చైనాలో మంకీపాక్స్‌ కొత్త వేరియంట్‌ కలకలం | China discovers cluster of new mpox strain | Sakshi
Sakshi News home page

చైనాలో మంకీపాక్స్‌ కొత్త వేరియంట్‌ కలకలం

Published Thu, Jan 9 2025 3:45 PM | Last Updated on Thu, Jan 9 2025 5:29 PM

China discovers cluster of new mpox strain

బీజింగ్‌ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్‌ (mpox) వైరస్‌లోని కొత్త వేరియంట్‌ కలకలం రేపుతుంది. గురువారం మంకీపాక్స్‌ కొత్త వేరియంట్‌ క్లాడ్ ఐబిని గుర్తించినట్లు చైనా (china) ఆరోగ్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర స్థితిని ప్రకటించింది. 

కాంగో నుంచి చైనాకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఎంపాక్స్‌ క్లేడ్ ఐబి అనే కొత్త వేరియంట్‌ వ్యాప్తిని కనుగొన్నట్లు  చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. సదరు కాంగో ప్రయాణికుడితో సన్నిహితంగా ఉండడం వల్ల నలుగురికి ఎంపాక్స్‌ కొత్త వేరియంట్‌ సోకిందని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్‌ సోకిన రోగుల్లో చర్మంపై దద్దుర్లు,బొబ్బలు లక్షణాలు ఉన్నాయని గుర్తించింది. 

మంకీపాక్స్‌లోని కొత్త వేరియంట్‌ కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగు దేశాలకు వ్యాపించింది. దీంతో డబ్ల్యూహెచ్‌ఓ సైతం తాజాగా, హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత ఆగస్ట్‌లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) నుంచి ఎంపాక్స్‌ ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇక చైనా గుర్తించిన మంకీపాక్స్‌లోని కొత్త వేరియంట్‌ క్లాడ్‌ ఐబీ లైంగికంగా కలవడం వల్ల వేంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

ఏమిటీ ఎంపాక్స్‌? 
1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్‌ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్‌ పరీక్షలు జరిపి ఈ వైరస్‌ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్‌ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్‌ సోకుతుండటంతో ఎంపాక్స్‌ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్‌ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్‌ కూడా ఈ రకానిదే.

ఇలా సోకుతుంది
→ అప్పటికే వైరస్‌ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్‌ సోకుతుంది. 
→ కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్‌ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. 
→ చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. 
→ రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. 
→ తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.

వ్యాధి లక్షణాలు ఏమిటీ?
→ ఎంపాక్స్‌ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. 
→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. 
→ 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. 
→ నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. 
→ నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.

వ్యాక్సిన్‌ ఉందా? 
స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్‌కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్‌ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్‌ (టీపీఓఎక్స్‌ ఎక్స్‌) యాంటీ వైరల్‌నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్‌ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్‌) డ్రగ్స్‌నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్‌ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్‌ విజృంభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement