
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం నుంచి రాజధాని ఢిల్లీ(delhi)కి ఉపశమనం లభించింది. ఇన్నాళ్లూ కలుషిత గాలి కారణంగా ఊపిరి తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడిన ఢిల్లీ ప్రజలు ఇకపై హాయిగా గాలి పీల్చుకోగలుగుతారు. వాయుకాలుష్యం ఉపశమించిన నేపధ్యంలో కేంద్రం గ్రాప్-2 నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత(Air quality) మెరుగుపడింది. ఈ నేపధ్యంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) కింద ఇన్నాళ్లూ విధించిన రెండవ దశ పరిమితులను కేంద్రం ఎత్తివేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారి, వాయు కాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఢిల్లీలో 24 గంటల సగటు గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) సాయంత్రం 4:00 గంటలకు 186గా ఉంది. ఇది రెండవ దశ పరిమితులు విధించడానికి అవసరమైన 300 మార్కు కంటే చాలా తక్కువ.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం)రాబోయే రోజుల్లో గాలి నాణ్యత సూచిక ఓ మోస్తరు నుండి పేలవమైన వర్గంలోనే ఉంటుందని అంచనా వేసింది. కాలుష్య స్థాయిలు మెరుగుపడినందున ఎన్‌సీఆర్‌తో పాటు పరిసర ప్రాంతాల నుండి అంతర్-రాష్ట్ర బస్సులు(Inter-state buses) ఇకపై ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతులిచ్చారు. శీతాకాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత నిర్వహణ కోసం ‘గ్రాప్’ ప్రణాళికలో భాగంగా నాలుగు దశలుగా పరిమితులను విధించారు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 186 వద్ద ఉన్నందున రెండవ దశ పరిమితులను ఎత్తివేశారు. అయితే రాబోయే కొద్ది రోజుల పాటు గాలి నాణ్యత మధ్యస్థం నుండి పేలవమైన వర్గంలోనే ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు