విదేశీ వర్శిటీలో మన మురళీరవం
ఇండియాలో చదివిన ఒక భారతీయ అమెరికన్ మహిళ... అందులోనూహైదరాబాద్లో ఐటీ విద్యను అభ్యసించిన అతివ... విజి మురళీ, అగ్రరాజ్యంగా పేరు పొందిన అమెరికాలోనే ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయమైన యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాడెవిస్లో ముఖ్య సమాచార అధికారిణిగా, సాంకేతిక విద్యా విభాగానికి ఉపాధికారిగా నియమితులయ్యారు. మన చదువుల ఘనకేతనాన్ని అమెరికాలో రెపరెపలాడించారు. సాటి తెలుగు వారిగా మన కీర్తిని ఇనుమడింపజేశారు.
హైదరాబాద్‌లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో 1975లో జీవ, రసాయన శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన మురళీ విజి, మరో రెండు సంవత్సరాల్లోనే ఉస్మానియా కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. అప్పటినుంచి 1981 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థ అయిన రీజియనల్ రిసెర్చ్ లేబరేటరీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో డాక్టోరల్ డిగ్రీ చేశారు. పీహెచ్డీ పూర్తి అవుతుండగానే ఆమెకు అమెరికాలోని నోట్రడామ్లోనూ, లోవా స్టేట్ యూనివర్శిటీలోనూ పోస్ట్ డాక్టోరల్ రిసెర్చి చేస్తున్న శుబ్రా మురళీధరన్‌తో పెళ్లయింది. వెంటనే ఆమె భర్తతో కలిసి అమెరికాలో అడుగుపెట్టారు. అక్కడికి వెళ్లాక ఆమె తన డాక్టోరల్ డిగ్రీని కొనసాగించాలా లేక కొత్త రంగంలోకి ప్రవేశించి, తనను తాను నిరూపించుకోవాలా? అని ఆలోచించారు. అదే విషయమై ఇండియాలో రాకెట్ సైంటిస్ట్ అయిన తండ్రిని సలహా అడిగారు. ఆయన మురళీతో... ‘నువ్విప్పుడు కొత్త కొలువులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పురిటి గడ్డ అయిన అమెరికాలో ఉన్నావు. రానున్న ఇరవై సంవత్సరాల్లో అన్నింటా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే అగ్రస్థానం సాధించనున్నదనే విషయం మర్చిపోకు’ అని చెప్పారు. తండ్రి చెప్పిన మాటలలో ఆమెకు ఏం ధ్వనించిందో ఏమో కానీ, తన డాక్టోరల్ పరిశోధనలను పూర్తిగా పక్కన పెట్టేసి, భర్త పనిచేసే లోవా స్టేట్‌లో కంప్యూటర్ సైన్స్‌లో రెండేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేశారు. ఆ తర్వాత భర్తకు ఆరిజోనా యూనివర్శిటీకి బదిలీ కావడంతో 1987 కల్లా అదే యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు. ఆ సమయంలో తను ఇండియాలో చదివిన కెమిస్ట్రీ, సైన్స్ డిగ్రీలు ఎంతగానో ఉపయోగపడ్డాయనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు మురళీ. తాను మాస్టర్స్ డిగ్రీ చదివిన ఆరిజోనా విశ్వవిద్యాలయంలోనే మొదట సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా చేరారు. ఆ తర్వాత సెంటర్ ఫర్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా తన ప్రతిభ నిరూపించుకున్నారు మురళీ. ‘‘నాకు అప్పగించిన బాధ్యతలలో నేను కనబరచిన నైపుణ్యానికి మెచ్చిన అధికారులు నన్ను ప్రిన్సిపాల్‌గా, ప్రాజెక్ట్ లీడర్‌గా, కంప్యూటింగ్ మేనేజర్‌గా, సిస్టమ్స్ మేనేజ్మెంట్ డెరైక్టర్‌గా వరసగా పదోన్నతులిచ్చి, నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలా అక్కడ పదకొండు సంవత్సరాలపాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించాను. తర్వాత 1999లో బదిలీపై వెస్ట్రన్ మిచిగన్ యూనివర్శిటీకి వెళ్లాను. అక్కడ ఐటీ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా, ముఖ్య సమాచార అధికారిగా సేవలు అందించాను. ఆ తర్వాత వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి పిలుపు రావడంతో అక్కడి అధికారులు నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడంతో నా పేరు అమెరికా అంతటా పాకిపోయింది’’ అంటూ వివరించారు మురళి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి... సాధారణంగా మనం ఇక్కడి చదువు నాణ్యమైనది కాదన్న భ్రమతో విదేశీ విద్యకోసం అర్రులు చాస్తుంటార.. అయితే మన దేశంలోనే విద్యను అభ్యసించిన మురళీ... కష్టపడి చదివే తత్వం, పట్టుదలతో పని చేస్తూ ప్రతిభకు మెరుగు పెట్టుకునే మనస్తత్వం ఉంటే - మన వాళ్లు కూడా విదేశాలలో విజయకేతనం ఎగురవేయవచ్చు అనడానికి నిదర్శనంగా నిలిచారు.
‘మురళీ విజి వంటి ప్రతిభావంతురాలైన, అనుభవజ్ఞురాలైన వ్యక్తిని ఈ పదవిలో నియమించడం ద్వారా యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా డెవిస్ ఎంతో అదృష్టం చేసుకుంది’ - యూనివర్శిటీ ఛాన్స్లర్ లిండా పి.బి. కటే హి ఆమెను ఆ పదవిలో నియమించే సమయంలో అన్నారంటేనే అర్థం అవుతోంది విజీ మురళీ అక్కడివారి అభిమానాన్ని ఎంతగా చూరగొన్నారన్నదీ!
మురళీ ఈ నెల 18న తన విధులలో చేరనున్నారు. అక్కడి ఐటీరంగంలో ఆమె అందించనున్న సేవలు, చేయనున్న మార్పులు, అక్కడి విద్యార్థులకు మన దేశం పట్ల, ముఖ్యంగా స్త్రీల పట్ల గౌరవాభిమానాలను పెంచుతూ మన సమాచార సాంకేతిక సౌరభాలను మరింత బలంగా వ్యాపింపచేస్తాయని ఆశిద్దాం.
- డి.వి.ఆర్.