను పోలిన చిత్రాలను ఉపగ్రహా ఛాయాచిత్రాల ద్వారా గుర్తించామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబ్బోట్ వెల్లడించారు. విమానం గుర్తింపునకు ఉద్దేశించిన ఉపగ్రహాలు రెండు భాగాలను గుర్తించాయని, ఆ శకలాలు ఎమ్‌హెచ్-370 బోయింగ్ విమానానికి సంబంధించినవి కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని మలేషియా ప్రధానికి తెలిపానని చెప్పారు. శకలాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించడానికి ఓ యుద్ధ విమానాన్ని పంపించామని తెలిపిన ఆస్ట్రేలియా ప్రధాని మరో మూడు ఎయిర్‌క్రాప్ట్లను కూడా పంపించనున్నట్లు వివరించారు. అయితే ఆ ప్రాంతాన్ని గుర్తించే పని చాలా కష్టంతో కూడిన పని అని పేర్కొన్న ఆయన.... ఆ శకలాలు ఎమ్‌హెచ్-370విమానానివి సంబంధించినవి కాకుండా పోయే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు... విమాన గుర్తింపు ప్రక్రియను అమెరికా, న్యూజీలాండ్‌లు మరింత తీవ్రం చేశాయి. ఆస్ట్రేలియాతో కలిసి విమాన శోధన ప్రక్రియ ముమ్మరం చేసిన యూఎస్, కివీస్‌లు... దక్షిణ హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో తమ అన్వేషణను కొనసాగిస్తున్నాయి.