సర్వీస్‌ స్టార్‌ | Indian-American Tejasvi Manoj named Time magazine Kid of the Year 2025 | Sakshi
Sakshi News home page

సర్వీస్‌ స్టార్‌

Sep 11 2025 12:35 AM | Updated on Sep 11 2025 12:35 AM

Indian-American Tejasvi Manoj named Time magazine Kid of the Year 2025

టైమ్స్‌కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌2025

‘నా టైమ్‌ బాగ లేదు’ అనుకున్నాడు తాతయ్య. ఎందుకంటే ఆయన ఆన్‌లైన్‌ మోసానికి గురయ్యాడు. దాంతో తీవ్ర నిర్వేదానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో తన తాతయ్యలాంటి ఎంతో మంది వృద్ధుల కోసం ‘షీల్డ్‌ సీనియర్స్‌’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించిన పదిహేడు సంవత్సరాల ఇండియన్‌–అమెరికన్‌ తేజస్వి మనోజ్‌... టైమ్స్‌ మ్యాగజైన్‌ ‘కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2025’ ఘనత సాధించింది.

 ‘ఆన్‌లైన్‌ మోసానికి గురైతే ఏం చేయాలి...’ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు సెమినార్‌లు, తన వెబ్‌సైట్‌ ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది తేజస్వి.  ఇప్పుడు తేజస్వి ‘టైమ్‌’ బాగుంది.  ఆమె చెప్పే సాంకేతిక విషయాల గురించి వినడానికి ఆబాలగోపాలం ఆసక్తి కనబరుస్తోంది. టైమ్‌ మ్యాగజైన్‌ తేజస్విని ‘సర్వీస్‌ స్టార్‌’గా కొనియాడింది...


కాలిఫోర్నియాలో పుట్టి డాలస్‌లో పెరిగింది తేజస్వి మనోజ్‌. తేజస్వి తల్లిదండ్రులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లు. కోడింగ్‌ అంటే తేజస్వికి ఎంతో ఇష్టం. చాలా చిన్న వయసులోనే కోడింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టింది. బొమ్మలతో ఆడుకుందో లేదో తెలియదుగానీ కోడింగ్‌ ప్రపంచంలో జావా, పైథాన్‌లతో ఆడుకుంది.

కోడింగ్‌ శక్తి... 
‘గర్ల్స్‌ హూ కోడ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సైబర్‌ సెక్యూరిటీపై నిర్వహించే క్లాసులకు రెగ్యులర్‌గా హాజరయ్యేది తేజస్వి. ఎయిర్‌ ఫోర్స్, స్పేస్‌ఫోర్స్‌ ప్రోగ్రామ్‌ ‘సైబర్‌–పేట్రియాట్‌’లో చురుగ్గా పాల్గొనేది. ‘కోడింగ్‌ అనేది ఎంతో అద్భుత ప్రక్రియ. కోడింగ్‌ ను చాలా ఎంజాయ్‌ చేస్తాను. కోడింగ్‌ను నేర్చుకోవడం వల్ల దానిశక్తి ఏమిటో తెలుసుకోగలిగాను. భవిష్యత్‌లో కూడా కోడింగ్‌తో నా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది తేజస్వి.

ఎంతోమంది తాతయ్యల కోసం...
గత సంవత్సరం తేజస్వి తాత ఆన్‌లైన్‌ మోసానికి గురయ్యాడు. మోసగాళ్లు ఆయన నుంచి డబ్బు డిమాండ్‌ చేశారు. అయితే కుటుంబసభ్యులకు ఈ ఆన్‌లైన్‌ మోసం గురించి తెలియడంతో వారి ఆటలు సాగలేదు. తాతయ్యకు ఆన్‌లైన్‌ మోసాల గురించి అవగాహన లేకపోవడం తేజస్విని ఆశ్చర్యపరిచింది. అయితే తన తాత మాత్రమే కాదు ఎంతోమంది వ్యక్తులకు ఆన్‌లైన్‌ మోసాల గురించి బొత్తిగా అవగాహన లేదనే విషయం తెలుసుకుంది. అలా అని తేజస్వి బాధపడుతూ కూర్చోలేదు.

‘నా వంతుగా ఏదైనా చేయాలి’ అని పరిశోధన బాట పట్టింది. సీనియర్‌ సిటిజన్‌లకు ఆన్‌లైన్‌ మోసాల గురించి హెచ్చరించడానికి ‘షీల్డ్‌ సీనియర్స్‌’ పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించింది. సైబర్‌సెక్యూరిటీకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను ‘షీల్డ్‌ సీనియర్స్‌’ తెలియజేస్తుంది.

స్వతంత్రంగా... సగర్వంగా...
‘సీనియర్‌ సిటిజనులు ఎలాంటి సంకోచం లేకుండా స్వతంత్రంగా, సగర్వంగా ఆన్‌లైన్‌ ప్రపంచంలో తమ పనులు తాము చేసుకునేలా షీల్డ్‌ సీనియర్స్‌’కు రూపకల్పన చేశాం’ అంటుంది తేజస్వి.

ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కలిగించడానికి తేజస్వి నిర్వహించే సమావేశాలకు ఎంతోమంది వృద్ధులు హాజరవుతుంటారు. ఆమె ప్రసంగిస్తుంటే నోట్స్‌ రాసుకుంటారు. ప్రసంగం పూర్తయిన తరువాత తేజస్విని రకరకాల సందేహాలు అడుగుతుంటారు. వాటికి ఓపికగా జవాబులు ఇస్తుంటుంది తేజస్వి.
‘మాది టెక్‌ ఫ్యామిలీ’ అని ఘనంగా చెబుతుంటాడు తేజస్వి తండ్రి మనోజ్‌. ఆ ఘనతకు సామాజిక ప్రయోజానాన్ని జోడించి ‘డిజిటల్‌ డిఫెండర్‌’గా పేరు తెచ్చుకుంది తేజస్వి.                    ∙

ఆహా... ఆల్‌రౌండర్‌!
కోడింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న తేజస్వి మనోజ్‌ వయోలిన్‌ అద్భుతంగా వాయిస్తుంది. తన ఆర్కెస్ట్రాతో హైస్కూల్‌లో ఎన్నో కచేరీలు చేసింది. కరాటేలో కూడా ప్రవేశం ఉంది. స్కౌటింగ్‌–అమెరికాలో యాక్టివ్‌గా ఉంది. తాజాగా ఈగిల్‌ స్కౌట్‌ ర్యాంక్‌ అందుకుంది. ‘వైభ’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా భూటాన్‌ కాందిశీకుల పిల్లలకు మ్యాథ్స్, ఇంగ్లీష్‌ బోధిస్తోంది. సామాజిక సేవాకార్యక్రమాలలో ఎప్పుడూ ముందుంటుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ తనకు ఇష్టమైన సబ్జెక్ట్‌లు. భవిష్యత్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలనుకుంటుంది. ‘ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉత్సాహవంతుల దగ్గరికి విజయాలు ఉత్సాహంగా నడిచొస్తాయి’ అని చెప్పడానికి బలమైన ఉదాహరణ తేజస్వి మనోజ్‌.

ఉక్కుకవచం... షీల్డ్‌ సీనియర్స్‌
‘షీల్డ్‌ సీనియర్స్‌’లో ఆన్‌లైన్‌ మోసాలకు సంబంధించిన సందేహాలకు చాట్‌బాట్‌ ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు. అనుమానాస్పద టెక్ట్స్, మెజేస్‌లను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా విశ్లేషించుకోవచ్చు. ‘షీల్డ్‌ సీనియర్స్‌’లో నాలుగు విభాగాలు ఉంటాయి. ‘లెర్న్‌’ విభాగంలో ఇంటర్‌నెట్‌ సెక్యూరిటీకి సంబంధించి ప్రాథమిక విషయాలు తెలుసుకోవచ్చు. 

స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్స్‌ రూపొందించుకోవడానికి, ప్రైవసీ సెట్టింగ్స్‌ను అర్థం చేసుకోవడానికి, ఎలాంటి సమాచారం షేర్‌ చేయవచ్చు, ఏది చేయకూడదు...మొదలైనవి తెలుసుకోవచ్చు. ‘ఆస్క్‌’ విభాగంలో చాట్‌బాట్‌ ద్వారా సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ‘ఎనలైజ్‌’ అనేది మూడో విభాగం. యూజర్‌లు ఈ ట్యాబ్‌ క్లిక్‌ చేసి అనుమానాస్పద టెక్ట్స్, ఈ మెయిల్స్‌ను అప్‌లోడ్‌ చేయవచ్చు. ‘రిపోర్ట్‌’ సెక్షన్‌లో ఆన్‌లైన్‌ మోసగాళ్లపై ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులపై స్పందించే 14 ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు చెందిన లింక్స్‌ ఇందులో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement