చైనా రాజధానిలో 2013 నుంచి పటిష్ట చర్యలు
కాలుష్య కారక పరిశ్రమల మూసివేత
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం
ప్రజల సహకారంతో ప్రభుత్వ చర్యలు సఫలం
క్రమంగా మెరుగుపడిన వాయు నాణ్యత
ఢిల్లీకి ఇదో కనువిప్పు కావాలి
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. విషపూరితమైన గాలి పీలుస్తున్న జనం ఆసుపత్రులపాలవుతున్నారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వాయు కాలుష్యం కాటుకు ప్రాణాలు కోల్పోతున్నారు. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ నివేదిక ప్రకారం.. కాలుష్యం కారణంగా ఢిల్లీలో ప్రతిఏటా దాదాపు 12,000 మంది మరణిస్తున్నారు. లక్షలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు.
నగరంలో ప్రతిఏటా నమోదవుతున్న మొత్తం మరణాల్లో 11.5 శాతం మరణాలకు కాలుష్యమే కారణం కావడం గమనార్హం. ఢిల్లీ ఒక గ్యాస్ చాంబర్‌గా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితులే 2013 దాకా చైనా రాజధాని బీజింగ్‌లోనూ కనిపించేవి. కానీ, ప్రస్తుతం బీజింగ్ సిటీ కాలుష్యం ముప్పు నుంచి చాలావరకు బయటపడింది. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందన్నది ఆసక్తికరం.
వాయు కాలుష్యంపై పోరాటం విషయంలో చైనా అనుభవాలు, సాధించిన విజయాల నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) మంగళవారం బీజింగ్‌లో 137 కాగా, ఢిల్లీలో 750గా నమోదైంది. ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. కాలుష్యం ఉత్పత్తి అయ్యే విషయంలో ఢిల్లీ, బీజింగ్‌లో ఒకేలాంటి పరిస్థితులు ఉన్నాయి.
శిలాజ ఇంధనాల వాడకం, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాలు, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు రెండు నగరాల్లోనూ ఉన్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం ఢిల్లీకి ఉన్న అదనపు ముప్పు. గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాల్లో చైనాది ప్రపంచంలోనే మొదటి స్థానం.
మొత్తం ప్రపంచ ఉద్గారాల్లో డ్రాగన్ దేశం వాటా 30 శాతం. అయినప్పటికీ బీజింగ్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి ఎలా అందుతోంది? ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? బీజింగ్‌లో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండడాన్ని చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ‘సోహో’ అధినేత, బిలియనీర్ పాన్ షియీ 2011లో తొలిసారిగా సోషల్ మీడియా పోస్టు ద్వారా బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.
2013లో కాలుష్య వ్యతిరేక పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో తొలుత యువత పాలుపంచుకున్నారు. క్రమంగా ఇదొక ప్రజా పోరాటంగా మారింది. వాయు కాలుష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజింగ్ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. తమ ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రెండు వారాలపాటు అవిశ్రాంతంగా ఆందోళన కొనసాగించారు.
ప్రభుత్వం దిగివచ్చింది. కాలుష్యంపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు అప్పటి చైనా అత్యున్నత నాయకుడు లీ కెఖియాంగ్ స్పష్టంచేశారు. పేదరికంపై జరుగుతున్న యుద్ధం తరహాలో కాలుష్యంపైనా యుద్ధం సాగిస్తామని తేల్చిచెప్పారు. అంతేకాదు కాలుష్య నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించారు. అధికారులను పరుగులు పెట్టించారు.
నేషనల్ ఎయిర్ యాక్షన్ ప్లాన్
→ కాలుష్యాన్ని కట్టడి చేయడానికి చైనా సర్కారు ‘నేషనల్ ఎయిర్ యాక్షన్ ప్లాన్’ విడుదల చేసింది. ఇందుకోసం 100 బిలియన్ డాలర్లు కేటా యించింది.
→ బీజింగ్‌లో మొట్టమొదటిసారిగా 2013లో వా యు నాణ్యత గణాంకాలను ప్రచురించారు. అప్పటిదాకా ఈ సమాచారం కోసం అమెరికా రాయబార కార్యాలయంపై ఆధారపడాల్సి వచ్చేది.
→ 2013 నుంచి సొంతంగానే సమాచారం సేకరించి, ప్రజలకు చేరవేయడం ప్రారంభించారు.
→ జాతీయ వాయు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కాలుష్యాన్ని 25 శాతం తగ్గించాలని ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సీరియస్‌గానే రంగంలోకి దిగారు.
→ తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న 100 ఫ్యాక్టరీలను మూసివేశారు. మరికొన్నింటిని ఆధునీకరించారు.
→ కాలుష్య ఉద్గారాల విషయంలో కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. కాలం చెల్లిన 2 కోట్ల పాత వాహనాలను రోడ్డెక్కనివ్వలేదు. వాటిని స్క్రాప్‌గా మార్చేశారు.
→ 2 లక్షల పారిశ్రామిక బాయిలర్లను ఉన్నతీకరించారు. పాత వాటి స్థానంలో ఆధునిక బాయిలర్లు అమర్చారు.
→ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు మంగళం పాడేశారు. సహజ వాయువుతో కరెంటును ఉత్పత్తి చేసి, 60 లక్షల ఇళ్లకు సరఫరా చేస్తున్నారు.
→ విద్యుత్‌తో నడిచే వాహనాలు బీజింగ్ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలు అతి తక్కువగా కనిపిస్తుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోంది. వాటికి పలు రాయితీలు అందిస్తోంది.
→ 2013లో చైనా ప్రభుత్వం ప్రారంభించిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. రాజధానిలో వాయు కాలుష్యం తగ్గడం మొదలైంది. గాలి నాణ్యత క్రమంగా మెరుగుపడింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించడంతో బీజింగ్ సిటీ ఇప్పుడు కాలుష్య రహిత నగరంగా మారింది.
ఇండియా చేయాల్సిందేమిటి?
ఇండియాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, ముంబై, పుణే, వారణాసి, పట్నా తదితర పెద్ద నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా కాలుష్యం ఊబిలో చిక్కుకున్నాయి. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో ఇండియా సిటీల స్థానం భద్రంగా ఉంటోంది. కాలుష్యాన్ని తరిమికొట్టి స్వచ్ఛంగా మార్చడానికి బీజింగ్ మోడల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలుష్యం నుంచి జనానికి విముక్తి కల్పించడానికి బలమైన రాజకీయ సంకల్పం కావాలని చెబుతున్నారు. నిపుణుల సూచనలు ఏమిటంటే..
→ వాయు నాణ్యతను మెరుగుపర్చడానికి అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాలి.
→ శిలాజ ఇంధనాల వాడకానికి కళ్లెం వేయాల్సిందే.
→ పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు పెరగాలి. అస్తవ్యస్తమైన పట్టణ ప్రణాళిక కాలుష్యానికి కారణమవు తోంది. ఈ పరిస్థితి మారాలి.
→ కాలుష్య నియంత్రణ చర్యల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి.
→ వ్యాపారం, వాణిజ్యం, ఎగుమతులతోపాటు రాజకీయ పలుకుబడి సాధించే విషయంలో చైనాతో పోటీ పడుతున్న భారత్ కాలుష్య నియంత్రణ విషయంలో ఎందుకు పోటీపడడం లేదన్నదే నిపుణుల ప్రశ్న.
→ కాలుష్య నియంత్రణను కేవలం స్థానిక ప్రభుత్వాలకే వదిలివేయకూడదు. ఇందుకోసం జాతీయ స్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరం.
→ చక్కటి ప్రణాళికాబద్ధమైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గిపోవాలి. ప్రజలు సొంత వాహనాలు కాకుండా ప్రజా రవాణా సాధనాలను ఉపయోగించుకుంటే కాలుష్యం చాలావరకు తగ్గిపోతుంంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment