ప్రపంచంలోనే తొలిసారిగా మనుషులతో కలిసి రోబోల పరుగు
12 వేల మంది అథ్లెట్లతో హాఫ్ మారథాన్‌లో పాల్గొననున్న డజన్లకొద్దీ రోబోలు
చైనా రాజధాని బీజింగ్‌లో ఏప్రిల్‌లో జరగనున్న వినూత్న పోటీ
ఎన్నో రంగాల్లో మనిషికి సవాల్ విసురుతున్న మరమనుషులను చైనా.. ప్రపంచంలోనే తొలిసారిగా చరిత్రాత్మక పోటీకి రంగంలోకి దింపుతోంది. అథ్లెట్లు, హ్యూమనాయిడ్ రోబోలకు కలిపి మొట్టమొదటిసారిగా హాఫ్ మారథాన్ (21 కి.మీ.) పరుగు పందెం నిర్వహించనుంది.
ఏప్రిల్‌లో జరగనున్న ఈ పోటీకి చైనా రాజధాని బీజింగ్‌లోని డాక్సింగ్ జిల్లా వేదిక కానుంది. ఇందులో డజన్లకొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు సుమారు 12 వేల మంది అథ్లెట్లతో పోటీపడనున్నాయి. ఈ రేసులో టాప్–3లో నిలిచే రేసర్లకు (అథ్లెట్లు అయినా లేక హ్యూమనాయిడ్ రోబోలైనా) బహుమతులిస్తారని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’తెలిపింది.
బీజింగ్ ఆర్థిక–సాంకేతికత అభివృద్ధి ప్రాంతం లేదా ఈ–టౌన్ పరిపాలనా సంఘం ఈ వినూత్న పోటీని నిర్వహించనుంది. 20కన్నా ఎక్కువ రోబో తయారీ సంస్థలు హాఫ్ మారథాన్‌లో పాల్గొననున్నాయి.
స్పెషల్ ఎట్రాక్షన్‌గా ‘టియాంగోంగ్’
మారథాన్‌లో పాల్గొనే రోబోలలో చైనాకు చెందిన ఎంబాడీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ అభివృద్ధి చేసిన టియాంగోంగ్ హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ రోబోకు గంటకు సగటున 10 కి.మీ. వేగంతో పరిగెత్తే సామర్థ్యం ఉందని ‘ద డైలీ సీపీఈసీ’పేర్కొంది. గతేడాది బీజింగ్‌లో జరిగిన హాఫ్ మారథాన్‌లో రేసు మొదలైనప్పటి నుంచి చివరిదాకా ఈ రోబో మనుషులతో కలిసి పరుగెత్తింది.
చైనాలో రోబోల అభివృద్ధి ఎందుకంటే..
చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో శ్రామికశక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్నా.. ఆర్ధికవృద్ధిని పెంచాలన్నా శ్రామికశక్తి అవసరం.
దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. చైనా ఆగస్టులో హ్యూమనాయిడ్ రోబోలతో ఫుట్‌బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ లాంటి పోటీలు నిర్వహించనుంది. – సాక్షి, సెంట్రల్‌డెస్క్
కండిషన్స్ అప్లై..
హాఫ్ మారథాన్‌లో పాల్గొనే రోబోలవిషయంలో చైనా కొన్ని షరతులు విధించింది. అవేమిటంటే..
» రోబోలన్నీ మనిషి ఆకృతిలో కనిపించాలి.
» వాకింగ్ లేదా రన్నింగ్ లాంటి కదలికల లక్షణాలు కలిగి ఉండాలి. అంటే వాటికి చక్రాలు ఉండరాదన్నమాట.
» రోబోల కనీస ఎత్తు 1.6 అడుగుల నుంచి గరిష్టంగా 6 అడుగుల మధ్య ఉండాలి.
» హిప్–టు–ఫుట్ పొడవు అంటే నడుము నుంచి పాదం వరకు 1.47 అడుగుల ఎత్తు ఉండాలి.
» రిమోట్ ద్వారా నియంత్రించే రోబోలు లేదా పూర్తిస్థాయిలో ఆటోమేటిక్ హ్యూమనాయిడ్‌లను పోటీలోకి దింపాలి. అయితే అవసరమైతే పోటీ మధ్య బ్యాటరీలను మార్చుకోవచ్చు.
2,76,288
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం 2023లో చైనా సంస్థలు ఇన్‌స్టాల్ చేసిన రోబోల సంఖ్య. ఇది ఆ ఏడాది ప్రపంచంలోని మొత్తం రోబోల్లో 51 శాతం
Comments
Please login to add a commentAdd a comment