
మలేషియా విమానం ప్రమాదానికే గురైందా?
లోహ విహంగం మృత్యు విహంగంగా మారిందా? అదృశ్యమైన మలేషియా విమానం ప్రమాదానికే గురైందా? అందువల్లే ఆ విమానం జాడ గుర్తించడం ఆలస్యమయిందా? విమానంలో ప్రయాణిస్తున్న 239 మంది ప్రయాణికులు మృత్యువాత పడినట్లేనా? ఆస్ట్రేలియా ప్రధాని తాజా వ్యాఖ్యలతో ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాకు సమీపంలోని దక్షిణ హిందూ సముద్ర పరిసరాల్లో విమాన శకలాలను గుర్తించామని, అవి మలేషియా విమానానికి చెందినవి కావొచ్చంటూ ఆస్ట్రేలియా ప్రధాని చేసిన వ్యాఖ్యలు గత అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
మలేషియ విమానం హిందూ మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చంటూ మూడు రోజుల క్రితం కథనాలు వెలువడ్డాయి. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్ వెల్లడించిన తాజా సమాచారం ఈ కథనాలకు బలం చేకూరుస్తున్నాయి. ఒకవేళ దక్షిణ హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో గుర్తించిన శకలాలు మలేషియన్ విమానానివే అయితే... ప్రమాదం జరిగే ఉంటుందని, విమానం కూలిపోవడం వల్లే ఆ ప్రమాదం జరిగి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
సముద్రంలో విమానం కూలిపోవడం వల్లే శకలాల గుర్తింపు ఆలస్యం అయిందని పేర్కొంటున్నారు. మరోవైపు... టోనీ అబ్బోట్ తాజా వ్యాఖ్యలు విమాన ప్రయాణికుల కుటుంబాల్లో కలకలం రేపుతున్నాయి. విమానం ఆచూకీ లభించక 13 రోజులు గడిచి పోయినా తమ వారు బతికి ఉండే ఉంటారనుకుంటూ కాస్తో కూస్తో పెట్టుకున్న ఆశలు తాజా సమాచారంతో ఆవిరైపోయినట్లేనని అభిప్రాయపడుతున్నారు.
కాగా విమానం మలేసియా, వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంటోల్ సరిహద్దులో ఉన్నప్పుడు అందులోని ట్రాన్స్‌పాండర్‌ను స్విచాఫ్ చేశారు. ఆ తర్వాత విమానం వెనక్కి వెళ్లి, పశ్చిమంగా, వాయవ్య దిశగా వెళ్లింది. ఇవన్నీ అందులోని ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగా చేసిన పనులే. ఈ నెల 7న అర్ధరాత్రి దాటాక 12.41కి బయల్దేరిన విమానం నుంచి 8న ఉదయం 8.11 గంటలకు శాటిలైట్ చివరి సిగ్నల్ అందింది. అంటే విమానం కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోయాక 7 గంటలకు పైగా గాల్లోనే ఉంది. కొత్త విషయాలు తెలుస్తుండడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులపై మళ్లీ విచారణ జరపాల్సిన అవసరముంది.